సుందర కాండము




1. కం. సుందరుడీ వానరు డతి
సుందరుడౌ రాముని సతి సుందరి సీతన్
సుందరమౌ లంకనుగన
అందరి దీవెనల సాగె నంబర వీథిన్

రామ కథ సుందరము. రాముని సతి సుందరము. రాముని బంటు సుందరుడు. రాముడు సుందరుడు. 
సుందరమైన లంకలో అందరి ఆశీస్సులతో ఆకాశంలోకి హనుమంతుడు బయలు దేరాడు. 

2. కం. వినువీథిని హరివీరుడు
తన కాయము పెంచి సాగ, తాపసి గణముల్,
ఘనకార్యము సిద్ధించగ
అనిమేషుల గూడి వేసి రాశీస్సుమముల్

హనుమంతుడు వినువీథిలో కాయమును పెంచి ఎగిరి పోతుండగా మునులు, ఋషులు, దేవతలు ఆయనపై ఆశీస్సులనే పూల వర్షం కురిపించారు


3. కం. నగమున గంధర్వ జతులు
మగువల వీడి నభమందు మారుతిని గనన్
భగభగ మండెను శైలము
పగిలెను శిఖరమ్ములన్ని పాముల విషమున్!

మారుతి వేగానికి బలంతో స్వామి మహేంద్ర గిరిని తన్నగానే అక్కడ తమ సఖులతో వున్న గంధర్వులు ఆకాశంలోకి ఎగిరి ఆయన ప్రతాపాన్ని చూచారు. పర్వతం లో దాగి ఉన్న భయంకర సర్పాల విష వేడికి గిరి శిఖరములు పగిలిపోయాయి. 


4. కం. తనువను కోకుడి! రాముని
ధనువును వీడిన శరమును, తప్పనుగురి!  నే
కనుగొనెద సీత జాడ న
వనిలో నెటు దాచిన, సురవనిలో నున్నన్!

ఇది నా శరీరం కాదు, రాముని ధనువునుంచి విడివడిన బాణము. గురి తప్పదు. సీతను ఈ భూలోకంలో ఎక్కడ రావణుడు దాచి యుంచినా స్వర్గంలో దాచినా కనుగొంటాను. 


5. కం. ఆపక కురిపించె విరుల
నోపక నువ్వెత్తు లేచి నూగిన తరువుల్
సైపక కపివీరుని గతి 
చాపగ తోచెను కనులకు సాగర మపుడున్

హనుమంతుని వేగాన్ని ఓపలేని తరువులు వేళ్ళతో సహా గాలిలో ఊగుతూ పూల వర్షాన్ని ఆయనపై ఆపకుండా వేశాయి. సాగరము ఆయన వేగానికి చాపలాగా చుట్టినట్టు కనబడింది.

6. కం. బడసితి సాగర నామము
ఒడుపుగ త్రవ్వంగ సగరు లోరిమి తోడన్
బడలిక తీర్చక హనుమకు
చెడు వార్తల వినగవచ్చు చేసెద హితవున్!

7. కం. రాగల మాటల వెరపున
సాగర పతిబిల్చె సఖుని సాయము సేయన్
కాగల రాముని కార్యము
నాగక సాగెడు హనుమకు ఆతిథ్యమిడన్

సముద్రునికి సాగరుడనే పేరు ఇక్ష్వాకు వంశీయులైన సగరుల వల్ల వచ్చినది. వారు భూమిని త్రవ్వి సముద్రం వృద్ధి పొందడానికి సాయపడ్డ వాళ్ళు. ఇక్ష్వాకు ప్రభువైన రాముని కార్యం లో తాను సాయ పడక పోతే నలుగురిచేత మాట పడవలసి వస్తుందన్న భయంతో సముద్రుడు తనలో వున్న బంగారు పర్వతమైన మైనాకుణ్ణి హనుమకు ఆతిథ్యమీయవలసినదిగా కోరాడు.

8. కం. నిలునిలుమో కపివీరా
అలసట తీరంగ నిముస మాగుము నాపై
కలవిట ఫలుములు తేనెలు
నిలచి తినుము సేదతీరు నీకున్ తండ్రీ

మైనాకుడు హనుమంతుని ఆగమని ప్రార్థించి, ఓ వీరుడా ఒక్క నిముషం నా శ్రేణువులపైన ఆగవయ్యా, నీ అలసట తీరుతుంది. నీ సేద తీరడానికి నా దగ్గర మంచి ఫలములు, తేనెలూ వున్నాయి. అవి స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చేయమని అడిగాడు. 

9. కం. నీ పితరుని మేల్గొంటిని
నా ప్రాణము కాచెనతడు నను త్రోసి యిటన్
నీ పూజలు చేసిన యది
కాపాడిన యతని మ్రోల కానుక నౌగా!


నీ తండ్రి వాయుదేవుడు నన్ను ఇంద్ర వజ్రాయుధమునుండి కాపాడిన వాడు. నీకు పూజ చేస్తే ఆయనకు చేసినట్టే అనుకుంటాను అని మైనాకుడు హనుమంతునితో అన్నాడు.

10. కం. సురసయను నాగ కాంతను
పరికింపగ హనుమ శక్తి పంపిరి అమరుల్
కురుచగ మారిన అనిలుజు
డరగి మరలె నామె నోట నాశ్చర్యముగన్

హనుమంతుని శక్తి సామర్థ్యములను పరీక్షింప దలచిన దేవతలు సురస అనే నాగ కాంతను హనుమకు అడ్డంగా పంపారు. తమ కాయమును హనుమ సురసలు ఒకరికంటే ఒకరు పెద్దగా పెంచారు. హనుమంతుడు తన బుద్ధి కౌశలం చేత ఒక్క సారి తన దేహాన్ని బొటన వేలంతగా చేసి ఆమె నోటిలో ప్రవేశించి వేగంగా బయటికి వచ్చి ఆమె మాటను తీర్చి ముందుకు సాగాడు. దేవతలు ఆయన ధైర్యానికి మేధా శక్తికి సంతోషించి ఆశీర్వాదము చేశారు.

11.. కం. నీడను లాగుచు సింహిక
వేడుక తోడభుజియించు వింతగు ముఖమున్
వాడై నగోళ్ళను హనుమ
నాడుల పెకలించి చంపి నభమున యెగిరెన్


నీటి మీద పడ్డ నీడను పట్టుకొని ఆకాశంలో ఎగిరే పక్షులను తినగలిగే శక్తిగల సింహిక హనుమంతుని నీడను పట్టి తినడానికి ఆమె నోటిలోకి అంగుష్టమాత్ర దేహముతో ప్రవేశించి హనుమంతుడు ఆమె ప్రాణ నాడులను పెకలించి చంపి ఆకాశంలో కి ఎగిరి ముందుకు వెళ్ళి పోయాడు.


12. కం. అలయక దాటెను జలధిని
బలితల మోపగ నిలిచిన వామను రీతిన్
కలవరపడె ధరతల మట
కలకలమనె  వనచరములు కాంచుచు హనుమన్!

అపారమైన జలరాశిని అవలీలగా దాటాడు హనుమ అప్పుడు ఆయన రూపం బలి తలపైన పాదం మోపిన వామనుని లాగా వుంది. ఆయన పద ఘట్టనకి భూదేవి అదిరిపడితే అక్కడున్న జంతువుల మధ్య కలకలం రేగింది. 

13. కం. కురిపించెను తరులు విరుల
పరమాద్భుత రూపముగని పరవశ మౌచున్
హరివీరుడు తనయాకృతి
ధరియించెను సహజరీతి ధరపై నపుడున్!

ఆయన వేగానికి చెట్లు ఒక్క సారి పైకి లేచి ఆయనపై పూల వర్షం కురిపించాయి. హనుమంతుడు తన సహజ సుందరమైన రూపాన్ని పొందాడు. 


14. కం. నాకమ్మును తలదన్నుచు
ఆకాశమునందు మొలిచి నట్టుల తోచెన్
కైకసి సూనుని లంకను
నాకారముచిన్న జేసి హనుమ యడుగిడెన్

స్వర్గాన్ని తలదన్నే లంక ఆకాశంలో తేలుతున్నదా అన్నట్టు ఆయనకు తోచింది. అటుంవంటి లంకలో తన ఆకారాన్ని చిన్నదిగా చేసి లోపలికి అడుగుపెట్టాడు హనుమంతుడు. 


కం. సుందరమౌ లంకాపురి
కందక దుర్భేద్యమగుచు కనబడె కనులన్
అందము చిందెడు వనముల
మందాకిని బోలు ఝరుల మారుతి గాంచెన్

ఆ సుందరమైన లంక చుట్టూ శతృవులు రావడానికి వీలులేకుండా కందకాలు త్రవ్వి వున్నాయి. అక్కడ అందమైన వనాలు, మెల్లగా పారే నదీ ప్రవాహాలూ మారుతి చూచి ఆశ్చర్యపోయాడు. 

15. కం. ఎటులొత్తొరు కపి వీరులు?
ఎటు తానొచ్చు రఘువీరుడేగతి గెలుచున్?
కటువగు రాక్షసుల నడుమ
పటుతరముగ రావణుండు పాలించు పురిన్!

లంకాపురి వైభవాన్ని అగడ్తను అక్కడున్న బకవంతులైన రాక్షసులను చూచి హనుమంతుడు అనుకొంటున్నాడు, ఎట్లా రాగలరు వానర వీరులు ఇక్కడికి? సామ దాన భేద దండోపాయములకు పట్టుపడని రాక్షసులన్న లంకకు రాముడు ఎట్లా రాగలడు? రావణున్ని ఏవిధంగా గెలవ గలడు? 

16. కం. ఇంతటి రూపము దాలిచి
ఇంతిని కనుగొనుట కాదు నేగతి తరమౌ! 
చింతింపగ చిన యాకృతి
ఎంతై నన్ మంచి దౌను ఇప్పడు నాకున్

ఈ రూపంతో సీతను వెదకడం సాధ్యమయ్యే విషయం కాదు. చిన్నదైన రూపాన్ని ధరిస్తే సీతను వెదకడం సులువౌతుంది. 

17. కం. హనుమంతుడు తన రూపము
చినపిల్లిని యంత మార్చె సీతను వెదకన్
కననద్భుతమై తోచెను
అనిలాత్మజు నాకృతియట ఆశ్చర్యముగన్

చిన్న పిల్లి యంత పరిమాణం లో వున్న హనుమంతుని అతి మనోహరంగా, చూడడానికి అద్భుతంగా కనబడింది. 

18. కం. రమ‌ణీయము నెటు గాంచిన
కమనీయముగా కనపడు కాంచన లంకన్
సమదర్శిగ హనుమంతుడు
సుమకోమలి సీతజాడ చూడగ వెడలెన్

19. కం. పడతిగ వచ్చిన లంకను
పిడిగుద్దున చరచె హనుమ భీతి గొలుపుచున్
అడుగంటిన ప్రాణమ్ముల
అడుగులబడె లంక యపుడు అంజలి నిడుచున్

లంకా నగరము స్త్రీ రూపము ధరించి హనుమంతుని అడ్డగించి ఆయన పైన యుద్ధానికి రాగా, హనుమంతుని ఒక్క పిడికిలి గుద్దునకే లంక ప్రాణాలు పోయినంతగా బాధపడి ఆయన కాళ్ళ పైన నమస్కరించి పడిపోయింది. 

