కిష్కిన్ధాకాండము




1. కం. పూవుల గుత్తులు చల్లిన
తావి నడుమ గాలిదేవు దాగుడు మూతల్
ఈవేళ కారు మేఘము
లీవనమున కురిసె పూల, నేలనొ చూడన్!

సుగ్రీవుని వెదకుచూ పంపా నది తీరములో నున్న వనంలోకి రామలక్ష్మణులిద్దరూ ప్రవేశించారు. అక్కడ వున్నా వివిధరకములైన చెట్లను పూవులను చూచి రామచంద్రుడు చాలా సంతోషించాడు. 

క్ష్మణా, చూడు ఈ పూవులు ఎంత అందంగా ఉన్నాయో వాయుదేవుడు ఈ పూవులతో దాగుడుమూతలు ఆడుకుంటున్నాడా అనిపిస్తుంది. ఈ మేఘములు ఇక్కడ పూవులా వర్షాన్ని కురుపించాయా అన్నట్టుగా నేలపైన ఇన్ని పూవులు పరచి వున్నాయి.

2. కం. ఎలకోయిల కల గానము
గలగలమని గాలి వేయు కరతాళములున్
చెలి వలపును తలపింపగ
విలపించెను రాముడచట వేరై సీతన్

లక్ష్మణా, ఆ కోకిలను చూస్తే ఆ కలగానానికి వీస్తున్న గాలి  తాళం వేస్తున్నట్టుగా అనిపిస్తున్నది అని రాముడు అన్నాడు. 
ఇవన్నీ మనసుకు హాయిని కలిగించినా సీతలేని కారణంగా రాముడు చాలా దుఃఖించాడు. 

3. కం. మలయ పవన మపుడు వెతను
కలిగించెను, నెమలియాట కలతను పెంచెన్!
అలివేణిని విడి రాముడు
వెలుగు విడిన దివ్వె వోలె వెలవెల బోయెన్!

రామునికి, ఒకప్పుడు ఎంతో హాయిని కలిగించిన ఈ మలయ పవనము ఇప్పుడుచాల బాధ పెడుతున్నది, నెమలి ఆట చూస్తుంటే సీత గుర్తుకువచ్చి ఇంకా బాధ కలుగుతున్నది . దీపమునుండి వెలుగు విడిపోతే ఎలా కాంతివిహీనమైపోతుందో అట్లా రాముడు సీత లేకుండా కనబడ్డాడు. 


4. కం. కలతను విడు రామా యే
నెలవున దాగిన యసురుని నీ ముందుంతున్
విలపించిన ఫలమేమీ?
కలుగు శుభమునుత్సహించి కదిలిన నీకున్!

సీతా వియోగంలో బాధ పడుతున్న రాముణ్ణి చూచి లక్ష్మణుడు అన్నాడు, రామా! ఆ రావణుడు ముల్లోకాలలో ఎక్కడ వున్నా వెదకి పట్టి నీ ముందు ఉంచుతాను. ఇట్లా బాధ పడితే సీత దొరకదు కదా. ఉత్సాహము అన్ని  కారణం కనుక మనము బయలుదేరి సుగ్రీవుణ్ణి వెదుకుదాము కదలు.  

5. కం. విల్లును దాల్చిన వీరుల
నల్లన గని సూర్య సుతుడు హడలి పరుగిడెన్
ఉల్లమునందన్న కదల
ఝల్లుమనెను దేహమపుడు శక్రజనుజుకున్

విల్లును చేతిలో వున్న రఘువీరులనిద్దరినీ దూరం నుంచి చూచిన సూర్య సుతుడైన సుగ్రీవుడు హడలి పోయి తన తోటి కపివీరుల వద్దకు పరుగుతీశాడు. వారిద్దరూ వాలి పంపించిన వాళ్ళని మనసులో అలోచన రాగానే ఆయన శరీరము కంపించి పొయింది. 

శక్రజనుజుడు - ఇంద్రుని కుమారుడైన వాలి తమ్ముడు - సుగ్రీవుడు  


6. కం. హనుమంతుడు వాక్కోవిదు
డిననందను జూచి నూరడిల్లమ నడిగెన్
కనుల బడనివాలికి ఈ
వనమందున భీతిగొనుట వలదని నుడివెన్!

వాగ్విశారదుడైన హనమంతుడు సుగ్రీవుని మత్రులలో శ్రేశ్ఠుడు, భయపడిపోయిన సుగ్రీవుని ఊరడించి ఆయనతో కనబడని వాలి గురించి ప్రత్యేకంగా ఐ వనములోనికి వాలి రాలేడు కాబట్టి భయపడటం అనవసరం అని చెప్పాడు.  


7. కం. అపర అమరులీ నిరువురి
కపివీరుడు వాలి పంపె కదనంబునకో!
తపసిగ రూపము దాలిచి
నెపమేమియొ వారి మతిని నేర్వుము హనుమా!

దేవతా స్వరూపలై నడచి వస్తున్న రామలక్ష్మణులను కపివీరుడైన నా అన్న వాలియే యుద్ధానికి పంపి యుంటాడు. నీవు తాపసి రూపం లో వెళ్ళి వారు ఇక్కడకు రావడానికి గల ఆంతర్యమేమో కనుక్కొని రా అని సుగ్రీవుడు హనుమంతునితో పలికాడు. 


8. కం. పరికించగ రాజర్షులు
కరినడకయు వృషభ మూపు ఘనబాహువులున్!
అరుదెంచిన పని యేమని
హరివీరుడు హనుమ యడిగె హరిహర సములన్!

హనుమంతుడు మాటలయందు నేర్పరి శివ కేశవుల్లాగా ఉన్న రామలక్ష్మణులతో మాట్లాడుతూ,  ఆర్యులారా మీరు చూడ్డానికి రాజర్షుల్లాగా కనబడుతున్నారు, మీ నడక చూస్తుంటే ఏనుగు నడకా లాగ వుంది, ఎద్దు లాంటి మూపు, సింహం లాంటీ ముఖమును కలిగి యున్నారు ఇక్కడికి వచ్చిన పనియేమి? అని అంజలి ఘటించి అడిగాడు.


9. వీనులకింపగు భాషను
మానమెరిగి పలికెనితడు మనముప్పొంగన్
జ్ఞాన సరస్వతియగు ఈ
వానరుని స్నేహమౌ నవశ్యము మనకున్.

లక్ష్మణా, ఈయన మాట్లాడే భాష చెవులకు చాల ఆనందంగా వినబడుతున్నది. ఈయన భాషలోని పదాలు ఒక్జ అపశబ్దంలేకుండా ఎక్కడ ఏ పదం వాడాలో అక్కడ ఆ పదం వాడబడి ఉన్నవి (మానం -  కొలత, ప్రమాణము) చూస్తే మంచి జ్ఞానము కలిగిన వ్యాకరణ పండితునిలాగ వున్న ఇతనితో మనకు స్నేహము తప్పక చేయవలెనని తెలుస్తున్నది.

