అరణ్యకాండ


జనస్థానం

1. కం. చుక్కల రాయడు రాముని,   
ప్రక్కల లక్ష్మణుడు సీత, వనమున నడువన్  
మక్కువ మీరగ జూచిరి 
ఋక్కుల పల్కుటను మాని ఋత్విజు లెలమిన్!

నడచి వస్తున్న సీతారామ లక్ష్మణులను చూచిన ఋషులు ఆ రాముని అందాన్ని చూచి ఆయన పక్కన వున్న సీత సౌందర్యాన్ని లక్ష్మణుని అందాన్ని చూచి తాము చేస్తున్న యజ్ఞాన్ని చదువుతున్న మంత్రాలను మరచిపోయారు.


2. కం. బలహీనుల బలవంతులు
పలు బాధల గురినిచేయ పాలకు లేలా!
పలు విధముల మాకిడుముల
కలిగించెడు వారి గూల్చి కావవె రామా!

రాముని ఉద్దేశించి ఋషులు మునులు మాటాడుతున్నారు, శ్రీ రామా విరాధుడనే రాక్షసుడు మమ్మల్ని తపస్సు చేసుకోనివ్వకుండా చాలా బాధ పెడుతున్నాడు. దేశానికి ప్రభువు మమ్మల్ని కాపాడటం ఆయన బాధ్యత, అట్లా
కానప్పుడు అటువంటి పాలకులు వున్నా లాభమేమి. ఆ రాక్షసుని సంహరించి మమ్మల్ని కాపాడు శ్రీ రామా!!



శరభంగుడు

4. కం. కాయము తృణముగ తలచుచు
మాయను బడని శరభంగ మహితాత్ముడటన్
మోయగ హుతవాహుడు మహ
నీయుల తుదివాసమున్ జనె ముదము గొనుచున్

శరభంగుడనే మహర్షి పరమ నిష్ఠాగరిష్ఠుడు అమితమైన తపో బలమున్నవాడు అతడు తన తపస్సుచేత బ్రహ్మలోకాన్ని, అమరలోకాన్ని కూడా జయిస్తాడు, ఇంద్రుడు తనని బ్రహ్మలోకానికి  తీసుకెళ్లడానికి రథాన్ని తీసుకుని వస్తే, అదే సమయంలో రామ లక్ష్మణులు సీతతో కలసి రావడాన్ని గమనించి దేవేంద్రుడు వెళ్లిపోతాడు . అటు పిమ్మట రాముణ్ణి ఆహ్వానించి తానూ సంపాదించిన తపస్సును ఆయనకు ధారబోస్తాననగా రాముడు అతన్ని వారిస్తాడు. 

శరభంగుడు రామునికి సుతీక్ష్ణుని గురించి చెప్పి, దేహ భ్రాంతి లేని వాడై రాముడు చూస్తుండగా తన శరీరాన్ని హుతవాహునికి (అగ్ని) అర్పించి మహాత్ములు వెళ్లే చివరి స్థానమైన బ్రహ్మ లోకానికి జ్యోతి స్వరూపంతో వెళ్ళిపోతాడు.     


సుతీక్ష్ణుడు

7. కం. వనసీమను మునివాటిక 
లను గల మహితాత్ముల గని ఆనందముగాఁ 
వినయముతో రఘురాముడు 
తనసతితో గూడి వారి దర్శనమొందున్  

సుతీక్ష్ణుడు మాహాత్ముడు అమితమైన తేజము గల తాపసి. తపస్సే అతనికున్న ధనము. రామునికి భవిష్యత్ మార్గాన్ని చూపడానికే అన్నట్టు ఇంకా స్వర్గానికి వెళ్లకుండా భూమిపైన ఉన్నాడు. రాముణ్ణి ఆహ్వానించిన పిమ్మట చుట్టుపక్కల వున్న ఆశ్రమాలను చూచి రావడానికి రాముడు ఇష్టపడితే అతనికి ఎట్లా వెళ్లాలో చెప్పాడు.
రాముడు వినయశీలి అక్కడ వున్న ముని ఆశ్రమాలను దర్శించి వారికి సీతతో బాటుగా పాద పూజ చేశాడు..  

సీతా రామ సంవాదము

8. కం. "వైరము లేకన్  క్రోధము"
"కోరిక పరసతులయందు కూడగ", "కల్లల్"
ధారుణి కామము గతులివి
దారుణ ఫలితమ్ములిచ్చు తలపగ రామా!

రామా! మనిషి మనసులోనే తారడుతూ అతని జ్ఞానాన్ని నాశనం చేయగల సామర్థ్యమున్న,  కామమనే దుర్గుణానికి మూడు దారులున్నవి 

1. వేరొకరితో వైరము లేకున్నా క్రోధము వ్యక్తపరచుట
2. పర భార్యాలను కోరుకొనుట
3. కల్ల (అబద్ధము చెప్పుట) 

వీటినుండి మనిషి ఎంత దూరంగా ఉంటే అంత శ్రే‌ష్ఠము. 


9. కం. దండ కమండలములగొని
ఎండకు వానకు వెరువని యేడుల తపసున్
"దండము" చేగొని కోల్పడె
చండాడగ పరుల, తామసమునకు వశుడై ! 

రామా, పూర్వము ఒక తాపసి గొప్ప తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళడానికి అర్హత సంపాదించాడు. అతని తపస్సును భంగము చేయడానికి దేవేంద్రుడు అతని దగ్గర  మారు వేషంలో వచ్చి "స్వామీ నేను కొన్ని రోజులు బయట దేశానికి  వెళ్తున్నాను నా దగ్గర ఒక ఖడ్గం వున్నది అది మీ దగ్గర నేను వచ్చే వరకు జాగ్రత్తగా వుంచుకొండి" అని చెప్పి వెళ్ళి పోయాడు. అప్పుడు ఆ తాపసి ఆ ఖడ్గాన్ని తన పక్కనే వుంచుకొని అన్ని పనులు చేసేవాడు, అట్లా కొన్ని రోజులైన తర్వాత ఆ ఖడ్గం లేకుండా ఎక్కడికీ పోలేక దానితో మృగాలను కొట్టి చంపడం మొదలు పెట్టాడు, అట్లా తామస గుణానికి లొంగి పోయి అధోగతి పాలై తన తపస్సునంతా పోగొట్టుకున్నాడు ఆ తాపసి. రామా ! మీ వద్ద ఈ ధనుర్బాణాలు చేతిలో వున్నంత వరకు మనకు ఏదో ఒక ప్రమాదం రాకుండా వుండదేమో  అని  నాకు భయంగా  వుంది. 

10. కం.చిరు కోపము నటియించుచు 
భరతాగ్రజుని గని బల్కు పావని సీతన్,
చిరు నగవున గను రాముని 
మరల మరల చూచి మోహమందిరి తపసుల్! 

సీత తనను ఉద్దేశించి పలికిన ప్రేమ పూరిత వాక్కులకు శ్రీ రాముడు చిరుమందహాసము తో ఆమె  వైపు చూచాడు అప్పుడు ఆయన అందం కఠిన తపస్సును చేసే మునులకు సైతం మొహాన్ని కలిగించేట్టుగా ఉంది. 

మాండకర్ణి

11. కం. మూలముల మెసవి తనువును
గాలిని నిలబెట్టి యేండ్లు, కడ కింద్రియముల్
ఏలగ, కోల్పడె నిజమగు
మేలు,తపసి మాణ్డకర్ణి మేదిని రామా! 

పలు ఆశ్రమాలను సందర్శించిన సీతా రామ లక్షణులు అదే క్రమంలో ఒక సరోవరం దగ్గర  సంగీతము నృత్యము యొక్క ధ్వనిని విన్నారు అక్కడున్న ధర్మభృత్ అనే ముని ఆ సరోవర వింతను తెలియజేస్తూ ఇలా చెప్పాడు, పూర్వం మాండకర్ణి అనే ఋషి గొప్ప తపస్సు చేశాడు ఆయన తపో భంగం చేయడానికి దిక్పాలకులు ఐదుగురు అప్సరసలను పంపారు ఆ అప్సరసల సౌందర్యానికి వశుడైన మాండకర్ణి మహర్షి తన తపస్సునంతా కోల్పోయాడు. 

అగస్త్యుడు

12. కం. ఘన సింధువు నరచేతను
చినచుక్కగ చప్పరించు జేతకు, వాతా 
పిని ఉదరమున గొన ఘనమ? 
తనరినగస్త్యుడు భుజించె తానసురునటన్!

శ్రీ రామచంద్రుడు అగస్త్య మహామునిని దర్శనం చేసుకోవాలని సుతీక్ష్ణుని దగ్గర అనుమతి తీసుకోని సీతా లక్ష్మణ సమేతుడై బయలుదేరాడు దారిలో లక్ష్మణునికి ఆ ముని మాహాత్మ్యమును వివరిస్తూ  చెప్పిన మాటలివి లక్ష్మణా ఇల్వలుడు వాతాపి రాక్షస సోదరులు బ్రాహ్మణులను శ్రాద్ధ భోజనానినికి పిలచి వారిని మోసాగించి చంపేవారు. వాతాపి మాంసాన్ని ఇల్వలుడు వారికి పెట్టగానే బ్రాహ్మణుల కడుపును చీల్చుకొని వాతాపి బయటికి వచ్చే వాడు, కానీ వారి ఆటలు అగస్త్యుని దగ్గర సాగలేదు. వాతాపిని సులువుగా జీర్ణం చేసుకొని ఇల్వలుణ్ణి కూడా సంహరించాడు ఆ మహాముని. 
ఒకానొకప్పుడు సముద్రాన్నంతటినీ ఆచమనంగా స్వీకరించిన ఆ అగస్త్యునికి వాతాపిని కడుపులో జీర్ణం చేసుకోవడం ఒక పెద్ద పని కాదు కదా!  

13. కం. కల్లను, వంచనల నిలిచి
ఉల్లము రాక్షస నెలవుగ నుంచిన నరులన్,
ఒల్లదు ఆ ముని సన్నిధి
అల్లదిగో గనుమగస్త్యు నాశ్రమ వాటిన్!

లక్ష్మణా! అగస్త్య మహాముని ఎంత గొప్పవాడంటే ఆ ముని ఆశ్రమంలోనికి అసత్యం పలికే వాడు, ఇతరులను మోసం చేయాలనే బుద్ధి కలవాడు, మంచి మనసు లేని వాడు గాని వెళ్ళలేరు. 


14.  కం. మడిపాత్రలు, తడి వలువలు
జడధారుల జటల పాట, చనువున మృగముల్,
అడకువ వేల్పుల క్రమమును
బడయునగస్త్యుండు వెల్గె పద్మాకరుడై!

అంతటా పరబ్రహ్మమును దర్శించే అగస్త్యుని ఆశ్రమం ఎంతో పవిత్రంగా వుంది. అక్కడ వున్నదల్లా యజ్ఞం చేయడానికి కావలసిన మడి పాత్రలు, మునులు ఆరేసుకున్న తడి వస్త్రములు మాత్రమే. మృగములు ఆ మునులను ఏమాత్రం బాధ పెట్టకుండా చనువుతో వుంటాయి. ప్రతిరోజూ మహిమానవితుడైన అగస్త్యుని పూజించడానికి దేవతలు వస్తారు. వారి స్థానాలు క్రమంలో ఏర్పరిచి వున్నాయి అక్కడ. అటువంటి ఆశ్రమంలో అగస్త్యుడు వేయి సూర్యుల వెలుగుతో వారికి అగుపించాడు. 

15. కం. అతిథిగ వచ్చిన మునిజన
నుత సీతను, రామలక్ష్మణుల గని సుస్స్వా
గతమిడి ఆముని మహిమా
న్వితమగు నస్త్రములనిచ్చె విజయము కలుగన్!!

జనస్థానం లోని మునులందరిచేతా పూజింపబడ్డ సీతా రాములను, లక్ష్మణుని చూచిన అగస్త్యుడు వారికి స్వాగత సత్కారాలను చేసిన పిమ్మట, త్రికాల వేదియైన ఆ ముని వారికి విజయం చేకూర్చే మహిమాన్వితమైన అస్త్రములను అక్షయ తూణిరమును ఇచ్చాడు. 

16. కం. కష్టముల విడని నేస్తము,
నిష్టి నియమ విధుల యందు నిల్వగ సతియౌ! 
దుష్టుల దృష్టిని నిలుపకు,
అష్టసిరుల ఆదిలక్ష్మి ఆమెయె రామా!

రాముని ఉద్దేశించి అగస్త్యుడు చెబుతున్నాడు. రామా ఎన్ని కష్టాలొచ్చినా నిన్ను విడచి వెళ్ళని స్త్రీ నీ పక్కన ఇష్టి - యజ్ఞ నియమాలు నిర్వహిస్తూ ఉంటే ఆమె ధర్మ పత్నిగా పిలవబడుతుంది. ఈ సీత సామాన్య వనిత అని అనుకోకు ఆది లక్ష్మి స్వరూపమైన ఈమెను ఏ దుష్టుని నీడా పడకుండా కాపాడుకో. 

పంచవటి

17. కం. రాముని ఆజ్ఞను సతతము
సౌమిత్రి వరముగ నెంచి ఔదల దాల్చున్! 
ప్రేమగ వెనువెంట నిలచి
సేమమరసి నెల్లవేళ సేయును సేవల్! 

18. కం. కలకల కారండ తతులు
గలగల గోదావరీ నగవులు, పులకలన్
కలిగించు పువుల చిరున
వ్వులు!  రాజ్యము మరిచె రాఘవుడు పంచవటిన్!

19. కం. ఏనుగు తొండము నీటను 
ఆన్చదు,  తాఁమరచు లేడి ఆకలి! మగతన్,
కూనయు వీడదు తల్లిని!
మానడు రాఘవుడు సంధ్య మంత్ర జపములన్! 

శూర్పణఖ

20. రాముడు నడువగ తటమున
కామారిగ దోచు మునులు కాంచిన తడవున్  
కామిని శూర్పణఖ గనుల, 
కాముని రూపము కనబడు కామాంధకటన్!

  21.కం. నరులైన అసురులైన ఇ
తర వనితల కోరి మోహతామసమందున్ 
నెరనమ్ము సతిని  విడిచిన 
నరకమునకు దారితవ్వి నరగుట విజయా! 

22. కం. వేగమున జానకి  దరికి
నేగిన కర్కశ కరాళ నేత్రిని హరుడై
ఊగి ముకుచెవుల తెంచెను
రేగిన లక్ష్మణుడు మోహరించుచు నచటన్!

ఖరఖండనం

23. కం. పదునాలుగు లోకాలను
పదునైన శరముల కూల్చు పదిక్షణములలో
పదునాలుగు ఖర కుంకల
ఎదిరించగ తృటియె చాలు ఎరిగిన రామున్!

24.  కం. హితమును కోరెడు సోదరి,
మితిమీరిన మోహబుద్ధి మెలగిన ధరలో,
గతి తప్పని వీరుడెవడు! 
అతిఘోరుడు ఖరుడు బూనె నతిదారుణమున్! 

25. తమ్ముని పరాక్రమ మెరుగు
అమ్మును విల్లును ధరించు రాముడు, బూరల్
కొమ్ముల ఖరసైన్యమునచట
దుమ్మును కలప తనొకండె దొరగొనె నడవిన్! 

26. కం. ఎప్పుడు శరమును విడిచెనొ
ఎప్పుడు రక్కస శిరస్సు లెగిరెనొ చూడన్! 
నిప్పులురుము భీకరతన్
ఒప్పగ రాముడని నిల్చె ఒక్కడె భవుడై!! 

27. కం. పెట పెటమని తలలు విరిగి
అటునిటు పడిరి ఖర సైన్యమాయువు తీరన్! 
బొటబొట నెత్తురు చిందగ
అటవి నెరుపు నదిగ మారె అసుర రుధిరమున్!

28. కం. కనుగానక దుష్కర్మల
మును చేసిన ఖరు శిరంబు, మొనదే లమ్మున్!
అని కూల్చెద నను రాముడు
అనలుని కనుదాల్చు హరుని యాకృతి గాంచెన్!! 

29. కం. ఖరదూషణు పరిమార్చిన
అరిజేతకు మురిసి సీత నాలింగనమున్
మరిమరి నొసగెన్! రాముడు
వరముగ వేరేమి కోరు వసుధను చూడన్!

అకంపనుడు

30. కం. సింహాననుడతడు నడుము
సింహము, ఖర దూషణాదులందరసురులన్
సంహారము చేయగ నర
సింహుం‌డయ్యెన్ జనస్థలంబున నధిపా

31. కం. ఇనకుల తిలకుని శౌర్య
మ్మునకంపను నోట విన్న ఉద్రేకంబున్
ఘనుడా రావణుడురిమెను,
ఘనమేఘమువలె! రగల్చె కన్నుల అగ్నిన్! 

32. కం. ధరణిజ వీడిన రాముడు
మరణించు నరక్ష ణంబు మారక మునుపే!!
ఖరఖండనమెరిగిన కిం
కరు బోధను రావణుండు కదలె కుటిలుడై!!

33. కం. తాపస కాంతల భంగము
దాపరికము లేక జేయు తలచిన తడవున్
ఓపడు నితరుల సుఖమును,
చూపుల కాల్చును దివౌకసుల నంతకుడై

34. కం. అణచదు దంతియు దంష్ట్రల ! 
తొణకడు వజ్రాయుధంబు తో దైత్యుడు!  రా
వణుడతి బలవంతుని గని
వణకెద రాదిత్య చంద్ర వాసవ ముఖ్యుల్!

35. కం. శివపద ఘట్టన మోర్వక
రవమును చేయగ జగమ్ము రావణు డనియెన్!
అవిరామ తపః ఫలముగ
అవనిని చావక వరంబు నాతడు పొందెన్! 

 శూర్పణఖ  ఆరోపణ 

36. కం. ఘోరావమానము రగులు
నారాకాసి తన గోడునన్నకు తెలిపెన్! 
ఏరీ పగగొన్న పడతి
మీరిన వీరుల్కనంగ మేదిని విజయా!

37. కం. కందర్పుని‌ అందము శర
దిందుని ముఖము, రణమందు నింద్రుని మీరున్! 
వందల శరములు కనులకు
అందక విడిచి ఖరసేన నణచె వినన్నా! 

మారీచ బోధ

38. కం. ఘనమగు రథమున దైత్యుడు
విను వీధిని సాగె వింత వేడుక తోడన్!
తనువిచ్చు రమణు లాడగ,
తనువీశ్వర పరము జేయు తపసుల జూసెన్!

39. కం. రాముని శౌర్యము నెరిగిన
ధీమతి మారీచుడుండె తీవ్ర తపమునన్! 
తామస దూరుని  దాంతుని,
కామాతురుడైన రేడు కానిపనడిగెన్!  

40. కం. మనసుకు నచ్చిన మాటలు
వినిపించు జనులను జూడ, వింతేమి భువిన్! 
వినుటకు కటువైన హితవు
ననువుగ చెప్పు, విను, వారి‌ నరుదుగ జూతుమ్! 

41. కం. తనువును దాల్చిన ధర్మము
ధనువును దాల్చగ ధరిత్రి దశరథ సుతుడౌ! 
తన శరముల నిను నాశన
మొనరించు! ధర పురుషోత్తముగ నెరుగు నృపా!

42. కం. దినకరుని దీప్తి వీడదు,
తన రమణుని విడిచి సీత తానుండదిలన్! 
అనలుడు రాముడు రోసిల
కనలు నసురులు శలభాలుగ! వినుము  రాజా!

43. అమిత మతని తేజము యమ
సముడై చెండాడు నీదు సైన్యమును నృపా! 
సమిధగనై నసుర కులము
సమయును సీతన్ హరించ శరముల అగ్నిన్!

44. కం. బాలుడు రాముడు చాపము
దాలిచి తాపసి మఖంబు తలగాచె నటన్! 
బేలల తిను నను కోలల,
లీలగ శత యోజనంబు లీడ్చెను జలధిన్!!

45. కం. తాపస రుధిరము త్రాగుచు
పాపమున చరించుచుంటి భయ రూపముతో! 
తాపసి నైతిని, రాముని
రూపము కన్నుల నిలువగ రోజు గడిపితిన్! 

46.  కం. చెట్టున, పుట్టన, నిలచిన
పట్టున కృష్ణాజినంపు వలువల జూతున్!
చట్టున లేతు, కలల చూ
పట్టగ రాముని ముఖమ్ము! వణకుచు రాజా!

47. అమ్ములు దాల్చిన రాముని,
'ర' మ్మొదట గల 'రథ'  'రత్న'  రాసుల నన్నిన్
'అమ్మో' యని వెరచెద! ఇట
ఇమ్ముని గణములను కూడి కిమ్మన కుంటిన్! 

48. కం. సోదరి చేసిన దురితము
ఆదమరచి ఖరుడు చేరె అంతకు నతిథై! 
నీదారదియే నౌగా! 
నాదుపలుకు వినక నీకు నరకమె మిగులున్!

49. కం. యమపాశము తల నాడగ
విముఖంబున నౌషధంబు విడుతురు రోగుల్!
సమవర్తిని చూడ మురియు 
కుమతియగు అసురుడు, ఎట్లు కోరును నీతుల్!

50. కం. చక్కగ చెప్పిన వినవుగ!
చిక్కుల మారియగు చెల్లి చేతిని బొమ్మై, 
దక్కరు దైత్యులు, నక్కకు
చిక్కిన గోక్రమము రీతి చేరిన నిన్నున్!

మారీచుడు మాయ లేడిగా వనమున తిరుగుట

51. కం.హరిణాక్షి నపహరించగ
హరిణంబుగ మారె తాను అసురుని ఆజ్ఞన్! 
దరి చేరక మారీచుని
అరిగ తెలిసి పరుగుదీసె హరిణములెల్లన్! 

లక్ష్మణుడు రాముని వారించుట

52. కం. అతిచతురుడు మారీచుడు
మతినెంచిన రూపు తాను మార్చేమార్చున్! 
అతిచిత్రము పసిడి మృగము! 
మతినెరిగి చరింపుమన్న మైథిలి కోర్కెన్!

53. కం. వగలొలికి మృగము నడువగ, 
ధగధగ మను మేని కాంతి ధరణిజ జేరెన్! 
మృగనయన నయన కాంతులు
మొగమున వెలిగి రఘురాము మోమున ఆగెన్! 

మారీచ వధ 

54. కం. మృగమైన, పట్టి తెత్తును!
మృగ భక్షకుడైన, జంపి, ఋషులను గాతున్!
మగువల కోరిక తీర్చుట
మగనికి నిజమగు జయమ్ము మహిలో ననుజా! 

55. కం. అటునిటు పరుగిడి రాముని
ఇటునటు పరుగిడగచేసి, నింగిని నేలన్
ఎటుచూచిన తానై జని
పటుతర మాయ దనుజుండు పరుగిడె వనమున్

56. కం. అలసిన రాముడు‌ పరుగును
నిలిపి విధాతను తలంచి నేకాగ్రతతో
నిలిపె శరము హృదయమ్మున 
నిలువున మారీచుడంత నేలను కూలెన్! 

57. కం. కాయము విడు మారీచుడు
'హా' యను యరుపులను బిల్చె అవనిజ ననుజున్!
‌ఏ యాపద బడెదరొ వా
రీయడవని రాముడేగె రేగిన మనసున్!!

సీత లక్ష్మణుని నిందుచుట

58. కం. పతియార్తనాద‌మును విని 
మతి నిల్కడ కోలుపోయి మైథిలి వగపున్! 
మితి గానని నిందల నిడి
హితవు నుడువు మరిదినెంచె  హీనచరితుగన్!!

లక్ష్మణుడు సీతకు జవాబు చెప్పుట

59. కం. దితిసుతులు కిన్నెర సురలు
జతగూడియు గెలువలేరు జానకినాథున్!
వెతచెందకు రఘుపతికై
గతిలేని యసురులమాయగ‌తెలియు మమ్మా!

60. కం.ఇంత కఠినవై పోతివి
సుంతైన తలపక నీవు పంతము తోడన్!!
ఆంతర్య మెరుగ నైతివి
చింతన లోనైన చెడును చేయను తల్లీ! 

యతివేషములో రావణుని ఆగమనము

61. కం. కుటిలుడు కైకసి సూనుడు,
జటిలునిగా వేష‌మూనె జానకి నొందన్!
చిటికెలొ వత్తుననె సఖుడు
ఎటులుండెనొ! యనుచు నేడ్చె ఎలనాగ యటన్!

62. ఎదుట నిలుచు సీతనుగని
మదము కనులనావరింప మైకము గొనుచున్! 
వదరెను వంచన వేషుడు
మది కాంతుని తలపు నిండు మైథిలి తోడన్! 

63. ఎవ్వరి దానవు కోమలి?
ఇవ్వనమున భీతి నొందకెటులుంటివొగా!
అవ్వల తినజూచు మృగము
లివ్వల పైబడగ దైత్యు లేగతి మనితో!! 


యతివేషములో నున్న రావణునికి సీత జవాబు

64.కం. జనకుని ఇంటను పుట్టితి
ఇన కులమును మెట్టితేను ఇన సము సతినై! 
కను విందుగ గడిపితి నట
కనుసన్నల యత్తలందు కలిగితి చెలిమిన్! 

65.కం. నా రాముడు సత్య వ్రతుడు
నీరజ నిర్మల విశాల నేత్రుడు, హితమున్
కోరు జగతి యెల్లరకున్! 
మీరడు ధర్మమెదురైన మృత్యువు తనకున్!

66. కం. పినతల్లి కోరెను రాముని
వనవాసము, తన కుమారు పాలన, వరమున్
తన తండ్రిమాట మీరని
ఇనకులు డౌననె తలొంచి ఇమ్మనుచాఙ్ఞన్

67. కం. కైకేయడిగిన  వరముల
భూకాంతుడు తలనువొగ్గి, పుత్రుని పంపెన్
కీకారణ్యము నుండగ,t
నా కాంతుని తోడు వచ్చెనతని యనుజుడున్!! 

రావణుని డంబములు

68. కం. సురలు నరులు దైత్యులు నె
వ్వరి చూచిన భీతిగొంచు వణకెదరొ ధరన్! 
నెరజాణల మది నేలెడు
సరసుడ, రావణుడ నేను! సారస నయనా! 

సారస - తామర

69. కం. నిను జూచిన తరి మరచితి
ధనమన ప్రాణంబు లిచ్చు తరుణల వేలన్
ఘనమగు లంకకు రాణిగ
ఒనగూర్చెద నేలునన్ను ఓ లలితాంగీ! 

సీత రావణుని వారించుట 

70. కం. మేరు సమానుడు రాముడు
పోరున సురపతినిమించు,  పోలును జలధిన్!
ధీరుడు వీరుడు శూరుడు!
ఈరేడు జగములు నిండు నెన్నగ గుణముల్!!

ఈరేడు జగములు - పదు నాలుగు లోకాలు
సురపతి - ఇంద్రుడు

71. కం. రాముడు నరసింహుడు, కన
గోమాయువు నీవు, సింహి కొలువు నిలతువో! 
కామాంధుడ వైతివి! కై 
నేమాడ్కి తాకెదు దినకరు నింగిని వేషా! 

రావణుడు తన గొప్పలు చెప్పుట

72. కం. ననుగని వణకు దిసపతులు
కొనచూపున వశము చేసి కొంటిని! వారల్,
మనసుకు ననువుగ నడతురు! 
ధనపతి పుష్పకము గొంటి తలచిన తడవున్!

73.కం. ధనుదుని యనుజుని నను, కా
దనకన్, నాతోడ రమ్ము తరళ సునయనా! 
కనకమయ లంక నుండిన,
మనువాడిన వాని మాట మరతువు లలనా! 


సీత జవాబు
74. కం. సురపతి సతిని హరించిన
ధర నిలువగ వచ్చు గాక తనువు నసువులన్! 
ధరసుత గొనిపో దలిచిన,
తరుణో పాయంబు లేదు ధారుణి నసురా! 


సీతా విలాపము

78. కం. ఫల మీయ దొడగు పాపము,
ఇల మీదట నీదు పుణ్యనిధి కరగి పోవన్! 
కుల సహితముగా కూలెదు
కలదు మరణము రఘురాము కరముల నసురా! 

సీత ప్రా ర్థన

75. కం. వన దేవత లార వినుడు,
దనుజుడు గొనిపోవు‌చుండె దాశరథి సతిన్!
కనులార కన్న దంతయు
ఇనుకుల తిలకున కెఱుంగ జేయరె దయతో !!

జటాయు త్యాగము

76. కం. దశరథ సఖుడు జటాయువు,
దశకంఠుని తోడ వేడె ధార్మిక మతియై! 
నిశథ చరుడు కామమునకు
వశుడై పావనిని పట్టె పంకిల మతియై!!  

77. కం. జగమల నేలురఘుసుతుని
సగమును గొనిపోవ జూడ చౌర్యపు వృత్తిన్! 
సెగ లెగయు రాముని కనుల
భగభగ మండెదవు నీవు, పగగొన నతడున్! 

78. కం. పంకజముఖి సీతను తన
అంకమునందొడిసిపట్టి అంబరమెగురన్! 
రంకెలు వేయుచు దైత్యుడు
సంకుల సమరమున కూల్చె సంపాత్యనుజున్!

79. కం. నిప్పును గప్పిన నివురుగ
కుప్పగ కూలెను జటాయు, కోమలి సీతన్
గొప్పును బట్టుచు నీడ్చుచు
తప్పొప్పులు తలపక నట దైత్యుడు చెలగెన్! 

సీతాపహరణం 

80. కం. పోరున రాముని గెల్వక
చోరుని వలె నతివ గొన్న శూరుడగుదువే!!
నా రాముని రామానుజు
నా రాచ శరముల నీకు నరకమె మిగులున్!

యుద్ధములో నా భర్తను గెలువలేక, దొంగలాగ ఆడదాన్ని తీసుకునిపోవడం శౌర్యలక్షణమెలా ఔతుంది?  నా రాముడు అతని తమ్ముడు వేసే ఇనుప బాణాలకు నీకు నరకము తథ్యము రావణా  


81. కం. కరి మేఘమున తళుక్కున
మెరసిన కాంతిగ, నవనిజ మెలికెలు తిరిగెన్
ఖరుడగు నసురుని కరముల,
మొర వినకనధముడు రేగె మోహాంధునిగన్!

నల్లని మేఘమువలె నున్న రాక్షసుని చేతుల‌మధ్య బంగారు నగలతో ఇంద్రనీలమణి లాగా మెరుస్తున్న సీత భయంకరమైన రాక్షసుని చేతుల మధ్య నలిగి మెలికెలు తిరుగుతూ విడిపించుకో వాలని ప్రయత్నిస్తున్నా అధముడైన రాక్షసుడు మోహముతో కనులు మూసుకున్న వాడై ఇంకా చెలరేగి పోయాడు

82. కం. పావని మేనును తాకిన
రావణుడగు హతమను చతురానను వాక్కున్
దేవతలొందిరి సుఖమున్
తావెరుగని సీత చూచి దుఃఖము కూడన్! 

చతురాననుడు - నాలుగు ముఖములు కలవాడు - బ్రహ్మ
తావు - దారి/దిక్కు

పరమ పావని సీత దేహాన్ని తాకడం అనే కార్యము కామం తో ఎప్పుడు రావణుడు చేశాడో అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ నోటి నుండి "కార్యము సిద్ధించినది" అని మాట వచ్చింది, ఆ మాట విన్న దేవతలకు సంతోషం కలిగింది, కాని రావణుని చేతిలో నలుగుతున్న సీతను చూచి వెంటనే దుఃఖము కూడా కలిగింది అని మహర్షి వ్రాస్తారు  

83. కం. రామా రామ యని అలసి
నెమ్మొగమును నేల వంక నిలుపు నతివ తో,
కొమ్మలు రెమ్మలు, అమ్మా!
మేమున్నామింకను భయమేల యనిరటన్!

84. కం. మంకున కైకసి నందను
డంకమున గొని యడుగిడెను లంకలొ సీతన్! 
చంకన యున్నది చావని,
శంకర గళ నిగళమే‌ యనెఱుంగక‌ నపుడున్ ! 

85. కం. చతురానను నాశీస్సుల
మితిమీరు వరబల గరువ మెంచిన వాడై
దితిసుతులను యేడొకరిని
హతమార్చుడు రామునియని యనిపె కుమతియై! 

86. కం. జలధిని మునిగెడు నావగ
జలమును నిండిన కనులతొ జానకి యుండెన్!
బలమగు రక్కసుల నడుమ
తలనుంచెను నేల వైపె ధరణిజ‌ నపుడున్!

87. కం. తన వారిని కోల్పోయిన, 
చిన జింకను గుమిని కూడి, చిత్రపు హింసల్,
ఒనరించెడు శున‌కాలుగ,
జనకసుతను చుట్టు ముట్టి జరిగిరి యసురుల్!   

88.  కం. శోకాకులయగు సీతను
భీకర రూపమునసురుడు ప్రీతిని గొనుచున్, 
మోకాల నిలిచి వేడెను
నాకాంతగ నేలు లంక నని మత్సరతన్

శోకమున మునిగిన సీతను, భీకరమైన దశగ్రీవుడు సీత‌ ఇక నాదే అన్న ధైర్యముతో రావణుడు ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నం చేస్తూ అంటాడు నా లంకకు రాణి గా వుంటే నీకు దాస్యమైనా చేస్తాను అని.

 89. కం. అడ్డెరుగని అసురపతికి
అడ్డముగా తృణము నుంచి నవనిజ పలికెన్
గడ్డికి సముడై, మదమున
గుడ్డిగ మారిన యసురుని, క్రోధము గొనుచున్!!

రాజ్య మదముతో  ఇష్టమొచ్చిన మాటలంటున్న రావణున్ని ఏమాత్రం భయము లేకుండా సీతమ్మ ఒక గడ్డి పరకను ముందుంచి క్రోధంతో జవాబు నిస్తుంది. 

90. కం. మదమున వాగెదవొంటరి
ముదితల యెడ మగతనంబె!  మొనగానివలెన్,
కదనంబున ఖర సైన్యము
నెదురెరుగక తెంచు వాని నెగ్గుట తరమా!!

ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళతో మదమెక్కి మాట్లాడటం మగతనమా? ఒక్కడు రాముడు పద్నాలుగు వేల ఖర సైన్యాన్ని ఒక ఘంట లో పరిమార్చాడు మగతనమంటే అది, అటువంటి వానితో నువ్వు యుద్ధంలో నెగ్గడం అసాధ్యమైన పని. 

91. కం. గోమాయువు కూతను విని
ఏమాయెనొ చెడుగ యనుచు, ఎదురౌ యనుజున్
రాముడు గనె కోపంబున,
నామైథిలి నెది బలి గొనెనాయని వగచెన్!

నక్క కూతను  విన్న రాముడు దుశ్శకునం గా భావించి ఏ చెడు వాటిల్లనున్నదో అని అలోచిస్తూ వేగంగా వెళ్తూ వున్నప్పుడు ఆయనకు తమ్ముడు ఎదురయ్యాడు. రాముడు ఆయన్ని చూచి చాల కోపం తెచ్చుకున్నాడు. నా సీత ఏ మాయ బలిగొన్నదో కదా అని చాల బాధపడ్డాడు.

92. కం. మనసున రగులగ క్రోధము
మనుజుడు కోల్పోవును కద మతినీ వసుధన్
తనపతి ఆపద భ్రమసిన
వనితను ఒంటిగ వనమున వదలుట మేలా!! 

ఎంత వారైనా కోపమ్ మనసును వశముచేసుకొన్నప్పుడు బుద్ధిని కోల్పోతారు కదా! అటువంటిది తానుకట్టుకున్న వాణ్ణి చూడలేని స్త్రీ కోపంలో అన్న మాటలు విని ఆమెని వదలి రావడం మంచిదా?

93. కం. సరగున పరుగిడు సరితను,
తరువును తామర నడిగెను ధరణిజ తావున్
తరుణీమణి జాడెరుగక
ఎరుపు కనుల కంటి నీరు ఏరై పొంగెన్! 

పర్ణశాల లో సీత కనబడక రాముడు,  అక్కడ వేగముగా పారే గోదావరిని, చెట్లను,  పూలను ‌వేడుకున్నాడు తన సీత జాడ  తెలుపమని
ఎక్కడా ‌‌సీత కనబడక‌  రాముని కన్నుల నీరు కూడా ఏరులా పొంగి‌ ప్రవహించింది.

94. కం. నిలునిలుమా కను గొంటిని
ఎలనాగ నినున్! అలిగెద వేలా నాపై, 
పిలచి పిలచి పోతినలసి
కలహమునకు కాదదనిది కమలదళాక్షీ

సీతను వెదుకుతున్న రామునికి చిత్త భ్రమ కలిగి ఆయన అంటున్నాడు,

" సీతా నిలు నిలు,  కనుక్కున్నాను నిన్ను, చాల సేపు పిలిచి అలసిపోయాను ఇంక నాతో కలహము మాని నా దగ్గరకు రావా"

మూలం. తిష్ఠ తిష్ఠ వరరోహే న తే అస్తి కరుణామయి|
               న అత్యర్థం హాస్య శీలా అసి కిమ్ మామ్ ఉపేక్షసే ||



95. కం. తరుల గిరుల పూల పొదల
కరి నడకన నది మలుపున కాంచును సీతన్
అరిసూదను డెటుజూచిన
ధరణిజ రూపమె కనబడె  ధారుణినంతన్  

అరిసూదనుడు - శత్రుసంహారకుడు 
ధారుణి - భూమి
ధరణిజ - భూమిలో నుండి పుట్టినది (సీత) 

మూ. ఇతి ఏవమ్ విలపన్  రామః  పరిధావన్  వనాత్ వనమ్| 
          క్వచిత్ ఉద్భ్రమతే వేగాత్ క్వచిత్ విభ్రమతే  బలాత్  ||
          క్వచిత్ మత్త  ఇవ ఆభాతి కాంతా అన్వేషణ తత్పరః 



96. కం. ఎందని వెదకుదు, సీతను
పొందక నెటుల వెనుదిరిగి నందర జూతున్? 
అందిచ్చితి నాదు సుతను
ఎందున్నదనిన జనకున కేమిత్తు బదుల్? 

లక్ష్మణా సీతను ఎక్కడని వెదకేది? సీత లేకుండా అయోధ్యకి తిరిగి ఎట్లా అందరిని చూడ గలను? నా కూతురి చేతిని నీచేతిలో పెట్టి పంపించాను కదా ఎక్కడ ఉంది ఎలా ఉంది అన్న జనకునకు ఏమి సమాధానమిచ్చేది? 

మూ. నివృత్త వన వాసః చ జనకమ్ మిథిలాధిపమ్|
కుశలమ్ పరిపృచ్ఛన్తమ్ కథమ్ శక్షే నిరీక్షితుమ్||  3-62-12

లక్ష్మణ బోధ 

97. కం. ఊరట నుచెందు మన్నా
చేరి నిలుచు సీత కలత చెందకు మనకీ
క్రూర మృగమ్ములు, మోరల
దారి తెలుప దొడగ నీవు తాలిమి గొనుమా! 

మోర - ముఖము క్రింది భాగము
తాలిమి - ధైర్యము

అన్నా! ఊరటను పొందుము, సీత మరల నీపక్కన నిలిచి చూడగలను నేను, కలత చెందకు. చూడు నువ్వు ఈ నోరులేని మృగాలను సీత ఎక్కడ వుంది అని అడగ్గానే దక్షిణం వైపు మోరలను ఎత్తి చూపిస్తున్నాయి మనము అటువైపు వెళ్ళుదము, ధైర్యము పొందుమన్నా! 

మూ. క్వ సీత ఇతి పృష్టా యథా ఇమే సహసా ఉథితాః||  3-64-21
         దర్శయన్తి క్షితిమ్ చైవ దక్షిణమ్ చ దిశమ్ మృగాః| 

         సధ్యు గచ్ఛావహే దేవ దిశమ్ ఏతామ్ చ నైఋ్రతీమ్|| 3-64-22
         యది తస్య ఆగమః కశ్చిత్ ఆర్యా వా సా అథ లక్ష్యతే |

98. కం. దిక్కుల నొక్కటి చేసెద
చుక్కల ద్రుంచెద నమరులు సుఖమును మరువన్
ముక్కలు‌ చేసెద దివి నిక
దక్కవు లోకములు రామ ధాటికి యనుజా! 

రాముని ధర్మ నిష్ఠను, మంచితనాన్ని ఈ దేవతలు, ప్రకృతి, నదీ పర్వతాలు అలుసుగా తీసుకుని నేను సీత ఎక్కడ వున్నదీ అని అడిగినపుడు సమధానం ఇవ్వడమ్ లేదు. ఇప్పుడే నా కోదండ శరములతో దిక్కులను కలిపేస్తాను, దేవతలు ఇక సుఖంగా వుండలేరు నా శర ధాటికి లోకాలు దక్కవు లక్ష్మణా!!

99. కం. భరియింపగ లేదన్నా
ధరనీ క్రోధమ్మును,  విడు దారుణ కరణిన్, 
పొరపాటొక్కని దైనన్, 
చెరిపేతువ నఖిల జగము చింత రగులగన్! 

అన్నా! శాంతించు నీ క్రోధాన్ని ఈ భూమి భరించలేదు. ఈ దారుణ గతిని. 
తప్పు చేసింది ఒక్కడే  కదా కాని దాని కారణం గా మొత్రం ప్రపంచాన్ని నాశనం చేయడమ్ సమంజసమా!! 

100. కం. అలయక గగనమున తిరుగు
కలువచెలుని కప్పును గద గ్రహణము నభమున్
అలుగున మనపై ధారుణి
చెలగిన కలుషాత్ములెంత! శివ శాసనమున్! 


అన్నా, చంద్రునికి గ్రహణము తప్పదు,  అయినా అలసిపోక తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆకాశంలో తిరుగుతూనే ఉంటాడు కదా..పాపాత్ములు ఎంత కష్టపెట్టినా భూమాత తన ధర్మాన్ని పాటిస్తూనే ఉంటుంది మనపై అలిగి తిరక్కుండా ఊరుకోదు కదా! ఇది‌ ఈశ్వర శాసనము.

101. కం. ధీమంతుడు సౌశీల్యుడు
తమ్ముడు పలికిన హితవుకు, ధర్మ నిరతుడై, 
సమ్మతిగా, మాటల సా
రమ్మునెరుగు రాముడరిగె రమణిని వెదుకన్ 

బుద్ధిమంతుడు, సౌశీల్యత, కలిగిన తమ్ముడు, లక్ష్మణుని  హితవైన మాటలను విని,
ఇతరులు పలికే మాటల్లోని సారాన్ని గ్రహించగలిగే ధర్మమూర్తి రాముడు సీతను వెదకడానికి బయలుదేరాడు. 

జటాయు  మృతి  చెందుట 

102. కం. తనువును కప్పగ రుధిరము
కొనయూపిరి ధర తలమున కూలు జటాయున్
తన జనకునిగా నెంచిన
ఇనకులమణి యనుజు గూడి నేడ్చె నతనికై

రక్తము తో తడిసిన శరీరముతో, కొన ఊపిరితో  నేలపైన  కూలి (చనిపోతూన్న/పడిపోయిన)  యున్న తమతండ్రి మితృడగు జటాయు‌ని చూచి ఎంతో బాధ పడి కన్నీళ్ళు పెట్టుకున్నారు రామ లక్ష్మణులు.

103. కం. సతి జాడను యెరిగించిన 
పతగేశ్వరుడట విడిచెను ప్రాణము లైదున్
పితృ కార్యము చేయ దలిచె
సుత సమునిగ రాముడపుడు సోదరు తోడన్ 

సీత జాడను కొంత తెలిపి పతగేశ్వరుడు (పక్షులకు రాజు) తన ఐదు ప్రాణాలను అక్కడ విడిచాడు. జటాయును తన తండ్రిలాగ తలచిన రాముడు, అతనికి పితృకార్యము (శ్రాద్ధ కర్మ) నిర్వర్తించడానికి తమ్మునితో ఉద్యుక్తుడైనాడు.

అయోముఖి 

104. కం. బారెడు పొట్టను కలిగియు
కారడవిని యరగు వారి కలబడి తిను యా
ఘోర యసురి ముకు చెవులను
వేరుగ చేసెను ఘనుండు వీరుని రీతిన్! 

అయోముఖి (ఇనుప ముఖము లేక క్రూరమైన స్వభావము గలది) అనే రాక్షసి, అడవిలో నడచి వెళ్ళే వాళ్ళని భయకంపితులను చేసి భక్షిస్తూ బ్రతుకుతుంది.  ఆ ఘోరమైన రాక్షసి లక్ష్మణుని చూచి మోహము తో తనతో రమించమని కోరగా క్రోధముతో రామానుజుడు ఆమె ముకు చెవులని కోసి కురూపిని చేశాడు.

కబంధుడు 

105. కం. పచ్చని పక్ష్మము లెఱ్ఱగ 
విచ్చిన కన్నొకటి పొట్ట వింతను గొలుపన్
ఎచ్చట చూడని రూపము
నచ్చరమున గనిరి దశరథాత్మజులచటన్

రామలక్ష్మణులు అయోముఖి సంహారం పూర్తి ఐన పిదప, ఒక భయంకరమైన ధ్వనిని విన్నారు. ఒక వింత ఆకారము, పొట్టపైన పెద్దగా ఒక్క ఎర్రని కన్ను దానిపైన పచ్చని వెంట్రుకలు కలిగి వున్నది. ఇంతకు ముందు అటువంటి ఆకారము చూడకపోవటం వల్ల ఆశ్చర్యంగా చూచారు వారిద్దరు. 

పక్ష్మములు - కను వెంట్రుకలు

106. కం. దేవుడు ఇచ్చిన రూపము
కావరమున కాదని కడు గర్వము నుండన్! 
దేవేంద్రుని ఘాతంబున
ఈ వనము‌న వేచియుంటి నీకై రామా! 

రామా, ఒకప్పుడు నేను సూర్య చంద్ర ఇంద్రులంత రాజసంగా ప్రకాశవంతంగా రూపమున్న వాడిని. దనువు కుమారుణ్ణి.  కానీ దేవుడిచ్చిన సుందర రూపాన్ని కాదని భయంకరమైన ఆకారాలను   ధరించి అందరిని భయపెట్టే వాణ్ణి. ఆ క్రమం లో స్థూలశిరుడనే మహర్షిని భయపెట్టినప్పుడు ఆతని శాపానికి గురియై వికృత రూపాన్ని పొందాను. ఆ తర్వాత బ్రహ్మ గురించి తపస్సు చేసి దీర్ఘాయువుగా వరాన్ని పొందాను. ఆ గర్వంతో ఇంద్రుణి పై యుద్ధానికి వెళ్ళాను అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో నా కంఠాన్ని కాళ్లను నా పొట్టలోకి కుదించాడు. అప్పటినుండి ఎక్కడికి కదలలేక దీర్ఘమైన బాహువులతో దొరికిన దాన్ని తింటూ మీ రాక కై ఎదురు చూస్తున్నాను. 

107. కం. వీరులకు కానికాలము,
నేరక కలిగిన నిలబడు నేస్తము వెంటన్!
సూర్య సుతుడు సుగ్రీవుని
చేరిన చేకూరు మేలు సీతను వెదుకన్!

కానికాలము - మంచి కాలము కానిది/ చెడు కాలము

రామా! మీరిద్దరు వీరులు కాని దురదృష్టవశాత్తు మీ దశ బాగుగా లేదు ఇప్పుడు. మీకిప్పుడు వెంట నిలబడే మితృడు కావాలి. సూర్య పుత్రుడు సుగ్రీవుడనే వానర వీరుడు సత్యవంతుండు సరియైన మితృనిగా మీకు సీతను వెదకడంలో సాయ పడగలడు.

మూ. తత్ అవశ్యం త్వయా కార్యః స సుహృత్ సుహృదామ్ వర|
అకృత్వా న హి తే సిద్ధిమ్ అహమ్ పశ్యామి చింతయన్|| 3-72-10

మూ. శ్రూయతామ్ రామ వక్ష్యామి సుగ్రీవో నామ వానరః |
భ్రాత్రా నిరస్తః క్రుద్ధేన వాలినా శక్ర సూనునా || 3-72-11

108. కం. పరదేశము నరుగు సుతుని
అరసికొనెడి తండ్రి జూపు నాప్యాయతతో
గురుతుల దెలిపె కబంధుడు, 
అరిజేతల మార్గసుఖమునాశించి మదిన్

అరసికొను - వివరాలను తెలిసుకొను
అరిజేతలు - శత్రువులను జయించగలవారు

పరాయి దేశానికి మొదటి సారి వెళ్తున్న కొడుకు ఎంత సమర్థుడైన వీరుడైనప్పటికీ,  కన్నతండ్రి ఎన్నో జాగ్రత్తలు చెప్తాడు.  మార్గంలో కలిగే కష్టాలను ఎట్లా ఎదుర్కోవాలి, ఏది ఎక్కడ దొరుకుతుంది అని. అదే విధంగా కబంధుడు వీరులైన రామలక్ష్మణులకు ఇద్దరికి ఋష్యమూకపర్వతానికి దారి సుగమం కావడానికి కావలసిన జాగ్రత్తలు ప్రేమతో చెప్పి పంపించాడు. 


109. కం. అతి సుందర మఘ దూరము,
పతితులు కాలూనలేని పర్వత మందున్
అతిబల వంతులు నలుగురు
హితులై యుందురు నిరతము ఇనసుతు వెంటన్

ఋష్యమూక పర్వతము అతి సుందరము, పవిత్రమైన పర్వత రాజము. అది అఘ దూరము - పాపము లేనిది, పతితులు - పాపము చేసే వాళ్ళు దానిపై కాలు పెట్టలేరు. అక్కడ చాల బలము కలిగిన నలుగురు వానరులు, ఇనసుతుడు - సూర్యుని కుమారుడు, సుగ్రీవునితో కలిసి అక్కడ వుంటారు.

శబరి మాత

110. కం. కన్నులు కాయలు గాచెను
ఇన్ని దినమ్ములుగ వేచి నీకై రామా!
నిన్ను గనగ పండెను నీ
కన్నుబడగ నాదు బ్రతుకు కరుణా సారా!

రామా! నీ కొరకే ఇన్ని ఏళ్ళుగా తపస్సు చేస్తూ ఈ ఆశ్రమంలో వేచియున్నాను. నీ కంటి చూపు నాపై బడగానే నా జన్మ చరితార్థమైనది. ఇంక నేను నా గురుదేవుల సన్నిధికి సంతోషంగా వెళ్ళగలను.

111. కం. ఎల్ల వనములందు వెదకి
పుల్లగ లేనివి, ఫలములు పొందుపరచితిన్
మెల్లగ తిను రామా! నీ
యుల్లమునకు హాయినిచ్చు యూరట గొనుమా!

తీయని పండ్లను అన్ని వనములలో వెదకి తెచ్చి, నీ రాకకై రోజూ ఎదురు చూస్తూ ఉన్నాను, మెల్లగా అన్నీ తిను స్వామీ! నీ హృదయానికి కొంత శాంతి దొరుకుతుంది.

112. కం. గురుదేవుని పాదమ్ముల
నిరతము మదినుంచు శబరి నిలకడ గొనుచున్
కరుణా నిలయుని రాముని
పరివిధముల సేవ చేసి బడసెను సుగతిన్!

తన గురుదేవుడైన, మతంగ మునిని ఎల్లప్పుడు మనసులో ధ్యానించు వృద్ధురాలైన శబరి మాత నిలకడ ను పొంది రామునికి వివిధ రకములైన పండ్లను పూలను, ఉదకములను, తెచ్చి సేవ చేసి కృతార్థురాలై మంచి గతిని పొంది గురుదేవుని సన్నిధికి చేరి పోయింది.

113. కం. ఏడు జలధులందు జలము
కూడినొకటిగా మలచిన గుండము నందున్,
వీడెను దుఃఖము రాముడు
చూడగ తోచెనిరువురికి శుభశకునములున్!!

శబరి ఉత్తమ గతిని పొందడం చూచి‌న రామలక్ష్మణులు ఆమె చూపెట్టిన సప్తసముద్రాల జలములందు స్నానము చేయగానే రామునికి చాల ఆనందం కలిగింది అశుభాలు తీరి మంచి కాలము తొందరలోనే రాగలదని వారికి తోచింది. 

మూ. ప్రణష్టమ్ అశుభం యత్ నః కల్యాణమ్ సముపస్థితమ్|
తేన తు ఏతత్ ప్రహృష్టమ్ మే మనో లక్ష్మణ సంప్రతి||

114. కం. ఇనసుతుని చూడ దలచిన
ఇనకులమణి వేగ నడిచె నెద సతి కొలువై
వెను వెనుకనె సౌమిత్రియు
కనుసన్నగ మెలగి సాగె కాంతికి ఛాయై!

రాముడు సుగ్రీవుణ్ణి కలుసుకోవాలని వేగంగా పంపా నది వైపు నడిచాడు. ఆయన వెనకాలే లక్ష్మణుడు కూడా కాంతిని నీడ అనుసరించినట్టు అనుగమించాడు. 

మూ. తత్ ఆగచ్ఛ గమిష్యావః పంపామ్ తామ్ ప్రియదర్శనామ్||
         ఋష్యమూకో గిరిః యత్ర న అతి దూరే ప్రకాశతే| ౩-౮౪-౬
        
        యస్మిన్ వసతి ధర్మాత్మా సుగ్రీవో అంశుమతః సుతః||

        నిత్య వాలి భయాత్ త్రస్తః చతుర్భిః సహ వానరైః |

కం. మునిమయమరణ్య కాండము
వినిమయమౌ కర్మ ఫలము విన పుణ్యముగన్
కనికల్లయు నిజము దెలుపు
ఘనమౌ రాముని పయనము, కరుగు మనసులున్!


అరణ్యకాండం వింటే చేసిన కర్మ పుణ్యంగా వినిమయం (exchange) ఔతుంది, సత్యం యొక్క బలము అసత్యం వల్ల ఆపద తెలుస్తుంది..అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఘట్టం లో  సీతా వియోగంలో రాముని ప్రయాణం చూచి కరగని మనసు వుండదు..