20. కం. ధాతపలుకు తీరునిపుడు
కోతివలన వచ్చు చేటు కూలుదురసురుల్
నాతికతను మరణమనుచు
రాతను లిఖియించె బ్రహ్మ రావణు నుదుటన్


హనుమంతుని దెబ్బకు కూలిన లంక ఆయనతో "కపి వీరా ఇప్పుడు బ్రహ్మ వాక్కు నెరవేరబోతున్నది, ఏనాడైతే వానరుడు నన్ను జయిస్తాడో ఆనాడు లంకకు చేటు వస్తుంది అసురులంతా నశిస్తారు. స్త్రీ కారణం చేత రావణుని మరణమని ఆయన నుదుట బ్రహ్మ వ్రాసి ఉంచినట్టు నాకు తెలుస్తున్నది" అని అన్నది.

21. కం. దాపలి పాదము నుంచెను
మాపగ రిపు తేజమెంచి మారుతి మొదటన్
చూపట్టెను రాకాసులు
కాపుగ గల లంక యచట కన్నుల యెదుటన్!

దాపలి - ఎడమ 

తన ఎడమ పాదాన్ని శతృవుల తేజము నణచడానికి మొదట పెట్టి లంకలోకి ద్వారం లోనుంచి కాక ప్రాకారం పైనుంచి దుమికి హనుమంతుడు రాక్షసులు కాపుగా వున్న లంకలోకి ప్రవేశించాడు. 


22. కం. ఇటు జూచిన రత్నమయము
అటు గాంచిన యాకసమ్మునంటు భవనముల్!
పటలమ్మున స్వర్ణముగల
పటుతరమౌ సౌధములను పావని గాంచెన్ !

లంకలో ఎక్కడచూచినా రత్నమయమే , ఆకాశములనంటే పెద్ద పెద్ద భవనాలు. బంగారు తాపడంతో చేసిన కప్పు గల సౌధాలు.  అన్నిటినీ ఆశ్చర్యంతో చూస్తూ ముందుకు సాగాడు హనుమ.

23. కం. వానర వీరుని కనుబడె
మానసమున ప్రియుల గెల్చు మానిని జనముల్
పానీయమ్ములు కుడుచుచు
ఆని మగల యొడిని తూలి ఆడుచు పడుచుల్

24. కం. వెన్నెల మాసిన జాబిలి
మన్నల దినపసిడి తీగ మాజానకియౌ
నన్నేలినరామునికై
కన్నార్పకజూచు తల్లి గాంచుట ఎపుడో

సీత కొరకు వెదుకుతున్న హనుమకు పలు రకములైన ఆడవారు కనబడ్డారు. కొందరు తమ ప్రియుల మనసు గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నవారు. మరికొందరు మదిరను త్రాగుతూ తమ భర్తల ఒడిలో తూలిపోతున్న వారు. ఇటువంటి వారి మధ్య మా‌ తల్లి జానకి వుండదు, నిరంతర రామ నామ స్మరణ తో కాలం గడుపుతూ రామునికై కన్నర్పకుండా ఎదురు చూస్తూ ఉంటుంది మా జానకి. మసక బారిన వెన్నెలలో చంద్రునిలాగా, మన్ను లో పడిన బంగారు తీగ లాగ వుంటుంది.  ఎప్పుడు సీతామాత దర్శనం ఔతుందో కదా అని అనుకుంటూ వెళ్తున్నాడు స్వామి హనుమ. 

25. కం. జనకుని ధన్యుని జేసిన
ఘనచరిత సుజాత, సీత కనబడ దెచటన్
తనకాంతుని తలచు నెపుడు
కనకోమలియౌ తరుణిని కనుగొనుటెటులన్

ఎందరో ఆడవాళ్ళను చూచాను కానీ జనక మహరాజు ఇంట్లో పుట్టి ఆయనను ధన్యుని చేసి మంచి నడవడిక గల సుమ కోమలియైన సీత మాత్రం నాకు కనబడలేదు కదా అని హనుమంతుడు చింతన చేసి ముందుకు వెళ్ళాడు.

మూలము:

ఆససాద అథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనమ్
ప్రాకారేణ అర్క వర్ణేన భాస్వరేణ అభిసమ్ఞన్తమ్

రక్షితమ్ రాక్షసైర్భీమైః సింహైరివ మహద్వనమ్
సమీక్షమాణో భవనమ్ చకాశే కపి కుంజరః


26. కం. దినకర మయూఖ వర్ణము
ఘనమగు ప్రాకారము గల కాంచన గృహమున్
హనుమంతుడు గాంచెనచట
అనునిత్యము మెలకువ గల అసురుల నడుమన్!


రావణుని భవనము ముందర ఉన్న ప్రాకారము సూర్యకిరణాల ( అర్క మయూఖము) రంగులో (వర్ణము) ఉన్నది. ఆ బంగారు భవనం ముందర  బలవంతులైన రాక్షసులు వేల కళ్ళతో అనునిత్యము కాపలా కాస్తూ హనుమంతునికి కనబడ్డారు. 


మూలమ్: 

మహీ తలే స్వర్గమ్ ఇవ ప్రకీర్ణమ్
శ్రియా జ్వలంతమ్ బహురత్న కీర్ణమ్
నానా తరూణామ్ కుసుమ అవకీర్ణమ్
గిరేరివ అగ్రమ్ రజసా అవకీర్ణమ్ 


27. కం. అమరావతి భూ తలమున,
అమరె ననగ కానుపించు అసురుని నెలవున్!
కమనీయకేసరభరిత
సుమశోభిత గిరిగ హనుమ చూచెను అచటన్!

రావణుని గృహము స్వర్గమును భూమి పైన పడవేసినట్టుగా ఉన్నది, ఎత్తులో ఉన్న ఆ భవన సముదాయము పుప్పొడులతో (కేసరము) నిండిన పర్వతంలాగా పూలతో కప్పబడి ఉన్నది. అటువంటి గృహమును హనుమ చూచాడు.

28. కం. హరివీరుడు పుష్పకమను
అరుదైనదియొక విమాన మచ్చట జూచెన్
అరుదెంచది మనసెరుగుచు
పరమాద్భుతముగ వెలుగుచు భాసిల్లెనటన్

హనుమంతుడు రావణుని మందిరంలో ఒక అరుదైన విమానము చూచాడు. పరమాద్భుతమైన వెలుగులను ప్రసరిస్తూ ఉన్న దాని పేరు పుష్పకము. ఆకాశం లో ఎగుర గల సామర్థ్యమున్న ఆ విమానము కూర్చున్న తడవున మనసులో తలుచుకున్న ప్రదేశానికి చేర్చగలదు

29. కం. పసిడిమయము యెటుజూచిన
అసురాధిపు వాసమందు నచ్చెరు వొందన్
మిసిమి వయసుతో కులుకుచు
అసమశరుని వాతబడిన అసురీ గణముల్


స్వామి హనుమ రాక్షస రాజైన రావణుని గృహంలో సీత కోసం వెదుకుతూ ఆ భవనమంతా పరీక్షించి చూచినప్పుడు ఆయనకు ఎక్కడ చూచిన బంగారు మయమై కనపడింది ఆ గృహం. అందమైన్ పడుచులు రావణున్ని కోరి వచ్చిన వారు, వయసులో వున్న వారు, వివస్త్రలై ఉన్నవారు మన్మథుని (అసమ శరుడు)  చేతిలో ఓడి పోయినవారు ఆయన తల్పం పైన కనబడ్డారు.

30. కం. ఒడలెరుగక నిదురించిరి
కడుహాయిగ కైకసిసుతు కలలన్ గనుచున్
ముడిపడు మేనుల పడతులు
పడియుండరి పరవశమున పల్యంకముపై.

రావణ గృహంలోని స్త్రీలు మదిరను సేవించి ఒళ్ళు తెలియని స్థితిలో ఒకరి పైన ఒకరు పడుకొని ఉన్నారు.  రావణ అంతఃపురంలో ఒక్క సీత తప్ప మిగితా ఆడవాళ్ళలో ఒక్కరు కూడా రావణుడు బలవంతంగా తెచ్చిన వారు, ఆయన్ను ఇష్టపడని వారు లేరు. 


31. కం. మందర సమ కాయమ్మున
చందనపు సువాసనెగయ సలిపిన కేళిన్
సుందరి ప్రియుడా రావణు
నాందోళిక లో పరుండ యనిలజుడుగనెన్

ఆందోళిక - మంచము

స్వామి హనుమ రావణున్ని చూచాడు. రావణుని దేహము మందర పర్వతమంత వుంది. ఆయన శరీరానికి ఎర్ర చందనం వ్రాసుకుని ఉన్నాడు. ఆడ వారితో సలిపిన కేళి కారణంగా అలసి పోయి పడుకుని ఉన్నాడు. సుందరమైన స్త్రీలు ఇష్టపడే రావణున్ని అందమైన మంచం పైన పడుకొని ఉండడం స్వామి హనుమ గమనించాడు. 


32. కం. ఊపిరి చూచిన దైత్యుని
పాపని బుసబుసగ దోచె పవనసు తునకున్
సైపగ నాతని తేజము
దాపుల నుండగను జంకి దవ్వుల నిలిచెన్

పాపడు - పాము 
దాపుల - దగ్గర
దవ్వుల - దూరము 

రావణుని దగ్గరగా వెళ్ళిన హనుమకు ఆయన ఊపిరి తీసి వదలి పెడుతుంటే ఒక మహా సర్పం బుసలు కొడ్తున్నట్టు అనిపించింది. రావణుని తేజస్సునకు ఒక్క సారి జంకిన హనుమ దూరంగా వెళ్ళి ఎత్తైన వేదిక పైన నిలబడి మళ్ళీ పరీక్ష గా ఆయన్ను చూచాడు.

33. కం. సిరిగ వెలుగు మండోదరి
సరసీరుహ ముఖమును గని సంతస పడుచున్
ధరణిజయే యని భ్రమసిన
వరపుత్రుడు యాడి దుమికె వాలము తోడన్

రావణ మందిరం లో ఎందరో ఆడవారిని చూచిన స్వామి హనుమకు అతిలోక సౌందర్యవతి యైన స్త్రీ లక్ష్మీ కళతో బంగారు ఆభరణాలు ధరించి పడుకొని కనబడింది. ఆమెను చూడగానే  సీత అని భ్రమ పడ్దాడు. సీతను చూచిన ఆనందంలో వరపుత్రుడైన స్వామి హనుమ తోకను నేలకు కొట్టి దుమికి ఆడి సంతోషించాడు. 


34. కం. రాజా రాముని తలచుచు
‌భోజనమును మానియుండు భూమి పరుండున్
కాజాలదు యీ మానిని
మాజానకి యనుచు కదలె మారుతి వెదుకన్


 అంతలోనే బుద్ధిమంతుడైన స్వామి హనుమ ఆలోచించి అనుకున్నాడు , నిరంతరము రాముని వియోగంలో దుఃఖపడుతూ ఉన్న జానకి భోజనమును మాని భూశయనము చేస్తుంది కాని ఇట్లా రత్నాబరాలు ధరించి హాయిగా పట్టె మంచం పైన పడుకుంటుందా? ఒక్క నాటికి ఈమె జానకి కాజాలదు అని కలత చెంది మళ్ళీ సీతాన్వేషణ ప్రారంభించాడు స్వామి.

35. కం. శోకమ్మున మునుగు నరుడు
యేకార్యము గెలువలేడు యిలలో చూడన్
నాకు వలదు నిస్సత్తువ
భూకాంతను వెదుకు దేను పూనిక తోడన్

శోకము ఎంతటి వాణ్ణైనా కార్య విముఖుణ్ణి చేస్తుంది కదా! అందుకని ఈ శోకాన్ని వదలి పూనికతో సీతమ్మను వెదుకుతాను అని అనుకున్నాడు హనుమ.

36. కం. పలుభంగిమలన్ జూచితి
వలువలు లేకయు నిదురను వనితామణులన్!
కలుగదొ దోషము? నాకని
తలచెను హనుమ తనలోన ధర్మ నిరతుడై 

ఎందరో ఆడవారిని పలురకమైన భంగిమల్లో చూచాను. నేను ధ్రమాన్ని తపొఇన వాణ్ణి కాదు కదా అని ఒకసారి స్వామి హనుమ ఆలోచించాడు. 

37. కం. స్థిరముగ నుంచితి మనసును
తరుణుల గుంపుల వెదకుచు ధరణిజ కొరకై
అరయగ నెవ్వని కైనను
హరిణాక్షిని కాననౌన హరిణములందున్!!

నా మనసు స్థిరంగా వున్నది కాబట్టి నా ధర్మానికి హాని కలుగలేదు. ఐనా ఒక స్త్రీని వెదకాలంటే స్త్రీల మధ్య లో చూడాలి కదా! లేళ్ళ గుంపులో స్త్రీ కొరకు వెదికితే మాత్రం కనబడుతుందా! ఈ కారణం చేత గత్యంతరం లేక  నేను సీత కోసం ఆడవారిని పరీక్షించి చూడవలసి వచ్చింది. అని అనుకుని ముందుకు సాగాడు స్వామి హనుమ.

38. కం. చూచితివా సీతను? యని
కాచుకొనిన కపుల నెటుల కాంచెద నెదురై?
తోచదు యేగతి నాకిక
వేచెద మరణమ్ము నన్ను పిలిచెడి వరకున్!

అవతలి ఒడ్డున అంగదుడు, జాంబవంతుడు మొదలైన వానరులు సీతను నేను వెదకగలనని నాపై నమ్మకం తో కాచుకొని ఎదురు చూస్తూ ఉంటారు. వారికి రిక్త హస్తాలతో ఎట్లా ఎదురు పడగలను? 
ఇప్పటి నా పరిస్థితి చూస్తే మరణమే శరణమని అనిపుస్తున్నది. అని స్వామి హనుమ మనసులో చాల దుఃఖము చెందాడు.

39. కం. తనువున ప్రాణము గలిగిన
కనవచ్చును మంగళముల కాలాంతరమున్
కనలేని నాడు సీతను
మననీయను ప్రాణముల మహిలో దైత్యున్

శరీరం ఉంటేనే కదా శుభములను పొందగలిగేది ఎవరైనా. కాబట్టి అనేక దోషములకు మూలమైన మరణాన్ని ఆలోచించను ఇప్పుడు. ఒకవేళ సీతను కనుక్కోలేక పోతే ఈ రావణుని ప్రాణాలను హరించి తీసుకుని పోతాను. 


40. కం. ఘనమగు తరుసంఘాతము
కనుపించు యశోకవనము కన మరచితినే
యని దిక్పాలకులను తన
మనసున మ్రొక్కగ దొరగొనె మారుతి యపుడున్


41. కం. మ్రొక్కెద రాముని లక్ష్మణు
మక్కువ రుద్రేంద్ర యముల మాతను సీతన్
దక్కగ జనకాత్మజ నే
మ్రొక్కెద వేల్పుల వరమిడ మోకరిలిపుడున్!


తన యెదుట ఒక సుందరమైన వనమును చూచాడు స్వామి హనుమ. దానిలో పెద్ద పెద్ద వృక్షాలు వున్నవి. అన్ని చోట్ల వెదికాను కాని ఈ అశోక వనం లో‌మాత్రం చూడలేదు సీతకోసం, అనుకుంటూ కార్య సాఫల్యం కొరకై హనుమంతుడు సీతా రాములను లక్ష్మణున్ని శివుని దిక్పాలకులను నమస్కరించడానికి ఉద్యుక్తుడైనాడు.

42. కం. పొగ కప్పిన యగ్ని కణము
సగము దెలియు చంద్ర రేఖ, సగమగు మేనున్,
మగువయొకతె హనమంతుని
కగుపించెను యాది లక్ష్మి  యాకృతి గచటన్

అంతలో ఒక శింశుపావృక్షం పైన యున్న స్వామి హనుమకు ఒక స్త్రీ మూర్తి కనబడింది ఆమె శక్తి స్వరూపంగా నివురు కప్పిన నిప్పుగా, మసకబారిన చంద్ర రేఖలాగా ఆదిలక్ష్మి లాగ అనిపించింది స్వామికి.

43. కం. పెను మాయావుల నడుమన
తన నాథుని మనసునుంచి తాపసియౌ నీ
వనలక్ష్మిని కనలేకయు
మనుచుంటివి యెటుల నీవు మైథిలి నాథా!

నిరంతరమూ బలమైన రాక్షసిల మధ్య నిన్నే తలుచుకుంటూ తాపసి లాగా జీవితాన్ని గడుపుతూ వనలక్ష్మి గా వెలుగుతున్న ఈ సాధ్విని విడిచి కూడా ప్రాణాలతో వుండగకుగుతున్నావు ఇది ఎట్లా సాధ్యం సీతా నాథా! 


44. కం. నాలుగు దిక్కుల నేలిన
యేలిక దశరథుని కోడ లీగతి వగపున్
బేలగ గని యేమందున్?
కాలమునకు కాని దేమి కాంచిన భూమిన్!!! 

నాలుగు వైపులా సువిశాల భరథ భూమిని యేలిన దశరథుని ఇంటి కోడలు ఇక్కడ ఒక్కతే యే ఆధారములేక ఏడుస్తూ చూస్తే కాలానికి లొంగనిది ఏదైనా ఉన్నదా అసలు అని ఆశ్చర్యమౌతుంది.

45. కం. కామాతురుడై దైత్యుడు
నీమమ్ముల మరచి యేగె నిదుర చెదరగన్
కాముకునికి కనుల బడక
సీమంతిని సీత కదలి చీరను యొదిగెన్


రావణుడు నిద్ర లేచీ లేవగానే సీతను చూడాలన్న కామాంధతలో ఆమే దగ్గరికి వచ్చాడు. ఆ కాముకుని కనుల బడక ఒకొ మూలకు ఒదిగి కూర్చున్నది అమ్మ సీత. 

46. కం. రక్కసి మూకల మధ్యన
దిక్కులు పరికించి చూచు దీనను సీతన్
చిక్కని శాఖల నొదుగుచు
అక్కజ పడిజూచె హనుమ యశృవులిడుచున్! 

ఆ రాక్షసుల మధ్య దీనగా కూర్చుని ఉన్న సీతమ్మను చూచిన స్వామి హనుమ కళ్ళ లో నీళ్ళు పెట్టుకుని ఆకుల మధ్యన ఒదిగి కూర్చున్నాడు. 

రావణ ప్రలోభం


47. కం. గడచిన కాలము నీకై
నడచి తిరిగి రాదు వినుము నాదు పలుకులన్
కడకన్నుల శాసించుము
అడుగుల బడులంక నీదు ఆజ్ఞా నిరతిన్!

సీతా, కాలాన్ని వ్యర్థంగా ఎందుకు గడుపుతావు అది నీకోసం వెనక్కు తిరిగిరాదు కదా! నా మాట విను నువ్వనుకుంటే నీ కొనచూపుతో నన్ను శాసించగలవు. నీ ఆజ్ఞ ఐతే లంకలో ఎవ్వరైనా నీ అడుగులకు మడుగులొత్తాల్సిందే. 

48. కం. ఎట్టాడిన నట్టాడును
పట్ట మహిషివైన లంక పాదములందున్
పట్టున పదినాళ్ళ వయసు
పట్టు విడక యున్న నీకు ఫలితమ్మేమీ?

నువ్వు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతుంది లంక నీ‌పాదాల దగ్గర. యౌవనమన్నది పదినాళ్ళ ముచ్చట నీవు పట్టు విడువకపోతే లాభమేమీ ? 

49. కం. విలపింతువేల కోమలి
పలవించుట మాని నీదు పతికైయింకన్!
కలకాలము నా రాణిగ
తులదూగుము సిరుల లోన తోయజ నయనా!

సీతా! ఆ రామునికై ఎందుకు ఏడుస్తావు? నా రాణిగా సిరి సంపదలలో తులదూగవేలా? 


50. కం. కలడని నీవనుకొన్నను
కలడో లేడో యతండు? కారడవిని యే
పులివాతను బడినాడో
కల మానిక, చేరిన నను కలుగును సుఖముల్!

సీతా, బ్రతికి యున్నాడని నీవనుకుంటున్న ఆ రాముడు కారడవిలో యే క్రూర మృగములచేత భక్షింపబడినాడో? కలలు కనడం మాని నన్ను కోరుకుంటే నీవు స్వర్గ సుఖములు పొందగలవు.
*****
51. కం. వాచాలుని ప్రేలాపన
నీచాత్ముడ నీదు మాట నిలుపుము యింకన్
నీ చావును తెచ్చుకొనకు
కాచును నా రాముడు నిను కాళ్ళను బడినన్

రావణా ఆపు నీ ప్రేలాపన నీచేతులారా నీచావును కొనితెచ్చుకోకు. నా రాముని కాళ్ళ మీద పడి తప్పు ఒప్పుకుంటే కరుణాసముద్రుడు నిన్ను క్షమించి ప్రాణాలతో వదిలేస్తాడు. 


52. కం. హితవు నుడువు వాడెవ్వడు
గతి లేడో నీకు ఇచట కాంచన లంకన్
మతిచెప్పిన విననంటివొ!
పతనమ్మును పొందుదీవు పడి కామంబున్!!

ఐనా ఒక్క విషయం ఆశ్చర్యజనకంగా వున్నది నాకు నీవు ఇతరులు మంచి చెబితే వినవా? లేక అసలు ఈ లంకలో మంచి చెప్పే వారే లేరా? రావణా నేను చెప్తున్నా విను మనసునదుపు పెట్టుకోలేని రాజు తన రాజ్యాలనన్నీ నాశనం చేస్తాడు. కనుక బుద్ధిగా మసలుకో.

53. కం. రెండు నెలలు గడువిత్తును
ఉండుము నా రాణిగీవు ఓ నళినాక్షీ
దండింతును వినకున్నను
దండగ రాముని తలంపు తరళ సునయనా!


సితా,  నీకిచ్చిన ఏడాది గడువు రెండునెలల్లో తీరిపోతుంది. అంతలోపు నా రాణిగా ఐతే నీకే మంచిది. లేకుంటే దండన తప్పదు. రాముని తలచుకోవడమన్నది దండగ అని యెరుగుము. 


54. కం. అమితము రావణు తేజము
అమరుల గెల్చెను రణమున అరిహంతకుడై
సముడెవ్వడు లేడతనికి
కుమతిగ కోల్పోకుమీవు కోరివచ్చు సిరిన్

రావణుని ఆజ్ఞ మేరకు వికృతమైన్ రూపముగల ఆ రాక్షస వనితలు సీతను భయ పెట్టుచూ అతని సిరిసంపదలు శౌర్యము చెప్తూ సీతా రావణుడు దేవతలను గెలిచిన వాడు. అతనికి సముడు ఎవ్వడూ లేడు. సరియైన బుద్ధితో ఆలోచించి కోరి వచ్చిన లక్ష్మిని కాదనుకోకు అని అన్నారు. 

55. కం. అసురాధిపు గుణ గణముల
నసురీగణము లెరిగించి రవనిజ యెదుటన్
పసిడిని, పదవిని, కాదను
పసిదానిగ జూలి పొందిరామెను గనుచున్!


రాక్షస వనితలు రావణుని గుణగణాలన్నీ చెప్పి, అసమానమైన సిరిని రావణుని పట్టమహిషి అయ్యే అదృష్టాన్ని కాదంటున్న సీతను చూచి ఆమె పాతివ్రత్యము ఏమాత్రమూ తెలియని వారై,  అయ్యో పసిదానిలాగా ఇంతటి ఐశ్వర్యాన్ని కాదనుటున్నదే అని జాలి పడ్డారు.

56. కం.‌ నారాముని తక్క పరుని
కోరను నేను నను మీరు గోసి నమిలినన్
క్రూరపు మాటల వెరవను
చేరను వేరెవరినైన చింతను కూడన్

నన్ను చంపినా కూడా నేను రాముని తప్ప వేరెవరినీ కోరను. మీ మాటలకు భయపడను.‌ఆలోచనలో కూడ పరపురుషుని తలుచుకోను.

57. కం. బెదిరించి యసుర వనితలు
ఎదురేగిరి తినగనెంచి యింతిని సీతన్
కదళీ తరు పెనుగాలికి
కదలి వణకు రీతి మాత కంపము చెందెన్

రాక్షస వనితలు సీతను బెదిరించి చివరికి ఆమెను చంపి తినాలని ముందుకు జరిగ్గనే. సీత వారి వికృతరూపాలను చూచి మిక్కిలి భీతి చెంది పెనుగాలికి కదిలిపోయిన అరటి చెట్టులాగా కనపడింది.

58. కం. వలదే సంపదయు సిరులు
కలగని నాడు రఘురాము కరస్పర్శనమున్
తలచిన నాతల రాతను
పలవించుట వ్రాసె ధాత భర్తకు నెడమై

రామచంద్రుని సాంగత్యము లేని నాడు నాకు ఎన్ని సంపదలున్నా వ్యర్థమే నా ఎడమ కాలితో కూడా రావణుని తాకను, ఇక అతని దగ్గరికి వెళ్ళడమన్న మాటేది? 
ఆలోచిస్తే ఉంటే నా తల రాతను భర్తకు దూరంగా ఉండాలని బ్రహ్మయే వ్రాసినాడని అనిపిస్తున్నది. అని సీత విలపించింది. 


59. కం. కరుణామయు నెడబాసియు!
మరణము రాదేమి నాకు?
మారకు డేలా - కరుణించడు గొని పోవక!
పురుషోత్తము దరిసెనమ్ము పొందుటయెపుడో!

కరుణా సముద్రుడైన రాముని యెడబాసినా కూడా నాకు మరణము రాకున్నదేమీ!!!
యమునికి (మారకుడు) ఇంకా నాపై దయరానట్టున్నది. పురుషోత్తముడైన రాముని దర్శన భాగ్యం ఎప్పుడో కదా!! 

60. కం. అంతెరుగని శోకమ్మున
కాంతుని కైపొగి లియేడ్చి కలకంఠి కనుల్
చింతాగ్నులనెరు పెక్కెను
సుంతైనను దయ నెరుగదు చూడంగ విధిన్!!!

సీత శోకాని అంతము లేకుండా కనబడుతున్నది. ఆమె మనసులోని చింత అనే అగ్నుల చేత ఆమె కన్నులు ఎర్రగా మారినవి. ఎంత దయమాలినది ఈ విధి!!!!

61. కం. నిలిచి వినుడు నామాటను
కలగంటిని యింత దనుక, కలవరమాయెన్!
కలసియనుజు తో రఘుపతి
కలహంసల రథము దిగెను కాంతులు నిండన్

త్రిజట తన స్వప్న వృత్తాంతము చెప్తూ అన్నది, సీతను తిందామన్న ఆలోచన మానండి నా మాట వినండి నేను ఒక స్వప్నం చూచాను ఇప్పుడే, తెల్లని హంసల రథంలో తమ్మునితో బాటు రాముడు దిగుతూ కనబడ్డాడు నాకు. 

62. కం. తెల్లని శిఖరాగ్రమ్మున
నల్లని కన్నుల యవనిజ నవ్వుచగుపడెన్
చల్లని తన కరములతో
మెల్లగ చంద్రుని దినకరు మేనుల తాకెన్!

వెండి కొండ పైన నల్లని కన్నులు గల సీత నవ్వుతూ కనబడింది ఆమె తన చేతులతో సూర్యుణ్ణి చంద్రుణ్ణి తాకుతూ నాకు అగుపడింది.

63. కం. రివ్వున పుష్పకమందున
మువ్వురు యేగిరి నభమున మోదము తోడన్
చెవ్వుల నీడ్చగ రావణు
డివ్వల పడిపోయెనేల యింతి కరమునన్

సీతా రామ లక్ష్మణులు మగ్గురూ కూడా పుష్పక విమానం ఎక్కి ఉత్తర దిశగా సంతోషంతో వెళ్ళిపోయారు. అప్పుడు రావణుణ్ణి ఒక స్త్రీ ఈడ్చు కుంటూ వెళ్ళడం కూడా చూచాను నేను. 

63. కం. రావణుడు వరాహమ్మున
పోవగ, తనసోదరుండు బోయెను ఒంటెన్
భూవరు కొడుకు మకరమున,
దావాగ్నుల నడుమ జనిరి దక్షిణ దిశగన్

రావణుడు ఒక వరాహం పైన అతని సోదరుడైన కుంభకర్ణుడు ఒంటె పైన ఇంద్రజిత్తు మొసలిపైన నూనె క త్రాగుతూ భయంకరమైన అగ్నుల మధ్య దక్షిణం వైపు వెళ్ళారు (దక్షిణ దిశాధిపతి యముడు) అంటే వాళ్ళంతా నరకానికి వెళ్ళారు అని భావం. 

64. కం. కాలిచి బూడిద జేసెను
కాలాగ్నిగ లంకను కపి కాలుని రీతిన్
కీలల కూలిరి యసురులు,
నేల నెగయు మంటలపుడు నింగిని జేరెన్!

రామదూత ఐన ఒక వానర వీరుడు లంకను వీరభద్రుని లాగా కాల్చి బూడిద చేశాడు. ఆ అగ్నికీలల రాక్షసులు కూలినారు. నేలమీదినుంచి మంటలు ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్టు లంకంతా కాలిపోయింది.

65. కం. హితుడై చను రామానుజు
నతికఠినపు మాటలాడి యనిపితి వనమున్
అతిదారుణ కాలమ్మే
మతిమాలిన నను మృగముగ మరపించె కదా!

నాకు ఎల్లపుడూ హితమునే తలచే లక్ష్మణుని ఎంతో కఠినమైన మాటలతో బాధపెట్టి జనస్థానంలో రాముని వెనుక పంపించాను. నాకు ఇప్పుడు రూఢిగా తెలుస్తున్నది బలవత్తరమైన కాలమే జింక రూపంలో నన్ను ప్రలోభపెట్టడానికి వచ్చిందని. 


66. కం. అడుగంటిన యాశలతో
జడను మెడకు నురిగ  జేసి జానకి యపుడున్
తడి కన్నుల తన రాముని
కడసారిగ మ్రొక్కి తనదు  కరముల మోడ్చెన్

భయంకరమైన రాక్షస వనితల మధ్య మిక్కిలి భయఓడిపోయిన సీత, అన్ని ఆశలూ అడుగంటి పోయి మరణించాలని నిర్ణయించుకుని తన పొడవైన జడను చెట్టుకు కట్టి తన మెడకు చుట్టుకుని సిద్ధపడింది. కన్నీరు నిండిన కళ్ళతో తన రామునికి నమస్కరించింది.

67. కం. రాముని దలచిన సీతకు
వామ భుజమ్మదిరె వామ పక్షము తొడయున్
యేమీ! శుభ శకునములని
రామాంగన సంతస పడె రాక్షస నెలవున్!


తన ప్రాణము తీసుకోవడానికి ఉద్యుక్తురాలైన సీతకు ఆ శ్చర్యముగా శుభ శకునములుగా ఎడమ భుజము, తొడ,  నేత్రము అదిరాయి. లంకకు తనని రాక్షసుడు అపహరించి తెచ్చినప్పటినుండి మొదటి సారిగా మంచి నిమిత్తములు తోచినందుకు ఆమెకు చాల సంతోషపడింది. 


68. కం. సరసున విరిసిన తామర
దరిచేరిన చేపపిల్ల తాకిన తూడున్
అరవిందపు కదలిక వలె
ధరణీసుత యెడమకన్ను తడబడె నపుడున్

ఒక నిశ్చలమైన సరుస్సులో ఉన్న కమలం ఆ తామర తూడుని ఒక చిన్న చేపపిల్ల తాకినప్పుడు పైన ఉన్న తామర ఎట్లా ఐతే కదులుతుందో ఆ విధంగా పద్మనేత్రి అయిన సీతమ్మ ఎడమ కన్ను తడబడి అదిరింది. ఇలాగా స్త్రీకి ఎడమ కన్ను గాని తొడ, భుజం కాని అదిరితే శుభ శకునం కదా. సీతమ్మ తను తలపెట్టిన దారుణ మైన కార్యాన్ని విరమించుకున్నది. 


69. కం. ఎటులాపుదు నా తల్లిని
కటువగు కార్యమ్మునుండి కాచుట యెటులో
యెటుతోచక కపి వీరుడు
అటునిటు కదిలెను తరువున ఆందోళితుడై

ఇటు చెట్టుపైన స్వామి సీతమ్మ తన జడతో ఉరివేసుకోవడం చూడగానే చాల అందోళన చెందాడు. అయ్యో ఎట్లా ఇప్పుడు నా తల్లిని కాపాడుకోవడం, ఏ రకంగా ఆపగలను ఈ దారుణమైన ప్రాణ త్యాగం నుండి? నాకు ఏమీ పాలుపోవడం లేదే? 


70. కం. నమ్మింతును యేరీతిని
అమ్మనెటుల పలకరింతు అసురుల నడుమన్
అమ్మాయావిని కానని
సమ్మతినిపొందుటెటుల సందియ పడకన్


సీతమ్మని ఎట్లా నమ్మించాలి నన్ను చూచి మరొక అసురుడని అనుకుంటే? అసలు ఇంతమంది అసురుల మధ్య ఆమెని పలకరించడం ఎలాగ, నన్ను చూచి భయపడి అరిస్తే ఇంతమంది అసురులు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు అప్పుడు అసలు కార్యం చెడిపోతుంది. కామరూపుడైన రావణుడను అన్న సందేహం ఆమెకి తప్పక వస్తుంది, మరి యేమి దారి?

71. కం. రాముని కథ శుభ‌ములొసగు
సేమము కూర్చును ధరిత్రి చింతలు దీర్చున్
స్వామిని దలంచి పాడెద
రామాయణ గానమిపుడు రక్షించు సతిన్!!

  రాముడన్నా,  రాముని కథ అన్నా  సీతకు ఎంతో ఇష్టం.  రాముని కథ క్షేమమును కూర్చి అన్ని చింతలను తీర్చగలదు. నాకున్న గతి ఆ రాముడే!  ఆయన్నే మనసులో తలచుకుంటూ రామాయణ గానం చేస్తాను అదే అమ్మను రక్షించగలదు. 


72. కం. దయగల రాజు దశరథుడు
హయగజ సైన్యముల తోడ అలరెనయోధ్యన్
భయరహితుడు సకలహితుడు
ప్రియమారగ ప్రజలనేలె బిడ్డల వలెనే!!

దశరథుడనే రాజు దయగలవాడు, ధర్మాత్ముడు అనేక అశ్వ గజ పదాతి దళములచే అలరారి అయోధ్యలోని ప్రజలను తన బిడ్డలుగా చూచుకొని పాలించేవాడు.  

73. కం. జన్నము చేయగ దశరథు
కన్నుల పండువుగ పుట్టె కమలేశుడిలన్
పున్నమ చంద్రునిగ పెరిగి
వెన్నెల కురిపించె తండ్రి ప్రియ పుత్రునిగన్! 

పుత్రులు లేని దశరథుడు పుత్రకామేష్టి యాగము చేశాడు. ఆయన కన్నులపండువుగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీరామ చంద్రునిగా జన్మించాడు. పౌర్ణమి రోజు చంద్రునిగా పెరిగిన రాముడు దశరథుని ప్రియపుత్రునిగా ఆయన సంతోషానికి కారణమైనాడు.  

74. కం. తన ధర్మము విడక యెపుడు
తన వారినె కాక, సకల ధారుణి ప్రజలన్,
కను పాపలుగా గాచును
ధనువును తన కేలదాల్చి ధర్మమె తనువై!

శ్రీరాముడు తన ధర్మాన్ని రక్షించుకుంటూ తనవారినే కాక భూమిలోని ప్రజలందరిని రక్షించగలవాడు. కోదండాన్ని ధరించిన ధర్మస్వరూపము శ్రీరామ చంద్రుడు. 


75. కం. జనకుని మాటను నిలుపగ
వనవాసము చేసె నతడు ప్రా‌ణేశ్వరితో
అనుజుని గూడిన రాముడు
ఘనులగు దైత్యులను జంపె కానల వేలన్

తన తండ్రి దశరథుని సత్యమునందు నిలబెట్టడానికి పదునాలుగేండ్లు సీతమ్మతో, తమ్ముడు లక్ష్మణునితో వనవాసానికి వెళ్ళిన శ్రీరాముడు వేలమంది రాక్షసులను సంహరిచాడు. 

76. కం. కపటి యతిగ లంకేశుడు
అపహరణము చేయ సతిని, ఆమెను వెదుకన్
కపి మైత్రిని రఘురాముడు
కపి వాలిని సంహరించి గాచెనినసుతున్

జనస్థానంలో ఉన్నపుడు సీత కోరికను తీర్చడానికి బంగారు మృగాన్ని తేవడానికి శ్రీరామచంద్రుడు వెళ్ళగా ఎవరూ లేని సమయంలో కపటి సన్న్యాసిగా వచ్చిన లంకాధిపతి రావణుడు సీతను అపహరిస్తే ఆమెను వెదకడానికి వానరులతో స్నేహం చేసిన రాముడు వానర రాజైన వాలిని సంహరించి సూర్య సుతుడైన సుగ్రీవుని కాపాడినాడు.

77. కం. ఇనసుతు నానతి వెడలిరి
యినకుల సతిని వెదుకంగ ఇలలోని కపుల్
వినతా సుతు మాటలు విని
ఘన సింధువు దాటి నేను గాంచితి లంకన్

సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం భూమండలం లోని వానరులంతా సీతమ్మను వెదకడానికి బయలుదేరినారు. వైనతేయుడైన సంపాతి మాటను అనుసరించి నేను శతయోజనమ్ముల సింధువు (సముద్రాన్ని) దాటి లంకలో సీతను వెదకడానికి వచ్చాను. 

78. కం. రాముడు చెప్పిన గురుతులు
ఏమియు తప్పక యగుపడె యిచ్చట నాకున్
యీమాతయె సీతౌనని
నా మనసుకు తెలిసె నిజము నమ్మికగనిటన్

లంకంతా సీతమ్మ కై వెదకిన నేను ఈ అశోక వనంలో శ్రీరాముడు యే గురుతులు సీతమ్మగురించి చెప్పాడో ఆ గురుతులు గల స్త్రీమూర్తిని చూచాను. ఈమెయే సీతమ్మ అని నాకు నమ్మకం కలిగింది.

79. కం. తన నాథుని కథనంతయు
వినిసీతకు కలిగె ముదము వీనులలరగన్
కనుపాపల నటునిటుగను
వినిపించిన దెసకు తిప్పి వింతగ జూచెన్

రాముని కథను చెవులకింపుగా విన్న సీతమ్మ ఎంతో సంతోషపడింది. కళ్ళు శబ్దం వచ్చిన దిక్కు ఆశ్చర్యంతో తిప్పి చూచింది. 

80. ఉరుముల విద్యుత్కాంతుల
మెరుపులు కలబోసినటుల మెరిసిన హనుమన్
తరుశాఖల ధరణీ సుత
పరికించగ మూర్ఛపొందె భయవిహ్వలతన్

వేల విద్యుత్కాంతులు ఒక్క చోట ప్రోగైతే ఎంత వెలుగు శక్తి యున్నదిగా కనబడుతుందో అటువంటి స్వరూపం తో మెరిసిపోతున్న హనుమంతుని చూచిన సీతమ్మ భయకంపితయై మూర్ఛనుపొందినది. 

81. కం. నిరతము నాపతి చింతన
గరపు కతన రాముని కథ కలబడెనేమో!!
అరయగ వింతగ తోచున్
కరుణామయుని కనులార కాంచుట యెపుడో 

కొద్ది సమయానికి మెలకువ వచ్చిన సీతమ్మ అహో ఎప్పుడు రాముణ్ణే తలుచుకుంటూ ఆయన నామమే జపిస్తున్న కారణం చేత రాముని కథ కలగా కనవడిందేమో రాముని నిజంగా ఎప్పుడు చూడగలను? 

82. కం. కలగాంచితి కపి ముఖమును
కలుగు నశుభమంచువింటి కలగన యిటులన్
పలవించితి రామునికై
కలచు మనసు నిదురలేమి కలలెటు వచ్చున్!

అయ్యో కలలో కోతి ముఖాన్ని చూచాను ఇది అశుభసూచకమని విన్నాను. ఐనా రామునికై పలవించుటలో బాధపడిన మనసుగల నాకు నిదుర యేరకంగా కలుగుతుంది? నిదురలేనిదే కలరాదుకదా కాబట్టి ఇది కలకాదు నిజమే. 

83. కం. తలపై కరములు జేరిచి
మెలమెల్లని యడుగుల జని మీనాక్షిదరిన్
అలికిడి సేయక పావని
పలికెను మృదు వచనములను వంచిన తలతో

రెండు చేతులూ తన తలపై చేర్చి అంజలి తో ముఖమును వినయపూర్వకముగా వంచి మెల మెల్లగా మీనములవంటి కనులుగల సీతమ్మ దగ్గరికి వచ్చి స్వామి హనుమ మృదు స్వరముతో ఆమెను పరిప్రశ్న చేశాడు. 

84. కం. తల్లీ యెవ్వరి దానవు?
యిల్లీలను యేడ్చుచుంటి వెందుల కిచటన్?
చెల్లెను యెవ్వరి యాయువు?
ఉల్లము నకుశాంతిదొరుకు ఊరట గొనుమా!

అమ్మా ఎవ్వరు నీవు? ఎందుకు ఇంత రాళ్ళు కరిగేలా కన్నీరు పెడుతున్నావు? నీ దగ్గరి వారెవరైనా మరణించారా? ఊరటను పొందు తల్లీ ! 

85. కం. రాముని దూతగ వచ్చితి
సేమ మరసె రాఘవుండు సీతా మాతా!
సౌమిత్రియు యంజలులిడె!
నీమూర్తియె వారి తలపు నిండె గదమ్మా!

సీత మాటలు విన్న హనుమ ఆమెతో, అమ్మా నేను రాముని దూతగా వచ్చాను నీ క్షేమాన్ని అడిగినాడు స్వామి. సౌమిత్రి కూడా నీకు శిరసువంచి ప్రణామములను అందజేయమన్నాడు. వారిద్దరూ నీ గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ  ఉంటారు.  రాముని మాట విన్న సీతా చాల సంతోషించింది.

86. కం. మాతా తెలుపుము యెవరవు
యీతావులకు అరుదెంచు యేదేవతవో
నాతలపు నిండు రాముని
సీతవొ?  తల్లీ తెలుపుము చింత తొలగగన్

మాతా యెవరవు నీవు?   దివినుండి భువికి దిగి వచ్చిన దేవతవా? 
నిరతము నా మనసులో నిండిన నా రాముని సీతవా? నిజము తెలుపు తల్లీ!! 

87. కం. ఎంతగ మారుతి జరిగెనొ
అంతంతగ సీత కదిలె అనుమానముతో
పంతము గల యసురుడనుచు
వంతను గొని వగచె సీత పరితాపముతో

పరిప్రశ్న  చేసిన హనుమకు జవాబు ఇచ్చిన సీత తనను నమ్మినదని మారుతి కొంత ముందుకు జరిగాడు. ఎంత ముందుకు హనుమ జరిగాడో అంతంత సీత వెనక్కు కదిలింది. తనపై పంతము బూనిన రావణుడే ఈతడని మారువేషంలో వచ్చినాడని సీత చాల దుఃఖాన్ని పొందింది.

88. కం. వానరులకు రఘువీరుల
కేనాడయ్యెను కలయిక యెటులయె స్నేహమ్
నానాథుడు యెటులుండును
మేని గురుతులేమొ దెలుపు మేలుగ యిపుడున్!!

వానరులకు నరులకూ ఎప్పుడు ఎట్లా స్నేహం కుదిరింది? నీకు రాముని గురించి తెలుసు అంటున్నావు ఆయన ఎట్లా ఉంటాడో చెప్పు చూద్దాం. 


89. కం. అన్నీ తెలిసిన దానవు
నన్నీలాగున యడుగుట నామేలునకో?
యెన్నని చెప్పెద నీకున్
కన్నయటుల మనవిజేతు కాంతుని చరితన్ 

90. కం. నమ్ముము తల్లీ తెలిపెద
సమ్మతముగ నీకు రామ చరితామృతమున్
తమ్ముని తోశ్రీరాముడు
కొమ్మల తిరిగెడు కపులను కూడిన గాథన్

అమ్మా!! అన్నీ తెలిసిన దానవు నన్ను అడుగుతున్నావు రాముని గురించి, ఇది నా అదృష్టమని భావించి నేను చూచినంత మేరకు మనవి చేస్తాను. 


91. కం. సమకాయుడు సుమనేత్రుడు
సమ బుద్ధియు గజగమనుడు సమరవిజయుడున్
అమల చరితుడఖిల ప్రియుడు
సమదర్శిగ ప్రజల జూచు సకలహితునిగన్

రాముడు కమలపత్రముల కళ్ళు గలిగిన వాడు. రాజసం ఉట్టిపడుతూ మదగజం ఎట్లా నడుస్తుందో అలా ఉంటుంది ఆయన నడక. మచ్చ లేని చరిత్ర కలవాడు, ప్రపంచంలో ఆయన అంటే తెకియని వాడు ఇష్టపడని వాడు ఉండడు. ప్రజలందరినీ సమ దృష్టితో చూస్తూ అందరికీ ఎప్పుడూ హితవు చేకూర్చేవాడు. 

92. కం.అతని కరము సిరికి నెలవు
అతని చరణ మేలు జగము ఆశ్రయమిచ్చున్
అతని శరము తప్పదు గురి
అతనికెదురు పడగ లేరు అమరులె యైనన్

రాముని చేయి లక్ష్మీ నిలయం, ఆయన పాదము లోకాలన్నిటికీ  ఆశ్రయమిస్తుంది. రాముని బాణము తిరుగులేనిది ఆయన ముందు దేవతలైనా గాని యుద్ధంలో నిలబడలేరు.

93. కం. గురుజనులకు యుపకారము
నెరపు నతడు రాజనీతి నేర్చిన వాడున్
కరణీయము నెరుగునతడు
పరగును గౌరవముతోడ పండితులయెడన్

రాజనీతిని క్షుణ్ణంగా తెలిసున్న రాముడు పెద్దవారి పట్ల, పండితుల పట్ల విశేషమైన గౌరవము చూపుతాడు. ఏ పని ఎప్పుడు చేయాలో దాని ఫలితాన్ని ఊహించి చేసే ప్రజ్ఞ కలవాడు రాముడు. 

94. కం.సాముద్రిక శాస్త్ర విధిగ
రాముని దేహమున వెలుగు రాజుల గురుతుల్
సామాన్యుడు కాడు అతడు
యీ మేదిని ధర్మమనిన యినకుల మణియే

శ్రీ రాముని చేతుల్లో, పాదాల్లో శిరస్సుపైన, విశేషమైన చిహ్నములు మహారజులకూ వుండవలసిన గురుతులూ ఉంటాయి. శ్రీరాముడు నడిచే ధర్మం.

95. కం. నరశార్దూలములిరువురు
ధరనడచిన హరిహరులగ ధర్మనిరతులై
శర ధనువుల యగుపించిరి
శరణమనిన యినసుతునకు శాఖల నడుమన్

రామలక్ష్మణులను శరములూ ధనుస్సు ధరించి మాకు అగుపించారు. సుగ్రీవుడు రాముణ్ణి శరణు పొందినాడు. 

96. కం. హుతవాహుని సాక్షినిలిపి
జతగూడిరి యొకరికొకరు సాయము సేయన్
హతమారిచి వాలినపుడు
సుతుగాచియు సూర్యసుతుని జూచె యధిపుగన్

అగ్నిసాక్షిగా రామ సుగ్రీవులిద్దరూ స్నేహం చేసుకున్నారు. ఒకరికొకరు సహాయం చేయాలని సంకల్పం చేసుకున్నారు. అటుపిమ్మట రాముడు తన మాటను నిలబెట్టుకుని సుగ్రీవుని రాజ్యభ్రష్టుణ్ణి చేసిన వాలిన సంహరించి అతని కొడుకైన అంగదుణ్ణి రాజును చేసి సుగ్రీవుణ్ణి కిష్కింధకు రాజును చేశాడు.

97. కం. కడలిని శతయోజనముల
కడచితి శరవేగముగను కాంచన లంకన్
కడుసుందరమీ వనమున
అడుగిడి కాంచితి నిన్ను అమ్మా సీతా!

సుగ్రీవుడు తన మాట ప్రకారం నిన్ను వెదకడానికి కపిసేనలను పంపించాడు. ఎంత వెదకినా నిన్ను చూడలేని మా నిరాశను దూరం చేస్తూ వైనతేయుడైన సంపాతి నీవున్న లంకగురించి మాకు చెప్పాడు. నా శరీరాన్ని పెద్దది చేసి నూరు యోజనాల సముద్రాన్ని దాటి అన్ని చోట్లా గాలించిన తరువాత ఈ అశోకవనంలో నిన్ను చూడగలిగాను. 

98. కం. వత్తురిట రామలక్ష్మణు
లొత్తురు వానరులతోడ ఊరట గొనుమా
చత్తురు అసురులు అందరు
నెత్తురు చిందుచు రణమున నిజమిది తల్లీ!

అమ్మా, రామలక్ష్మణులు వానరులతో లంకకు వస్తారు. రావణున్ని సపరివారంగా సంహరించి నిన్ను పొందగలరు. 

99. కం. తెలిసున్నది మనవించితి
తెలియబరచు నీదుయిచ్ఛ తెలిసి మరలెదన్
కలిసి కపులతో రాముడు
గెలువ గలడు, దైత్యులు రణకీలల, సమయన్!

సీతమ్మా, నాకు తెలిసినదంతా చెప్పాను. ఇక నీ ఇచ్ఛ ఏమిటో సెలవిస్తే నేను నిన్ను చూచిన విషయాన్ని శ్రీ రామునికి చెప్పాలి. రాముడు అప్పుడు వెంటనే ఇక్కడికి రాగలడు. అసురులను రణములో సంహరించి గెలుపు పొందగలడు. 


100. కం. చేకొను మాతా ముద్రిక
నాకిచ్చెను స్వామి నీకు నమ్మిక కలుగన్
భూకాంతుని రూపమెయిది
నీకష్టము తీర్చగలదు నెమ్మది నిచ్చున్

సీతా మాతా,  ఇదిగో చూడు స్వామి నీకు నాపై నమ్మకం కలగడానికి నాకిచ్చిన అంగుళీయకము శ్రీరామునామాంకితమైన ముద్రిక ఇది రాముని ప్రతిరూపము. 
నీ కష్టాలు ఇక తీరినట్లే. 

101. కం. తనచేతిని ముద్రిక గొని
తనకాంతుని రూపమెయని తలచి బిడియమున్
మనసున సంతస మొందుచు
హనుమంతుని పొగడె తల్లి ఆనందముతో


సీతమ్మ భర్త ఉంగరాన్ని గ్రహించి దాన్నే చూస్తూ రాముణ్ణి చూచినంత సంతోషాన్ని పొందింది.  హనుమంతుని చాల ప్రశంసించింది.

102. కం. నేనెరిగితి నీ బలమును
నీనైపుణ్యము నీదు నేర్మియు బుద్ధిన్
తానెరుగును రఘురాముడు
నీనేర్పును కార్యనిష్ఠ నిజముగ హనుమా!!

103. కం. శతయోజన జలధి గడచి
వెతికి తెవని వెరపు లేక వీరుని రీతిన్
అతిముదమును కలిగించితి
గతి తెలియక వగచు నాకు కలిగినవాశల్

హనుమా నీ ప్రజ్ఞ ఏమిటో నాకు తెలిసినది శత యోజనాల సముద్రాన్ని దాటి ఎవ్వరికీ భయపడకుండా లంకంతా గాలించిన సంగతి చూస్తే నాకు అవగతమై పోతున్నది. శ్రీరామునికి నీ సామర్థ్యం కార్య సాధకుని లక్షణము బాగ తెలుసు కాబట్టే నిన్ను ఈ పనికి ఎంచుకున్నాడు. నాకు చాల సంతోషంగా వుంది. ఇక లేవు అన్న ఆశలు మళ్ళీ కలిగాయి. 

104. కం. నిరతము నిన్నే తలచును
విరహమ్మున నీదు పేరె పిలుచును యెపుడున్
దరి జేరెడు ఉరగమ్ముల
పరికించడు నిదురవేళ బాధతొ యేడ్చున్!


సీతమ్మా, శ్రీ రాముడు నిన్నే ఎప్పుడూ తలచుకుంటూ ఏడుస్తున్నాడు. నీధ్యానమగ్నుడై పక్కన వున్న విష కీటకాలను కూడా చూడడం లేదు. 


105. కం. హుతవాహుని ఘృతము నటుల
మతినెంచియు నిన్ను నేను మాతా సీతా!
అతి రయమున గొనిపోయెద
పతి చెంతకు నా భుజముల పదిలముగమ్మా!


శ్రీరాముని దుఃఖము నీ కష్టములు ఇక నేను చూడలేను. అగ్ని దేవుడు దేవతలకు ఘృతమును ఎట్లా అయితే యజ్ఞ హవిస్సుగా తీసుకొనిపోతాడో అదే విధంగా నిన్ను రాముని చెంతకు నా భుజముల పైన ఎత్తుకొని తీసుకుపోగలను.

106. కం. నన్ను యెటులగొని పోదువు
చిన్నది యౌతనువు తోడ సింధువు పైనన్
యెన్నగ కపిగుణమేయని
సన్నగ నవిచూచె సీత శాఖాచరునిన్

హనుమా, ఇంత పెద్ద సముద్రాన్ని ఇంత చిన్న దేహముతో నన్ను తీసుకొని ఎట్లా పోగలవయ్యా నీ కపి బుద్ధిని చూపింంచావు కదా!! అని సీత హనుమతో అన్నది. 

107. కం. కోరిన రూపము దాలుచు
వీరుడు హనుమంతుడలిగి పెంచెను తనువున్
మేరునగము నంత పెరిగి
దారుణ కాలాగ్నిగ తోచె ధరణిజ కపుడున్

సీతమ్మ మాటలు విన్న హనుమ చిన్నబుచ్చుకుని తన విరాడ్రూపాంతో ఆమెకు దర్శనమిచ్చాడు. అగ్ని శిఖలతో మేరు పర్వతమంత ఎత్తుగా కనవడినాడు సీతకు స్వామి హనుమ. 

108. కం. రావణ లంకను ఎత్తగ
చేవగలదు నాకు గనుము సీతా మాతా
నావీపున అధివసించు
నీవారికి యెదుట నిన్ను నిలుపుదునిపుడే

మాతా ఈ లంకను రావణుని తో సహా ఎత్తుకొని పోగల చేవ ఉన్నది నాకు. నా వీపు పైన అధివసించు ఇప్పుడే రాముని ఎదుట నిలబెడతాను. 

109. కం. నను రాముడె  గొని పోవలె
తన శరములతో యసురుని తల నరకవలెన్
అనితలచి యంటి వినుమ
అనుమానము కొంత లేదు హనుమా నీపై!

హనుమా!  నీ సామర్థ్యం పైన నాకు కొంచెం కూడా అనుమానం లేదయ్యా! కాని రాముడే రావాలి రావణున్ని తన బాణంతో సంహరించాలి అప్పుడే ఆయన వీరత్వం లోకానికి తెలుస్తుంది.

110. కం. రాముని కాంతవు నౌటను
యీమాడ్కిని పలికితీవు హితవుగ తల్లీ
నామాటల తప్పెంచకు
స్వామి వ్యథ సహించలేక సలిపిన పనులన్ 

సీతమ్మా మా రామునికి తగిన దానివిగా మాట్లాడినావు. నేను మాట్లాడిన మాటలు తప్పుగా తలచకు. నా స్వామి బాధను తొందరగా దూరం చేయాలన్న తపనలో నీతో మాట్లాడిన మాటలు చేసిన పనులను క్షమించు.

111. కం. యీదారుణ లంక నరగు
ఖేదమెరిగి యడిగియుంటి కినుక గొనకుమా
నీదైనది గురుతొసగిన
నాదారిని మరలిపోదు నాకిడు సెలవున్

శతన యోజనముల సముద్రాన్ని దాటి ఈ దారుణమైన లంకలో రావడానికి రాముడు పడే కష్టాన్ని తలచుకుని మాత్రమే నిన్ను నాతో రమ్మని అడిగాను. నామీద కోపం పెట్టుకోకమ్మా. నీ గురుతుగా ఏదైన ఇస్తే అది తీసుకుని నేను స్వామి దగ్గరకి వెళ్తాను. 

112. కం. నాకాంతునితో నొకపరి
యేకాంతమునున్న వేళ యెగురుచు నాపై
కాకిగ వాలిన యసురుడు
నాకిచ్చిన బాధ దెలుపు నా రామునికిన్


 యేకాంతముగా నా రామునితో ఉన్న నాకు కాకాసురుడనే రాక్షసుడు కలిగించిన బాధను నా గురుతుగా నా రామునికి విన్నవించు.

113. కం. క్షేమమడిగితినని దెలుపు
సౌమిత్రిని, స్వామికివియె సాష్టాంగములున్!
నామాటనుమరువ కనుము
రామాగమనమ్మె సీత రక్షణ యనుమా!

హనుమా,  లక్ష్మణునకు (రామానుజునికి) ,  రామునికి సీత క్షేమమును అడిగిందని చెప్పు. నీ ధ్యానమే ఆమెకు ఊపిరి అని స్వామికి పాదాలకు నమస్కారం చెప్పిందని కూడా తెలియజేయి.

114. కం. తలపించును నా తల్లిని
కలిగించును గురుతు రాము కన్నపితరునిన్
విలువగు చూడామణియిది
కలిగించును నమ్మకమును కాంతుని మనసున్

హనుమా ఇదిగో చూడామణి దీన్ని రామునికి ఇమ్ము. ఈ మణిని చూచి నన్ను నా తల్లిని దశరథుని ముగ్గురినీ గుర్తు చేసుకోగలడు స్వామి.


115. కం. తన కరమున మణిదాల్చిన
హనుమంతుడు వెలిగిపోయె అగ్నిగ చూడన్
కనిపించెను సరికొత్తగ
తనమేనున కాంతులెగయ ధరణిజ కపుడున్

చూడామణి చేతిలో పెట్టుకున్న హనుమంతుడు అగ్నిలాగా వెలిగిపోయాడు. ఆ మణి ప్రభావముచేత అమితమైన తేజస్సు ఎనలేని బలసంపదను పొందిన హనుమ సీతకు కాంతి స్వరూపంగా అగుపించాడు.

116. కం. అందరిలో చిన్ననగుట
ముందుగ నన్నంపిరిటకు, భుజబల శాలుల్
వందలుగా కలరు కపులు
సందియమేల విడిపోవు సంకెల నీకున్!

అమ్మా! సుగ్రీవుని కొలువులో నేనే అందరికన్న చిన్నవాడిని అందుకే నన్ను ముందు పంపిచారు. నా కన్నా బలశాలులు కొన్ని వందల వానరవీరులు ఉన్నారు. నీకు ఏ సందేహమూ వలదు నీకీ సంకెళ్ళు ఎంతో కాలం ఉండవు.

117. కం. కనుగొంటిని కమలాక్షిని
చిన కార్యము మిగిలి పోయె,  చింతను జేయన్,
దనుజుల గలబల మేమియొ
కనుగొన వలె మరలు మునుపె కనకపు లంకన్ !

స్వామి హనుమ, అనుకుంటున్నాడు నేను వచ్చిన ప్రధాన లక్ష్యం నెరవేరింది.‌ ఒక చిన్న పని ఉండిపోయింది. ఈ రావణుని బలమేమిటో ఈ నగర నిర్మాణ విశేషమేమిటో వెనక్కి వెళ్ళే ముందే తెలుసుకుంటే రామునికి తెలుపవచ్చు. రాబోయే యుద్ధంలో ఈ సమాచారం ఉపయోగపడగలదు.

కార్యసాధకుడు ప్రధాన లక్ష్యమే కాకుండా ఉపయోగపడే ఇతర లక్ష్యాలను కూడా సాధించగలిగి ఉండాలి.

118. కం. సలుపగ నొక కార్యమ్మును
పలు మార్గము లుండు చూడ ఫలమును పొందన్
ఫలితము సాధించు నరుడు
కలిగి యెరుక అన్నిగతులు కానగ ధరణిన్!

లోకంలో ఒక పని సాధించాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. అన్నీ తెలిసి ఉత్తమమైన దానిని ఎంచుకొని సాధించ గలిగిన వాడే నిజమైన ఫలితాన్ని పొందుతాడు.

119. కం. తెలియదు సామము యసురుల
తలకెక్కవు దానభేద దారులు కూడన్
తలపగ దండోపాయమె
తెలివైనది దైత్యులయెడ తెలిసిన వీరిన్

శతృవును సామ (dialogue) , దాన (exchange/monitory) , భేద (create friendship with their enemies etc.)  దండోపాయము (war)  లచేత జయించవచ్చు. ఈ దానవులకు మొదటి మూడు సరిపోవు. కాబట్టి దండోపాయాన్ని అనుసరిస్తాను.

120. కం. నేలను కూల్చెద తరువుల
రాలగ నగశిఖరములను రావణు వనమున్
వేలుగ వచ్చిన యసురుల
కాలన్ రాచి యెదురౌదు కైకసి తనయున్

రావణుని దృష్టిలో పడాలి అంటే అతనికి ఇష్టమైన ఈ వనాన్ని ధ్వంసం చేస్తాను  అప్పుడు వేల రాక్షసులు నాతో యుద్ధానికి వస్తారు. ఆ రకంగా రావణున్ని చూడగలను,  నా శక్తి సామర్థ్యాలు కూడా అతనికి పరిచయం చేయగలను.


121. కం. గడగడ వణుకుచు వనితలు
వడివడి వెడలిరి తెలుపగ వానర కరణిన్
బడబానలమై దైత్యుడు
కడతేర్చగ కపికిశోరు గరిపెను ఆజ్ఞన్

భయపడి పోయిన అసుర వనితలు పరుగెత్తి రావణు దగ్గరికి వెళ్ళి హనుమ చేసిన విధ్వంసాన్ని చెప్పారు. రావణుడు చాల కృద్ధుడై వానరుని చంపమని కింకరులనే రాక్షసులను పంపించాడు.

122. కం. ఎలుగెత్తియు హనుమంతుడు
తలచెను రఘువీరునతని తమ్ముని ముదమున్
పలికియు జయ మంత్రమ్మును
చెలరేగియుచేసె వనము చెల్లా చెదురున్!

హనుమంతుడు రాముని లక్ష్మణుని సుగ్రీవుని ఎలుగెత్తి జయము పలికి తన వీర విక్రమ రూపముతో అశోక వనమును చెల్లా చెదురు చేశాడు. అడ్డు వచ్చిన అసురులను దోమల్లాగా నలిపి చంపాడు.

123. కం. జయము జయము నా స్వామికి
జయము సుమిత్రా సుతునకు జయమినసుతుకున్
జయరాముని దాసుడిపుడు


జయకేతనమెగుర వేయు స్వర్ణపు లంకన్

జయమగు గాక నా స్వామి రామునకు, కయమగు గాక సుమిత్రా నందనుడైన లక్ష్మణునకు, జయము నా రాజు సుగ్రీవునకు. రాముని దాసుడనైన నేను ఈ అసుర కింకరులను అగ్నిలాగ కాల్చి వేస్తాను.

124. కం. ఉండగ మాయమ్మ వరము
తుండెములుగచేతు దైత్యు దుండగులన్ నే
కొండల కొమ్మల కరముల
చెండాడెద నెందరున్న చెలగీవనమున్

సీతమ్మ వరమున్న నేను, రావణుని సైన్యము ఎన్ని వేలమంది ఉన్నా కొండలు, చెట్లు నా చేతులనే ఆయుధాలతో చెండాడగలను.

125. కం. అరివీరుడు మంత్రిసుతుడు
బిరబిర వచ్చెను రథమున భీకర ధ్వనితో
శరముల నురమున నాటగ
పరిఘ విసిరి చంపెనతని పావని యపుడున్

రావణుని మంత్రి ప్రహస్తుని కుమారుడు జంబుమాలిని రావణుడు పంపాడు హనుమతో యుద్ధానికి. ఘోరమైన రణం జరిగింది వారిరువురి మధ్యన. జంబుమాలి హనుమ వక్షస్థలం లో బాణాలను నాటి ఒక పరిఘను విసిరాడు. హనుమంతుడు అదే పరిఘను తీసుకొని అత్యంత వేగంతో, బలంతో తిప్పి జంబుమాలి పై విసిరితే ఆ వేగానికి తట్టుకోలోక జంబుమాలి మరణించాడు.


126. కం. యెరుగుదు నే కపివీరుల
తరమే రూపంబు మార్చ తలచిన తడవున్!
అరయగ భూతమ్మే యిది
జరుపు రణమునందు మీకు జాగ్రత సుమ్మా

127. కం. తెలిపిది‌ రావణుడంతట
బలవంతుల నేవురనిపె వానరు పట్టన్
చెలగి హనుమ చంపెనపుడు
నలువంకల లంక రుధిర నదిగా తోచెన్


రావణుడు అంతరంగంలో దుఃఖిస్తూ అది బయటికి కనబడకుండా తన దగ్గర ఉన్న ఐదుగురు సేనానాయకులను పిలిచి వాళ్ళతో, నేను సుగ్రీవుని, వాలిని ఎందరో వానరులను చూచాను కాని వారెవ్వరికీ తలచిన వెంటనే రూపం మార్చి ఈ రకంగా పోరాడే శక్తి లేదు. కాబట్టి ఇదేదో మహాభూతంలాగా తోస్తున్నది. జాగ్రతగా ఈ వానారాన్ని శిక్షించి రండి.

హనుమంతుడు ఆ రాక్షస నాయకులను అందరినీ సంహరించాడు. అప్పుడు లంక నాలుగు వంకలా నదిలాగా రక్తం పారింది.                       

128. కం. తనయుని అక్షుని వీరుని
హనుమతొ తలపడ అనిపెను అసురుడు అపుడున్
కనకపు రథమున ప్రభలతొ
ఘనముగ వెడలెను యతండు కాలుని రీతిన్ 

సేనానాయకులందరు హనుమ చేతిలో నిహతులైనారని విన్న రావణుడు తన పుత్రుడైన అక్షుని వైపు చూచాడు. అతను యుద్ధం చేయడానికి పరమోత్సాహంతో బంగారు రథముపైన వెలిగిపోతూ బయలుదేరాడు.

129. కం. రావణ కుమారుడక్షుని
చేవను గని మెచ్చె హనుమ చేసెను రణమున్
యీవేళన దయ తగదని
పావని పడద్రోసి వాని ప్రాణము దీసెన్

అక్ష కుమారుని తేజస్సును అతని యుద్ధ కౌశలాన్ని చూచి హనుమ చాల అబ్బుర పడ్డాడు. కాని పెరిగిన అగ్ని కాల్చివేయక తప్పదని, దయ కూడదని అతని నిహతుని చేశాడు స్వామి హనుమ.


130. కం. నినుమించిన వీరుడెవడు
కనరాడిల వెదకి చూడ, కాగల కార్య
మ్మునుసాధింపవలెన్!
ననుబోలినవాడవీవు నమ్ముము తనయా!!

చిన్న కొడుకు నిహతుడైన వార్తతో చాల దుఃఖించిన రావణుడు. పెద్ద కొడుకు ఇంద్రజిత్తుని రమ్మని "తనయా నీకంటే పెద్ద వీరుడు ఈ ప్రపంచం మొత్తం వెదకి చూచినా కనబడడు. నాతో సమానమైన తేజస్సు వీర్యము కలవాడవు. కాగల కార్యమును నీవే సాధింపగలవు.

131. కం. బంధుర మేఘపు వర్ణుడు
బంధింపగ బయలుదేరె వానరు వనమున్
సంధించెను బ్రహ్మాస్త్రము
ఆధాతకు యొగ్గె హనుమ అంజలి నిడుచున్

మేఘనాథుడు హనుమంతుని బంధించడానికి గొప్ప రథములో బయలుదేరి అశోకవనము చేరుకొన్నాడు. వారిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. హనుమంతుని నివారించే ఉపాయం తోచని ఇంద్రజిత్తు చివరికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. బ్రహ్మ మాటకు కట్టుబడి హనుమంతుడు అంజలి ఘటించి పట్టుబడిపోయాడు.

132. కం. మిరుమిట్లుగొలుపు కాంతుల
మెరయు కిరీటము ధరించి, మేరువు మీదన్
కరి మేఘము వలె వెల్గెను
అరివీరుడు రావణుండు హనుమ యెదురుగన్

స్వామి‌ హనుమను రాక్ససులు యీడ్చుకొని రావణుని ఎదురుగా తీసుకుని వెళ్ళారు. ఆ రావణుడు గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ నవరత్న ఖచిత కిరీటము తో ఎత్తులో ఉన్న సింహాసనంమీద కూర్చొని ఉన్నాడు. అతన్ని చూస్తే మేరుపర్వతం పైన కూర్చున్న నల్లని మేఘం వలె తోచింది హనుమకు.

133. కం. యేమీ యీతని తేజము
యేమా ధైర్యంబు చూడ మెచ్చట నైనన్
కామం బొక్కటి గెలిచిన
యీమేదిని సాటిరాడు నెవ్వడు కూడన్

రావణుని తేజస్సు చూచి హనుమంతుడు ఆశ్చర్యపడి, అహో ఏమి తేజస్సు ఇతనిది!  ఎంత ధైర్యము! ఏమి రూపము! ఒక్క కామాన్ని గెలిచివుంటే సకల ప్రపంచాన్నే కాక విశ్వాన్ని కూడా ఇంద్రునితో కలిసి పాలించి ఉండేవాడు కదా ! అని అనుకొన్నాడు.

134. కం. గరపిన పుణ్యము నీకున్
దొరికెను కనకంపు లంక దొరగా నిలువన్
తరిగెను నీకీ నాడది
భరియింపగ తప్పదింక పాపపు ఫలమున్

హనుమంతుడు రావణునితో "రావణా ఇంతకు ముందు నువ్వు చేసిన పుణ్యఫలంగా కాంచన లంకకు రాజుగా అన్ని భోగాలు అనుభవించావు. ఇకముందు నువ్వు చేసిన పాప ఫలితాన్ని పొందడానికి సిద్ధంగా వుండు.


135. కం. చతురాననుకై తపమున
అతిగర్వమునందు నీవు అడిగిన వరమున్
మతి మరచిన నర కపులే
హతమార్తురు నిన్ను ముందు అని మరువకుమా!

చతుర్ముఖ బ్రహ్మ కొరకు ఘోరమైన తపస్సు చేసి ఎవ్వరితోనూ మృత్యువు లేకుండా వరాలని పొందిన నీవు నర వానరులను లెక్కచేయలేదు. ఆ నర వానరులే ముందు ముందు నీ మరణానికి కారణమౌతారు.


136. కం. కోరి కొనకు మృత్యువు నువు
చేరి శరణువేడు నేడు సీతా నాథున్
మారిన యిప్పుడె మేలౌ
మీరిన లేదెచట నీడ మేదిని నిలువన్

రావణా ఎందుకు చావును కొని తెచ్చుకుంటావు? ఇప్పటికీ సమయం మించిపోలేదు సీతాపతి కరుణా సముద్రుడు. శరణు వేడితే కాదనడు. ఇప్పుడే సీతను అప్పగించు. లేదా రాజుగా నిలబడ్డావు ఇప్పుడు, నిలబడడానికి నీడ ఈ భూ ప్రపంచంలో నీకు ఎక్కడా దొరకదు.

137. కం. దూతను చంపుట పాడియ?
నీ తమ్మునిమాట వినుము నేరమిదన్నా
కోతుల కతి ప్రియమైనది
యా తోకను కాల్చి పంపు అరి నిన్నెరుగున్


హనుమంతుని బోధను విని,  ఇతరులు చెప్పిన మంచిని వినే లక్షణము లేని రావణుడు హనుమను చంపమని ఆదేశాన్ని ఇచ్చాడు. అప్పుడు ధర్మాత్ముడైన విభీషణుడు అతనితో అన్నా, వచ్చిన వాడు దూత, అతన్ని హతమార్చటం నేరమౌతుంది కాబట్టి అతన్ని అంగవిహీనుని చేసి పంపితే నీ బలపరాక్రమాలను  అతని ప్రభువుకు విన్నవించుకుంటాడు

138. కం. అనలుని కోరెను యవనిజ
హనుమంతుని కాచుమనుచు అంజలి తోడన్
అనిల కుమారుడు యంతట
కనిపించిన గృహములన్ని కాల్చగ నెంచెన్ !

స్వామి హనుమకు కలిగిన స్థితిని తెలుసుకున్న సీతమ్మ అగ్ని దేవుని ప్రార్థించింది అతనికి యే కష్టము కలిగించకుమని. చల్ల బడిన అగ్ని దేవుని సహాయంతో అన్ని ఇళ్ళను కాల్చాలని అనుకున్నాడు స్వామి.


139. కం. వాలము చుట్టిన మంటల
కాలుని గతి దుమికి హనుమ గగనము నందున్
హేలగ తిరుగుచు నటునిటు
ఖేలగ దహియించె లంక కీలల బడగన్

స్వామి తన విశ్వరూపాన్ని చూపుతూ గాలిలో ఎగురుతూ ఆడుతూ పాడుతూ లంకనంతా అగ్నిమయం చేశాడు.

140. కం. సీతాసతి  సేమమ్మును
వాతాత్మజు డెరుగనెంచి వనమునకరిగెన్
మాతకు వందనశత మిడి
ఆతురుత‌న్  యెగిరె నంత ఆకస మందున్

కాలిపోయిన లంకలో సీతమ్మ  క్షేమమని చారణుల ద్వారా విన్న స్వామి హనుమ అశోక వనము వెళ్ళి మాతకు అనేక మార్లు నమస్కారాలు చేసి రామునికి ఈ శుభవార్త చెప్పాలన్న ఆత్రుత తో ఆకాశంలో యెగిరి వెళ్ళాడు.

141. కం. హనుమంతుని యాగమనము
గనిన కపులు సంతసమున గగనము వైపున్
వినయాంజలితో నందరు
ఘన స్వాగతమిడిరి వారు కపివీరునికిన్

హనుమంతునికొరకు వేయి కళ్ళతో చూస్తున్న కపిసేనలు ఆకాశంలో స్వామిని చూడగానే గంతులేసి ఆడుతూ చప్పట్లు కొడుతూ చాలా సంతోషించి వినయాంజలితో స్వామికి ఘన స్వాగతమునిచ్చారు.

142. కం. హనుమంతుడు యెరిగించెను
ఘన లంకా కథల నన్ని కపిసేనలకున్
వనమున సీతా మహిమను
వినిరచ్చెరువొంది వారు వేయికనులతో

హనుమంతుడు చుట్టూ చేరిన కపి సేనలు వేయి కళ్ళతో చెవులతో వింటూ ఉండగా తన లంకా కథనంతా వారికి చెప్పాడు. సీతమ్మ పాతివ్రత్య మహిమను  లంకేశుని తపో బలమును విని వారంతా ఆశ్చర్యపోయారు.


143. కం. వారించె జాంబవంతుడు
పోరున కైయుత్సహించి పురిగొలుపు కపిన్
శ్రీరాముని కార్యమ్మిది
ఆ రాముడె చూప వలెను ఆచరణమ్మున్

అప్పుడు అంగదుడు అతి ఉత్సాహముతో రావణుని యుద్ధంలో ఓడించి సీతను మనవెంట రాముని దగ్గరకు తీసుకొని పోవాలన్న ఆలోచన చెప్పాడు. అప్పుడు పెద్దవాడైన జాంబవంతుడు, ఇది రాముని కార్యము,  శ్రీరాముడే మనకు దారి చూపెట్టవలసినది మనకై మనము నిర్ణయించడం తప్పు అని వారించాడు.

144. కం. అలుపెరుగని కపి సేనలు
కలకలమున మధువుగ్రోలు కరణిని కనగన్
అలిగిన దధిముఖు డప్పుడు
తెలుపగ వెడలె కపిరాజు తీరిన కొలువున్

దధిముఖుణ్ణి దండించిన వానరులు మధువనంలో ఉండగా వారి ఆగడాలను రాజైన సుగ్రీవునికి చెప్పడానికి కిష్కింధకు యెగిరి వెళ్ళాడు దధిముఖుడు.

145. కం. హనుమంతుని ఆగమనము
విని ముదమున యినసుతుండు వెలిగిన మోమున్,
వెనువెంటనె కిష్కింధలొ 
తనవారిని చూడ నెంచి దధిముఖు ననిపెన్

హనుమంతుని రాకను, కపిసేనల సంతోషాన్ని విన్న సుగ్రీవుడు వారు తప్పక సీత జాడను కనిపెట్టి వుంటారన్న నమ్మకంతో చాల సంతోషించి వారందరినీ వెంటనే చూడాలని దధిముఖునికి ఆదేశమిచ్చాడు.

146. కం. కనుతెరచిన కనుమూసిన
నిను దలచును మాత నీవె నిండగ కనులన్
మన జాలదు నెలదాటిన
మనకు సమయమెంతొ లేదు మైథిలి కావన్

రాముడు హనుమంతుని సీత ఎట్లా వుంది నన్ను తెలుచుకుంటుందా అన్న ప్రశ్నకు సమాధానంగా, స్వామీ అమ్మ కళ్ళు తెరచినా మూసిన నీవు తప్ప వేరే ధ్యాస లేదయ్య ఆమెకు. ఒక నెల మాత్రమే బ్రతికి వుంటా నని నీతో చెప్పమన్నది అమ్మ. మనకు ఎంతో సమయము లేదు సీతను కాపాడటానికి.

147. కం. యేరులు పారగ కన్నుల
నీరాకకు జూచి యేడ్చు నిరతము నీకై!
నారాకను శాంతించెను
యీరత్నమునిచ్చె యమ్మ యిమ్మని నీకున్!

స్వామీ అమ్మ కార్చే కన్నీరు యేరులై ప్రవహిస్తున్నట్టుగా చూచిన నేను రామ కథను చెప్పి ఆమెను ఊరడించాను, శాంతించిన తల్లి ఈ చూడామణిని నీకు గురుతుగా యిమ్మని నాకు ఇచ్చింది ఇదిగో పరికించు స్వామీ!



కం. సుందరకాండను శుభముగ
అందరి యాశీః బలమున అందించిన యీ
కందములను పఠియించిన
అందును ఆరోగ్యము ధర ఆనందంబున్