10. కం. సుమతియగు నీతని పలుకు
సమతుల్యముగ మెలగు, విని సఖుడౌ శతృవున్
అమరి వ్యాకరణమ్మున
అమలమ్మగు వాక్కు వేదమాయెను వినగన్.

లక్ష్మణా మంచి పండితునిలాగా మాట్లాడే ఇతని వాక్కు, ఎక్కువ లేకుండా తక్కువ కాకుండా వుంది. ఇటువంటి వాని మాట వింటే కత్తి దూసిన శతృవు కూడా మితృనిగా మారిపోతాడు కదా! ఈతని మాటల రమణియత గాంభీర్యము ఎవరికైనా సులువుగా విజయాలను తెచ్చిపెడుతుంది కదా!! 

11. సుగుణాభిరాముడీతడు
పగనెరుగని దశరథునికి వరమున బుట్టెన్
సుగతులను తండ్రికి దలచి
సగమగు సతి తోడు రాగ సాగెనడవికిన్.


12. చక్కని సీత సుజాతను
రెక్కల గొనె వనమునందు రిపుడు రథమునన్
దిక్కుల కెగిరిన యాతడు
ఎక్కడ దాచెనొ యెరుగము ఇలలో ఆమెన్

13. కం. అరిజేతగు రఘురాముడు
శరణమ్మునుకోరెనేడు శాఖాచరులన్!
సిరులిచ్చిన సీతాపతి
వరమీయగ నడిగె నిపుడు వానర రాజున్!!

శత్రువులను జయించగల శ్రీ రామచంద్రుడు నేడు చెట్లపైన నివసించే వానరులను శరణు కోరినాడు. పూర్వము ధనరాశులను జనులకు ఇచ్చిన రాముడు నేడు వానర రాజైన సుగ్రీవుని కోరుతున్నాడు.

14. కం. అతినేర్పరి హనుమంతుడు
హుతవాహుని పూజ చేసె ఉభయుల నడుమన్
హితవును విని సూర్యసుతుడు
వెత లిద్దరివి ఒకటి యని  ప్రేమతొ పలికెన్

హుతవాహుడు - అగ్ని(దేవతలకు యజ్ఞ హుతమును మోసుకొని వెళ్ళేవాడు)

నేర్పరి, కార్యసాధకుడు అయిన హనుమంతుని మంచి మాటలను విని సూర్య నందనుడైన సుగ్రీవుడు సూర్యవంశానికి మణివంటి రాముని కి మితృడై అగ్ని సాక్షిగా ఇక రాముని కష్టాలు తనవని పలికాడు.


15. కం. నలుగురిలో నగుబాటుగ
తొలగించెను పదవి‌నుంచి, త్రోసెను యిటకున్!
కలుషిత హృదయుండై నా
పొలతిని చెరబట్టె వాలి భూజా నాథా!!


భూదేవి పుత్రికయైన సీత‌ కు ఇష్టమైన రామా, నా‌ అన్న నన్ను‌ నలుగురిలో అవమానించి రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. చెడ్డ మనసు గల అతడు నా భార్యను కూడా చెరబట్టాడు. 

16. కం. శరములు యివి పదునైనవి
సురరాజ సుతు వధియింతు సురలెదురైనన్
నెరనమ్మిన చెలికానివి
నెరవేర్చెద గొను వచనము నిదె సుగ్రీవా!

సుగ్రీవా! నీవు నాకు అగ్నిసాక్షిగా మితృడవైనావు నన్ను నమ్మిన నీకు తప్పక సహాయం చేయగలను. ఇదిగో చూడు నా దగ్గర మున్న బాణాలు చాల పదునైనవి, వీటితో ఇంద్రుని కుమారుడైన ఆ వాలిని ఎవ్వరెదురైనా వధించి తీరుతాను. ఇదే నీకు నా‌ వచనము.


17. కం. అసురుడు రథమున నెగురగ
వసుభూషల విడిచె వనిత, పరికిం పంగన్!
వసుధ సుతగ దోచునిపుడు
గసువున బడె నీ‌ నగలను గాంచుము రామా!

రామా నాతోటి వానరులతో పూర్వమొకనాడు వనములో వుండగా ఆకాశమార్గములో ఒక రాక్షసుడు ఒక స్త్రీ ని అపహరించి తీసుకొని వెళ్ళాడు, అప్పుడామె తన (వసుభూషలు) బంగారు ఆభరణాలను మూటగా కసువు (గడ్డి) పైన విడిచింది.  నాకు ఆమె వసుధ సుత (భూమాత పుత్రిక) అని ఇప్పుడు తెలిస్తున్నది. ఆ నగలు ఇవే చూడుము రామా! 


18. కం. కన్నీరుజారి రాముని
వన్నియ మోమును తడిపెను, వలవల  నేడ్వన్!
ఎన్ని తడవలైనన్ తన
కన్నుల కనలేని నగలు కలచెను మనసున్!


సీత ఆభరణాలను చేతులోకి తీసుకోనగానే కన్నుల్లోని నీరు పొంగి   రాముని శోభాయుతమైన ముఖమును కప్పి వేసింది, ఎంత ప్రయత్నించినా గానీ ఆ నగలను కన్నీటి చేత పోల్చుకోలేక పోయాడు స్వామి.


19. కం. గిరుల తిరుగు వానరుడను
పరివేదన నోర్చుకుంటి! ప్రభుడవు తగునా!
పరితాపము విడి నీవిక
కరణీయము గాంచు రామ!  కన్నీరేలా!

రామా!  నాక్కూడా భార్యవలన చాల బాధ కలిగింది. వానరుడనైన నేనే ఈ బాధను భరిస్తున్నా కదా, మహరాజువు, అన్నీ తెలిసిన వాడవు నీవు శోకాన్ని సహించాలని వేరే చెప్పాలా? ఇప్పుడు కరణీయము (చేయదగిన పని) ఏదో ఆలోచించు. దుఃఖాన్ని దిగమింగు. 


మూ. నాహం తామనుశోచామి ప్రాకృతో వానరోపిసన్
         మహాత్మా చ వినీతశ్చ కిమ్ పుంర్ధ్రతిమాన్ భవాన్.

20. కం. దిక్కుల నెక్కడ దాచిన
దక్కగ జేతు నవనిజను, దాల్చితి ప్రతినన్
చిక్కిన దైత్యుని కులముతొ
ఉక్కడచగ నూతనిత్తు నుర్వీ నాథా!

సీతను రావణుడు దిక్కుల్లో ఎక్కడ దాచి ఉంచినా సరే నీకు దక్కేట్టు నీముందర ప్రతిజ్ఞ దాలుస్తున్నాను. రావణుడు నీకు దొరికేట్టు చేస్తాను. వాని సపరివారంగా నాశనం (ఉక్కడచు) చేసేందుకు నేను తప్పక సాయం  చేస్తాను. నీవు ఈ ఉర్వి (భూమి) కి నాథుని వంటివాడవు కదా! 

మూ. సత్యం తు ప్రతిజానామి త్యజ శోకమరిందమ

         కరిష్యామి తథా యత్నం యథా ప్రాప్స్యసి మైథిలీ.

21. కం. ఏలికగా కిష్కింధకు
వాలిని చేసిన నతండు, బలగర్వమునన్
నాలుగు చెరగుల తిరుగుచు
ఆలమునకు కాలుదువ్వె నందరి తోడన్!


నా అన్న వాలిన, మా తండ్రి గతించిన తరువాత, కిష్కింధకు రాజును చేశారు అతను మహా బలసంపన్నుడు ఆ బల గర్వముతో ఎప్పుడు అన్నిచోట్లా తిరుగుతూ వేరొకరితో  యుద్ధము (ఆలము) చేయడానికి ఉత్సాహము చూపేవాడు.


22. కం. మయసుతుడగు మాయావితొ
భయరహితుడు వాలి జేసె బలయుద్ధము ని
మ్మెయి గడచె వత్సరము సం
శయమున మరలితి పురముకు సంతాపముతో

మయసుతుడైన మాయావిని వెంబడిస్తూ వెళ్ళిన వాలి ఒక గుహలోనికి ప్రవేశించాడు. ఈ విధంగా (ఇమ్మెయి) ఒక సవత్సరం గడిచి పోయింది. ‌వాలి మరణించాడనే సంశయముతో దుఃఖించి మరలి కిష్కింధకు వచ్చేశాను.  


23. కం. గడచెను ఏడులు రాజుగ,
బడబాగ్నిగ తిరిగి వచ్చె భ్రాత పురముకున్
ఒడలెరుగని క్రోధమ్మున
నడవికి త్రోసె నను వాలి అందరు చూడన్!


చాలా కాలం రాజుగా ఉన్నాను నేను. ఒక రోజు వాలి తిరిగి వచ్చాడు అగ్ని లాగా మండుతూ ఉన్న అతడు చాల క్రోధంతో నన్ను రాజ్యాన్నుంచి తరిమి వేశాడు.


24.కం. నలుకడలుల నొక అంగలొ
అలుపెరుగక దుమికి,  వాలి అర్ఘ్యము నీయున్
బలమగు పర్వత శిఖర
మ్ముల తృటి లోన విరుచు పరమోత్సాహమునన్


రామా! నాలుగు సముద్రాలను ఒక అంగలో అలుపు లేక వాలి అర్ఘ్యము నీయగల వేగము గలవాడు. పెద్ద పెద్ద పర్వత శ్రేణులను ఒక్క దెబ్బలో విరవగల బలమున్న వాడు.



25. కం. మందమతియు మదపూర్ణుడు
దుందుభి కలబడు కలహము దొరగొని యెపుడున్
పొందును‌ ముదమును పోరున
కందుకముగ దోచును నగ శిఖరముల చూడన్! 


దుందుభి అనే రాక్షసుడు మదముతో తన బలమును ప్రదర్శించడానికి అందరితో కలహాన్ని తెచ్చుకుంటాడు. పర్వత శిఖరాలు బంతుల్లాగా కనబడతాయి అతనికి.

26. కం. పట్టును బట్టిన యసురుని
మట్టిగరిపి వాలిచెలగె మారకు రీతిన్
చుట్టగ జుట్టి మతంగుని
పట్టున పడవేసె వాని బలగర్వమునన్ 

యుద్ధము చేయాలనే పట్టు బట్టిన దుందుభిని వాలి యమునిలాగా చెలగి ఒక్క పోటులో సంహరించి చుట్ట లాగా చుట్టి వాని శరీరాన్ని మతంగ మహర్షి (పట్టు - చోటు) ఉన్న ఆశ్రమం దగ్గర పడవేశాడు.



కం. ఎరుగుదు నే వాలిబలము
సరి గెరుగను నీదు శక్తి సామర్థ్యములన్
శరమున ఈ సాలవృక్షము
నరికిన వాలి సమయునని నమ్మెద రామా!  

రామా, దుందుభి, మాయావి వంటి భీకర రాక్షసులను సంహరించిన  వాలి బలమేమో నాకు పూర్తిగా తెలుసు. కానీ నీ బలము నేను కళ్ళారా చూడలేదు. ఒకవేళ నీవు ఈ సాల వృక్షాన్ని ఒకే బాణం తో కూల్చ గలిగితే అప్పుడు నాకు కొంత నమ్మకం కలుతుంది.



27. కం. వేడిన వానరు కోరిక
నేడు తరులు నొక్క కోల నేలకు నొరగన్
చూడగ ఛేదించి నగము
వాడి శరము తూణిజేరె వడివడి రామున్! 

కోల - బాణము
తూణి - తూణీరము


సాల వృక్షాన్ని బాణం‌తో కూల్చమని అడిగిన సుగ్రీవుని కోరికకు రాముడు తన కోదండాన్ని సారించి బాణం వేయగా అది అక్కడ వరుసగా ఉన్న ఏడు సాల వృక్షాలను కూల్చడమే కాకుండా వాటి అవతల వున్న పర్వతాన్ని చేదించి భూమిలో గుచ్చుకొని తిరిగి రాముని అక్షయ తూణీరం లోకి వచ్చి చేరింది.

28. కం. ఎదురెరుగదు నీదు శరము
ఎదిరించగ లేరు దివిని యే వేలుపులున్
ఎదిరిగ మారిన వాలిని 
కదనమ్మున కాలరాచ కదలుము రామా! 

(ఎదిరి - విరోధి, వేలుపు - దేవతలు) 

రామా!! నీ శరవేగమునకు ఇంద్రుడు, దివిలో ఉన్న ఏ దేవతలైనా కూడా ఎదిరించ జాలరు. నాకు శత్రువుగా (ఎదిరి) మారిన నా అన్న వాలిని సంహరిచడానికి ఇప్పుడే బయలుదేరు.  



29. కం. ముదమున మార్తాండసుతుడు
కదనోత్సాహము నరిచెను గగనము లదరన్
బెదరని సురపతి సూనుడు
వదలక కొట్టెను యనుజుని భయము గొలుపుచున్ ! 

అత్యుత్సాహముతో బయలుదేరిన సుగ్రీవుడు ఆకాశ మదిరేలాగ అరిచి వాలిని యుద్ధానికి రమ్మని పిలిచాడు. ఇంద్రుని కుమారుడైన వాలి దానికి ఏమాత్రం బెదరక బయటికి వచ్చి సుగ్రీవునితో మల్ల‌యుద్ధమ్ చేసి అతడు భయపడి పారిపోయెంతగా కొట్టాడు.


30. కం. కాయము ప్రాయము వేషము
బాయక నొకరీతిగున్న బలకారణమున్
వేయక నిల్పితి శరమును
సాయపడగ మాటనిచ్చి చంపుట మేలా!! 

సుగ్రీవా, కాయము - శరీర ప్రమాణము చేత, ప్రాయము, వేషము లో ఒకే రకంగా వున్న బలమైన కారణం చేత బాణ ప్రయోగం చేయకుండా ఆగిపోయాను, నేను నీకు సాయపడతానని మాట ఇచ్చాను కాని నా బాణం చేత నిన్ను వాలి అనుకుని బాణం వేసి చంపడం మంచిది కాదు కదా!


31. కం. వడివడిగ సాగు నదములు
సడిచేయు ఝరుల జూచి సాగిరి వారల్!
అడకువ సప్తజన పుడమి
బడలిక తీరగ కదలిరి వాలిని జూడన్!


32. కం. నగధీరుడు రఘువీరుడు
అగణిత సుగుణాల రాశి యాతడు నాథా
పగ విడువుము సుగ్రీవుతొ
తగవుకు కాదిది తరుణము తలచిన‌‌ కొలదిన్!! 


నాథా, సుగ్రీవునితో వైరము నీకు తగినది కాదు. అతని వెనుక వున్నది మామూలు మనిషికాదు. సుగుణాల రాశి, మేరు నగ ధీరుడు ఐన రాముడు. అని తార యుద్దానికి బయలుదేరిన వాలితో  అన్నది.


                      
33. కం. తనువు విడుచు కాలమ్మున
మనసు వినదు మాటలేవి మంచిని తెలుపన్! 
మనవి వినడు వాలి తరుణి 
సునిశిత బుద్ధితొ పలికిన సూక్తుల నెవియున్! 


భూమ్మీద నూకలు చెల్లిన వానికి ఎన్ని మంచి మాటలు చెప్పినా గాని వాడు వినడు. 
తార సునిశిత బుద్ది గల వానర వనిత, రాజ్య నిర్వహణలో  వాలి తార మాటలను చాల గౌరవిస్తాడు. కాని అతని అంత్యకాలము ఆసన్నమైనది కనుక ఆమె  మాటలేవీ ఆయనకు రుచించలేదు. 


34. కం. అర చేతుల పిడిగుద్దుల
తరుల గిరుల కొట్టుకొనిరి ధర దిసలదరన్
ఉరుములు మెరుపులు మెరిసెను
యిరువురి సమరమ్మును సురలెల్లరు చూడన్! 

వాలి సుగ్రీవుల యుద్ధము అనన్య సామాన్యము, సాల వృక్షాలతో, పర్వత శిఖరాలతో, పిడి గుద్దులతో వాళ్ళిద్దరూ కొట్టుకుంటూంటే మెరుపులు మెరుశాయి, ఆ యుద్ధాన్ని దేవతలంతా కన్నార్పకుండా చూచారు. 


35. కం. తరు మాటున రఘువీరుడు
వరమిచ్చిన యిన కుమారు పాలకు చేయన్
శరమును ఉరమున నాటగ
సురపతి సూనుడు నొరిగెను చూడ ధర పయిన్ 

చెట్టు చాటున వున్న రాముడు సుగ్రీవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి బాణాన్ని వాలి గుండెలో నిలిపాడు, అప్పుడు వాలి నేల పై ఒరిగిపోయాడు.


కం. నేరుగ నిలువన్ జాలక
భీరువు వలెబాణ మేసి పేరును చెడగన్
కారణము లేక చంపుట
వీరత్వము గాదు నీకు వినుమో రామా!!


యుద్ధము లో నాతో నిలువలేక సుగ్రీవునితో కలబడు సమయాన, సరియైన కారణము లేక బాణము తో నన్ను చంపడం వీరత్వము ఎట్లా ఔతుందో చెప్పగలవా రామా! ఈ పని చేసి ధర్మాత్ముడన్న పేరు నీకు చెడిపోలేదా !!

36. కం. కనబడు ఈ భూమిపయిన్
వనముల పైపెత్తనంబు భరతునిదౌటన్, 
నొనరించితినీ కర్మను, 
ఇనకుల విభు మార్గ మెంచ నెటు దోసంబౌ?


విను వాలీ, కనపడే ఈ భూమి పైన, వనములతో సహా అంతా కూడా ఇక్ష్వాకు వంశీయుల ఆధిపత్యము వున్నది. ఇప్పుడు భరతుడు ఏలిక గా వున్నాడు, అతని ఆజ్ఞ ను అనుసరించి మేము ఎవరూ కూడా ధర్మాన్ని అతిక్రమింక్షకుండా చూస్తున్నాము. నా పూర్వీకులు అనుసరించిన ధర్మాన్నే నేను పాటింకచాను. తప్పు చేసిన వానికి సరియైన దండన విధించకుంటే అతను చేసిన పాపం ఆ దేశాన్ని పాలించే ప్రభువుకు సంకరమిస్తుంది అని ధర్మ శాస్త్రం చెపుతుంది. నేను ధర్మాన్ని ఏ పరిస్థితుల్లోనూ అతిక్రమించను. నా దోషము ఇందులో ఏమాత్రం లేదు. 


37. కం. కనుగానక కామంబున, 
తనతండ్రిగ జూచు కొన్న తమ్ముని పడతిన్,
మనువాడిన దానిగ గన,
ఒనగూడిన దండనయిది ఓ వానరుడా! 


వానరా, నువ్వు ధర్మాన్ని అతిక్రమించి కోడలి వరుస కావలసిన రుమను, అతను బ్రతికి వుండగానే భార్యగా స్వీకరించావు,కోడలు, చెల్లెలు, తమ్ముని భార్య కూతురితో సమానము, ఆ కారణం చేత నీకు ఈ దండన విధించడం జరిగింది.


38. కం. దండనకర్హుని విడిచిన
దండించు ప్రభునకు దగులును దారుణ ఫలముల్!
ఒండొరులకు నఘ మంటదు
దండన పొందిన తడవున ధారుణి లోనన్!

అఘము - పాపము

శిక్షకు అర్హుడైన వాణ్ణి శిక్షించకుండా వదిలి వేస్తే వాని పాపము శిక్షించే స్థానంలో ఉన్న రాజుకి చేరుతుంది అప్పుడు ఆ రాజు దారుణ ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. అట్లా కాకుండా శిక్ష అమలు పరిస్తే ఇద్దరూ పాప రహితులౌతారు.

39. కం. తెలిసీ తెలియక ప్రేలితి
తెలిసెను నాపాపమేమొ తెలుపగ నీవున్
నిలబడు ధర్మము నీవై
నిలిపెదవది యీ ధరనని నేర్చితి రామా!

రామా! తెలిసీ తెలియక నీతో వాదించాను. ఇప్పుడు నా‌తప్పేమో తెలుసుకున్నాను. నీవు మూర్తీభవించిన ధర్మానివి. ధర్మాన్ని నిలపడానికే పుట్టావని తెలుసుకున్నాను.

40. కం. నిన్నెరుగక నే పలికితి
మన్నింపుము నా అఘముల మైథిలి నాథా!
విన్నపమిది తుది కోర్కెగ
ఎన్నుకొనుము నాదుసుతుని ఎలమిని రామా!

రామా! నీ ధర్మ పరిపాలనను, నీ ఆంతర్యాన్ని తెలుసుకోలేక చాల తప్పుగా మాట్లాడాను. నేను చేసిన ఈ మహా పాపాన్ని (అఘము) క్షమించు. నా పుత్రుడు అంగదుణ్ణి మాత్రం దయతో (ఎలమి) నీవానిగా చూచుకొనుము ఇదే నా ఆఖరి కోరిక.

41. కం. వెన్నుగ నుండిన తారను
కన్నెఱ చేయక నితరులు కనుగొను రామా!
నన్నుగనక నాపుత్రుడు
ఖిన్నుడ గునువాని పైన కినుక  గొనకుమా  !

ఉన్నంతకాలము నాకు వెన్నుదన్నుగ ఉన్న నా భార్య తారను నేను చేసిన తప్పులకు కోపగించుకోకు. ఆమెను సుగ్రీవుడు అవమానించకుండా కాపాడు. నన్ను చూడలేకపోతే నా పుత్రుడు అంగదుడు నీరిలేని ఏరులాగా శుశ్కించిపోతాడు, వాని (కినుక) కోపగించుకోకు.

42. కం. ఇనకుల మణిబాణం‌బున
పునీతుడై‌ వాలి పొందె పుణ్య పథములన్
కనులేరుయె వానరులకు
ఘనచరితుండౌ ప్రభునటు కాంచగ నచటన్

రాముని బాణంతో హతుడైన వాలిని పాప రహితుడై పుణ్యలోకాలను పొందాడు. వానరులు తమని ఇన్నాళ్ళూ రక్షించిన ప్రభువును చూచి చాల దుఃఖించారు.

43. కం. కోరితి చెడునెపు డన్నకు,
వారించి విడిచెను‌ నన్ను ప్రాణము తోడన్!
కోరను రాజ్యము నేనిక
వీరుండగు వాలి తనువు విడు కారణమై

సుగ్రీవుడు రామునితో అన్నాడు, రామా! ఎన్ని మారులో వాలి మరణించాలని కోరాను నేను. ఆ క్రమంలో క్షాలా సార్లు యుద్ధం కూడా చేశాను కాని నన్ను అన్ని సార్లు తరిమి కొట్టాడే కానీ చంపలేదు..కాని నేను మాత్రం అతని మరణానికి కారణమైనాను (చంపాను) . ఆయన విలువ ఇప్పుడు నేలమీద పడిపోయిన తరువాత నాకు తెలుస్తున్నది. నాకు ఈ రాజ్యము వద్దు.

44. కం. తోడుగ నేడ్చును వెతలను
నీడగ నిల్చును రఘుపతి నెంచిన సఖుగన్
వేడిన రాజ్యము నిచ్చును
మ్రోడులు చివురించు చేరి మ్రొక్కిన రామున్!

శ్రీ రాముడు కరుణా సముద్రుడు. నెరనమ్మిన స్నేహితునికై వాని దుఃఖములో పాలు పంచుకుంటాడు, ధర్మబద్ధంగా కోరితే రాజ్యాన్నైనా ఇవ్వగలడు. నిస్సహాయస్థితిలో మ్రోడులాగా ఉన్న సుగ్రీవుని జీవితం మళ్ళీ చిగురింప జేశాడు రాముడు!!

45. కం. జల్లుగ కురిసిన మబ్బులు
నుల్లమునకు హాయి నిడగ ఉర్వీ పతికిన్
చల్లగ తాకిన గాలికి,
తల్లి ఒడిని శిశువులైరి ధరలోన ప్రజల్!

వర్షా కాలం తర్వాత సీతాన్వేషణ సాగిద్దామని సుగ్రీవునికి చెప్పిన రాముడు. ఒక గుహలో వర్ష ఋతువును చూచి చాల సంతోషంగా ఉన్నాడు. జల్లుగ కురిసిన మేఘాలు అందరి మనసులకు ఆనందాన్ని చేకూరుస్తున్నాయి. మెల్లగ సాగే గాలి చల్లదనానికి ప్రజలంతా భూమాత ఒడిలో పిల్లల్లాగా సంతోషంగా ఉన్నారు.

46. కం. పులకించిన మది రాముడు
తిలకించెను ప్రకృతి లోన తేలిన జగమున్
యెలకోయిల గానమ్మున
సెలయేరుల నగవులందు సీతను గాంచెన్

వర్షాన్ని చూచి మనసు అనందంతో వున్న రామునికి ప్రకృతి అంతా ఎంతో అందంగా, దానిలో ప్రపంచమంతా తేలి ఆడుకుంటున్నట్టు కనబడింది. కోకిల పాటలో పారే నదీ జలములలో సీత సుందరమైన మోమును చూచాడు రాముడు.

47. కం. అలుపెరుగని సైన్యములను
విలువనెరుగు స్నేహితులను, పెరిగిన ధనమున్
మెలకువ తో కాపాడగ
కలుగు జయము ప్రభువుకపుడు కను సుగ్రీవా!

సుగ్రీవా! అలుపులేక పోరాడే  సైన్యమును,  విలువ తెలిసిన /గౌరవాన్నిచ్చే స్నేహితులను, కష్టపడి పెంచుకున్న ధనాగారాన్ని,  ప్రజల హితవు కొరకు ఎల్లప్పుడు జాగ్రత్తగా కాపాడే వాడే రాజు. అటువంటి వానికి ఎప్పుడూ జయమే కలుగుతుంది. అని హనుమంతుడు అన్నాడు.

48. కం. గతి తెలియక తిరుగు మనకు
హితవును చేకూర్చి నిన్ను ఏలిక జేసెన్
మితిమీరగ నీ నడవడి
చితిచేర్చ క్షణము చాలు సీతాపతికిన్!


సుగ్రీవా! వాలి నిన్ను రాజ్యాన్నుంచి బహిష్కరించినప్పుడు గతిలేక కొండల్లో తిరిగే మనకు రాముడు ఆశ్రయాన్నిచ్చి వాలిని చంపి,  నిన్ను కిష్కింధకు రాజును చేశాడు. అది మరచిపోయి నీ నడవడి హద్దులు దాటితే  వాలి లాగా నిన్ను కూడా చితిపైన పడుకోబెట్టటం (చంపటం) రామునికి ఒక్క క్షణం పని. కాబట్టి సీతాన్వేషణ మొదలు పెట్టు. అని హనుమంతుడు సుగ్రీవునితో అని అన్నాడు.

50. కం. కలిగిన‌ మేలును మరచిన
కలుషిత మానిసికి లేదు గతి యే తావున్!
మలిగిన ప్రాణము మట్టిని,
కులహీనుని యంట రాదు కుక్కయు ననుజా!

లక్ష్మణా మరొకరిచే ఉపకారాన్ని పొంది అది మరచిపోయిన వానికి ప్రపంచం లో  గతి మాలిన వాడు అనబడతాడు. వాని ప్రాణము మట్టిలో కలసిన తరువాత అటువంటి కులహీనుని కాయాన్ని కుక్క కూడా తాకడానికి ఇష్టపడదు. అని రాముడు తమ్మునితో  అన్నాడు . 

51. కం. తగదీ కోపము తమ్ముడ!
పగ పెరిగిన పాడి కాదు మనకీ తడవున్,
రగిలిన క్రోధము గెలిచిన
మగధీరుడె వీరుడౌను మహిలో ననుజా!

లక్ష్మణా! శాంతించు.  సుగ్రీవుని పై క్రోధము తెచ్చుకోవటం మనకు మంచిది కాదు. ఐనా ఎవరైతే తనలోని క్రోధమనే శతృవును గెలవ గలుగుతాడో వాడే నిజమైన వీరుడు అనబడతాడు కదా.

52. కం. సుడి గాలి గతి సుగ్రీవుని
కడకేగెను లక్ష్మణుండు కాలుని రీతిన్
గడగడ వణుకుచు వానరు
లడవిని పాఱిరి నలుదిసలందున దాగన్

 లక్ష్మణుడు సుడిగాలి వేగంతో కిష్కింధకు వెళ్ళాడు అక్కడ  వున్న వానరులు రుద్రుని లా కనబడుతున్న అతన్ని చూచి నాలుగు దిక్కుల్లొ పారిపోయి దాక్కున్నారు.

53. కం. కోపించిన ‌రఘురాముడు
మాపగలడు నెవరి నైన మహిలోన నృపా!
ఆపన్నుల గాచునతని
కాపాడగవేడు నీవు, కరుణించి విడున్!

రాజా! రామునికి కోపం తెప్పించడం మనకు శ్రేయస్కరం కాదు. ఆయనకే కోపం వచ్చి కోదండం పట్టుకుంటే దేవతలు కాదు, ఎవరైనా నిలువ జాలరు ఆయన ముందర. కాని రక్షించమని కోరితే కరుణానిలయుడైన రాముడు రక్షిస్తాడు. అని హనుమంతుడు సుగ్రీవునితో  అన్నాడు. 

54. కం. హడలుచు లక్ష్మణు ధాటికి
దడపుట్టిన యినసుతుండు తారను యనిపెన్
ఒడలెరుగని ఆమెను గని
మెడ వాలిచి లక్ష్మణుండు మెదలక నిలిచెన్

లక్ష్మణుని విల్లు నారి నుంచి వచ్చిన శబ్దానికి హడలి పోయిన సుగ్రీవుడు ఏమి చేయాలో తెలియక, ఆపదలో మంచి ఆలోచనతో మాటలతో కాపాడే శక్తిగల తారను ఆయన దగ్గరకి పంపించాడు. మదముతో వున్న తార మద్యం సేవించడం వల్ల ఒంటి పైన స్ప్రహ లేకుండా బయటకి వచ్చింది. పరాయి స్త్రీని చెడు దృష్టి తో చూడలేని లక్ష్మణుడు ఆమెని చూడక నేలవైపు తల వంచి నిలబడినాడు.

55. కం. ఒనరించిన వాగ్దానము
ననవరతము ప్రజల సేమ మరయుట మరచెన్
తన సుఖమే చూచు నితని
కొనగూడు నధర్మ ఫలము ఉర్విని తారా!!

తారా! ఈ సుగ్రీవుడు రాజుగా తన కర్తవ్యాన్ని, మితృనిగా తన మాటను మరచిపోయాడు. రాజుగా ఉండి, తన సుఖమును మాత్రమే చూసుకొనే ఇతనికి అధర్మ ఫలితము తప్పక దొరుకుతుంది.

56. కం. పురుషోత్తములకు నైన న
పర బ్రహ్మల కైన కామవాంఛను‌ గెలువన్
తరమా వీరుడ!  శాఖా
చరులగు కపులని దలంచి జాలిని గొనుమా!

వీరుడా లక్ష్మణా! నీవు చెప్పింది అక్షరాల నిజం. కాని ఎంత మనో నిగ్రహం కలిగిన ఋషులకైనా అపర బ్రహ్మ యైన విశ్వామిత్రుని వంటి వారికైనా కామ వాంఛను గెలవడం సాధ్యమైనదా? ఇంక చపల చిత్తులైన వానరుల విషయం చెప్పాలా? సుగ్రీవునిపై జాలిని గొని ఆతని తప్పును క్షమించు.

57. కం. మాటకు నిల్చి సుజనులకు
చేటును రానీక జూచి జిత యింద్రియుడై
ధీటుగ పాలించిన వా
డోటమి నెరుగని ప్రభువుగ ఉర్విని వెలుగున్

సుగ్రీవా! సజ్జనులైన ప్రజలను రక్షించి, ఇచ్చిన మాటకు నిలబడి ప్రజలకు కష్టము రానీక చూచి, ఇంద్రియములను గెలిచిన వాడు నిజమైన రాజుగా కొనియాడ బడతాడు అని లక్ష్మణుడు సుగ్రీవునితో అన్నాడు. 


58. కం. నావాడని యలసించితి
చేవలసిన కార్యమింక చిత్తము మరువన్
వేవేలుగ వానరముల
రావలెనని యాన తిత్తు రాముని కొరకున్!

 లక్ష్మణా! రాముడు నావాడే కదా అని ఆలస్యము చేశాను. తప్పు జరిగిపోయింది. ఇంక చేయ దగిన పనిపైన దృష్టి మరల్చను. అన్ని దిక్కులనుంచి వానర వీరులను వెంటనే ఇక్కడికి రమ్మని ఆజ్ఞ ఇస్తాను

59. కం. కాముము యొక్కటె తెచ్చున
ధీమంతుడవైన నీకు తిరమగు గతులన్!
నీమము తప్పని ధర్మమె
భూమి జనులకిచ్చు నోయి పురుషార్థములన్!!

ఒక్క కామము మాత్రమే పురుషార్థముల ఆఖరిదైన మోక్షాన్ని తెచ్చి పెట్టలేదు ధర్మము ను నిరంతరము ఆచరణ చేస్తేనే దొరుకుతుంది.

60. కం. నలువైపుల కోట్ల కపుల
ఇలనంతట వెదుక సీత నినసుతు డంపెన్
ఎలుగెత్తుచు 'రామా' యని
అలుపెరుగని కపి సముద్ర మడవిని పొంగెన్!!


సుగ్రీవుడు ప్రస్రవణ పర్వతానికి చేరుకున్న కోట్ల వానర వీరులను భూమి నాలుగు దిక్కులకు వెళ్ళి సీతను వెదకాలని ఆదేశాన్ని చేశాడు. ఆ వానారులంతా 'జై శ్రీ రామా' అని అరుస్తూ సాగుతూంటే అడవిలో వానర సముద్రం పొంగినట్టు కనవడింది

61. కం. ఏదేశము నేమున్నదొ
ఏదారులు యెటు జనంచు నెరిగిన వాడై
సాదరముగ సూర్యసుతుడు
వైదేహిని వెదుకనంపె వానర సేనన్

భూమి లోగల దేశములన్నిటి యందు ఎక్కడ ఏమున్నదో ఏ దారిలో వెళితే ఏమి దొరుకుతుందో అన్ని వివరాలు తెలిసిన సుగ్రీవుడు సీతను వెదకడానికి అసంఖ్యాకమైన వానర సేనలకు చెప్పి పంపాడు.

62. కం. వేగమున వాయుసముడవు
జాగును సేయక కనుగొను జానకి జాడన్
నీ గెలుపె నాకు గతియని
ఆగక పలికె కపిరాజు హనుమతొ నపుడున్!

హనుమా! నీ అంతటి వేగముగా వెళ్ళేవాడు ఒక్క వాయుదేవుడే. నీ గెలుపు (సీరను వెదకడంలో) మా అందరికి రక్ష. కనుక ఆలస్యం చేయకుండా సీతమ్మను వెదుకు. అని సుగ్రీవుడు హనుమతో అన్నాడు.

63. కం. రక్కసి నెలవున నేడ్చుచు
దిక్కెరుగక నుండు సీత దీనాకృతిగన్! 
చక్కగ నీపై నమ్మిక
దక్కగ గొనుముంగరమ్ము ధరణిజ జూపన్! 

రాముడు, హనుమా! రాక్షసుడు ఎత్తుకొనిపోయిన సీత ఏడ్చుచు దిక్కుతెలియక ఉంటుందేమో అందుకొరకు నీవు ఆమెను చూచినప్పుడు ఈ ఉంగరాన్ని ఆమెకు నా గుర్తుగా చూపిస్తే నీ పై నమ్మకం ఏర్పడుతుంది అని అన్నాడు.

64. కం. మొదలిడి సీతా న్వేషణ,
కదలిరి తమ రేని యాన కపి సైన్యంబుల్!
వెదకిరి యంతట తిరుగుచు,
వదలక నేచోటు వారు వైదేహిగనన్!!

సుగ్రీవుని ఆజ్ఞను పాటించి కపి సైన్యము అన్ని వైపుల సీతను వెదకడానికి బయలుదేరి అంగుళం వదలకుండా అన్ని చోట్లా గాలించారు.

65. కం. జన సంచారము లేనిది
కననాశ్చర్యమును గొలుపు ఘనమౌ బిలమున్
కనులకు తాపసి రూప
మ్మనంగ దోచెదెవరీవు మాతా దెలియన్!

వానరులు ఒక ఆశ్చర్యమైన జనసంచారము లేని బిలం లోనికి ప్రవేశించగా వారికి ఒక తేజస్సుతో కూడిన తల్లి కనబడింది.

66. కం. అమలమ్ములౌ జలముల
కమనీయముగ కదలాడు కమలము లిచటన్
రమణీయ మీవనంబున
అమరెను వింతగ విమాన హర్మ్యపు కాంతుల్!

67. కం. వినగో రెదమీ వింతను
కనుపిం చునిదిసురలోక కట్టడ మువలెన్
ఘనమౌ నీభవ నమ్ములు
యొనరించిననీ తపస్సు నోజస్ఫలమో?


హనుమంతుడు తేజస్సుస్సుతో వెలుగుచున్న ఆ తల్లిని ఆ బిలం లో కనబడిన ఆశ్చర్యమగు విశేషాలను గూర్చి అడుగుతున్నాడు. అమ్మా స్వచ్ఛంగా వున్న ఈ జలములలో అందంగా కదలాడుతున్న కమలాలు, అద్భుతంగా దేవలోక కట్టాంలా కనబడుతున్న భవనము, విమానము నీ తపస్సు చేత పుట్టిన ఓజస్సు (శక్తి) వల్ల కలిగిందని తెలుస్తున్నది ఈ వింతలను నీ నోట వినాలని ఆతృతగా వున్నది.


68. కం. దానవ శిల్పియగు మయుని
మానస మునుగొన్న హేమ మరులను గొనగన్,
కానుకగా నిర్మించెను!
దీనికి కాపుగ నమరితి తెలియుము హనుమా!

దానవ శిల్పి మయుడు హేమ అనే అప్సర పైన ప్రేమను వ్యక్తం చేయడానికి నిర్మించినవి ఈ భవనము, విమానము, వనము, జలాశయములను మయుడు ఇంద్రునిచేతిలో పరాజితుడైన తరువాత హేమ పనుపున నేను కాపాలాగా వున్నాను.

69. కం. కాలము తెలియక గడిపితి
నాలుగు నెలలైన కాననైతిని సీతన్
జాలము నోర్వడు భూపతి
చాలించెద తనువునిచట,  చావే గతియౌ


సీతను వెతకటానికి నాకు రాజు (సుగ్రీవుడు) ఒక నెల గడువునిచ్చాడు. ఇప్పుడు నాలుగు నెలలు గడిచి పోయాయి. ఇంకా సీత జాడ తెలియలేదు.
సుగ్రీవుడు ఈ ఆలస్యాన్ని క్షమించడు కాబట్టి చావు తప్ప నాకు వేరే గతి లేదు అని అంగదుడు అన్నాడు.

70. కం. ఫలమేమి ప్రాణము విడిచి
కలుగున మేలు తలపెట్టు కార్యమ్మునకున్?
నలుసెరుగని సూర్య సుతుని
కులము నిలుప వేరు లేరు కుములగ నేలా!

అంగదా ! ప్రాణము తీసుకోవడం వల్ల మనం తలపెట్టిన కార్యానికి ఏదైనా మేలు జరుగుతుందా? అదీ కాక నలుసు (బిడ్డ)  లేని సుగ్రీవుని కుల వృద్ధి చేయవలసిన వాడవు నీవే కదా ఇంక ఎందుకు ఇట్లా కుమిలి బాధపడతున్నావు అని హనుమంతుడు అంగదునితో అన్నాడు.

71. కం. కవ్వించగ దిననాథుని
రివ్వున వినువీథినెగిరి రెక్కల బలిమిన్,
అవ్వేడికి కూలితి మీ
దవ్వుల! యుంటిని యెరుగక తమ్ముని జాడన్!


నేను నా తమ్ముడు జటాయు రెక్కల బలముతో సూర్యునితో పోటీ పడదామనే తలంపు గలిగి ఆకాశం లో ఎగిరాము, ఆయన వేడికి తట్టుకోలేక నేలపైన కూలి పోయాము. అప్పటినుండి నా తమ్ముడు ఎక్కడ వున్నాడన్న విషయం నాకు తెలియలేదు. అని సంపాతి వానరులతో అన్నాడు.

72. కం. రెక్కలు కాలగ కదలక
దక్కిన కొనయూపిరుంటి తనువునిలుపుచున్
చక్కని చూపును వరముగ
వాక్కున తెలుపగలవాడ వంచకునునికిన్


రెక్కలు కాలిన కారణంగా ఎక్కడికి కదలలేను. ఎట్లాగో కాలం గడిపేస్తున్నాను ఎక్కడికీ కదలకుండా. రామునికి సాయం చేయడానికి నా దగ్గర ఇప్పుడున్న శక్తి ఒక్క నా చూపు మాత్రమే అది మా వైనతేయులకు సహజమైన వరంగా ఇచ్చాడు ‌విధాత. కాబట్టి వంచకుడైన రావణుని లంక గురించి నేను చూడ గలిగి నంత మీకు తెలుప గలను.

73. కం. విరిగిన రెక్కల సేవల
గరపితి మహనీయుకేను కానల నుండన్
యెరిగితి బ్రతుకున కర్థము
చిరుసాయము చేతు మీకు చింత తొలగగన్

నేను నిశాకర మహర్షి అనే‌మహనీయునికి విరిగిన రెక్కలతో సేవ చేసినందుకు ఆయన అనుగ్రహం చేత నా జీవితానికి అర్థం తెలుసుకున్నాను. సీతమ్మ జాడ చెప్పి మీకు ఈ చిన్న సహాయాన్ని చేసి మీకున్న చింతను కొంత తీర్చడమే నా జీవిత శేషానికి అర్థం పరమార్థం.

74. కం. పోయిన రెక్కలు మొలవగ
హాయిగ సంపాతియెగిరె ఆకస మందున్
ఆయువు మూడెను రావణు
కోయని దుమికె కపిసేన కోలాహలమున్!

నిశాకర మహర్షి వరంతో, వానరులకు సీత జాడను తెలిపిన సంపాతికి పోయిన రెక్కలు తిరిగి మొలచాయి. ఆకాశంలో ఎగురుతున్న సంపాతిని చూచి ఆనందంతో కపిసేనలు గెంతులు వేశారు.

75. కం. ఉలుకు పలుకులేకుంటివి
పలు శాస్త్రములెరుగు నీవు పలుకవదేలా!
బలమున సుగ్రీవు సముడవు
నిలిచెను వానరుల భావి నీపై హనుమా!!

హనుమా ! ఇన్ని సాస్త్రములను చదివిన నీవు ఇట్లా ఉలుకూ పలుకులేక కూర్చున్నావేమి? నీకు సుగ్రీవునంత బలమున్నది. వానరుల భవిష్యత్తు ఇక నీపైనే ఆధారపడి వున్నదని జాంబవంతుడు హనుమతో ఆయన పుట్టుకను గూర్చి చెబుతూ  అన్నాడు

76. కం. మరచిన బలమును తెలిసిన
హరివీరుడు వెను విదిల్చి ఆశ్చర్యముగన్,
నరసింహాకృతి పొందెను
ధరయు నదరెను కపిశూరు ధాటికి నపుడున్!

జాంబవంతుని వలన తన లోని బలమును తెలిసిన హనుమంతుడు ఒక్క సారి వెన్ను విదిల్చి హుంకరించి కాయమును పెంచడానికి నిలబడగానే నరసింహాకృతి గల హనుమను చూచి నిశ్చేష్టులైనారు కపివీరులు. భూమి ఆయన ధాటికి తట్టుకోలేక ఒక్క సారి అదిరింది.

77. కం. చండ ప్రచండముగ  బ్ర
హ్మాండముల చుట్టివత్తు అంగలొ నిపుడున్
అండజ పతి వేగంబున
కొండల త్రుంచెద బలమున కోరిన మీరున్!

జాంబవంతునితోను అక్కడున్న కపివీరులతో హనుమ, ఇప్పుడు నేను బ్రహ్మాండములను ఒక్క అంగలో చుట్టి రాగలను. అండజ పతి (అండములోనుంచి పుట్టిన వాడు, గరుత్మంతుడు) ఏ వేగముతో వెళ్ళగలడో అంత వేగముగా వెళ్ళగలను, మేరు పర్వతాన్నైనా త్రుంచి రాగలను అని అన్నాడు.

78. కం. మనసుతొ లంకకు చేరిన
హనుమకు తలవంచి కపులు అంజలులిడగన్
అనిలజు పదఘట్టనమున
ఘన వృక్షములు పడె నేల కంపించె గిరిన్

హనుమంతుడు మహేంద్రగిరిపకి ఎక్కుతూన్నపుడు వానరసేనలంతా తలలువంచి ఆయనకు నమస్కారం చేశారు. ఆయన పదఘట్టనకు కొండంత కంపించింది, పెద్ద పెద్ద వృక్షాలన్నీ నేలపై పడిపోయాయి. హనుమ మనసుతో లంకకు చేరిపోయాడు.






No comments: