బాలకాండము


                                                                             -   ॐ - 


                                                                           -  శ్రీ రామ - 

 

కం. శ్రీ రాముని మదిని నిలిపి  

       ఆరాముని సచ్చరిత్ర ఆతని దయతో 

    ఆరంభించెద, యందలి

            సారమ్మును గ్రోలరండు సజ్జనులారా !! 



శ్రీ రామాయణము మానవాళికి భారత దేశమందించిన మహత్తరమైన కానుక. భారతీయ వాఙ్మయాన్ని ప్రపంచానికి దేదీప్యమానంగా వెలిగించి అందించిన సూర్య చంద్రులు వాల్మీకి మహర్షి , వ్యాస భగవానుడు.  ఎందరో మహాపురుషులు నిరంతర శ్రీ రామాయణ పఠనము, శ్రవణము చేసి కైవల్యాన్ని పొందారు. ప్రపంచంలోని ఎన్నో భాషల్లోకి అనువాదము చేయబడిన ఉత్గ్రంథరాజము శ్రీ రామాయణము. రామాయణమూ, రామ నామము ఎన్ని మార్లు విన్నా ఆనందదాయకము దుఃఖక్షయకారము సకల సంపన్న కారణము. 

శ్రీ రామాయణ సారాన్ని కందపద్యాలుగా వ్రాయాలన్న సంకల్పం శ్రీరామ కటాక్షంగా భావిస్తూ చేసిన ఈ చిన్ని ప్రయత్నాన్ని మనసారా దీవిస్తారని ఆశిస్తున్నాను. 


           తపస్స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదామ్ వరమ్ 

                   నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుఙ్గవమ్"


1. కం. నారాయణ గానమ్మును, 

చూరగొనుచు విను మనసుల సురముని మహతిన్ 

సారించుచు జూచె, శృతుల

వారాశిని దేలుచుండు వల్మీక భవున్ 


వల్మీకము‌ నుండి పుట్టిన వాడు, తపఃశాలియగు వాల్మీకి, తపస్సును, వేదాధ్యయనమును చేయుటయందు ఆసక్తి కలవాడు అటువంటి మహనీయుడైన వాల్మీకి వద్దకు దేవర్షియైన నారదుడు రాగా ఆయనను వినయముతో అడిగాడు.


               "కోన్వస్మిన్ సాంప్రతమ్ లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్,

               ధర్మజ్ఞశ్చ కృతజ్ఙశ్చ సత్యవాక్యో దృఢవ్రతః "



2. కం.ధరలో ధర్మజ్ఞుడెవడు

పరుల వ్యథలు తనవనుకొను వాడెవ్వడిలన్ ! 

నిరతము సత్యము పలికెడు 

నరుడెవ్వడొ దెలియనెంతు నాక మునివరా! 


3. కం. అవిరళముగ సుగుణమ్ములు 

భువిలోనన్ పొందె నెవడు పురుషాకృతిగన్? 

సవినయముగ కోరెద నిను

సవివరముగ చెప్పుమయ్య జ్ఞాన ప్రదాతా!! 


దేవర్షీ!  జ్ఞాన ప్రదాతా! ఇప్పుడు భూలోకములో మంచి గుణములు కలవాడును, ధర్మము తెలిసినవాడును,  సత్యమైన వాక్కు కలవాడు పరాక్రమవంతుడు, సద్గుణముల రూపముగా కలవాడు అగు మహాపురుషుడెవ్వడున్నాడు.  


4. కం. రామునిగా ఇక్ష్వాకుని 

నామాంకిత వంశమందు నర శ్రేష్ఠునిగన్!

భూమిని పుట్టిన యాతడు

ధీమంతుడు సుగుణరాశి తెలియు మునివరా!! 


5. కం. స్వజనమ్ముల రక్షించును

ప్రజలను పాలించునతడు ప్రాణ సములుగన్  

నిజధర్మము వీడడెపుడు 

భుజబలమున మేటియతడు పుడమిని చూడన్ 


వినయముతో వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నలకు నారదుడు బదులిచ్చాడు - మహర్షీ! ఇక్ష్వాకు వంశములో పుట్టిన వాడు రాముడు. ఆతను గొప్ప పరాక్రమము కలవాడు, సుగుణముల రాశియైన రాముడు ఎల్లప్పుడూ ధర్మమును పాటించుచు తనవారిని రక్షించుచుండును. భుజబలశాలి బుద్ధిశాలియైన రామునిలో నీవడిగిన గుణములన్నీ కలవు. 


6. కం‌. ఇనకుల తిలకుని గాథను

మునివరునికి దెల్పె దేవ ముని మోదముతో

వినయాంజలితో ఆ ముని  

మననమ్మును జేసి యందు మగ్నుండయ్యెన్ 


దేవలోక మునీంద్రుడైన నారద ముని, సూర్యవంశ తిలకుడైన రామచంద్రుని గాథను సంక్షేపంగా వివరించాడు వాల్మీకి మహర్షికి. వాల్మీకి ఆ రామకథను మననం చేసుకుంటూ అందులో మగ్నమై పోయాడు. 



7. కం. తమసా నది తీరమ్మున

విమలమ్మగు మనసుతోడ విహరించు దరిన్ 

రమియించెడు క్రౌంచమ్ముల

తమకమ్మును చూచి మురిసె తాపసి యపుడున్ 


రాముని కథను మననం చేసుకుంటూ వాల్మీకి మహర్షి తమసా నదీ తీరంలో నడుస్తూ వెళుతూండగా ఆయనకు ఒక చెట్టుపైన రెండు క్రౌంచ పక్షులు రమిస్తూ అగుపించాయి ఆ దృశ్యాన్ని చూస్తూ నిలిచాడక్కడ ఆ మౌని. 



8. కం. ఒడిజేరిన మగపక్షిని 

కడదేర్చెను యమ్ముయొకటి కాలుని కరమై

యెడబాసిన ప్రియుని గనుచు 

కడుదీనగ యాడు గువ్వ కన్నీరయ్యెన్


హాయిగా రమిస్తూన్న ఆ పక్షుల వైపు  అంతలో యమపాశము వంటి బాణమొకటి వచ్చింది. ఆ బాణము ఆ జంటలోని మగ పక్షిని తాకగానే విల విలలాడుతూ నేలకొరిగిందా మగ పక్షి.  జంటను కోలుపోయిన ఆడు పక్షి కంట నీరు నిండి దీనంగా విలపించింది. 


9. కం‌. మురిపెమ్ముల క్రౌంచమ్మును  

కరుణ మరచి కాల రాచు కఠినాత్ముండా 

దురితమ్మున బడు నీకిక 

ధర నాయువు చెల్లె వినుము ధర్మ విదూరా ! 


ఆ ఆడు పక్షి దీనారవానికి వాల్మీకి మహర్షి హృదయం కరిగిపోయింది, శోకం ఉప్పొంగింది. ఆ దృశ్యాన్ని చూచి దానికి కారణమైన బోయవాని వంక చూచి ఇలా అన్నాడు. 


"ఓయీ నిషాదుడా! హాయిగా రమిస్తున్న పక్షుల జంటను కరుణమాలి‌ వేరు చేశావే!! ఇటువంటి పాపం చేసిన నీకు ఆయువు చెల్లుగాక"  


10. కం. వందన చరితుం డాముని 

పొందిన శోకమె, పదముల పూగుచ్ఛముగన్ 

ఛందములో అమరిన యది

అందమ్ముగ ఆదికావ్యమై భువి వెలసెన్


వాల్మీకి ముని హృదయంలో పుట్టిన శోకము కరుణ రసంగా మారి ఆయన ఆ‌ నిషాదునితో పలికిన మాటలు "శ్లోక" మనే ఛందస్సులో అమరాయి. ప్రపంచంలోనే అది మొదటి శ్లోకంగా నిలిచి, అటు పిమ్మట ఆదికావ్యమై వెలసింది. 


11. కం. పుట్టను బుట్టిన ముని దరి 

పుట్టించిన ధాత యరుగ, ముని మానసమున్ 

పట్టిన పదముల విడువక 

అట్టులనే యాతని కిడె ఆతిథ్యములన్ 


12. కం. ముని మనసును గ్రహియించిన 

అనిమేషుల పెద్ద, అతని కానందముతో 

ఇనకులమణి కథ, జగతికి 

వినిపించగ వరమునిచ్చె ప్రీతిని యపుడున్ 


13. కం. రవికుల సోముని గాథను 

అవలోకింతువు మునివర ఆశీస్సులివే 

ఎవరి మనసునే మున్నదొ

అవగతమగు నీకు, కరము నమలకము వలెన్ 


14. కం. ఇలపై గిరులున్న వరకు 

సలిలమ్ములు బారు వరకు సరితల లోనన్

విలయమ్ముల దాటి ధరన్

నిలుచును రామాయణకథ నిశ్చలచలమై 


15. కం. రచియిం‌చెను రామ కథను 

అచలమ్మగు మనసున ముని, అసురేంద్రు వధన్!

రుచిరమ్మగు గానము నా 

రచనమ్మును పంచిరపుడు లవకుశు లవనిన్ 


16. కం. గానము జేసిరి లవకుశు

లానందముతో నయోధ్య నందరు వినగన్ 

భూనాథుడు పరవశమున 

గానామృత ఝరిని దేలి కరిగెను అపుడున్ 


17. కం. మహినేలిన సగర సుతులు  

సహనముతో సాగరమ్ము సాధించిరి, ఆ

మహనీయుల వంశాంబుధి 

లహరులలో రామ చరిత  రాజిల్లె భువిన్ 


18. కం. కోసల దేశము నందున 

వాసిగ నుండిన అయోధ్య పట్టణ మందున్ 

వాసవ సముడు దశరథుడు 

శాసనమును గరుపు చుండె శాంతి సుఖములన్ !


19. కం. అమరపురిని తలపించుచు 

అమరె నయోధ్యాపురమ్ము అవనీ తలమున్ ! 

తమధర్మము పాటించుచు 

సమభావముతో మెలగిరి సకల జనులటన్ 


20. లేమన్నది లేదు ప్రజల 

కామితములు దీర్చు ప్రభుని కనుసన్నలలో

సామంతులు సామ్రాట్టుని

సేమమ్మును తలతురెపుడు చింతలు లేకన్!


21. కం. అంతటి ఘనుడు దశరథుడు

అంతెరుగని సంపదలకు అవనిని‌నెలవై 

సంతానములేక యెపుడు 

వంతనుగొని గడుపు చుండె పలువత్సరముల్ 


22. కం. ప్రీతి నొసగు సుతు బడయక 

యేతెరవున లేవు నాకు ఇలలో సుఖముల్ 

ఖ్యాతి గనిన హయమేధము 

చేతు నిపుడె తనయు కొరకు చింతను దీర్పన్ 


23. కం. తొలుత విభాండకుడను ముని

కలిగిన సుతుబెంచె నరుల కన్నుల బడకన్

తొలగించె క్షామ మతడు

నిలిపి పదము రోమపాదు నిర్జల నెలవున్ 


24. కం. మహిమగల ఋష్యశృంగుని

వహియింపగ యిష్టి విధిని ప్రార్థించినచో 

సహజాతులు కుమరులు నీ

గృహమున శోభిల్ల గలరు పృథ్వీనాథా 


25. కం. క్షితిపతి దశరథుడు, తనదు 

హితవు తలచు రోమపాదు యింటికి చనియెన్ 

సతితోడ ఋష్య శృంగుని 

అతిముదమున తన నగరికి ఆహ్వానించెన్ 


26. కం. వీరుల రక్షణలో,  మఖ

వారువమును విడువుమిపుడె వసుధను తిరుగన్ 

కోరికలను తీర్చుము పలు

భూరి విరాళముల నిచ్చి భూసురలకునై 


27. కం. జనకుడు కాశీ రాజుయు

ఘనకీర్తిని బడయు వారు క్రతువున కరుగన్,

ఒనరించెను హయమేధము 

తన గురువుని యానతి గొని దశరథుడు పురిన్ 


28. కం. భూజనములు తృప్తి బడయు

భోజనమిడి దశరథుండు పొంగెను మనసున్! 

పూజలు చేసిరి సుజనులు

భూజానికి సుతులు కలుగ పూర్ణ హృదయమున్ 


29. కం. దురితమ్ములు తీరినవిక

గరిపిన హయమేధ మందు కలిగిన ఫలమున్ ! 

జరిపించెద పుత్రేష్టిని

ధర జన్మింతురు నలుగురు ధర్మ స్వరూపుల్ 


30. కం. నీవొసగిన వరములచే

కావరమున వీగుచుండు కైకసి తనయున్ 

యే విధమున అణచ గలము

మా వెతలకు దారి దెలుపు మాధవ తనయా!! 


31. కం. మరణము రాకన్ పొందిన

వరములలో నరుల మరచు బలగర్వునకున్ 

నరుడే తెచ్చును అంతము 

శరణాగతి చేయుడిపుడె శంకర వినుతున్ 


32. కం. సురలా రీతిని వేడ్కొన

గరుడారూఢుండు శౌరి కౌస్తుభ ధరుడున్ 

కరుణామయుండు విష్ణువు

దరహాసము తోడ అచట దర్శనమొసగెన్ 


33. కం. శ్రీలోలా, స్థితి కారా!

తాళగ జాలము యసురుల దారుణ యఘముల్ 

జాలము సేయక మనుజుగ 

భూలోకమునందు వెలయు పుణ్యప్రదాతా!! 

 

34. కం. దురితాత్ముని దండించెద

ధరపై నవతారమెత్తి దశరథు నింటన్ 

నరపాలుగ ధర్మమ్మును 

నెరపెద పదివేలయేండ్లు నేర్వగ మనుజుల్ ! 


35. కం. అంతమగును అనపత్యము 

సంతస మొందిరి అమరులు జరిగిన క్రతువున్  

చింతలు దీరును భక్తిన్ 

కాంతలు ఈ పాయసమును గైకొన రాజా 


36. కం. క్రతువు ఫలము పాయసమును

సతుల కిడెను దశరథుండు సంతోషముతో 

సుతుల బడయు కోరికతో 

అతిభక్తిని అందుకొనిరి అంతట సుదతుల్ 


37.  కం. వడిగ కదిలె వర్షమొకటి

కడకు సతుల కడుపు పండె కల నిజమాయె‌న్ 

ఒడిలో పాపల కొరకై

కడుయాశగ వేచిరపుడు కౌసల్యాదుల్ 


38. కం. కోరిన రూపము దాల్చెడు

వీరుల సృజియింపుడిపుడె వేలుపు లారా

వారలు హరి సములు కపులు 

చేరగలరు అసుర వధకు జిష్ణుని అవనిన్ ! 


39. కం. సురపతి నర్కుని అనిలుని

వరబలమున పుట్టిరవని వానర వీరుల్ 

హరివీరులు గరుడసములు  

హరితోడుగ హతముజేయ ఆసుర కులమున్ 


40.కం.  తారాపతి దేవగురుని

చేరిన శుభలగ్నమందు, శ్రీనాథుండే! 

శ్రీరాముని ఆకృతితో 

ధారుణి కౌసల్య యొడిని తనువును దాల్చెన్ 


41. కం. ఇన్నాళ్ళుగ కన్నకలలు

కన్నులెదుట పండెననగ కమనీయముగన్ 

కన్నది కౌసల్యాసతి

పున్నమ నెలరేని బోలు పుత్రుని రామున్! 


42. కం. ధీమంతుడు ధర్మాత్ముడు

భూమిని భరియింప గలగు పుణ్యాత్ముండున్ 

రాముని పోలిన భరతుని

భామిని కైకేయి బడసె వరపుత్రునిగన్  


43. కం. లక్ష్మణ శతృఘ్నులను, శుభ

లక్షణ సంయుత సుమిత్ర, లక్ష్మీకరమౌ 

అక్షయ గుణముల వర్ధిలు

సుక్షత్రియ సుతులగనెను సుముహూర్తమునన్


44. కం. పాడిరి గంధర్వు లపుడు

ఆడిరి అప్సర గణములు ఆనందమునన్ 

కూడిరి సుజనులు నగరిని

వేడుకలను చేసి రవని వీక్షింపంగన్ 


45. కం. తలచిన కొలంది మోదము 

కలిగించును భువి జనులకు, కష్టము తీర్చున్ 

వెలలేని రామనామము

ఇలపై నిలచును స్థిరముగ ఇనకుల మణికిన్ 


46. కం. భరియించును భూ భారము

తరియించును రామ నామ తపసున భువిపై 

వరపుత్రుడు కైక సుతుడు

భరతునిగా ఖ్యాతి గాంచు భక్తికి ఋజువై 


47. కం. అరిసూదను లిరు తనయులు

అరయగ లక్ష్మణ శతృఘ్నులను నామములన్ 

భరతుని, రాముని, విడవక

నిరతము సేవింప గలరు నిజధర్మముగన్ 


48.కం. కులగురువుని సన్నిధిలో 

విలువిద్యను నేర్చుకొనిరి వేద విహితులై 

పలు శాస్త్రాధ్యయనములను 

సలిపిరి  దశరథ తనయులు శ్రద్ధా భక్తిన్ 


49. కం. కడుహాయిగ కాలమ్మును

గడిపె‌ నృపతి సుతులతోడ ఘడియ విడువకన్ 

అడుగిడ యౌవన శోభలు

వడిగ వెదక సాగెనతడు వధువుల కొరకున్ 


50. కం.  వేదమ్ముల ప్రతి రూపము 

గాధేయుడు నరుగుదెంచె కార్యోన్ముఖుడై 

మోదముతో  భూనాథుడు

సాదరముగ చేసె నతిథి సత్కారములన్


51. కం. ఆనతి నిడుమౌనీంద్రా

నేనీయగ తగినదేమొ నీకీ భూమిన్

కానుకలన్ కామితమున్ 

రానీయను లోటు నీకు రాణ్ముని శ్రేష్ఠా ! 


52. కం. కోరిన రూపము దాల్చెడు

మారీచసుబాహులనెడి మాయాసురులున్

దారుణముల్ కావించిరి

వారల దండింప కోర వచ్చితినిటకున్ 


53. కం. క్రూరులు దైత్యుల నణచగ

వేరెవ్వరులేరు భువిని వీరులు చూడన్ 

శ్రీరామునికే సాధ్యము 

నారక్షణ ననుపు మతని నమ్మికతోడన్ 


54. కం. నారాముడు నాప్రాణము! 

యేరీతిని త్రుంచగలడు యిరువుర నొకడే! 

క్రూరులు బలాఢ్యు లసురులు

వారింపగ చేతనౌన పసిబాలునకున్? 


55. కం. నాసైన్యము నా సర్వము

నీసేవకు సిద్ధమౌను నిలచిన తడవున్ 

దోసమ్మని తలపకుమా

దాసునిగాసేవజేతు దైత్యుల నణచన్ 


56. కం. తనయుని పైమోహమ్మున

ఒనరించిన వాక్కు మరలు ఉర్వీ నాథా! 

ఘనకీర్తిను పొందగలదు

యినకులమీ యవనిలోన యెంచగ‌ నీచే! 


57. కం. అనఘుడు విశ్వా మిత్రుడు

కొనవ్రేలున ద్రుంచగలడు క్రూర యసురులన్ 

మనసున భయమును వీడుము

తనయుని పంపుము దశరథ దక్కును శుభముల్! 


58. కం. జనకుని మాటను తలనిడి

మునియాగము కాచుకొరకు మోదము తోడన్ 

వనసీమకు రఘురాముడు

వెనుదన్నుగ లక్ష్మణుండు వెడలిరి మునితో


59.కం. మునివెంటన్ రఘు వీరులు

చనుదెంచగ పుష్పవృష్టి జల్లిరి యమరుల్ 

వినిపించిరి దుందుభులన్ 

అనిమేషులు వారిచూచి ఆనందమునన్ 


60. కం. బల అతిబల యను విద్యలు 

కలిగించును శుభము నీకు కౌసల్యసుతా

తొలగును ఆకలి దప్పులు

బలశాలిగ చేయునిన్ను భావిని రామా!! 


61. కం. ఉదయాద్రిని దినబాంధవు

డుదయించెడి వేళయయ్యె, ఓ!  శ్రీరామా! 

నిదురకు సమయము కాదయ

అదనిది అర్ఘ్యమ్ము నీయ ఆదిత్యునకున్!



62. కం. వందనమిడి సంధ్య కపుడు

అందమ్మును చిందిపోవు ఆ రాకొమరుల్ 

మందాకిని పారు నెలవు

అందున్నన్ మునుల జూచి రాశ్చర్యమునన్ 


63. కం. ఎవ్వరి దీ పుణ్యస్థలి

మువ్విధముల పారుగంగ ముచ్చట గొలుపున్ 

ఎవ్వరు వీరల్ మునివర

ఇవ్విధమున తపసుజేతు రేకారణమున్ 


64. కం. దేవాది దేవుడు, శివుడు

దేవేరిని గూడి వెడలె దేవగణముతో! 

పూవింటిని కేల నిలిపి 

త్రోవన్ నిల్చెను మదనుడు తుంటరి తనమున్ 


65. కం. పరమేశుడు ఉగ్రుండై 

చెరుకు ధనువు వాని తనువు ఛిద్రము చేసెన్  

ధర నంగ దేశముగ! ముని

వరులకు అనవయ్యె నెలవు పరము నొసగుచున్  


66. కం. మక్కువతో ముని శ్రేష్ఠుడు 

చిక్కని చీకటి గగనము చేరెడు వరకున్

చెక్కెను రాముని మనసును

చక్కగ వినిపించి కథలు జనకుని రీతిన్  


తాటక సంహారము 


67.కం. 

మానస సరయూ నదులకు 

మానసమున వందనమిడి మౌనీంద్రునితో 

మానవ సంచార రహిత

కానన్ గని రాముడడిగె కారణ మెదియో ! 


68.కం. 

సుర రాజుని వరము బడసి

సురలోకము తలపు దెచ్చు సుందర వనమున్ 

నరకముగా తాటకయను

నరభక్షకి మార్చి వేసె నాలుగు దిసలన్ 


69. కం. 

ఇంతటి సుందర వనమును

హంతకురాలై చెరచిన అసురిని యిపుడే 

అంతము చేయుము, సుంతన్

చింతింపకు ఇంతియనుచు శ్రీరఘు రామా! 


70.కం.

జనకుని కొసగిన వచనము

అనువర్తించుట మరువను ఆగమ నిరతా

మునివర నీదగు మాటన్

విని తాటకిని వధియింతు పితరుని  ఆజ్ఞన్ 


71.కం.

రాముని టంకారమునన్ 

రోమాంచితమగుచు వికృత రూపముతోడన్ 

భూమంతయు అదిరి పడగ 

ఆమువ్వురిపైకియురికె ఆసురి యపుడున్ 


72. కం.

కొండను బోలిన తాటకి 

బండల విసరుచు చెలగెను భరతాగ్రజుపై 

భండన భీముడు రాముడు

ఖండించెను అసురి తనువు కౌశికునాజ్ఞన్


73.కం.

భళి భళి రామాయని కా

హళులన్ మ్రోగించిరమరులానందమునన్  

తళుకు మనెడి రాముని ముఖ

కళలు గనుచు మురిసిపోయె కౌశికుడెలమిన్


----

74.కం. 

రాముని నిష్ఠను కనుగొని

ధీమంతుడు కుశిక సుతుడు, తెలవారగనే 

ప్రేమన్, ఉపదేశించె న 

సామాన్యంబైన అస్త్ర శస్త్రము లెన్నో 


75. కం.

కనులకు యింపై యెదుటన్

మనసున కానందమిడుచు మహిమాన్వితమై

ఘనతరు సంఘాతము తో

కనుపించెడి వనమెవరిది గాధి తనూజా? 


76.కం. 

తొల్లి విరోచను తనయుడు 

ముల్లోకములన్ గెలువగ మొదలిడె మఖమున్

చల్లార్చెను వామనుడై

అల్లీలామానుషుండు ఆతని క్రతువున్ 


77.కం.

వామను డైనాడా హరి

సేమమ్మును కూర్చి యిచట చేసెను తపసున్ 

నే‌‌మఖమును చేయు నెలవు 

యీ ముని వాటిక యనెరుగు ఇనకుల తిలకా !! 


78.కం.

నిద్దుర మరచిరి దశరథు

ముద్దుల కొమరులు యిరువురు మునియాగముకై  

పొద్దనకన్ రేలనకన్ 

సిద్ధమైరి అసుర వధకు సిద్ధాశ్రమునన్ 


79.కం. 

అనలాస్త్రమ్ము సుబాహుని 

కొనయూపిరి నిలువనీదు కూల్చున్ యిపుడే 

మనుజాస్త్రము మారీచుని

ఘనసింధున పడగద్రోయు కనమిదె యనుజా! 


80.కం. 

మనసారగ దీవించిరి 

మునిశ్రేష్ఠులు రఘు తనయులు ముంగిట నిలువన్ 

ఘన విజయము సాధించియు

వినయము తో నిలచిరచట వీరు లిరువురున్ 



81. కం.

మునిబృందము గూడి జనకు

డొనరించెడు మఖము చూడ ఓ రఘు రామా

చనుము ప్రభల వెల్గు మహా

ధనువును దర్శింతువచట దశరథ రామా!! 


82.కం.

గురువగు విశ్వామిత్రుని 

దరిచేరిరి పుత్రుల వలె దశరథ తనయుల్

పరి ప్రశ్నలు వేసిరతని

సురుచిరమగు సుందర వన శోభను గనుచున్ 


83. కం.

సారస గర్భుని కొమరుగ

ధారుణి జన్మించె కుశుడు ధర్మ నిరతుడై

కారణ జన్ములు నల్గురు

మారుగ పుట్టిరి అతనికి మహితాత్ములుగన్ 


84.కం.

కుశనాభుడు కుశతనయుడు

దశదిశలన్ ఖ్యాతిగనెను ధర్మాత్ముండై 

నిశికాంతుని మోము గలుగు

సుశీలసుత శతము బడసె శుభగాత్రులుగన్ 


85.కం.

అనిలుడు చెందెను మోహము

వనితలగని యడిగె తనను వరియింపంగన్ 

జనకుడు యెంచును మాపతి

ననిపలికిరి అనఘచరితలందరొకటిగన్ 


86.కం.

పవమానుడు ఆగ్రహమున 

ఉవిదల దేహమ్ములందు ఓజస్సు గొనెన్! 

జవముడిగిన ఇంతులపుడు

సవివరముగ తెల్పిరి కథ జనకుని మ్రోలన్ 


86.కం.

కలిగిన కష్టము నోర్పుతొ

నిలిపిరి కులగౌరవమ్ము నిజముగ మీరల్ 

ఇలలో ఓర్పును మించిన 

విలువైనది లేదు గుణము ప్రియ సుతలారా !! 


87.కం.

ఎల్ల దిసలందు  కన్నులు

జల్లెడగా చేసి రాజు జగతిని వెదకెన్ 

అల్లునిగా చూళి సుతుని 

పెళ్ళాడగ కోరెనతడు ప్రియపుత్రికలన్ 


88.కం.

జ్ఞానియగు బ్రహ్మ దత్తుని

మేనున్ తాకిన సుదతులు మేలును పొందన్ 

మానసమున కుశనాభుడు

వేనోళ్ళన్ పొగిడెనతని ప్రీతిని గొనుచున్ 


గంగావతరణము


89. కం.

ఉమగంగాయను కన్యల

హిమవంతుడు బడసె తొలుత ఇరు తనయలగన్ 

అమరులు తమ లోకములో 

అమలమ్మగు జలము‌కోరి అడిగిరి గంగన్ 


90. 

శీతాద్రీశుని పుత్రిక

భూతేశుని కొరకు తపసు పూజలు చేసెన్ 

ప్రీతిని గొని అచలాధిపు

డాతరుణిని పెండ్లి జేసె అసమాక్షునితో 


91.

పరమేశుడు పార్వతితోజ్

పరిణయసుఖ మనుభవించ పలు వత్సరముల్ 

పరిణామంబెటులోయని 

సురలు భయము చెంది పడిరి శూలి పదములన్ 

 

92. 

కదిలిన నా రేతస్సును 

వదిలిన ధరియింప గలుగు వారెవ్వరిలన్? 

మదనరిపుని తేజముగొన 

అదితిసుతులు కోరిరంత అవనీ మాతన్ 


93. 

పవమానుడు హుతవాహుడు

శివతేజము జొచ్చి నిలుప సితగిరి నవనిన్ 

భవవీర్యము భువినిండెను 

అవతారము దాల్చె గుహుడు హాటకప్రభలన్



94.కం.

కినుకను పొందెను శాంభవి

తనయునికై కలలు చెదర తలడిల్లు మదిన్ 

అనప త్యము అదితి సుతుల

కొనగూడగ శాపమిడెను ఉగ్రాకృతితో 


95. కం. 

హరవీర్యము హుతవాహుడు

సురవాహిని లోన నిలిపె సురపతి కోర్కెన్ 

శరవణ పొదలన్ సురథుని

భరియింపగ లేక విడిచె భవతేజమ్మున్ 


96.కం. 

అందమునకు ఆకృతిగా

కందుడు జన్మించెనచట కాంచన ప్రభలన్

సుందర రూపుడు పురహరు

నందనునకు వేల్పులిడిరి నాయక పదవిన్ 


----

97.కం.

ఇనకుల భూపతి సగరుడు 

తనయుల కైసతులగూడి తపమొనరింపన్ 

ముని శ్రేష్ఠుడు భృగువెదురై

వనితల కొసగెను వరములు వంశోన్నతికై 


98.కం.

అసమంజుని జ్యేష్ఠునిగా  

అసమానులు వేల సుతుల ఆతని పిదపన్ 

ఒసగెను భృగుండు, సగరుడు

శిశువుల గనిమురిసిపోయె చింతలు వీడెన్ 


99.కం. 

పిల్లల నదిలో త్రోసియి

ఘొల్లుమనగ వారు, మురియు కుటిల మనస్కున్ 

ఎల్లల వెడలగ గొట్టెను

కల్లన్ యెరుగని సగరుడు, ఖలుడౌ తనయున్! 


100. కం. కోరుచు శుభములు క్రతువును

ఆరంభించిన సగరుడు హయమును విడిచెన్ 

వీరుడగు అంశుమంతుని 

వారువమును రక్ష జేయ పంపెను వెనుకన్ 


101. కం. సవనాశ్వము హరియించెను

దివినాథుడు కలవరపడి దిక్కుతెలియకన్ 

భువనమ్మును ఛేదించిరి

జవనము కై నలు దిసలను సగరుని కొమరుల్ 


102. కం. వారువమును కపిలాశ్రమ

చేరువలో గని సగరులు, చివ్వున మునిపై 

దారుణ మునుబూనగ ఋషి

వారల మసిజేసె అపర ఫాలాగ్ను వలెన్ 


103. కం. ఖగపతి యెడ పినతండ్రుల

సుగతి బడయు మార్గమెరిగి శోకాకులుడై, 

సగరు మనుమడేగె పురికి

సగముగ మిగిలిన మఖమును జరిపెను భక్తిన్ 


## గంగావతరణము


104. కం. ఇనవంశోద్భవ నృపతులు

ఘనముగ పాలించి భువిని కాంచిరి యశమున్ 

తన పూర్వుల మోక్షముకై 

ఒనరించె భగీరథుండు ఉగ్రతపంబున్! 


105. కం. కరుణించెను కమలభవుడు

వరమొసగె భగీరథునకు పావని గంగన్ 

హరుడొక్కడె గగన ధునిని 

భరియింపగ గలడిలయని పలికెను నృపుతో 


106. మహదేవుని మెప్పించగ

అహరహము భగీరథుండు హరుని తలచుచున్ 

సహనముతో చేసె తపసు

గుహజనకుడు మోదమంది కురిసెను వరముల్ 


107. ఫెళ్ళుమనగ ఆకాశము 

భళ్ళు మనుచు దుమికె గంగ భవుని శిరసుపై 

కళ్ళనురిమి కఱకంఠుడు 

ముళ్ళ జటను గిరిగ జేసి ముడిచె సురనదిన్


108.కం. కనుపించని సురనదికై 

అనఘుండు భగీరథుండు ఆక్రందించెన్ 

అనలాక్షుడు కరుణించెను

వినుజాలును విడిచె అతని వెనుకనె నడువన్


109. కం. ముడి విడివడి పొడుగుమడుగు

వడిగ వెడలె విభుని అడుగు పడిన యెడములన్

కడిగి జగతి జనుల చెడును

జడిగ ఝరులు సుడుల ముంచె జహ్నువు నెలవున్ 


110. కం. నిక్కిన గంగను జహ్నువు 

పుక్కిటపట్టె నమరతటి పొగరు నణచగన్

మ్రొక్కగ నరపతి  విడిచెను

దక్కెను జాహ్నవిగ పేరు ధర సురనదికిన్ 


111. కం. అందెల తరగల కదలుచు

మందగమన శుభద గంగ మందాకినియై

వందన చరితుని పూర్వుల 

కందించెన్నూర్ధ్వగతుల నఘనాశినియై 


112. కం. గాధేయుడు భాగీరథి

గాధను వివరించిన విని కడునచ్చరమున్ 

మోదమ్మున రఘు తనయులు

ఆదమరచి నిదుర బోయి రావనసీమన్ 


113. రామ లక్ష్మణులకు గంగావతరణ గాథను భగీరథుని విజయగాధను తెలిపి వారిని నిదురకుపక్రమించమని చెప్పాడు‌. వారిద్దరూ ఆశ్చర్యకరమైన ఆ కథను విని చాల సంతోషంతో ఆదమరచి నిదురపోయారు.  


114. అనునిత్యము యౌవనమున 

మనుచుందురు యెటుల సురలు మరణములేకన్ 

అనిమేషుల కమరత్వము 

ఒనగూడిన దెవ్విధమున ఓ! మౌనీంద్రా! 


## సాగర మథనం


115. జర నాపగ మార్గమెదియొ 

మరణమ్మును దాటి మనము మనుటెవ్విధియో! 

జ్వరభయమును గెల్చుటెటుల 

సురయసురులు చింత జేసి సుధ సాధింపన్  


116. గిరికవ్వముగా జలధిని 

ఉరగమ్మును త్రాడు జేసి ఉభయులు తఱుచన్ 

గరళమ్మట జనియించెను

హరు పదముల పడిరియంత అదితి దితి సుతుల్ 


117. చల్లని తల్లి శుభంకరి 

పిల్లల కష్టము కనుగొని ప్రేమతొ పతిపై 

ఉల్లము లోనమ్మికతో  

నల్లని విషమును గొనుమని నాథుని కోరెన్ 


118. భుగభుగ మని సర్ప విషము 

జగముల కాల్చగ కదలగ జలధిని అపుడున్ 

సెగలన్ క్రక్కెడు గరళము 

నగచాపుడు అమృతమనగ నవ్వుచు మ్రింగెన్


119. లోకేశుడు కూర్మమ్ముగ 

ఆకారము దాల్చి నిలిపె అద్రిని జలధిన్ 

లోకోత్తర రూపముతో 

ఆ కడలిని జన్మ పొంది రప్సర గణముల్ 


120. వారాశిని మథియించగ

వారుణితో గూడి అమృత భాండము పుట్టెన్ 

కోరిక తీరగ సుధకై 

ఆరంభించిరి యని అదితి దితి సుతుల్ 


121. మోహినిగా మురహరుడా 

బాహుబలులు అసురుల తన వయ్యారముతో 

మోహమునన్ ముంచి, అమృత

రాహిత్యుల జేసి సురల రక్షగ నిలిచెన్ 


122. సుతులన్ జంపిన యింద్రుని

హతమొనరించెడు పుత్రుని ఆశించినదై 

దితిచేసెను ఘోర తపము 

అతిభక్తిని సేవ జేయ అమరాధిపుడే 


123. పదములు శిరసుకు మారుగ 

నిదురించెను దైత్య మాత నిండిన నెలలన్ 

అదనని దితిగర్భము జని  

ఖదిరుడు ఖండముల ద్రుంచె కాంత గర్భమున్ 


124. దితివేదన చల్లార్చగ

శతమఖుడామాత గర్భ సప్తకమునకున్ 

మృతిబడయని గతినొసెగను

అతిముదమున దైత్య జనని అతనిని పొగడన్ 


## అహల్యా వృత్తాంతము


125. సుందర వన వాటిక యిది 

ఇందెవరును కాన రారు ఏ కారణమున్? 

చందురు బోలిన రాముడు

వందన చరితుని అడిగెను వత్సుని కరణిన్ 


126. భూ తలమున దివ్య ప్రభల

నీతి నియమ నిష్ఠలు తన నిజతత్వముగన్ 

ఖ్యాతి గనిన ముని శ్రేష్ఠుడు,

గౌతమముని ఆశ్రమమిది కనుమిదె రామా !


127. లొకోత్తర సౌందర్యము 

ఆకారముగా అహల్య ఆతని సతియై 

ఏకాంతముగా నుండెను

వేకువ ఝామున తనపతి వెడలగ నదికై


128. వేయి కనుల దొర కన్నులు

మూయగ కామము అహల్య ముంగిట నిలిచెన్

మాయా రూపుడు సురపతి

యేయనెరిగి కూడె నతని, యెలనాగ రతిన్


129. తరియించితి సుర శ్రేష్ఠా

త్వరపడు తడవయ్యె పొమ్ము వచ్చిన తెఱవున్

అరిగిన యిటు గౌతమ ముని

భరియింపగ లేము అతని ప్రతిరంభమ్మున్   


130. దేవాసుర  దుర్ధర్షుడు 

పావక సమగౌతముండు ప్రయతుండగుటన్

భావాటునిగా సురపతి

నావాటికలోన చూచి అగ్నిగ  మండెన్


131. నారూపము దాల్చి యిటుల

ఘోరమ్మును ఆచరించు కుటిలాత్ముండా!

దూరమగును వృషణమ్ములు

మీరినచో కట్టుబాటు మేలుకలుగునా!! 


132. కాయము పై మోహముతో 

చేయగ రానీ అఘమును చేయు మదవతీ 

వాయువు భక్షించి యిచట

రాయిగ మారెదవు నీవు రాగములుడుగన్ 


133. రామచరణ రజమీ వన

సీమలలో పడినయంత చెడుదూరమ్మై

స్వామిని సేవించి పిదప

నాముంగిట నిలతువీవు నవభావమునన్ 


134. గౌతము శాపము తీరగ

నాతిగ మరలెను  అహల్య నలుగురి యెదుటన్ 

మాతగ తలచిన రఘుసుతు

లాతరుణీ పదములంటి రంచిత భక్తిన్ 


***

135. గాధేయుని రాకను విని 

మోదముతో జనక నృపుడు మునిముఖ్యులతో 

వేదోక్తముగా నతనిని

సాదరముగ పిలువ పురికి సరగున చనియెన్ 


136. గజసింహాలుగ నడచుచు

రజనీకర సూర్యులవలె రాజిల్లుచునున్ 

భుజబల శాలులు  వీరులు

అజుని హరుని  తలపుదెచ్చు అమరులొ వీరల్? 


137. సిద్ధాశ్రమ వాటికలో 

ఉద్దండులు దానవులను ఓడించిన వీ

రిద్దరు దాశరథులు నీ

వద్దన్ గలధనువు చూడ వచ్చిరి రాజా! 


138. అనఘుడగు శతానందుడు

ముని గౌతముజ్యేష్ఠ సుతుడు మోహరహితుడున్ 

జననీ జనకుల సేమము

విని కౌశికు వల్ల నొసగె వినయాంజలులన్ 


139. ఎంతటి పుణ్యము చేసితి

వింతటి మునికృపను పొంద యేజన్మలనో 

అంతెరుగని దితని మహిమ 

వింతలు నిండిన చరితను వినుమిదె రామా! 



### విశ్వామిత్రుని వృత్తాంంతము


140. గాధిసుతుడు ధర్మముతో 

యీధరణిని వేల యేండ్లు యేలెను ప్రజలన్

ఆధిక్యత నన్ని దిసల

సాధించెను యెదిరి లేని సామ్రాట్టుండై


141. జయకేతన రథ ములతో  

హయ గజ పద దళముల గొని అలసిన వాడై 

రయమున కౌశికుడరగెను 

దయాళు వశిష్ఠు నెలవు దప్పిక తీరన్ 


142. పురమేలెడు ప్రభువరగిన 

పరిచర్యలు చేయుట యది పరిపాటి యిలన్ 

పరమాన్నము షడ్రుచులన్ 

పరివారము గూడి గొనుము బడలిక తీరన్ 


143. తలచిన వశిష్టు నానతి 

పలురకముల భోజ్య లేహ్య ఫల పాయసముల్ 

కలిగించెను ధేను శబల

కలయాయని చూచు చుండ కౌశికు సేనల్


144. మారుగ యీధేనువునకు 

కోరినదిచ్చెద మునీంద్ర కూరిమి తోడన్ 

కోరుకొనుము ఏదైనన్ 

ధారుణిలో సంపదెల్ల తప్పక ఇత్తున్ 


145. గోవుగ తలపకు శబలను

దేవత లొసగిన భగినిగ దెలియుము రాజా

నావాటిక యజ్ఞ విధుల

కావలసిన వన్ని యిచ్చి కాపాడు మమున్ 


146. వేవేలుగ సైన్యమ్మును

కావరమున గాధిసుతుడు కదనము కంపెన్ 

గోవు శబల యోగ బలము

ఆవీరుల మట్టిగరిపె ఆశ్చర్యముగన్ 


147. క్షితినాథుడు కోల్పోయెను

శతసుతులను సైన్యములను సకల బలగమున్ 

అతిగర్వము అణగారగ

చతికిల బడె లజ్జనుగొని జవములు ఉడుగన్ 


148. కోరలు తీసిన ఉరగము

హోరు విడిన సాగరముగ ఉడిగిన జవమున్ 

చేరెను కౌశికుడు పురము 

భూరక్షణ భారము తన పుత్రున కొసగెన్ 


149. మహదేవుని మెప్పించెను

అహరహములు తపము చేసి ఆతని కరుణన్

గహనమ్మగు ధను శాస్త్రము 

బహుప్రీతిని కుశికసుతుడు బడసె వరముగన్


150. హరవర బలమున కౌశికు

డరగి వశిష్ఠుని వనమున కావేశముతో 

కురిపించెను శరవర్షము 

దరిదాపుల గల యడవిని దగ్ధము జేసెన్


151. బలవంతుడవని వీగుచు

కలకాలము నిలుచు వనము కాల్చితివరెరే 

నిలునిలు మిక మూఢాత్మా 

తెలిపెద బ్రాహ్మణ బలమును తిలకించుమిదే


152. కేలూనెను మునిశ్రేష్ఠుడు

కాలుని కర పాశము వలె కరదండమ్మున్ 

ప్రేలిన కౌశికు శరముల 

హేలగ అది మ్రింగివేసె యెగయుచు కీలల్  


153. భ్రమనుంటిని నా బలమున 

సమమేదియు లేదు బ్రహ్మ శక్తికి జగతిన్ 

కమలాసను మెప్పించెద 

అమరగ బ్రహ్మర్షి పథము అలసించకనే 


154. మరల తపము నొనరించెను

పురము విడిచి కుశికసుతుడు పూర్ణమనముతో 

వరమొసగెను వాణీపతి

కరుణను రాజర్షి పదము గాధేయునకున్ 


155. తనువుతొ స్వర్గము పొందగ

యినకుల రాజగు త్రిశంకు యెంచిన వాడై 

తనగురువును యడిగె తెరవు 

అనుచిత కార్యము వలదని ఆతడు తెలిపెన్ 


156. నిండని కోర్కెతొ ఆతడు

అండనడుగ గురుసుతులను, ఆగ్రహపడుచున్

ఛండాలుని రూపమ్మును 

దండనగా నొసగి వారు తరలిరి కినుకన్


157. కోరెను కౌశికు శరణము

మారిన రూపుతొ త్రిశంకు, మనసు కరుగగన్,

తీరును నీ కామితమని

ఆరాణ్ముని వరమొసగెను అతనికి దయతో 


158. కనివిని యెరుగని యాగము

మునిరాజు జరిపె త్రిశంకు మోక్షము కొరకై

వినువీధిని సశరీరుగ

అనిమేషుల ద్వారముకడ ఆతని నిలిపెన్ 


159. గురుధిక్కారము సలిపిన 

తరమా స్వర్గమును పొంద ధరలోని నరుల్

మరలు భువికి వచ్చినటుల

పరమేశ్వర శాసనమని వాసవుడనియెన్! 


160. రోదనతో మరలు నృపుని

గాధేయుడు గాంచి అపర కాలాత్మకుడై

సాధించిన ఫలము నొసగి

రోదసిలో మారు నాక లోకము నిలిపెన్ 


 *సునశ్శేపుని వృత్తాంతం*


161. మహరాజు యంబరీషుడు

బహుప్రీతిని యజ్ఞ మొకటి ప్రారంభింపన్ 

సహస్రాక్షుడు బలిపశువు న

పహరించె అతని మఖము భగ్నము జేయన్ 


162. కోరెను ఋచీకుని సుతుని 

మారుగ యజ్ఞ పశువునకు మఖము ముగింపన్ 

కోరిన గోభూ సంపద

భూరి విరాళములొసగెను భూపుడతనికిన్ 


కోరెను రాజు ఋచీకుని

మారుగ యజ్ఞ పశువునకు మలికొమరుండన్ 



*మేనక*


163. గరపెను కౌశికుడు తపసు

పరుగిడె కాలము వడివడి వత్సర శతముల్ 

సురభామిని మేనక యటు 

అరుదెంచెను స్నానమాడ ఆ వనసీమన్ 


164. జలదజనిత విద్యుల్లత

జలకములాడుచు కనుబడ స్మర వశుడగుచున్

పలికెను ముని మేనక తో 

పలువత్సరముల తపస్సు భంగము కాగా


165. సౌందర్య మునకు రూపమ

పొందిన నినుధన్యుడగుదు పూర్ణేందుముఖీ

అందము నారాధించుచు

ఉందము యిరువురము కలిసి ఒకరికొకరమై 


166. గడిచెను దశవత్సరముల్ 

వడివడిగామేనక యొడి వదలని మునికిన్ 

సడలగ మదనుని పాశము

కడుదీనుగ కౌశికుండు కనలె మనసులో 


167. నాకుత పోభంగము సుర

లీకాంతలనంపి జేతురెంతటి ఘనులో!!

నాకార్యము సాధించెద

యేకాంతముగా గెలిచెద ఇంద్రియముల నే 


168. గాలిని బంధించెను బొట

వేలున నిల్చెను దణిముని భీషణ తపమున్ 

కాలాగ్నిగ యగుపించెను

వేలుపులకు ముని శిరసున  వెల్వడు కాంతుల్ 



65 సర్గ -   శ్రీరాం 


169. ఉప్పెనయైపొంగె కడలి

తప్పెను తేజము సురలకు ధారుణి యదరెన్ 

తప్పించుమువిలయంబని

చెప్పిరి చతురాస్యునెదుట చేరియొకటిగన్ 


170. బ్రహ్మర్షిగ కౌశికునకు 

బ్రహ్మయొసగె సురలగూడి వరమాతనికిన్ 

బ్రహ్మానందము నాముని

బ్రహ్మ పదములంటి చేసె వందన శతమున్ 

 


171. తనదు పురోహితు వాక్కున 

ఘనకౌశికుగాథను విని కడుసంతసమున్ 

జనకుండాముని కొసగెను

వినయము తోస్వాగతమును వేదోక్తముగన్



172. రాకొమరుల్ రాణ్మునితో 

వేకువ ఝామున వెడలిరి విమల హృదయులై 

మీకిదె స్వాగతమని,  నృపు

డాకౌశికునకెదురేగె నంజలి తోడన్ 


173. జనకుడు వైదిక నిరతుడు

మునివరునకు నర్ఘ్యపాద్య మొసగిన వాడై

తనకానతినిమ్మ నెదుట

వినయముతో నిల్చెనుముని ప్రీతిని బడయన్ 


174. దశరథ కుమారులిర్వురు 

దశదిశలన్ ఖ్యాతిగన్న ధార్మిక శూరుల్  

అసమాక్షుని కార్ముకము ద

రిసింపగన్కోరినారు  ఋజుగుణసాంద్రా


175. జన్నము చేయగ దక్షుడు

మన్ననగా మఖహవిస్సు మహదేవునకున్ 

మిన్నులదొరలీయ మరువ

కన్నెఱ్ఱైహరుడు కనలె కార్ముక ధరుడై


176. సురల తలలు తెగ వేయగ

హరుడు ధనువు నెత్తి వెడల, అమరుల్ ఒకటై

శరణమనిరి ఫాలాక్షుని 

కరకంఠుడు శాంతిపొంది కరుణను ప్రోచెన్ 


177. వాసవుడా కార్ముకమును 

న్యాసమ్ముగ దేవరాతునకొసగగ దయన్ 

భాసిల్లినదీ చాపము 

మాసీమలకెల్ల వేళ మంగళ‌మిడుచున్ 


178. హలమున దున్నగ భూమిని

వెలువడె నొకచిన్ని శిశువు వేలప్రభలతో 

పిలచితి నామెను సీతగ

తలచి సిరిగ పెంచినాను తనయను ప్రేమన్ 


179. తరుణిని సీతను పొందగ

వరశుల్కము శౌర్యమేని ప్రకటించితి, వే

ధరణీశులు మిథిలాపురి

కరుదెంచిరి బలముచూపి హరువిలునెత్తన్ 


180. వెనుదిరిగిరి నరపాలురు 

అనలాంబకు చాపమెత్త నలవియె లేకన్! 

వినుమిచ్చెద వైదేహిని 

యినకులమణి భవుని విల్లు యెత్తిననిపుడే! 


181. బలవంతులు దృఢకాయుల

పిలిపించెను జనక నృపుడు విల్లును ద్రోయన్ 

తిలకించెను శ్రీ రాముడు

పులకించిన మనసుతోడ పురహరు ధనువున్ 


182. దశరథ సూనుడు ధనువు

స్పృశియింపగ కోరె నాజ్ఞ విశ్వామిత్రున్ 

ఋషిసత్తముండు జనకుం

డొసగిరి ఆశీస్సులతని కుభయుల్ ఒకటై 


183. కరి వరగమనుడు రాముడు

హరుకార్ముకమెత్తి కూర్చె అల్లెనలయకన్ 

కరిమబ్బున ఉరుమాయని

శరాసనపు కాంతి రామచంద్రుని చేరన్ 

 

184. అల్లెను యెక్కిడ రాముడు 

ఫెళ్లుమనుచు విరిగె ధనువు పేరోలగమున్ 

చెల్లెను జనకుని శపథము 

కళ్ళు చెదరి మూర్ఛగొనిరి కాంచిన సభికుల్ 


185. అనితర సాధ్యమ చింత్యము 

అనలాంబకు ధనువు విరుచుటపురూపమ్మే !!

యినకుల సూనుడు సీతన్ 

మనువాడగ తగిన జోడు మహిని మునివరా!! 


186. రఘువీరుని శౌర్యమ్మును

తగురీతిగ తెలుప జేయ దశరథు మ్రోలన్

ఖగవేగమ్మున పంపెద

ప్రెగడ ప్రముఖులన్నయోధ్య వేగ మునివరా! 


187. జనక మహీపతి దూతలు

ఇనకుల భూపతి కొలువున కేగిరి వేగన్ 

అనిమేషుల పతి రీతిని

కనబడె సామ్రాట్టు వారి కన్నులు చెదరన్  


188. గెలిచెన్ రాముడు సీతను

అలవోకగ యెక్కు పెట్టి హరకార్ముకమున్ 

సెలవిమ్మనె మిథిలాపతి 

సలుపగ యిరువురికి పెండ్లి సముఖమున ప్రభూ! 


189. బంధు పురోహిత సహితుడు

ఇందురుడై దశరథుండు యెదురయె జనకున్ 

వందన చరితుడు భూపతి

ముందుగ గురువులు నడవగ పూజించె నృపున్ 


190. ఇనకుల గురువు వశిష్ఠుని

ఘనచరితుడు గాధి సుతుని, గౌతమ కొమరున్ 

తనయ మనువు  జరిపించగ 

జనకుడు ఆనతి నడిగెను శ్రద్ధాళుండై 


191. మొలకలతో కుంభమ్ములు 

అలరులతో పాలికలతొ హాటక మయమై 

అలరారెను వేదిక వే

కొలదిగ బ్రాహ్మణ చయంబు కూడిన సభలో 


192. సమతుల్యమైన దర్భలు 

అమరించెను మునివశిష్ఠుడగ్నికెదురుగన్ 

కొమరితను తెచ్చె జనకుడు 

రమవెంటన్ నడచి వచ్చు రత్నాకరుడై 


193. చెన్నొందెను హోమాగ్నులు

  మిన్నంటెను మంగళ ధ్వని మిథిలాపురిలో

  కన్నులపండుగ జనులకు 

  పున్నమ జాబిలి మహిసుత మోమును చూడన్


194. కనక కలధౌత భూషిత

జనకాత్మజ నెదుట నిల్పి శాస్త్రోక్తముగా

జనకుడు రామునితోడన్ 

అనలుని సాక్షిగ పలికెను అందరు చూడన్ 


195. తోడుగ మెలగును జానకి,

నీడగ నిలచును సతతము నీతో రామా,

నేడయె నీదిక గొనుమిదె 

వీడకు సుఖదుఃఖమందు ప్రీతినొసగితిన్ 


195. రఘువీరుడు పెండ్లాడెను 

అగణిత సుగుణాల రాశి అవనీజాతన్ 

జగతి జనులు నుతియించిరి‌

తగు జంటని దీవెనలిడి తనిసిన‌‌ మనసున్ 


196. శృతకీర్తి శతృఘ్ను బడసె

పతిగా, మాండవి భరతుని పరిణయమాడెన్ 

సతియూర్మిళ సౌమిత్రియు

జతగూడరి దంపతులుగ జనకుని ముదమున్ 


197. పాడిరి గంధర్వులు దివి

నాడిరి అప్సర గణంబు లానందమునన్

నాడు మిథిలచూడ జనుల 

వేడుకలన్ మించిపోయె  వేల్పులనగరున్


198. మణిమేఖల భూషణముల్ 

ఘనగజ హయ సురభి తతులు కనకాంబరముల్ 

జనకుడు సారెగ పంపెను

మనువున రఘుపతినిగూడి మైథిలి తోడన్


199. పరివారముతో వెడలెను

సురపతివలె దశరథుండు సుతసహితముగా

ధరపై దుశ్శకునంబులు 

పరికించిన నృపతి గురుని పరిప్రశ్నించెన్ 


200. పెనుచీకటి నలువంకల

దిననాథుని కప్పివైచి తిమిరము నింపెన్

ఇనకుల భూపతి కొమరుల్

మునిముఖ్యులు తక్క జనులు మూర్ఛను బడగన్


201. కాలాగ్నిగ యరుదెంచెను

ఫాలాక్షుని ప్రళయ కాల ప్రతిరూపముగన్

శూలిశర సమమగు  పరశు

కేల నిలిపి భార్గవుండు  కీలలెగయుచున్ 

 

202. మొనగాడవంచు వింటిని

అనలాస్యుని ధనువు విరుచుటంత ఘనుడవో!! 

గొనుమిదె వైష్ణవ చాపము

కనబరపుము నీదు ఘనత కాంచెద రామా! 


203. చేపట్టెను రాముడు విలు

చూపెట్టెను భార్గవునకు శూరత్వంబున్ 

మోపెట్టగ ధనువు హరిగ

చూపట్టెను రాముడు భృగు సూనుని యెదుటన్ 



204. భువిరంగవల్లుల నడుమ

రవితేజముతో నృపుండు రాజనగరులో

నవదంపతులను తోడ్కొని

రవళింపగ మంగళ ధ్వనులడుగిడె శోభన్ 


205. అమరెన యోధ్యా నగరము

అమరావతి వలె వెలుగుచు ‌నాశుభ ఘడియన్

కమలాసతి వలె జానకి

రమణునితో కలసి నడిచె రాజ భవనమున్

No comments: