యుద్ధ కాండము




1. కం. యోచన కందని కార్యము
నీచే నయ్యెను సఫలము నిజముగ హనుమా
తోచదు ఏమియు నిప్పుడు
నాచేతుల నీకు నీయ,  నన్నే యిత్తున్ !

హనుమా నీవు చేసిన ఈ ఘనకార్యము ఎవ్వరుకూడా ఊహించలేనిది. ఈ రోజు నీవు అటువంటి పని సాధించి దాన్ని సఫలము చేసి వచ్చావు. దీనికి బదులుగా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు (ఏమిచ్చినా తక్కువే) కనుక నన్ను నేనే నీకు కానుకగా ఇస్తున్నా. అని శ్రీరాముడు హనుమంతుని ఆలింగనము చేసుకున్నాడు.

2. కం. భూకాంతుని కార్యమ్మును
నాకేమని యనుట యధము నైజము ధరలో
యేకారణ మెదురైనను
ఆకార్యము మించి చేయు నలయక సుమతుల్

ప్రభువు ఇచ్చిన పనిని నాకేమీ అని తలచువాడు అధముడు. ఇచ్చిన పనికి మించి చేసి చూపించే వాడే కార్యసాధకుడైన సుమతిగా కొనియాడబడతాడు.


4. కం. కోదండము ధరియించిన
నీదు బలిమి కెదురు రారు నింగిని సురలే!
వేదన యేలా యిప్పుడు
నీదారిని నడువ గలము నిజముగ రామా!


5. కం. అడుగుల బడు నెవడైనను
వడిశర ముల కేది సాటి వసుధను రామా
కడలి గడచు మార్గ మెరుగు,
కడతేర్చగ ఘడియచాలు కైకసి సూనున్

రామా! నీవు కోదండాన్ని ధరించి రణములో నిలిచి ఉంటే దేవతలే నీముందు నిలబడలేరు. నువ్వు దారి చూపెట్టు ఇన్ని కోట్ల వానరులము నీతో నడవడానికి సిద్ధంగా వున్నాము.

నీ శరముల ధాటికి సాటి ఈ భూ ప్రపంచంలో ఏదైనా వుందా!! నువ్వు సముద్రాన్ని దాటడం ఎలాగో ఆలోచించు రావణున్ని కడతేర్చడం పెద్ద పని కానే కాదు.  అని సుగ్రీవుడు రామునితో అన్నాడు.

6. కం. నాలుగు దుర్గముల నడుమ
నేలను యమరావతి వలె నెలకొని గిరిపై
వేలయసుర వీరులెపుడు
కాలుర వలె గాతురచట ఘనమగు లంకన్

హనుమంతుడు శ్రీరామునికి లంకయొక్క నిర్మాణ పటిష్టతను, కౌశలాన్ని ఎరుకపరిచాడు. లంకకు నాలుగు దిక్కుల నాలుగు దుర్గాలు పటిష్టమైన నాలుగు ద్వారాలు కలవు. వాటిని భేదించడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. నిరంతరమూ వేల వేల రాక్షస సైనికులు ఆ లంకను కాపు కాస్తూ ఉంటారు.

7. కం. యినకుల పతులకు విజయము
గొన యుత్తర ఫల్గుణియిట కూడిన ఘడియన్
మనకిచ్చును శుభముననిని
తనరు యసురు హతమొనర్ప తరుణంబిదియే

ఇప్పుడు ఉత్తర ఫల్గుణీ నక్షత్రము కూడి యున్న లగ్బము ఇదే ముహూర్తాన్ని యుద్ధానికి సరైనదిగా నిర్ణయిస్తున్నాను. మనకు యుద్ధం లో (అని) రావణున్ని హతమార్చడానికి లంకకు వెళ్ళడానికి ఇదే  సరైన సమయం.

8. కం. వ్యూహము రచించి రాముడు
బాహుబలుని నీలుననిపె భద్రత నెరుగన్
ద్రోహాత్ముని చంపెదమని
హోహోయని సాగె సేన హుంకారములన్


కోట్ల వానర సేన యేవిధంగా అరణ్యంలో సాగాలో చక్కగా ఆలోచించి రాముడు మంచి వ్యూహాన్ని తయారు చేశాడు. ముందుగా నీలుడనే బలమైన వానరుడు ఆయుర్వేదం బాగ తెలిసి‌న వాణ్ణి దారిని భద్రం చేయమని ఆదేశాన్నిచ్చాడు. వానరసేన అత్యుత్సాహంతో హుంకారములు చేస్తూ ద్రోహాత్ముడైన రావణున్ని చంపేస్తామని అరుస్తూ ముందుకు సాగారు.

9. కం. నీరంధ్రము నీరధిగా
వారందరి కనుల నిండె  బడలిక తీరన్
తారాడిన చెలి తలపున
ఆరాముని కనులనీరు ఆగక పొంగెన్

10. కం. అంతెరుగని కడలి యెదుట
ఇంతిని తలచి వగపొందు యినకుల తిలకున్
చెంతనె సేదను తీరిచి
సంతాపము విడువుమనెను సౌమిత్రి యటన్

వానరు లంతా సముద్రము ముందర కూర్చొని బడలిక తీర్చు కున్నారు. ఆకాశము సముద్రము ఒకే రీతిగా కనబడింది అప్పుడు. సీత తలపుకు వచ్చిన రామునికి మాత్రం కళ్ళల్లో నీళ్ళు ఆగకుండా పొంగాయి. పరి పరి విధాలుగా తన చింతను తమ్మునితో చెప్పుకున్నాడు రాముడు. చెంతనే వుండి స్వామికి సేద తీర్చాడు లక్ష్మణుడు.

11. కం. సురలను గెలిచిన నీకున్
నరుల వలన కీడనునది నమ్మదె వేలా
ధరనంతయు శాసింతువు
తరమా నిర్జింప నిన్ను తలపడిన యనిన్

12. కం. అసురాధిప చింతింపకు
అసమానుడు మేఘనాథు డరి భంజనుడున్
మసిచేయును నీ యానతి
ఉసిగొల్పెడు రామదండు నొక్కడె తానై

రావణుని  మంత్రులు అతను చెప్పిన మాటలు విని ఆశ్చర్యంగా అన్నారు,

ప్రభూ! దేవతలను గెలిచిన నీకు మానవులచేత కీడు కలుగుతుందంటే ఎట్లా నమ్ముతున్నావు? ప్రపంచాన్నంతా శాసించగలవాడవు నువ్వే యుద్ధంలో నిలబడితే ఎవరు నిన్ను నిర్జింపగలడు?

మహరాజా! నీ దాక ఎందుకు, నీ పుత్రుడైన మేఘనాథుడు ఒక్కడు చాలు. మొత్తం రామదండును మసి చేయడానికి. నువ్వు ఆనతి ఇచ్చి చూడు.

13. కం. ఘనసింధువు దాటి చెలగి
మనలంకను మసినిచేయు మారుతి బలమున్
కనులార కాంచితిమే
తన స్వామియె తరలి రాగ తరమా గెలువన్


14. కం. తోడుగ దైవము రాముని
నీడగ వానరుల సేన నిలచియు నుండన్
వాడిశరమ్ముల వేడికి
కాడై మిగులు‌ను మనపురి కనుగొన లేరా!

రావణుని తమ్ముడు, ధర్మాత్ముడు అయిన విభీషణుడు వారందరి మాటలు విని వారితో, ఊహింపజాలని సముద్ర‌ లంఘనమును అతి సులువుగా చేసి మన లంకలో హనుమంతుడు చేసిన పనులన్ని కళ్ళారా చూచాము , అటువంటిది,  అతని స్వామి శ్రీరాముడే వస్తే అతన్ని గెలువగలమని ఎట్లా అనుకుంటున్నారు!!!

రామునికి దైవము తోడున్నాడు, వానరుల స్నేహము కూడా ఉన్నది. అతనితో చిరోధం పెట్టుకుంటే మన లంక స్మశానం లాగా మారడం తప్పదు. ఈ విషయం మీరు ఎందుకు చూడలేకపోతున్నారు?


15. కం. దక్కును లంకా నగరము
చిక్కులు విడు సీత నిడిన సీతాపతికిన్
తక్కిన వన్నియు నిష్ఫల
మెక్కిడ రాముడు ధనువును ఎదురౌ తరమా!

మనకు లంకా నగరము దక్కాలీ అనుకుంటే సాదరంగా సీతను రామునికి ఇచ్చివేయడమొక్కటే మార్గం. తక్కిన ఆలోచనలన్నీ నిష్ఫలమైనవి. రాముడే ధనువు చేబడితే అతన్ని ఎదుర్కునే సత్తువ మనలో ఎవరికీ లేదు. కాబట్టి నా మాట వినండి

16. కం. కనిపించె దుశ్శకునములు
ఘన లంకా పురిని నేడు కడుచోద్యముగన్
వినవచ్చెను నక్క యరుపు
తిన వచ్చిన గ్రద్దలిచట తీరెను బారుల్

అన్నా ఈ నాడు మన లంకలో నాకు ఎన్నో దుశ్శకునాలు కనబడుతు‌న్నాయి. ఇంతకు ముందు చూడనటువంటి చెడు దృశ్యాలు చూస్తున్నాను. నక్కలు అరుస్తున్నాయి అకారణంగా. గద్దలు కాకులు లంక పైన బారులు తీరి ఉన్నాయి. గుర్రాలు ఏనుగులూ శక్తివిహీనమై పోయినాయి.

17. కం. మించిన కాలము మిగులదు
మంచిని చెప్పితి యనుజుగ, మన్నించన్నా
వంచన తోతెచ్చిన సతి
నంచిత బుద్ధిని అనుపు మనందరి మేలున్

కాలము మించిపోకముందే సీతను గౌరవంగా రాముని దగ్గరకు పంపివేయి. మనకు మేలు జరుగుతుంది.

18. కం. వీరులు నీ వెనకుండగ
కారణ మేమి‌ కనబడదు కలతను పొందన్
తీరగ నీమది కోరిక
చేరుము సీతను బలమున చింతను బడకన్

మహాపార్శ్వుడనే మంత్రి లేచి ప్రభూ కుంభకర్ణుడు ఇంద్రజిత్తు వంటి వీరులు నీ వెలక ఉన్నంత వరకు నీవు ఆందోళన చెందాల్సిన కారణమేమీ నాకు కనబడటం లేదు. నీవు సీతతో బలవంతంగా కోరిక తీర్చుకొనుము.

19. కం. యెరుగుము రహస్య మొక్కటి
దరిచేరగ నే పడతిని తానొప్పనిచో
ధరగూలెద పది తలలతొ
విరించి నిడె శాపవాక్కు వెరచెద దానిన్

అప్పుడు రావణుడు మహాపార్శ్వునితో " నీకు ఒక రహస్యం చెప్తాను ఒకప్పుడు పుంజికస్థల అనే వనితను బలాత్కారంగా అనుభవించాను. ఆమె బ్రహ్మ దేవునితో మొరపెట్టుకొనగా ఆయన నాకు ఒక శాపాన్నిచ్చాడు అదేమంటే నేను యే స్త్రీనైనా ఆమె ఇచ్ఛకు విరుద్ధంగా అనుభవించే ప్రయత్నం చేస్తే నా తల ముక్కలై నేల బడతాను. ఆ కారణంగా భయపడుతున్నాను.

20. కం. పామును నీమెడ చుట్టిన
దేమూర్ఖుడొ యెరుగవైతి వేలనొ యన్నా
నామాటలు వినకున్నచొ
రాముని శరముల సమయును రాక్షస సేనల్!

ప్రహస్తుని మాటలు రావణుని ప్రేలాపనలు విన్న విభీషణుడు అతనితో అన్నాడు, ఈ ఐదు తలల పాము నీ తలపై ఆడుతున్న విషయం నీవెందుకు గ్రహించుటలేదో నాకు అర్థం కాకుండా వున్నది. సీతను రామునికి తిరిగి ఇవ్వని నువ్వంటే జరిగే ఘోరం ఏమో తెలుసా? నీ పది తలలు వక్కలు కావడమన్నది తథ్యం. రాముని శరములు రాక్షససేనలను చీల్చి చెండాడమూ తథ్యమే.


21. కం. పిన తండ్రీ యేమీ యిది?
వినివి స్మయమౌనునీదు పిరికి పలుకులన్
అనిమేషుల గెలిచితిమే
మనకు నరుల వెరపనునది మాన్యంబౌనా!

విభీషణుని మాటలు విన్న ఇంద్రజిత్ అన్నాడు, చిన్నాన్నా ఏమి ఇలా భీరువులాగా మాట్లాడుతున్నావు మన రాక్షస జాతికే అవమానం కదా? దేవతలనే గెలిచిన మనకు నరులొక లెక్కా?

22. కం. బాలకుడవు యెరుగలేవు
ప్రేలితివి పెద్దల యెదుట వీరుని రీతిన్
చాలదు నీ బలము,  ధనువు
దాలిచి రణమందు నిలువ దశరథ సుతుడే

చిన్న పిల్ల వాడివు పెద్దల ముందు ఇట్లా ప్రేలుతున్నావు ఈ సభలో ఉండడానికే అర్హతలేదు నీకు. రాముడే ధనువు ధరించి యుద్ధం లో నిలబడితే నీ బలము సరిపోదు అతన్ని ఆపడానికి. అని విభీషణుడు ఇంద్రజిత్తుతో అన్నాడు.

23. కం. లంకను చెడబుట్టితివే
జంకుట రాక్షసు లెరుగరు చాలిక నీతుల్!
పంకిల బుద్ధివి, మెండుగ
బొంకుల నేర్చితివినీవు పొమ్మెట కైనన్!!

తమ్ముని హితవు కర్ణ కఠోరంగా వినబడింది లంకేశ్వరునకు. క్రోధంతో ఊగిపోతూ అతనన్నాడు, లంకలో చెడబుట్టినావు నీవు. భయపడడం అన్నది రాక్షసులకు తెలియదు‌ నీ పనికిమాలిన నీతులు చాలింక. నీ బుద్ధి పాడైపోయింది. నీవు ఇక లంకలో ఉండడానికి నేను ఒప్పుకోను. తమ్మునివని నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నా వెళ్ళిక్కడినుంచి అని ఘర్జించాడు.


24. కం. మనసుకు నచ్చిన మాటలు
వినిపించు జనులను జూడ, వింతేమి భువిన్!
వినుటకు కటువైన హితవు
ననువుగ చెప్పు, విను వారు నరుదగు భూమిన్ !

రావణా నీ మనసుకు నచ్చే మాటలు చెప్పే వారు చాల మంది ఉన్నారు నీ చుట్టూ, కాని వినడానికి కటువైనా కూడా మేలు చేసే మాటలు చెప్పే వారు, అలా చెపితే వినే వారు లోకంలో అరుదు కదా. నీకు ప్రమాదం తెస్తాను అని నీకు అనిపించినపుడు నేను ఇక్కడ వుండడం సరియైనది కాదు. నేను వెళుతున్నాను.

25. కం. రక్షగ సీతకు, తోడ్పడు
పక్షీంద్రుని పట్టి చంపు పాపాత్ముండౌ
రాక్షస రాజుకు తమ్ముని,
వీక్షింపగ వచ్చితిపుడు వీరుని రామున్ !

జనస్థానంలో సీతను అపహరించి ఆకాశంలో వెళ్తున్నపుడు ఆమెకు రక్షణగా వచ్చిన జటాయువును చంపిన రాక్షస రాజైన రావణుని తమ్ముడను. శ్రీరామ దర్శనము కొరకు వచ్చాను.

26. కం. చెర విడువుము జానకినని
పరి విధముల చెప్పి జూచి భంగపడితినే
శరణార్థిగ వచ్చితి యిట
చరణమ్ములు కోరి నేను జానకి నాథున్

సీతమ్మను విడిచి పెట్టమని పరి పరి విధములుగా రావణుని ప్రార్థించి విఫలుడనైనాను,  అవమానింపబడ్డాను. నా భార్యా బిడ్డలను వదలి శ్రీరామును చరణాలను శరణు కోరి ఇక్కడకు వచ్చాను. అని విభీషణుడు వానరులతో అన్నాడు.

27. కం. యెరిగింపుడు మీ యోచన
శరణమ నిన వాని కేది సరియగు తెరవో?
దురవస్థ కలిగి నప్పుడె
ఉరవు దెలుపు వాడె హితుడు నుర్విని చూడన్

సుగ్రీవుని యుక్తమైన మాటలు విన్నారు మీరంతా కష్టమైన పరిస్థితి ఏర్పడినప్పుడే నిజమైన మితృడు మంచి సలహాను ఇచ్చి కాపాడుతాడు. కాబట్టి సరియైన మార్గమేదో ఒక్కొక్కరూ చెప్పండి. అని రాముడు వానర నేతలతో అన్నాడు.

(ఉరవు - మంచి, మేలు)

28. కం. పగవాని తమ్ముడితడు
తగదు మనకు ఆశ్రయమిడ తలచిన రామా
తగురీతిని దండించుటె
తగినది, దైత్యుడని యెరిగి దయ మేలగునా!

సుగ్రీవుడు రామునితో, రామా, ఇతడు పగవాని తమ్ముడు,  నమ్మరాదు, తగిన రీతిగా దండించి పంపివేయడమే సరియైనదని నా అభిప్రాయము. రాక్షసుడని తెలిసి కూడా దయను చూపడం సరికాదు అని అన్నాడు.

29. కం. యెరిగింపుడు మీ యోచన
శరణమ నిన వాని కేది సరియగు తెరవో?
దురవస్థ కలిగి నప్పుడె
ఉరవు దెలుపు వాడె హితుడు నుర్విని చూడన్

సుగ్రీవుని యుక్తమైన మాటలు విన్నారు మీరంతా కష్టమైన పరిస్థితి ఏర్పడినప్పుడే నిజమైన మితృడు మంచి సలహాను ఇచ్చి కాపాడుతాడు. కాబట్టి సరియైన మార్గమేదో ఒక్కొక్కరూ చెప్పండి. అని రాముడు వానర నేతలతో అన్నాడు.

(ఉరవు - మంచి, మేలు)

30. కం. తెలిపిరి కపినేతలపుడు
పలురీతుల రామునెదుట వారి తలపులన్
పలికెను హనుమంతుడపుడు
విలువైనదిమాటయొకటి విజ్ఞతెరుగుచున్

వానర నేతలైన అంగదుడు, మైందుడు, జాంబవంతుడు వరుసగా వారికి తోచిన మార్గాలను రాముని ముందుంచారు. అప్పుడు రాముడు బుద్ధిమంతుడు వాగ్విశారదుడైన హనుమంతుని వైపు చూచాడు. హనుమ పెద్దల యెదుట ఎలా మాట్లాడాలో తెలిసిన వాడై నమ్రతతో జవాబు నిచ్చాడు.

31. కం. యెదురుగ వచ్చిన మిత్రుని
కుదురుగ ప్రశ్నలు సలుపక క్రుద్ధుని చేయన్
అదరి తిరిగి పోవునతడు
ఒదవు గరపు వానినిటుల ఒదులుట మేలా!

(ఒదవు - యుక్తము, మంచి)

తనకు తానే ఎదురైన మిత్రుని అడుగరాని ప్రశ్నలు వేస్తే అతడు వెనుదిరిగి పోయే ప్రమాదం ఉన్నది, కాబట్టి విభీషణుని అనవసర ప్రశ్నలు వేసి వదులు కోవడం మంచిది కాదని నా అభిప్రాయం.


32. కం. నీ తేజము తెలిసి యితడు
ఈ తావునకరగి నపుడె యెరిగితి యితనిన్
నీతెరిగిన వాడీతడు
యీతని స్నేహము మనకిడు యెన్నగ మేలున్

అమిత బలశాలి వానర రాజైన వాలిని సంహరించి సుగ్రీవుని రాజును చేసిన నీ బల పరాక్రమములను తెలిసి కూడా భయము లేక మన ముందు నిలబడినాడన్న ఒక్క నిజమే అతన్ని మనము ఆదరించడానికి సరియైన కారణం. మనకు ఇతని స్నేహము మేలు చేకూరుస్తుంది అని నా అభిప్రాయం. నిర్ణయం తీసుకోవలసినది నీవే కదా రామా!

33. కం. కొనవేలున పరిమార్చెద
మొనగాడెవడైన వాని మొనదేలమ్మున్
తనప్రాణము భిక్షనడుగు
ఘన యరి యేయైన వాని కాదన గలనా!


సుగ్రీవా! నీకు తెలిసిన విషయమే చెప్తున్నా, ఎంతటి మొనగాడైనా లంకలోని అసురులు అంతా కలిసి వచ్చినా నా కొన వేలుతో సంహరించగలను. కాని ప్రాణభిక్ష కోరి వచ్చిన దెవరైనా నిరాకరించి పంపలేను అది నా వ్రతము.


34. కం. నీవాడను రామా!  యన
నావానిగ చేసికొందు నమ్మిన వానిన్
రావణుడేయైన యతని
కావగ ప్రాణములనిత్తు కడపటి వరకున్

ఒక్క సారి రామా నేను నీ వాడను అని నా దగ్గరకు వచ్చిన వాని నా వానిగా చేసుకుంటాను. అతడు విభీషణుడే గానీ రావణాసురుడే కానీ అతణ్ణి రక్షించడం‌ కోసం నా చివరి ప్రాణము పోయేంతవరకూ పోరాడగలను.

35. కం. రామా నీ వాడననుచు
యేమానవుడైన నాదు యెదుట నిలచినన్
యీమేదినియున్న దనుక
బాముల బడనీయననగ బడసితి వ్రతమున్

ఎవరైనా సరే  ఒక్కసారి  రామా నీ వాడను నేను అని నా యెదుట నిలిస్తే వారిని భూమి ఉన్నంతవరకు కాపాడతాననుట నా వ్రతము.                      

36. కం. భరతుని బోలిన తమ్ముడు
భరతాగ్రజువంటి కొడుకు పరికించంగన్
దొరుకున నినుబోలు హితుడు
ధరణీ తలమందు ‌వెదుక తరమా చూడన్

సుగ్రీవా, భరతుని వంటి తమ్ముడు, నా వంటి పుత్రుడు నీ వంటి స్నేహితుడు భూమ్మీద వెదకి చూచినా దొరకరయ్యా!

37. కం. నీరక్షణ నా భారము
నే రావణు జంపెద  నిను నిలిపెద ప్రభుగన్
కోరిన శరణము వీడన్
శ్రీ రాముని వచన మిదియె చింతను విడుమా


విభీషణా, నీవు నన్ను శరణు వేడినావు ఇక నీ భారము నాది. రావణుని సంహరించి నిన్ను లంకకు ప్రభువుగా చేస్తాను. నీవు చింతను విడువుము.

38. కం. దురితాత్ముని లంకేశుని
దరి దూతగ యున్న శుకుడు దాటియు జలధిన్
వెరపెరుగక కపివీరుని
దరిజేరియు నిలిచి తెలిపె దైత్యుని వార్తన్

చెడ్డ ‌మనసుగల రావణుని కొలువులో ఉన్న శుకుని రమ్మని తన మాటగా సగ్రీవునికి తెలపమని అతనికి చెప్పాడు. శుకుడు సముద్రాన్ని దాటి వచ్చి సుగ్రీవుని ముందు నిలబడి రావణుడు చెప్పిన మాటలను సుగ్రీవునికి చెప్పాడు.


39. కం. జతగూడిన మానవులను
హితవేమియు నొరుగ బోదు యినసుత నీకున్
మతి నెరుగుము యీ సత్యము
హతమౌదురు నరులు కపులు అడుగిడ లంకన్

సుగ్రీవా నీవు నాకు సోదరుని వంటి వాడవు. నేను సీతను ఎత్తుకుని వస్తే నీకేమి నష్టం? నీకు నాకు శతృత్వమేమీ  లేదు కదా?
యీ మానవులతో స్నేహం చేశావు దీనివల్ల నీకేదో మంచి ఒరిగి పోతుందనుకుంటే అది నీ భ్రమయే. నీకో సత్యం చెప్తున్నా విను శతృ దుర్భేద్యమైన లంకలో నర వానరులు అడుగుపెడితే చావటం ఖాయం. కాబట్టి రామునికి సాయం చేయడం మానివేయి.

40. కం. సగరుని వల్లనె పొందెను
జగతిని సాగరుడువృద్ధి, సాయము చేయున్
తగురీతిని ప్రార్థించిన
మొగిదెల్పును రాఘవునికి మోదము తోడన్

మొగి - విధము.

స్వామి హనుమ విభీషణుని పరిప్రశ్న చేసి అడిగారు, ఈ కడలి దాటడానికి మార్గమేమి అని. శ్రీ రాముడు సముద్రుణ్ణి శరణాగతి చేస్తే ఆయన మనకు దారి చూపించగలడు అని బదులిచ్చాడు విభీషణుడు.

41. కం. శ్రీరాముడు వినయముతో
వారాశిని కొలిచి యడిగె వరమీ యంగన్
వీరుని రాముని శౌర్యము
నీరధి పతియెరుగ లేక నిలిచె కదలకన్

అప్పుడు శ్రీ రాముడు మూడు రాత్రులు దర్భలపై శయనించి యథావిధి దీక్ష బూని, సముద్రుణ్ణి ప్రార్థన చేశాడు. సముద్రుడు ప్రసన్నుడు కాలేదు.

42. కం. మంచిని కోరెడి వారల
అంచిత బుద్ధియు, యణకువ, అసమర్థతగా
యెంచుదురీ లోక జనులు
మంచికి కాలమ్ము కాదు మహిలో యనుజా !

రాముడు లక్ష్మణునితో అంటున్నాడు, చూశావా లక్ష్మణా మంచికి కాలము కాదు ఇది. మంచి వారి సౌమ్య గుణాన్ని సహనాన్ని అసమర్థత గా పరిగణిస్తుంది కదా ఈ లోకం.

43. కం. జలముల ఇంకింతునిపుడు
కలిగించెద కడలిలోన కాలాగ్నిశిఖల్
తొలగించెద గరువమ్మును
జలచరముల మసినిజేతు శరవేగంబున్

ఈ సముద్ర జలాలలను ఇంకింపజేస్తాను. శరాగ్నులను కాలాగ్నిగా రగిల్చి జలచరములను మసిచేస్తాను. సముద్రుని గర్వాన్ని అణగిస్తాను. అని అన్నాడు వీరరాఘవుడు అమితమైన కోపముతో.

44. కం. నిలు నిలు మోరఘు వీరా
ఇలను జలము లక్షణమిది యెరుగుము రామా
కలిగించెద దారి నిపుడె
శిలలను తేలింతు నీవు చింతను విడుమా!

సముద్రుడు ప్రత్యక్షమై రామునితో, రామా ప్రపంచంలో పంచభూతాలకున్న లక్షణమిది ఈశ్వర శాసనం కదా. లోక కల్యాణం కొరకు,  మీకు దారిని కలుగచేస్తాను నీటిపైన వేసిన బండరాళ్ళను తేలేట్టు చేస్తాను నీవు చింతింపకు.

45. కం. సురశిల్పికి సుతుడు నలుడు
అరయగ నాతని సముండు అవనిని రామా
వరబలమున కట్ట గలడు
పరమాద్భుత సేతు వితడు పాథోధిపయిన్

సముద్రుడు రామునితో అన్నాడు రామా నీ పక్కనే వున్న ఈ నలుడు సురశిల్పియైన విశ్వకర్మ పుత్రుడు. అతనితో సమానమైన వాడు. సంద్రము పైన సేతువు కట్టడానికి సమర్థుడు.

46. కం. పోటెత్తెను కపి సంద్రము
చాటించుచు రామనామ జయ ధ్వానములన్
ధీటుగ కట్టిరి సేతువు
దాటి కడలి చేరె సేన దైత్యుని లంకన్

నలుని దర్శకత్వంలో వానర సేన మరొక సముద్రమా అన్నట్టుగా కదలి, కడలి పైన సేతువును కట్టి, రామ నామ జయజయ ధ్వానాలనతో  రావణుని లంకకు చేరుకున్నది.

47. కం. అదరెను భూతలము కపుల
పదఘట్టనకోర్వలేక పడిపోయె తరుల్
చెదరెను గుండెలు లంకకు
ముదము గొనిరి సురలు మునులు మొరసెను భేరుల్

మొరయు - మ్రోగు

కోట్ల వానర వీరుల పద ఘట్టనకు భూమి కంపించి పోయింది. అక్కడున్న వృక్షాలు నేలకూలాయి. లంకలోని వారు భయభ్రాంతులైనారు. రావణ సంహారానికి నాందిగా దేవతలు మునులు సంతోషించారు. దేవదుందుభులు మ్రోగినాాయి.


48. కం. నీలాకాశము నెరుపులు
కాలాంతమ్ముగ తోచు కలువల రేడున్
గాలికి బడుతరులు గిరులు
మేలగు శకునములుకావు మేదిని ననుజా!

ప్రకృతి లో కనబడే నిమిత్తములను తెలుసుకోగల (నిమిత్తజ్ఞుడు) శ్రీరాముడు లక్ష్మణునితో అంటున్నాడు, లక్ష్మణా చూడు ఆకాశం ఎర్రగా మారింది, రక్తపు చుక్కలతో మేఘాలు వర్షిస్తున్నాయి, గాలికి రేగిన ధూళికి పర్వతాలు వృక్షాలు పడిపోతున్నాయి, ప్రళయకాలం సమీపించినపుడు చంద్రుని రంగులు మారిపోతాయి చంద్రుని చూస్తే అట్లా కనబడుతున్నాడు. ఇవన్నీ రాబోయే విధ్వంసానికి నిమిత్తములు అని‌ అన్నాడు.


49. కం. రాముని సీతను విడువుము
నీమంచికెచెప్పుచుంటి నేరుము యధిపా
సామమె మేలగు మనకిక
నామాటలు వినకనీకు నాశనమేగా

రాముడు రావణ దూతగా వచ్చిన శుకుణ్ణి వదిలి పెట్టమని ఆజ్ఞ ఇచ్చాడు. శుకుడు రావణునితో రాముని శౌర్యము, వానర సేనల బలము వివరించి సీతను విడువు లేకపోతే లంక నాశనమౌతుందని చెప్తాడు.

50. కం. సారణ శుకులెరిగించిరి
వారు గనిన వానరులను వారల బలమున్
కోరిన రూపము దాలుచు
వారి ఘనత,  రామునెదుట వారి వినయమున్

సారణ శుకులు వానరుల బలమును వారి కామ రూప శక్తి యుక్తులను రామునిపై వారికున్న అచంచల విశ్వాసమునూ రావణునికి తెలియబరచారు.

51. కం. వినుమో అసురాధీశా
కనుపించెడి వాడు హనుమ, కాలుని సముడే!
మన లంకను కాల్చు యితడు,
తను ఒక్కడె చాలు అసుర దర్పమణచగన్ !

రాజా! కనిపించుచున్న ఆ వీరుడే హనుమంతుడు అతని బలమును నీకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదనుకుంటా. నీ కళ్ళముందే లంకను కాల్చి వెళ్ళిపోయాడు. రాక్షసుల బలాన్ని అణచడానికి అతనొక్కడె చాలు.

52. కం. కలరు కపులు హనుమ సములు
గెలువగ నిను సమరమునను ఖేలగ రాజా!
కలరు సుగ్రీవుని సేనలొ,
అలుపెరుగని కోట్ల కపులు అరయగ నధిపా!

కానీ నీ దురదృష్టమేమంటే హనుమంతుని సములు సుగ్రీవుని సేనలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. యుద్ధం వారికి ఒక ఆట నిన్ను జయించడం అంత పెద్ద పని కాదు వారికి.

53. కం. అరుల పొగడు మీరిరువురు
మరచితిరే రాజనీతి!  మంచి చెడుగులన్!
గురుతెరిగియు మీ సేవలు
పొరపాటు సహించుచుంటి పొండిక మీరల్ !

శుకసారణుల మాటలు విన్న రావణుడ చాల క్రోధముతో " మీ రిద్దరూ నా‌ముందు శతృవును ఇంతలా పొగడుతున్నారే!  ఇదేనా మీకు తెలిసిన రాజ నీతి? లేక నేర్చుకున్నదంతా మరచి పోయారా? ఇంతకు మునుపు మీరు నాకు చేసిన సేవలను గుర్తుంచుకొని మిమ్మల్ని ప్రాణాలతో విడిచి పెడుతున్నా, పొండి ఇక్కడినుంచి"  అని ఆగ్రహంతో అరచాడు. వారిద్దరూ  అతనికి నమస్కరించి నిష్క్రమించారు.

54. కం. సీతాపతి మాయ శిరము
ఆతల్లికి జూపి నగియె అసురాధముడున్
భూతనయది నిజమనుకొని
భూతల మున బడెను తాను మూర్ఛను అపుడున్

రావణుడు కుటిల బుద్ధితో మాయను పన్ని అచ్చు రాముని వలె ఉన్న ఒక ప్రతిమ తలను తయారు చేసి సీతకు చూపించాడు. తల్లి జానకి అది నిజమనుకుని మూర్ఛను పొందింది.

55. కం. వల వల యేడ్చెను మైథిలి
పలువిధముల పతిని దలచి బాధతొ పొగిలెన్
నలువ వరము తీరునిపుడు
కులసతి కన్నీరులంక కాల్చియె తీరున్

నలువ - బ్రహ్మ

మూర్ఛనుంచి తేరుకున్న సీతమ్మ రాముని కొరకు ఎంతో కన్నీరుకార్చింది. పతివ్రతల కన్నీరు లంకను కాల్చక మానదు కదా!

56. కం. తరమా తల్లీ!  రాముడు
మరణించుట యన్న మాట మహిలో చూడన్!!
దురితాత్ముని మాయయె యని
సరమ పలికె సీత మదికి సాంత్వన నిడుచున్

సరమ, విభీషణుని పత్ని ధర్మాత్మురాలైన ఆమె, సీతా విలాపము చూచి ఆమె తో, తల్లీ రాముడు మరణించడం అన్న మాట సాధ్యమయ్యే విషయమేనా! ఎట్లా నమ్ముతున్నావు తల్లీ. నా కళ్ళారా చూచి వచ్చాను రాముడు వానర సేనతో లంక బయట యుద్ధానికి సిద్ధంగా వున్నాడు. ఇది కేవలం నిన్ను ప్రలోభపెట్టడానికి రావణుడు పన్నిన పన్నాగమే,  అని సీతను ఓదార్చింది.

57. కం. లంకేశుడు కనులబడగ
హుంకారముతో కపీశుడురికెనతనిపై
సంకుల సమరమ్ము గరిపి
పంకిలమతి మాయనెరిగి పరుగిడి మరలెన్

సువేల పర్వతం పైన సుగ్రీవునితో కలిసి ఉన్న రామచంద్రుడు లంకానగర శోభను తిలకిస్తున్నాడు. అంతలో లంకేశుడు తన పరిచారకుల సేవను అందుకుంటూ వారికి కనబడ్డాడు. ఇంత అనర్థానికి కారణమైన ఆ దశకంఠుని చూడగానే సుగ్రీవునికి పట్టరాని కోపం వచ్చింది. ఒక్క ఉదుటున రావణుని ముందుకు దుమికాడు. ఇద్దరికీ భయంకరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. రావణుడు గతిలేక మాయను ఆశ్రయించాడు. అది గ్రహింవచిన సుగ్రీవుడు తిరిగి సువేల పర్వతానికి మరలి పోయాడు.

58. కం. ఏమీసాహసము హితుడ
నామేలునుకోరు నిన్ను నష్టపడినచో,
యేమౌనోయీరాముడు
నామిత్రుడు లేనిబ్రతుకు నరక సమమెగా!

రావణునితో యుద్ధం చేసి వచ్చిన సుగ్రీవునితో రాముడు, మిత్రమా ఏమీ ఈ సాహసము కాకూడందేదైనా జరిగి ఉంటే నా పరిస్థితేమి? నీ వంటి స్నేహితుడే లేని రోజు నేను ప్రాణాలతో ఉండగలనా? అని అన్నాడు.

59. కం. సురపతి సుతునికి సుతుడను
అరుదెంచితి మేలుదెలుప అసురేంద్రా నీ
అరిగ దెలియు రాముడు ఆ
హరిగ నెరుగు నీదు యసువు లారక మునుపే

60. కం. కంటకునిగ మారి సురల
వెంటన్ బడి పరసతులను వేధించితివే
ఒంటరి సీతను గొంటివి
మంట గలిపి నిన్ననిపెద మారకు కడకున్


రాముడు చివరి ప్రయత్నంగా వాలి సుతుడైన అంగదుణ్ణి దూతగా రావణుని వద్దకు పంపాడు. అంగదుడు రావణునితో అన్నాడు "ఇంద్రుని కుమారుడైన వాలి తనయుడను నేను , నీకు మంచి చెప్పడానికి వచ్చాను, నీ ప్రాణాలు పోకముందే నీ శతృవుగా కనబడుతున్న రాముడు సాక్షాత్తు శ్రీ హరి అని తెలుసుకో అని తెలిపి రాముని సందేశాన్ని అతనికి తెలిపాడు.

"త్రిలోక కంటకుడవైన నీవు దేవతలను మునులను చాల కధ్టపెట్టావు. పర సతులను కామాంధుడవై చెరబట్టావు. సీతను ఒంటరిగా వున్నపుడు అపహరించావు. ఈ కారణాల వల్ల ఈ నాడు నీకు మరణ దండన తప్పదు"

61. కం. భయమెరుగని కపివీరులు
జయము జయము రామచంద్ర జయమని యనుచున్
రయమున యేగిరి ముందుకు
భయకంపిత యయ్యె లంక వానర ధ్వనులన్

వానర సేనలు లంక కోటను ముట్టడించారు రావణునికి పచ్చని లంక నేల గోధుమ వర్ణంగా కనపడింది. వానరులు జయము రామచంద్రునికి, జయము లక్ష్మణ స్వామికి, జయము సుగ్రీవునికి అంటూ వేగంగా కోటపైకి ఎక్క సాగారు. వారి జయధ్వానాలకు లంకలోని అసురులంతా భయ కంపితులైనారు.

62. కం. హరివీరులు యరిసేనలు
ధరణీతల మదరి పోవ తలపడిరి యనిన్
తరులు గిరులు జడి వానగ
కురిపించిరి రామదండు ఘోరాలమునన్

వానరులకు అసురులకు యుద్ధం మొదలైంది. భూతలము అదిరిపోయింది వారి వీరాకృతికి. ఇంత కాలానికి మంచి రోజులొచ్చాయి కదా అని దేవతలు మునులు చాల సంతోషించారు.

63. కం. దారుణ సంగ్రామమ్మున
వీరుల శిరములు తనువులు వేరై పడగన్
పారెను రుధిరాంబుధి యట
మారెను లంక మశనముగ మారణ కాండన్

భీకరమైన సంగ్రామము సాగింది వారిద్దరి మధ్యన. శిరసులెగిరి పడ్డాయి మొండెములనుండి ఉబికి వచ్చిన రక్తం నదిగా మారి పారింది. నిర్జీవమైన దేహాలతో పచ్చని లంక, రావణ కామ దాహానికి స్మశానం లాగ మారింది.

64. కం. మూగిన మబ్బుల మాటున
దాగిన దైత్యుని సుతుండు దశరథ సుతులన్
నాగాస్త్రముతో కొట్టగ
ఊగుచు ధరపైన బడిరి ఉడిగిన చేష్టల్

మేఘనాథుడు మాయా యుద్ధము చేస్తూ మేఘాలను సృష్టించి వాటి వెనుక దాగి నాగాస్త్రమును రామ లక్ష్మణులపై సంధించాడు. విషము మెల్లగా ఎక్కి నేలపైన చేష్టలుడుగి పడిపోయారు రఘువీరులు.

65. కం. రావణుడా వార్తను విని
పూవులతో స్వాగతమిడి పుత్రుని గెలుపున్
నా వారసుడని ముదమున
కైవారము జేసె సుతుని గరువము తోడన్

కైవారము - పొగడ్త

రామలక్ష్మణులను తన పుత్రుడు నిహతులను చేశాడన్న వార్త వినగానే యెగిరి గంతేశాడు రావణుడు. అతనికి ఘనస్వాగతాన్ని ఇచ్చి. ఆహా!  నాకు నిజమైన వారసుడు మేఘనాథుడే అనుకుంటూ అతన్ని పొగడ్తలతో ముంచెత్తాడు.

66. కం. దురితాత్ముడు దయహీనుడు
ధరకూలిన రఘుతనయుల తనువులు జూపన్
ధరణీసుత నచట యనిపె
మరణించిన వారి జూచి మైథిలి యేడ్వన్

రామలక్ష్మణులు అచేతనులై పడియున్న దృశ్యాన్ని చూచి సీత తనను చేరగలదన్న దురాలోచనతో దయావిహీనుడు దశకంఠుడు సీతను పుష్పకముపైన యుద్ధ స్థలమునకు త్రిజట తో కూడిన అసుర వనితలతో పంపాడు.

67. కం. ననుజూచిన దైవజ్ఞులు
ఘన యోగము కలదనునది కల్లగ మిగిలెన్
మనువాడినవాని కలసి
చినదానిగ కన్న కలలు ఛిద్రము లాయెన్!

నేలపై పడియున్న రఘువీరులను మరణించారని తలచిన సీతమ్మ కన్నీరు మున్నీరై యేడ్చింది. అయ్యో నన్ను చిన్నప్పుడు చూచిన దైవజ్ఞులు చెప్పిన మాటలన్నీ అబద్ధంగా మిగిలిపోయాయి. నా భర్తతో నేను చిన్నప్పుడు కన్న కలలన్నీ విరిగిపోయినాయి కదా అని విలపించింది సీతమ్మ.

68. కం. భరియింపదు పుష్పకమిది
మరణించిన నీదు భర్త మాతా నిన్నున్
సురలందరు కదిలొచ్చిన
ధరపై రఘురాము గెల్వ తరమా తల్లీ !

త్రిజట అనే అసుర వనిత , సీతపై ఉన్న స్నేహముతో ఆమెను ఊరడిస్తూ అన్నది, సీతా రామలక్ష్మణులు మరణించారన్నది అసత్యం. అందుకు గల కారణాలను చెప్తాను విను. మనము అధిరోహించి వున్న ఈ పుష్పకవిమానము దివ్యమైన మహిమ గలది. ఒకవేళ నీ భర్త మరణించి వింటే ఇది నిన్ను వహింప జాలదు. అదీ కాక ఇంద్రుడు దేవతలు రాక్షసులతో కలిసి వచ్చి పోరాడినా రఘురాముని ముందు యుద్ధంలో గెల్వడమన్నది సాధ్యం కాదు. కాబట్టి నీవు విచారించకు.


69. కం. కనులు తెరచి కమలాక్షుడు
తన తమ్ముని జూచి మిగుల తలడిల్లె మదిన్
నినుకోల్పడి యెటు బోయెద
మనలేనీ లోకమునని మరిమరి యేడ్చెన్

స్ప్రహలోకి వచ్చిన రామచంద్రుడు కదలిక లేక పడియున్న తమ్ముని స్థితిని జూచి తల్లడిల్లి పోయాడు. లక్ష్మణా నిన్ను కోల్పోయిన నాడు నాకు అంతా అంధకారమే నాకు సీతా వద్దు ఈ బ్రతుకు వద్దు నీతో బాటు నేను కూడా యమలోకానికి వస్తాను అని దుఃఖించాడు.


70. కం. కనుపాపగ గాచితివే
వనవాసమునంత నన్ను వదలక యెపుడున్
నినుతోడ్కొనిపోక యెటుల
కనతల్లిని జూతునేను కన్నుల తోడన్!!

లక్ష్మణా తండ్రి కొడుకుని కనుపాపలాగ కాపాడినట్టు వనవాసమంతా నన్ను కాపాడినావు. సుమిత్రా మాతను నీవు తోడు లేకుండా నా కన్నులతో చూచేదెలా!

71. కం. పాలకడలి నందు వెదకి
వేలుపుగురుడా యమరుల వేఱుల గాచెన్
కాలము గడవక తెచ్చిన
రాలక సౌమిత్రికియవి రక్షణ నిచ్చున్

సుషేణుడు అనే వానర వైద్యుడు రాముని విలాపము చూచి తనకు తెలిసిన విషయాన్ని సుగ్రీవునితో రాజా, దేవాసుర సంగ్రామం లో దేవతలను రక్షించడానికి దేవ గురువైన బృహస్పతి పాల సముద్రం లో వెదకి తెచ్చిన  కొన్ని అమూల్యమైన వేఱులు లక్ష్మణుని ప్రాణాలు రాలకుండా కాపాడగలవు హనుమంతుని పంపి అవి తెప్పించు అన్నాడు.

72. కం. ఖగరాజుని వేగమునకు
నగశిఖరములూగె, మెరిసె నభమున మెరుపుల్!!
సెగల నుమియు యురగమ్ములు
బిగిని విడిచి రఘుతనయుల భీతిలి పాఱెన్!!

గరుత్మంతుని వేగానికి అక్కడ పర్వతాలు ఊగినాయి ఆకాశం మెరుపులతో శోభాయమానమైంది. వినతా కుమారుని చూడగానే రామలక్ధ్మణులను గట్టిగా పట్టుకొని ఉన్న సర్పాలు భయపడి పారిపోయాయి.

73. కం. నీకున్ నాకున్ స్నేహము
యేకారణమున కలిగెనొ యినకుల తిలకా
నీకా కథ నెరిగించెద
ఆకైకసి నందనుండు ఆరిన పిదపన్

స్వస్థను పొందడమే కాకుండా పూర్వం కన్న ఎక్కువ బలముతో రామ లక్ష్మణులు యుద్ధానికి సిద్ధమైనారు. రాముడు అతనితో మహాత్మా మాకు ఎంతో మేలు చేశావు నిన్ను చూస్తే నాకు మా తాతగారైన అజమహారాజు లాగా కనబడుతున్నావు. నీవు ఎవరవు అని ప్రశ్నించగా గరుడుడు రామునితో , రామా నీవు నాకు ప్రియమిత్రుడవు. మనకు స్నేహం ఏ కారణం చేతకలిగిందో నీకు రావణ సంహారం జరిగి సీత నీకు దక్కిన పిదప తెలుపగలను అని వచ్చిన వేగంతోనే మరలి వెళ్ళిపోయాడు.


74. కం. హరివీరుల దునుమాడగ
అరివీరుడు ధూమ్రనేత్రుడడుగిడ రణమున్
శరవేగముతోడ హనుమ
ధరగూల్చెను తలను మోది తడబడ కతనిన్

రామలక్ష్మణులు స్వస్థత పొండమే కాకుండా మిక్కిలి బలము కలిగినవారైనారన్న వార్తను విన్న రావణుడు మిక్కిలి క్రోధంతో ధూమ్రాక్షునే రాక్షసవీరుణ్ణి యుద్ధానికి పంపించాడు. ఆ రాక్షసుడు హనుమంతుని సేనతో తలపడ్డాడు. గొప్ప యుద్ధం జరిగింది వారిద్దరి మధ్యన. గదతో రాక్షసుడు హనుమంతుని తలపై కొట్టగా కొంచెంకూడా తడబడని స్వామి హనుమ అతన్ని ఒక బండరాయితో తలపైన మోది సంహరించాడు.

75. కం. శూలమ్ములు ఘనరథమున
దాలిచి చెలెరేగు వజ్రదంష్ట్రుని కెదురై
కాలుని వలెనిల్చి యనిని
వాలి సుతుడు వాని జంపె పర్వత శిలలన్

ధూమ్రాక్షుడు హతుడైన వార్తను విని రావణుడు అతిక్రూరుడైన వజ్రదంష్ట్రుడనే రాక్షసుణ్ణి యుద్ధానికి పంపాడు. ఆ అసురుడు ఘోరమైన యుద్ధంలో ఎందరో వానరవీరులను సంహరించాడు. వానర యువరాజు వాలిసుతుడు అంగదుడు అతనితో గొప్ప యుద్ధం చేసి చివరికి ఒక పర్వత శిలతో అతని తల వక్కలు చేశాడు.

76. కం. వీరుడకంపను డేగెను
పోరునకై సిద్ధపడుచు పుడమి యదరగన్
దారుణ యుద్ధము జరుగగ
మారుతి పంపెను యతనిని మారకు కడకున్

వజ్రదంష్ట్రుడు హతమవగానే అకంపనుడనే అసుర వీరుణ్ణి నాయకునిగా చేసి రావణుడు యుద్ధానికి పంపాడు. అకంపనుడు శూరుడు అతివేగంగా యుద్ధం చేయడంలో నేర్పరి. వానరులను చెల్లా చెదరయేట్లు ఘోరమైన యుద్ధం జరిపాడు. వానరులకు రక్షకా మళ్ళీ స్వామి హనుమ నిలబడ్డాడు. భయంకరమైన పోరు సాగింది. చివరికి ధర్మమే కదా జయించవలసింది. అకంపనుని సంహరించి యమసదనానికి పంపాడు వీర హనుమంతుడు.


77. కం. తమయేలిక కామాగ్నికి
సమయగ యసురులు రణమున శలభముల గతిన్
సమరాంగణమున దైత్యుడు
సమతుల్యు నమాత్యుననిపె సమిధగ యపుడున్

వెళ్ళిన అసుర వీరులు ఒక్కరు తిరిగిరాలేదు. రావణుని కామాగ్నికి ఒక్కొక్క రాక్షస వీరుడు శలభాల్లాగా మాడి పోతున్నారు. అప్పుడు రావణుడు తన ప్రధాన మంత్రి అయిన ప్రహస్తుని యుద్ధానికి పంపాడు.


78. కం. శూలాయుధుడు ప్రహస్తుడు
వేల యసుర గణము తోడ భీకర ధ్వనులన్
కాలునివలె పోరాడెను
నీలునితో రణమునందు నేలను కూలెన్

రావణుని వద్ద ఆజ్ఞ ను పొంది ప్రహస్తుడు పెద్ద సైన్యంతో బాటు భీకర ధ్వని చేస్తూ యుద్ధానికి బయలుదేరాడు. భయంకరమైన యుద్ధం చేస్తూ ఎంతో మంది వానరులను సంహరించాడు.
చివరికి నీలుడనే వానర వీరునితో పోరాడి మరణించాడు.

79. కం. సురజేతలు దితిసుతులను,
హరివీరులు హతము జేయ నసురేశ్వరుడే
బరిలోనికి దిగి వచ్చెను
'హర హర ' యని అసురగణము హర్షము తెలుపన్

అమరులను జయించిన ప్రహస్తుడు మొదలగు వీరులంతా కపి వీరుల చేతిలో హతము పొందడం చూచిన లంకేశుడు, తానే స్వయంగా యుద్దానికి నాయకత్వ వహించాలని నిర్ణయించిన వాడై అసుర సేనలు 'హర హర ' అని ఘోషిస్తుండగా రుద్రుని వలె బయలుదేరాడు.

80. కం. వానర రుధిరము తోడన్
యీనేలను తడిపెదనిపుడెవరెదురైనన్
సేనలతో యగుపించెను
కానగ లంకేశుడపుడు కాలాంతకుడై

ఈరోజు ఈ వానరుల రక్తంతో భూమికి అభిషేకం చేస్తాను,  అమితమైన క్రోధంతో ఉన్న రావణుడు తన స్వర్ణ రథము పైన రణస్థలములో సేనలతో యమునిలాగా కనబడ్డాడు.


81. కం. శతసూర్యుల తేజముతో
క్షితి యదరగ ఘన రథమున, కేలన్ ధనువున్
దితిసుతు డా యసురేశుడు
అతికాయులు వెంట నిలువ అడుగిడె రణమున్

గొప్ప రథముపైన అనేక సూర్యుల కాంతితో చేతిలో శర ధనువులను ధరించి తనవెంట బాహుబలులు, అతికాయులు అయిన రాక్షస వీరులను తోడ్కొని రావణుడు సమర భూమిలో రాజఠీవితో నిలబడ్డాడు.

82. కం. యేమీ! యీతని తేజము
యేమా శౌర్యము కనముగ యెచ్చట నైనన్
సామాన్యుడు కాడితడని
రాముడు గనె యచ్చరమున లంకేశ్వరునిన్

రామచంద్రుడు మార్తాండునిలా వెలుగుతున్న రాక్షస రాజును చూచి "ఆహా యేమి యితని తేజస్సు, యేమి బలశౌర్యములు!!  యితడు సామాన్యునిలా కనబడటం లేదు" అని ఆశ్చర్యముగా అతనివైపు చూచాడు.

83. కం. ఎదుట నిలుచు అసురేంద్రుని
కెదురేగెను యినసుతుండు యిభరాజువలెన్
బెదరక రావణు డాతని
యెదనిలిపెను వాడిశరము యిలపై పడగన్

రావణుని చూచిన సుగ్రీవుడు అతనికి ఎదురుగా మదగజం లాగా పరుగెత్తి వెళ్ళాడు. పర్వత శిఖరాలను అతనిపై పడవేయగా వాటిని తన శరములతో తునకలు చేసి, సుగ్రీవుని బంగారు పొన్ను గల అస్త్రమలతో అతని శరీరాన్ని చాల గాయపరచాడు రావణుడు. నేలపైన స్ప్రహలేకుండా పడిపోయాడు సుగ్రీవుడు.

84. కం. దశకంఠుడు చెలరేగెను
దిశలన్నిట నొక్కడగుచు దివిభువినదరన్
నిశిచరపతి నెదురు కొనగ
దశరథ సూనుడు ధనువును దాల్చెను కరమున్

నాలుగు దిక్కుల తాను‌ఒక్కడే అయిన రావణుడు గొప్ప కపివీరులను వాడి బాణాలతో కొట్టి పడవేశాడు. అది చూచిన రామచంద్రుడు ధనువును చేతిలోకి తీసుకున్నాడు.

85. కం. హరివీరులు నేలబడగ
యరుదెంచెను హనుమ దుమికి అసురుని యెదుటన్
అరివీరుని పిడిగుద్దుల
కురమున పారగ రుధిరము యుర్విని కూలెన్

రావణుని శరధాటికి సుగ్రీవుడు మొదలగు కపి వీరులు నేల బడగానే,  రాముడు కోపించి ధనువును చేబట్టగా చూచిన హనుమంతుడు పరుగున రావణుని తో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. బలంగా రావణుని వక్షఃస్థలంపైన చరచాడు స్వామి హనుమ , క్రోధావేశంతో రావణుడు హనుమంతుని కొట్టగా నేలపైన పడిపోయాడు హనుమ.

86. కం. నాకానతినిడుమన్నా
యీకాముకున కెరిగింతు యినకుల శౌర్యం
నాకారిని యోడింతును
నాకార్ముక కౌశలమున నాశము జేతున్

లక్ష్మణుడు రామచంద్రుని ఆజ్ఞను అర్థిస్తూ, అన్నా నీవు రావణునితో యుద్ధానికి ఎందుకు ఈ కామాంధునికి రఘువీరుల శౌర్యాన్ని పరిచయం చేస్తాను. నా ధనువు చాల్య్ ఇతన్ని నాశనం చేయడానికి.


87. కం. శరములు నభమున తగులగ
తరగని వెలుగులు యెగిసెను దశదిశల నిలన్
హరికరి కరణిని తలపడు
నిరువురి నిపుణతను గనిరి యెలమిని అమరుల్

రావణ లక్ష్మణుల మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఒకరిని మించి ఒకరు యుద్ధ కౌశలాన్ని చూపెడుతూ పోరాడారు.  సింహము మరొకరు ఏనుగులాగా కనబడుతున్న ఇద్దరినీ  దేవతలు ఆశ్చర్యంతో చూచారు.


88. కం. నలువను తలచియు వేసిన
ములుకుల బాణము తగులగ మూర్ఛితుడయ్యెన్
బలశాలి లక్ష్మణుండు య
నిలాత్మజు డరుగుదెంచె నిటలాక్షుగతిన్

లక్ష్మణుని యుద్ధ కౌశలాన్ని అతని లాఘవాన్ని చూచి చాల ఆశ్చర్యపోయిన రావణుడు గతిలేక బ్రహ్మాస్త్రాన్ని అతనిపై సంధించాడు. అది తాకగానే మూర్ఛను చెందాడు లక్ష్మణుడు.     స్వామి హనుమ  అదిచూచి వెంటనే క్రోధావేశంతో కాలునిలాగా అక్కడికి వచ్చి నిలబడ్డాడు.

89. కం. పిడిగుద్దున పడవేసెను
జడమతి రావణుని హనుమ చతికిల బడగన్
యొడిలో‌సౌమిత్రినిగొని
వడిగ హనుమ రాము కడకు పరుగున చేరెన్

స్వామి హనుమ పిడి గుద్దుతో చరచగానే రావణుడు నేలపైన చతికిలబడ్డాడు. హనుమ లక్ష్మణుని ఎత్తుకుని రాముని వద్దకు తీసుకుని వెళ్ళాడు.

90. కం. గరుడునిపై యధివసించు
హరిగా నా భుజము పైన యాసీనుడవై
పరిమార్చుము యసురేశుని
తరమా యిటులేగిన నిను దైత్యుడు గెలువన్ ?

రామచంద్రుని స్వామి హనుమ అర్థిస్తూ , రామా గరుత్మంతునిపైన ఆ శ్రీ హరి అధిరోహించి విరోచన సంహారము చేసినట్లు నా భుజము పైన ఎక్కి ఈ అసురేంద్రుని తో తలపఫుము. నిన్ను గెలవడం ఆ రావణునికి సాధ్యం కాదు.

91. కం. నిలునిలుమో యసురేశ్వర
తలదాచగ చోటు లేదు ధరణీ తలమున్
యిలవేల్పులె దిగివచ్చిన
కులసహితముగాను నిన్ను కూల్చెద నికపై!

రావణా నిలువుము! నాకింత దుఃఖాన్ని కలిగించిన నీకు‌ ఇకపై తలదాచుకోవడానికి చోటు లేదు. ఎవ్వరడ్డుపడినా నిన్ను‌ నీ కొఫికిలను మనుమలను కుల సహితంగా నాశనం చేస్తాను ఇక ‌మీదట.

92. కం. హనుమంతుని భుజపీఠమె
తనరథముగ  రావణు జని,  తప్పని గురితో
ఘనమకుటము పడవేసెను
యినకులమణి తనశరమున యిలపై పడగన్!

స్వామి హనుమ భుజ పీఠాన్నే తన రథముగా చేసికొన్న శ్రీరామచంద్రుడు. అర్ధచంద్రాకార శరముతో రావణుని కిరీటాన్ని నేలపై పడేట్టుగా కొట్టాడు.

93. కం. అలసితవో యసురాధిప!
నిలిపి తగవు రేపు రమ్ము నేటికి చాలున్!
బలము గొనుము, లంక జనుము
తలపడ బలహీనులనిల తలవంపు కదా!

అలసిపోయిన రావణునితో శ్రీరాముడు. రావణా నీవు చాల బలహీనుడవై పోయావు అలసియున్నావు కాబట్టి ఈ రోజునకు యుద్ధాన్ని ఆపి లంకకు వెళ్ళు. రేపు మళ్ళీ బలం‌పుంజుకొని రమ్ము. బలహీనునితో యుద్ధం చేయడం వీరలక్షణం కాదు కదా.

94. కం. పరమేశ్వరి, వరుణసుతయు
సురభామిని శాపవాక్కు చూపిన ఫలమో
నరు చేతిలొ మరణమనుచు
సరసీరుహ యాసనుడిడు శాసనమిదియో

శ్రీరాముడు పెట్టిన ప్రాణభిక్షను భరించలేక ఘోరావమానము పొందిన రావణుడు, తన దురవస్థకు కారణాలు వెతుక్కుంటూ అనుకున్నాడు, నాకిప్పుడు తెలుస్తున్నది, పార్వతి, వరుణ కుమారి పుంజికస్థల, సుర అప్సర రంభ ఇచ్చిన శాప వాక్కు ఫలమో?  చతుర్ముఖ బ్రహ్మ నరుని చేతిలో నీకు మరణమనుకుని చేసిన శాసనమో?

95. కం. అనరణ్యునియాగ్రహమో
మునికాంతను చెరను బట్టు మోహ ఫలంబో
యినకులమణి రూపమ్మున
ననువెంటాడుచు వచ్చె నాశము చేయన్

రఘుకుల రాజైన అనరణ్యుని ఆగ్రహమో, తపస్సు చేసుకుంటున్న వేదవతిని చెరబట్టాలనే నా మోహబుద్ధియో రాముని రూపంలో నన్ను వెంటాఫి లంక వరకు వచ్చింది. ఇది నన్ను నాశనము చేయక తప్పదు.

96. కం. వానరుడని పరిహసించు
నానేరము సైపలేని నందీశ్వరుడున్
ఆనాడిడె శాపమ్మది
యీనాడిటు రూపు దాల్చె యినసుతు సేనై!

వానర ముఖమని పరిహసించి నేను తూలనాడిన నందీశ్వరుడు ఆనాడు నాకు ఇచ్చిన శాపము సుగ్రీవుని సేనల రూపంలో నన్ను నాశనం చేయడానికే రామునితో కలసి వచ్చింది.

97. కం. భీకర కాయుడు వీరుడు
నాకష్టము తీర్చువాడు నాదు యనుజుడే
నాకాధిపు‌ గెలువంగల
కైకసి సుతుని కొనిరండు కరణీయముకై

రాముని చేతిలో పరాభవం చెందిన రావణుడు వేరే గతిలేక భీకర కాయము గల కైకసిసుతుడైన తన తమ్ముడే వానర సేనను త్రుంచ గలడని భటులతో అతన్ని తన సముఖానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు.

98. కం. నిదురించు కుంభకర్ణుని
కదిలించగ కల్లునింపి కడవల తోడన్
మదగజముల నడిపించిరి
అదిలించుచు అసురగణము యాతని పైనన్

ఒకసారి నిదురపోతే ఆరుమాసాలు ఏకధాటిగా నిదురపోతాడు కుంభకర్ణుడు. అది బ్రహ్మ ఇచ్చిన శాపానుగ్రహం అతనికి. ఎంతప్రయత్నించినా నిదురలేవని కుంభకర్ణుని లేపడానికి వేల అసురులు అతనికి ఇష్టమైన కల్లును కుండలతో తీసుకొచ్చి అతనిపై మదగజములను నడిపించారు.

99. కం. పురవీథిని యరగు నసురు
వెరపొందిన కపుల గని విభీషణు డనియెన్
దురితాత్ముని మరయంత్రము
అరికాదని తెలుపు వీరి కవనిజ కామా!

రామా! నడచి వెళుతున్న వాడు నా అన్న కుంభకర్ణుడు. అతిభయంకర స్వరూపముతో ఉన్న యితని చూచి వానరులు భయపడి యున్నారు వీరి భయము తొలగడానికి నడచి వెళుతున్నది మరయంత్రము మనిషి కాదని చెప్పడం మంచిది అని విభీషణుడు అన్నాడు.

100. కం. పుట్టెడు ఆకలి తోడను
పుట్టిన యీతడు తినంగ పుడమిని యన్నిన్
కట్టడి చేసె నలువ వీ
డిట్టుల చరింప, జనులకు హితమును కూర్చెన్

 రామా పుట్టీ పుట్టగానే పుట్టెడు ఆకలితో, పెను కాయముతో కుంభకర్ణుడు తన యెదుట పడ్డ ప్రాణులనన్నీ తినడం మొదలుపెట్టాడు. అది చూచి నలువ (బ్రహ్మ) లోక హితార్థం ఇతనికి  ఆరుమాసాలకు ఒక పర్యాయం తినేట్టుగా‌ కట్టడి విధించాడు.

101. కడుహాయిగ నిదురించితి
చెడుకాలము దాపురించి చెరిపెను శాంతిన్
ఎడము విడని కపి సేనలు
సుడిగాలిగ చుట్టిరిమన సుందర లంకన్

ఎదుట కూర్చున్న కుంభకర్ణునితో ఉన్న పరిస్థితిని చెప్పాడు రావణుడు. తమ్ముడా నీవు చాల హాయిగా నిద్ర పోయావు ఇన్ని‌ నాళ్ళు కానీ మన లంకకు చెడు కాలము దాపురించింది శాంతి కరువై పోయింది. మన సుందరలంక లో  ఎక్కడ చూచినా వానరులే.

102. క. గండము వచ్చిన దనుజా
మండెను మనలంకయంత మడిసిరి యసురుల్
దండింపగ యరిసేనల
అండగ నీవుంటివనెడి ఆశయె మిగిలెన్

గొప్ప గండం వచ్చిపడింది తమ్ముడూ, లంకంత మండుతున్న అగ్నిగోళంలా మారింది. ఆ అగ్నిలో ముఖ్యులైన రాక్షస వీరులంతా మరణించారు అంతా నాశనమై పోయింది. నీవు శతృవులను దండించగలవనే ఆశ మాత్రమే మిగిలింది. నాకు నీ సహాయం ఎంతో అవసరమిప్పుడు.

103. కం. వగతువు యీనాడిట్టుల
తగురీతిని తెలుప హితవు దాల్చక చెవులన్
మగనాలిని చెరబట్టిన
ముగియును నరకానదారి, ముంచియె తీరున్!

తన కర్మకు చింతిస్తున్న రావణుని చూచి కుంభకర్ణుడు నవ్వి, అన్నా సీతను రామునికి ఇచ్చేయమని విభీషణుడు నేను ఎంత చెప్పినా వినలేదు నీవు దాని ఫలితంగా ఈనాడు ఏడుస్తున్నావు. పతివ్రతలను తెరబడితే నరకం తప్పదు కదా. ఈ నీ చెడ్డ పని మన రాక్షస కులాన్ని ముంచివేయకమానదు.

104. కం. అన్నవు ప్రభుడవు లంకకు
నిన్నీ గతిచేయువాని నిలబడ నీయన్
ననన్నంపుము రణభూమికి
అన్నరులను వానరులను అణచెదనిపుడే

కుంభకర్ణుని హితోపదేశానికి క్రోధంతో ఉన్న రావణుని కుంభకర్ణుడు సముదాయించి. అన్నా చింతింపకు, నీవు నాకు ప్రభుడవు, పెద్దన్నవు నిన్ను ఈ గతికి తెచ్చిన వారిని నిలబడనిస్తానా?  నా ప్రాణమున్నంత వరకు పోరాడతాను. ఆ నరులను వానరులను ఇప్పుడే వెళ్ళి అణచివేస్తాను.

105.. కం. వీరులెపుడు చెప్పుకొనరు
వారి ఘనత తెల్లమౌను ప్రతిఘాతమునన్
మీరందరు  వాక్చతురులు
మీరాజును చెఱచినారు మెప్పుల కొరకే

మహోదరుని మాటలు విన్న కుంభకర్ణుడు అతనితో, మహోదరా, నిజమైన వీరులు వారి ఘనత వారే చెప్పుకోరు. ప్రత్యర్థి తో పోరాటములో వారి చేతలు, ప్రతిఘాతములే వారి ఘనతను తేటతెల్లం చేస్తాయి. మీలాంటి వాళ్ళు ప్రభువుకు నచ్చినట్లు మాట్లాడి అతనికి తీరని నష్టం తెచ్చిపెట్టారు. అని క్రోధంతో పలికాడు.

106. కం. దరహాసము నసురేంద్రుడు
అరివీరుని జూచిపలికె అనునయ వాక్కుల్
మరచి మహోదరు మాటలు
పరిమార్చుము రామసేన ఫాలాక్షువలెన్!

మహోదరుని పిరికితనం, కుంభకర్ణుని తో సంభాషణం విన్న  రావణుడు నవ్వుతూ తమ్మునితో అనునయ వచనములను పలికాడు. ఈ‌మహోదరుడు రామునితో యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు అతని మాటలు మరచిపో, రామ సేనలను ఆ రుద్రునిలాగా ఎదుర్కో అని‌అన్నాడు.

107. కం. ఆకాశమునంటు యసురు
నాకారము జూచి కపులు హడలి పరుగిడన్
భీకర గర్జన చేయుచు
రాకాసులమూకలేగె రణగొణ ధ్వనులన్

కుంభకర్ణుడు రాక్షస సేనతో గర్జన చేస్తూ యుద్ధానికి బయలుదేరాడు. ఆకాశాన్నంటే అతని భీకర స్వరూపాన్ని చూచిన వానరులు తలో దిక్కూ పారిపోయారు. అతని వెంట వున్న రాక్షస గణం యొక్క అరుపులతో రణభూమి అదిరిపోయింది.

108. కం. నింగిని బోలిన ముఖమున
మింగెను వేలాదికపుల, మేరువు సముడై
పొ‌ంగిన రావణు ననుజుడు
అంగములను విరిచి నమిలె అలయక వారిన్

కుంభకర్ణుని ఆకాశమంత నోరు తెరిచి వానరులను మింగివేశాడు. మేరువు అంతగా వున్న కాయముతో రణభూమిలో మారణహోమాన్ని సృష్టించాడు. పారిపోతున్న వానరులను పట్టి వారి శరీరాలను త్రుంచి నమిలి తిన్నాడు.

109.కం. వందలు వేలుగ కపులను
బంధించిన దైత్యుడపుడు భక్షణజేసెన్
ఎందరొ వానర వీరులు
చిందర వందరగ పడిరి శిరసులు తెగగన్

కుంభకర్ణుడు భీకర స్వరూపంతో చేతికి అందిన వానరులను భల్లూకములను విరిచి పడవేస్తూ, భక్షిస్తూ మూర్తీభవించిన యమునిలాగా ముందుకు సాగిపోయాడు రణభూమిలో. వానరుల శిరసులు మొండెములు చిందర వందరగా పడి యుద్ధభూమి రక్తపుటేరుగా మారింది.

110. కం. బలవంతుడు వానరపతి
కలుగును తలవంపతనికి కాపాడిన నే
నిలిచెద నిచ్చోటయని య
నిలాత్మ జుడుజేరె కపుల నెమ్మది నీయన్

 సుగ్రీవుణ్ణి ఓడించిన కుంభకర్ణుడు అతన్ని తన చేతుల్లో బంధించి లంకలోనికి తీసుకుని వెళ్తుండగా చూచిన బుద్ధిమతాంవరిష్టుడైన  స్వామి హనుమ తనలో అనుకున్నాడు "ఇప్పుడు నేను సుగ్రీవుని రక్షిస్తే వానర సేనల యెదుట అతనికి అవమానము కలుగుతుంది.  కాబట్టి నేను ఇక్కడే వుండి క్షతగాత్రులైన నావారికి ధైర్యాన్నిస్తాను"

111. కం. అరివీరుని యెదురుకొనగ
పరమోత్సాహమున నిల్చె భరతానుజుడే
శరముల ద్రుంచిన దైత్యుడు
మెరిసెను కరిమేఘునివలె మేదిని నపుడున్

సుగ్రీవుడు రాముని వద్దకు పరుగున చేరగానే , కుంభకర్ణుని ఎదురుకోవడానికి స్వయంగా లక్ష్మణుడు వచ్చాడు. లక్ష్మణుడు ఏడు బాణాలను కుంభకర్ణుని గురిచూచి వేయగా అవి అతని ఎదలో వెళ్ళి గుచ్చుకున్నాయి, బంగారు రంగులో ఉన్న బాణాలతో కుంభకర్ణుడు సూర్యుడు దాగిన నల్లని మేఘంలా మెరిసిపోయాడు.

112. కం. బాలునివోయీ లక్ష్మణ
చాలదు నీబలము నన్ను చంపగ రణమున్
జాలము చేయక తొలగుము
కాలుని కడకే యనిపెద కౌసల్య సుతున్

కుంభకర్ణుడు లక్ష్మణునితో, నీవు బాలుడవు నాతో యుద్ధానికి నీ బలం సరిపోదు‌. ఇక ఈ యుద్ధాన్ని రాముని సంహరించి ఆపివేస్తాను.

113. కం. వచ్చినది కుంభ కర్ణుడు
చచ్చుటకా వాలికాను చాటుగ చంపన్
తుచ్ఛ ఖరాదుల కానిపు
డిచ్చెద మరణమ్మునీకు యినకుల వీరా!

రాముని చూచిన కుంభకర్ణుడు అతనితో అన్నాడు. రామా నీ యెదుడ నిల్చినది దేవతలను గెల్చిన కుంభకర్ణుడు, సులువుగా చచ్చుటకు నేను వాలిని కాను, ఆ విరాధ ఖరులను కాను. నీకు మరణాన్ని కానుకగా ఇస్తాను కాచుకో.

మూ. నాహం విరాధో విజ్ఞేయో న కబన్ధః ఖరో న చ
న వాలీ న చ మారీచః కుంభకర్ణ సమాగతః


114. కం. కుప్పించెను కుంభకర్ణుడు
కొప్పరముగ దాశరథిని కూల్చెద ననుచున్
గొప్పగు ధనువున రాముడు
నిప్పుల శరముల యసురుని నిల్పెను రణమున్

రాముని వైపు వేగముతో కుప్పించి లంఘించాడు కుంభకర్ణుడు. విజృంభించి తనవైపు వస్తున్న రాక్షసుని నిప్పు లాంటీ బాణాలతో అడ్డుకున్నాడు రఘురాముడు.

115. కం. చండ ప్రచండడు రాముడు
ఖండించెను యిరుకరముల ఘన శరములతో
కొండను బోలిన యసురుని
మొండెము పడవేసెనపుడు మునుగగ కడలిన్

మేరు నగ ధీరుడైన రాక్షసుని రెండు చేతులూ కాళ్ళు గొప్పవైన అస్త్రములతో ఖండీంచిన  చండ ప్రచండుడు రాముడు ఇంద్రాస్త్రంతో అతని శరీరాన్ని సముద్రం లో పడవేశాడు.
కుంభకర్ణుడు అంతమయ్యాడు.

మూ. తచ్చాతికాయం హి మహత్ప్రకాశం
రక్షస్తదా తోయనిధౌ పపాత
గ్రాహాన్ పరాన్ మీనవరాన్ భుజంగాన్
మమర్ద భూమిం చ తదా వివేశ.

116. కం. రావణు కొమరులు మువ్వురు
దేవాంతనరాంతకులును  త్రిశురుని తోడై
కావరమున యేగిరపుడు
ఆవానర సేననణచ అంతకు సములై

అంతకుడు- యముడు

117. వాలి సుతుడు అతని సముడు
కాలుని వలె నిల్చి వారి కన్నుల యెదుటన్
కాలము చెల్లిన యసురుల
కాలాంతకుడై యనిపెను కాలుని కడకే

కాలుడు- యముడు, రుద్రుడు
కాలాంతకుడు - ప్రళయ స్వరూపుడు

రావణ కుమారులు దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరుడు ముగ్గురూ పినతండ్రి మరణానికి ప్రతిచర్యను చేస్తామని శపథం చేసిన వారై. యుద్ధానికి వెళ్ళారు.

ఎందరో వానరులను హతము చేస్తూ ముందుకు సాగుతున్న వారి యెదుట సుగ్రీవుని ఆజ్ఞ ను అనుసరించి వాలి తనయుడు వాలి అంతటి వీరుడు అంగదుడు, వారి యెదుట వజ్రశరీరుడై రుద్రుని వలె నిల్చాడు. భయంకరమైన యుద్ధం చేసి ఎందరో రాక్షసులను నరాంతకునితో సహా యమలోకానికి పంపాడు.

118. కం. మేరు నగము బోలు తనువు
ధీరుడు యతికాయునెదుట తిరముగ నిలిచెన్
శూరుడు సౌమిత్రి యపుడు
బీరములను మానుమనుచు బిలిచె తలపడన్

అతికాయుడు మేరునగ శరీరుడు అతడు యుద్ధం లో అడుగు పెట్టగానే కుంభకర్ణుడు పునర్జీవితుడయ్యాడేమో అనుకుని వానరసేన భయపడి పారిపోయింది. వీరుడైన లక్ష్మణుడు అతన్ని ఎదురుకున్నాడు. నీవు బాలుడవి నాతో యుద్ధానికి సరిపోవన్న అతికాయుని వ్యర్థమైన ప్రేలాపన మాని యుద్ధం చేయి అని అన్మాడు లక్ష్మణుడు.

119. కం. సౌమిత్రితొ నతికాయుడు
భీమాకృతితోడ సలిపె భీకర రణమున్
ధూమాగ్నుల బ్రహ్మాస్త్రము
రామానుజుడేసి జంపె రాక్షసునపుడున్

అతికాయునికి సౌమిత్రికి భయంకరమైన యుద్ధం జరిగింది ఒకరిని మించి ఒకరు గొప్ప అస్త్రాలను ప్రయోగించారు. అలాగే ఎదుటి వాని అస్త్రాలను నిర్వీర్యం చేశారు కూడా.
చివరికి వాయుదేవుని సలహా ప్రకారం బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు లక్ష్మణుడు దానితో అతికాయుడు సంహరింపబడ్డాడు.

రావణుని విలాపం 

120. కం. జగమేలిన నాదు సుతులు
నగధీరుడు నా యనుజుడు నాకొరకయ్యో!
తగవు గొనిరి రామునితో
జగము విడిరి త్రోసి శోకసంద్రము నందున్!

అన్ని లోకాలను గెలిచిన నా పుత్రులు, నగమువంటి తమ్ముడు, కుంభకర్ణుడు నా వారందరూ నాకొరకు రామునితో తలపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. నన్ను ఏకాకిని చేసి శోక సముద్రములో నెట్టివేశారు ఇంకా నాకీ బ్రతుకెందుకు అని రావణుడు చాల దుఃఖించాడు.

121. కం. గెలిచితినట సుర లోకమ్ములు
తలదాచగ చోటులేదు ధారుణినెచటన్
పలికెడి వాడే కరువై
మలినాటిని చూచు టెటుల మహిలో యిపుడున్

నిన్నటి వరకు లోకాలన్నీ నాకు దాసోహం చేశాయి ఈ నాడు నన్ను కాపాడడానికి ఒక్క అసురవీరుడుకూడా లేడు. రేపటి రోజు నేను ఎట్లా చూచేది.

122. కం. నిజమా రాముని శౌర్యము!
భుజశాలుల దానవులను పుడమిని కలిపెన్
స్వజనమ్మున‌ లేడెవ్వడు
రజనీచరుడొక్కడైన రాముని గెలువన్

శ్రీ రాముడు నిజంగా ఎంతో శౌర్యవంతుడు, వీరుడు! కాకుంటే ఎలా ఇంతటి వీర దానవులను మట్టిలో కలపగలుగుతాడు?  మొత్తం‌ లంకలో ఒక్కడు కూడా ఇతన్ని యుద్ధంలో గెలవగలిగే వాడు నాకు కనపడడం లేదు అని వాపోయాడు రావణుడు.

123. కం. అతిచతురుడు యింద్రజితుడు
బ్రతికుండగ కనులముందు వగచెదవేలా?
క్షతజధునుల పారించెద
చితిచేర్చెద నిపుడెచూడు  సీతానాథున్

కుమారులను తమ్ముని కోల్పోయి దుఃఖిస్తున్న రావణుని చూచి పెద్ద కొడుకైన ఇంద్రజిత్ అతనితో అన్నాడు. తండ్రీ ఎందుకు దుఖిస్తున్నావు ఇంకా నేను బ్రతికే ఉన్నాను. నీకు తెలుసు నా పరాక్రమమెటువంటిదో. యుద్ధంలో రక్తపు నదులను (క్షతజము - రక్తము, ధుని - నది)  ప్రవహింప జేస్తాను, రాముణ్ణి ఇప్పుడే మట్టిగరిపిస్తాను నువ్వు చూస్తూ ఉండు అని బయలుదేరాడు.

124. కం. సాగిన అసురేంద్రసుతుడు
సాగించెను హోమ విధులు శాస్త్రసహితమై
చేగొని బ్రహ్మాస్త్రము తను
దాగెను మేఘముల వెనుక తాలిచి మాయన్

తండ్రికి మాట ఇచ్చి బయలుదేరిన మేఘనాథుడు, రణభూమిలో ఒక ప్రత్యేక హోమం శాస్త్రసమ్మతమ్ముగా,  క్రమంతప్పకుండా చేశాడు. దానితో అమిత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని చేతిలో తీసుకుని మేఘాలమాటున దాక్కుని యుద్ధం చేయడానికి సన్నద్ధం అయ్యాడు.


125. కం. వినపడినను కనబడకను
వెనువెనుకనె పది పదులుగ విసురు శరములన్
దనుజుడు యతిచతు రగతిని
దు‌నుమాడెను వేలకపుల దుష్కర రణమున్

మరెవ్వరికీ సాధ్యం కాని విధంగా చేస్తున్నాడు యుద్ధం ఇంద్రజిత్తు. భూమ్మీదున్న కపిసేనలకి బాణ ధ్వని వినబడుతోంది కాని ఎక్కడినుండి వస్తున్నాయో తెలియడం లేదు. ఒకే సారి వంద బాణాలను వేస్తూ కపిసేనలను చెండాడం మొదలు పెట్టాడు మాయావి యైన మేఘనాథుడు.

126. కం. కం. జలజాసను వరబలమును
తలవంచిరి గౌరవమున దశరథ తనయుల్
గెలిచిన గర్వము నిండగ
తలనెగరేసి చనె తాను దైత్యుడు పురికిన్

ఇంద్రజిత్ శౌర్యమునకు మూలకారణమైన బ్రహ్మాస్త్ర శక్తిని గౌరవిస్తూ రామ లక్ధ్మణులు ఇద్దరూ నేలపై మూర్ఛకు లోనయ్యారు. గెలిచిన గర్వముతో తలను పైకెత్తి లంకకు మరలినాడు ఇంద్రజిత్.

127. కం. మరణము కాదిది మూర్ఛయె
వెరపొందగ కాదు యదను వీరా హనుమా
పరికింతము నలువంకల
ధరపైబడు కపులలోన దక్కిన దెవరో

యుద్దభూమిలో ఎక్కడ చూచినా తెగిన దేహాలు, రక్త ధారలే కనబడ్డాయి. వీరుడైన హనుమంతుడు కూడ కొంతసేపు బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కట్టుబడి, మేల్కొన్నాడు.
అతనితో విభీషణుడు అన్నాడు, హనుమా రామలక్ధ్మణులు బ్రహకు కట్టుబడి మూర్ఛపోయారు అంతే,అసలు యుద్ధభూమిలో పడిన వారు ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో చూద్దాం పద అన్నాడు.

128. కం. అడుగవు రాముని సేమము
అడుగవు సౌమిత్రినైన!  ఆశ్చర్యముగన్
అడిగితివే హనుమ కొరకు!
అడుగుటలోమర్మమేమి ఆర్యా తెలియన్!!

ఇంద్రజిత్తు మాయాయుద్ధానికి పడిపోయిన వానరుల్లో ఎవరైనా బ్రతికి ఉన్నారా అని అన్నిచోట్లా వెతుకుతూన్న విభీషణునికి వృద్ధుడైనా నివురుకప్పిన నిప్పులాగా కనిపించాడు భల్లూకరాజు జాంబవంతుడు. ఆయన విభీషణుని అడిగాడు హనుమంతుడు క్షేమమేనా అని, ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన విభీషణుడు, ఆర్యా, నీవు రాముని క్షేమము అడగడంలేదు లక్ష్మణుడు ఎట్లా వున్నాడని కూడా అడగడంలేదు. హనుమంతుని కొరకు ప్రశ్నిస్తున్నావే ? ఏమిటి దీనిలోని ఆంతర్యం?

129. కం. వినుము విభీషణ నిజమిది
అనిలాత్మజుడొకడు చాలు అందరు బ్రతుకన్
హనుమంతుడు లేక భువిని
మనయందరి అసువులున్న మరణ సదృశమే

విభీషణునితో జాంబవంతుడు చెప్పాడు, విభీషణా, హనుమంతుడు ఒక్కడు చాలు మనందరినీ బ్రతికించడానికి, అతడు లేకుంటే మనందరి ప్రాణాలున్నా అవి లేనట్టే.

130. కం. నీవారిని బ్రతికించగ
నీవలననె సాధ్యమౌను నిజముగ హనుమా
జీవమ్మును మనకీగల
ఆవేరుల తెమ్ము యిపుడె అంజని పుత్రా!

జాంబవంతుడు హనుమంతుని దగ్గరికి పిలిచి, ఇది నీఒక్కడివల్లనే సాధ్యమయ్యే పని. నీవు వెంటనే హిమాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న దివ్య ఔషధ మూలికలైన సంజీవకరణి (ప్రాణాన్ని నిలబెట్టే వేరు) సంధాన కరణి (తెగిన అవయవాలను జోడించే వేరు) విషల్యకరణి (శరీరంలోనొ ఆయుధ శేషాలను తీసివేసే వేరు) సువర్ణకరణి (దేహానికి పూర్వపు కాంతిని సౌష్టవాన్ని ఇచ్చే వేరు) వీటిని వెంటనే తీసుకొనిరా అని అన్నాడు.

131. కం. హనుమంతుడు హిమవంతము
చనెవేగమునౌషధముల సాధించంగన్
కనుల బడని వేరులఁగొని
ఘనపర్వత సహితమెగిరె గగనపు వీథిన్

సమయాన్ని వ్యర్థం చేయకుండా హనుమంతుడు కాయాన్ని పెంచి ఆకాశంలో‌ఎగిరి హిమాలయానికి జాంబవంతుడు చెప్పిన పర్వతం దగ్గరికి చేరుకున్నాడు. తమను ఎవరో కోయడానికి వస్తునారని గ్రహించిన ఆ ఔషధ తరువులు కనబడకుండా దాక్కున్నాయి. వెతికి వెతికి ఇంకో గతి లేక హనుమంతుడు ఆ పర్వతంపై ఆగ్రహం చెంది, ఆ ఔషధ తరువులతో సహా పెకిలించి ఆకాశంలో ఎగిరిపోయాడు.

132. కం. ఖగరాజుని వేగమ్మున
నగసహితముగ యెగురు హనుమ నభమున సాగెన్!
ధగధగమని మేనుమెరయ
అగుపించెను సూర్యుని వలె అంబరమందున్

గరుత్మంతుని వేగముతో పర్వత సహితముగా ఆకాశంలో ఎగురుతున్న స్వామి హనుమ మేను మెరిపోతూ మరో సూర్యుడా అన్నట్టు కనిపించాడు.


133. కం. అంజని పుత్రుడు తెచ్చిన
సంజీవని మహిమ చేత శ్వాసను గొనుచున్
కుంజర సములైన కపులు
అంజలినిడి నిల్చిరపుడు హనుమ యెదురుగన్

హనుమంతుడు తెచ్చిన ఆ సంజీవనీ పర్వత మూలికల ప్రభావంతో మరణించిన వారంతా పునర్జీవితులైనారు. మళ్ళీ ఏనుగంత బలం కలవారై హనుమంతునికి జేజేలు పలికారు.

134. కం. గిరిపైగల ఔషధములు
పరమాత్ముని సృష్టిలోని పరమాద్భుతమే
యెరిగిన యీసత్యమ్మును
మరల తుషారాద్రి నుంచె మారుతి నగమున్!!

మరణించిన వారిని బ్రతికించగల ఆ దివ్యమైన సంజీవనీ పర్వతం పరమాత్ముని సృష్టిలోని అద్భుతం అని తెలిసిన హనుమంతుడు ఆ దివ్య పర్వతాన్ని దాని స్వస్థలమైన హిమాలయంలో పెట్టి తిరిగి రాముని సన్నిధికి చేరుకున్నాడు.

వి.  ప్రకృతిని మానవుడు సరియైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి కాని దాన్ని నాశనం చేయకూడదన్న జగత్సత్యాన్ని స్వామి హనుమ తెలిపిన మహోన్నతమైన సందేశమిది

135. కం. ఊపిరి పొందిన వానరు
లూపున లంకకు పరుగిడిరోహో యనుచున్
సైపక వారల పౌరుష
మాపక చేసిరి అసురులు హాహా రవముల్

సంజీవని మహిమ చేత ఊపిరి పొందిన వానర సేనలు ఒక్కుమ్మడిగా  లంకను ముట్టడించారు వారి పౌరుషాన్ని భరించలేని రాక్షస సేనలు, పౌరులు హాహాకారాలు చేస్తూ పురవీధుల్లో ప్రాణాలరచేతిలో పెట్టుకుని పరుగుదీశారు.

136. కం. కొండల కొఱువుల మోదుచు
దండించిరి రామసేన దైత్యుల వేలన్
పండిన రావణు పాపము
మండిన ఆ స్వర్ణలంక మసియై మిగిలెన్

చేతిలో కొండ శిలలను, మండే కట్టెలను పట్టుకొని కనపడిన వారిని కనపడినట్టు కొట్టడం మొదలు పెట్టారు వానరులు. అగ్నిలో కాలి మసియై పోయింది స్వర్ణలంక.

137. కం. రామధనుష్టంకారము
సీమాంతరములనుదాటి చేరెను నభమున్
రాముని సేనలకు ముదము
కామాంధుని లంకలోన కంపము రేపెన్

అప్పుడు శ్రీరాముడు తన కోదండాన్ని ధరించి నారిని లాగి టంకారము చేశాడు. మహత్తరమైన ఆ కోదండమునుండి బయల్దేరిన ధ్వని లంకను దాటి ఆకాశమంతా నిండిపోయింది. ఆ ధ్వని విన్న వానరులకు సంతోషము, రావణుని లంకలో‌ ప్రజలకు భయము ఒకేసారి కలిగించాయి.

138. కం. ఇనకులమణి ముఖద్వారము
తనశరముల కూల్చె నపుడు దైత్యుల‌లంకన్
గొని రావణుడతి క్రోధము
తనతమ్ముని సుతుల బిల్చె తరలగ రణమున్

రాముడు,  రాక్షసుల లంక ముఖద్వారాన్ని పగులగొట్టాడు. పట్టలేని కోపంతో రావణుడు తన తమ్ముడు కుంభకర్ణుని కుమారులైన కుంభ నికుంభులను యుద్ధం చేయడానికి వెళ్ళమన్నాడు.

139. కం. కుంభని కుంభులు యిరువురు
కుంభిని యదరగ వెడలిరి కూల్చగనరులన్
శంభుగ చెలగిన‌ హనుమ  ని
కుంభుని చంపె కపిరాజు కుంభుని కూల్చెన్

మహాయోధులు కుంభ నికుంభులు వానరవీరుందరినీ ఓడించారు భీకరమైన యుద్ధం చేస్తూ. సుగ్రీవుడు కుంభుణ్ణి సంహరించగా నికుంభుని తల ఊడబెరికి సంహరించాడు స్వామి హనుమ.

140. కం. ఖరసుతుడా మకరాక్షుడు
గరువముతో యెదురు పడెను కౌసల్య సుతున్
దురితాత్ముని తల, శరమున
తరిగెను దాశరథి యపుడు ధరపై పడగన్

అటు తరువాత ఖరుని కుమారుడు మకరాక్షుడు తనంత వీరుడు లేడనే గర్వంతో ఉంటాడెప్పుడూ యేకంగా రాముని ముందుకే వచ్చాడు యుద్ధానికి గొప్ప యుద్ధం జరిగింది వారిద్దరి మధ్యన. చివరికి ఆగ్నేయాస్త్రంతో అతని శిరసు ఖండిచాడు శ్రీ రాముడు.

141. కం. ఆగుము లక్ష్మణ వినుమిది
దాగిన వాని హతమొనర్ప ధర్మమ యనుజా?
ఆగంతకుడింద్రజితుని
ఆగని శరధాటినిపుడు అణచెద గనుమా !

ఇంద్రజిత్తు మళ్ళీ మాయా యుద్ధం చేస్తూ మేఘాలమాటునుండి వానరసేనలను రామలక్ష్మణులను బాణాలతో బాధపెట్టడం మొదలు పెట్టాడు. లక్ష్మణుడు క్రోధంతో బ్రహ్మాస్త్ర ప్రయోగానికి సిద్ధపడ్డాడు. రాముడు తమ్మునితో,  లక్ష్మణా బ్రహ్మాస్త్రము ఒక్క ఇంద్రజిత్తునే కాదు అందరు రాక్షసులను సంహరిస్తుంది. ఎదురుగా నిలబడక దాగిఉన్నవాడిని చంపడం ధర్మం కాదు. శరపరంపర కురిపించి ఇతన్ని మన యెదుట పడేట్టు చేస్తాను చూడు, అని అన్నాడు.

142. కం. మాయావి మేఘనాథుడు
మాయా సీతను రథమున , మారుతి యెదుటన్
ఆయమ వేణిని చేగొని
హేయమ్ముగ మెడను విరిచె హీనాత్మునిగన్

రాముని ఆలోచన తెలిసిన మేఘనాథుడు. లంకలోనికి వెళ్ళి తిరిగివస్తూ తన రథము పైన మాయా సీతను, సీతలాగా దీనంగా వున్న స్త్రీని వెంటబెట్టుకుని వచ్చాడు. మనసులో కొంచెం‌కూడా బెరుకు లేకుండగా ఆ స్త్రీయొక్క జుట్టు పట్టుకుని కంఠాన్ని కోశాడు దురాలోచనతో ఇంద్రజిత్తు. ఎదురుగా ఉన్న హనుమ గట్టిగా అరుస్తూ అతన్ని దూషించాడు.

143. కం. ఎంతపని చేసితి వధమ!!!
సుంతైనన్ దయనెరుగవె సుదతిని చంపన్!
చింతను చేయవె షండుడ!!
ఇంతిని హతమార్చ చేతు లెటులొచ్చెనొకో?

సీతను హతం చేసిన మేఘనాథునితో స్వామి హనుమ అన్నాడు, ఛీ ఎంత పని చేశావురా అధముడా, దయ అన్నది ఈషణ్మాత్రము లేదు నీకు. ఆడదాన్ని చంపడానికి చేతులెట్లా వచ్చాయి నీకు??

144. కం. సీతహతము యైనదనుచు
వాతాత్మజు నోట విన్న భరతాగ్రజుడున్
ఘాతమ్మున తరువు యటుల
భూతలమున పడెను స్వామి మూర్ఛను గొనుచున్

సీత హతమైంది అన్న వార్త హనుమంతుని నోట విన్న రామచంద్రుడు మూర్ఛపోయాడు. చెట్టు మొదలు నరికితే ఎట్లా పడుతుందో అలా భూమిపైన కిందపడ్డాడు.

145. కం. కాలము కాదిది నీతికి
కాలెను ధర్మమ్ము నేడు, కాంచన లంకన్
నేలను కలపగ లెమ్మిక
యీలోకము లోన‌నీకు యెదురేదన్నా !

సీత లేదన్న వార్తతో మూర్ఛ చెందిన రామునితో కోపము, శోకమూ కలిహిన లక్ష్మణుడు ఆయనతో రామా, నీవు నమ్ముకున్న ధర్మము నేడు కాలి పోయింది. ఇక ఉపేక్షించి లాభంలేదు. నీకు ఎదురు లేదు వెంటనే లేచి ఈ లంకను నాశనం చేయి. అని అన్నాడు.

146. కం. అనిలాత్మజు కనుదోయికి
కనిపించిన మాత సీత కాజాలదు భూ
తనయను పరిమార్చుటయది
ఘనసింధువుయెండురీతి  కల్లయె వీరా


విభీషణుడు అక్కడికి పరుగున వచ్చి రామ లల్ష్మణులను చూచి విషయం కనుక్కుని ఆశ్చర్యంతో లక్ష్మణునితో అన్నాడు, వీరుడా, సముద్రం లో నీరు ఎండిపోవడం ఎంత నిజమో సీత హతమైందన్న వార్త కూడా అంతే నిజం. కాబట్టి ఇంద్రజిత్తు మళ్ళీ హోమం మొదలు పెట్టక ముందే అతన్ని నివారించడం శ్రేష్ఠం. దుఃఖానికి సమయం కాదు అని అన్నాడు.

147. కం. భరతానుజుడింద్రజితుని
పరిమార్చగ బయలుదేరె పావని తోడన్
దరిచేరగ తన మృత్యువు
అరిసూనుడు అపె మఖము ఆఖరి ఘడియన్

రాముని ఆజ్ఞ ప్రకారం లక్ష్మణుడు హనుమతో బాటుగా ఇంద్రజిత్తునితో యుద్ధం చేయడానికి బయలుదేరాడు నికుంభిలకు. మరణకాలం సమీపించిన ఇంద్రజిత్తు తాను చేసే అభిచారహోమాన్ని (మఖము)  ఆపివేశాడు.

148. కం. అనుజుడవై రావణునకు
దనుజారిని చేరినావు ధర్మము చెరపన్
పినతండ్రివయ్యు నీదు సు
తుని జంపగ జూతువెటుల దుర్మార్గముగన్?

లక్ష్మణునితో ఉన్న పినతండ్రియైన విభీషణునితో ఇంద్రజిత్తు అన్నాడు,   స్వయానా లంకేశ్వరునికి తమ్ముడవైననీవు దనుజులకు ఎదురుగా శతృవులతో చేతులను కలిపి ధర్మాన్ని మంటకలిపావు. నాకు పిన తండ్రివైన నీవు కొడుకుని చంపే దుర్మార్గాన్ని వెతుకుతున్నావు.


149. కం. చిన్నతనము నుండి యెరిగి
నన్నీ‌లాగున యడుగుట న్యాయమ్మేనా
ఎన్నో రీతుల యడిగిన
అన్నయె నను కాదుయనుట అదిసమ్మతమా!

తనను దూషించిన ఇంద్రజిత్తుతో , చిన్న తనమునుండి నన్ను చూచి నాతో ఇట్లా మాట్లాడుతున్నావే ఇదేమైనా న్యాయంగా వున్నదా? ఎన్ని రకాలుగా మంచి తెలిపినప్పటికీ నా అన్న అయిన నీ తండ్రి వినకుండా నన్ను కాదన్నాడే అది ఏరకంగా సమంజసము, సమ్మతము?

150. కం. శ్రీరాముడు ధర్మాత్ముడు
వీరుడు సత్య వ్రతుడైన వినుమో శరమా!
ఆ రాముని కార్యమ్మిది
క్రూరాసురు ప్రాణములను గొని తెమ్మిపుడే

ఓ శరమా! రాముడు వీరుడు, ధర్మాత్ముడు, సత్యవ్రతుడే అయితే నీవు రాముని కార్యము కొరకు, క్రూరుడైన మేఘనాథుని ప్రాణములను తీసుకొనిరా! అని లక్ష్మణుడు అన్నాడు.

151. కం. తన చెడునకు కారణమని
దనుజేంద్రుడు చంపబూనె తనయనుజుననిన్
కనుల బడిన సౌమిత్రిని
తన‌శరమున యెదను చీల్చె ధరపై పడగన్

తన కుమారుని నికుంభిలా యజ్ఞాన్ని పాడుచేసి అతని మరణానికి కారణమైన విభీషణుని చంపడానికి చూచాడు యుద్ధానికి వచ్చిన రావణుడు. కాని అంతలో అతని కన్నుల ముందర తన కొడుకుని చంపిన లక్ష్మణుడు కనబడగానే శక్తి అనే అస్త్రం ప్రయోగించి లక్ష్మణుని శరీరాన్ని చీల్చేట్టుగా కొట్టాడు. లక్ష్మణుడు నేలపైన పడిపోయాడు.

152. కం. ధరలో పొందుట సాధ్యము
నరులకు పలువురు సతులను నగరము కొకరిన్
మరణించిన చోయొకపరి
తరమా తమ్ముడు కలుగుట ధారుణి లోనన్

రావణుని శక్తి అస్త్రముచేత నిర్జీవముగా పడియున్న తమ్ముని చూచి మిక్కిలి బాధ పొందిన శ్రీరాముడు ఏడుస్తూ అంటున్నాడు. "మనిషి కావాలనుకుంటే నగరానికొక భార్యను పెక్కురు బంధువులను పొందగలడు. కాని ఒక సారి మరణించిన తరువాత మరలా ఈ జన్మకు ఇంకో తమ్ముడు దొరకడం సాద్జ్యం కాదు కదా!! "

మూ. దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవాః
తంతు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః

153. కం. భూ నభములు అదిరి పడెను
భూనాథుడు భూమిజపతి పోరున్ సలుపన్
ఆనందము పొంది సురలు
వేనోళ్ళను పొగిడిరపుడు విరివర్షముతో

రామ రావణులు లోకభీకరులై యుద్ధం చేస్తూ ఉంటే భూమి ఆకాశమూ అదిరి పోయాయి. ప్రళయకాలంలా కనబడింది సమయం అప్పుడు. కాని రావణుని అంతం ఇల నిశ్చయమైనదని ఆనందంతో దేవతలు వేనోళ్ళ పొగడుతూ పూల వర్షాన్ని రామునిపై కురిపించారు.

154. కం. పూసిన మోదుగ తరువై
భాసిల్లెను యినకుల మణి పరమాద్భుతమై
వేసిన శరముల దైత్యుడు
మాసిన ముఖవర్ణుడయ్యె మరణము పిలువన్

మోదుగ చెట్టు పూస్తే ఎలా వుంటుందో రక్తంతో తడిసిన దేహంతో శ్రీరామచంద్రమూర్తి వెలిగిపోయాడు. మరణం చేరువైన రాక్షసుడు ముఖం వివర్ణమై పోయింది.

155. కం.‌తన యజమాని యలిసెనని
తన రథమును సారథి యని తప్పించంగన్
మనసున రోషము రేగగ
దనుజేంద్రుడు యాతనిగని దౌష్ట్యములాడెన్

అంతలో రావణుని రథసారధి తన యజమాని అలసిపోయాడని తెలుసుకుని రథాన్ని యుద్ధ ప్రదేశం‌నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్ళాడు. రావణుడు రోషంతో అతన్ని అనరాని మాటలన్నాడు.

156. కం. దశకంఠుడుగ్రుడయ్యెను,
దిశమరలిన సారథి గని ధిక్కని యరచెన్
"దిశపతులను శాసించితి
నశియించెను నాదు యశము నలుగురి యెదుటన్"

రథాన్ని దిశ మరల్చిన సారథి పై మహోగ్రుడయ్యాడు రావణుడు. అతనితో ధిక్కని పరుషమైన మాటలను ఇలా అన్నాడు. అరెరె ఎంత పని చేశావురా సారథీ, దిక్పాలకులను , సర్వ ప్రపంచాన్నీ శాసించిన రావణుడు యుద్ధం వెనుదిరిగాడన్న అపఖ్యాతిని తెచ్చి పెట్టి నలుగురిలో నా పరువు తీశావు అని అరిచాడు.

157. కం. ఆలములో వెనుదిరుగుట
యీలంకేశుడు యెరుగడు యెవడెదురైనన్
తోలుము రథమును యిపుడే
కాలుండేయైనవాని కడతేర్చెదనే

రాజా నిన్ని కాపాడుకోవడం నా బాధ్యత అదీ‌కాక రథాశ్వాలు అలసిపోయాయి మీ భయంకరమైన యుద్ధానికి అందుకని నేను రథాన్ని మరల్చవలసి వచ్చింది అని అన్నాడు. దానికి సంతృప్తి చెంది రావణుడు అతనితో, యుద్ధంలో శతృవునకు వెన్ను చూపడం ఈ లంకా నాథుడు యెరుగడు. వెంటనే రథాన్ని రాముని వైపు మరల్చు ఎదురుగా ఉన్నది యముడే ఐనా ఇవాళ్ళ అతన్ని కాల్చి తీరుతాను అని గర్వంతో అన్నాడు.

158. కం. భూమిజ నాథుని కెదురై
ప్రేమమ్మున 'రామ ' 'రామ '  వినుమా యనుచున్
ధీమతి అగస్త్యుడతనికి
కామితమును దీర్చు యినుని ఘనతను దెలిపెన్

అలసి ఉన్న రామంచంద్రునికి ఎదురై తేజస్వి, ధీమంతుడు,  మహిమాన్వితుడైన అగస్త్యమహర్షి , రామా రామా అని ప్రేమతో స్వామిని పిలిచి శుభకరము, శక్తిప్రదాయకమూ, కామితములను తీర్చే ఆదిత్యహృదయాన్ని బోధించాడు.


159. కం. హ్లాదమ్మునుగొని , రాముడు
ఆదిత్యుని మదిని నిలిపి అంచిత బుద్ధిన్!
ఛేదించగ రావణు తల
మోదముతో ఆలమందు ముందుకు సాగెన్

శక్తి వంతమైన ఆదిత్యహృదయ మంత్రాన్ని పఠించి, సూర్యుణ్ణి పూజ్య భావంతో (అంచిత బుద్ధి) స్థిరచిత్తముతో పూజించి మనసులో నూతనోత్తేజాన్ని శరీరంలో కొత్త బలాన్నీ పొంది రావణుని తలను ఛేదించడానికి సర్వసన్నద్ధుడయ్యాడు రఘురాముడు.

160. కం. భ్రాజిత హయవాహనుడై
రాజిల్లెను రావణుండు రణభీకరుడై
భూజన సంకటహరుడై
తేజముతో రాఘవుండు తీరెను హరియై

రావణాసురుడు నల్లని వర్ణంతో ప్రకాశిస్తున్న (భ్రాజిత) అశ్వాలు కలిగిన పసిడి రథములో వెలిగిపోతూ (రాజిల్లు) రామునివైపు వాయువేగంతో దూసుకొని వస్తూ కనిపించాడు. రామచంద్రుడు దేవేంద్రుని దివ్యరథములో మాతలి సారథ్యంచేస్తూ ఉండగా ఆకుపచ్చని గుర్రాలతో ఉన్న రథములో,  భూమిలోని ప్రజల సంకట హరునిగా,  లోకాలను ఏడిపించిన రావణ సంహారానికి సిద్ధంగా యుద్ధరంగంలో తేజస్సుతో  శ్రీహరి లాగా వెలుగుతూ అగుపించాడు.

161. కం. కనిపించెను దుశ్శకునము
లనిపించెను అసురలంక ఆరని మంటై
వినిపించెను నక్క యరుపు
కొనసాగిన దానవ నర ఘోరాలమునన్ !

రావణునికి దుశ్శకునములు ప్రస్ఫుటంగా కనిపించాయి. ఒకవైపు నక్క అరుపులు మరొకవైపు గ్రద్దల గుంపులు తమకు మృష్టాన్నభోజనం దొరకబోతున్నదని సంతోషించాయి. అనుపమానమైన రామరావణ సంగ్రామం మొదలైంది.

162. కం. ఒకరిని మించియు నొక్కరు
ప్రకటించిరి రణ‌నిపుణత ప్రతికృతులందున్
సకల జగము లచ్చరమున
ఒకటై తిలకించెనపుడు ఉభయుల ప్రభలన్

రామ రావణుల‌మధ్య అతిభీకరమైన, లోకోత్తరమైన యుద్ధం ఆరంభమైనది. ఒకరిని మించి ఒకరు అస్త్రాలను ప్రయోగించారు. పైనబడుతున్న అస్త్రాలను నిర్వీర్యం చేస్తూ ఒకరినొకరు అడ్డుకుంటున్నారు. సకల జగత్తూ ఒక్కటై ఆశ్చర్యంతో వారిద్దరి యుద్ధ నైపుణ్యాన్ని , ప్రకాశాన్నీ చూస్తూ నిలబడ్డారు.

163. కం. మానిరి యుద్ధము అసురులు
వానరులను గూడి గనిరి వారల రణమున్
భూనభముల సురలు మునులు
వీనులు కన్నులు తనువుగ వీక్షించిరనిన్

అది ఒక మహత్తరమైన సన్నివేశం, రామ రావణులు యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధభూమిలో ఉన్న మిగితా రాక్షసులూ వానరులూ యుద్ధాన్ని ఆపి వారి వీరపరాక్రామాలను చూస్తూ నిలబడిపోయారు. ఆకాశంలో దేవతలు భూమిపైన ఋషులూ ఒళ్ళంతా కళ్ళు చెవులూ చేసుకొని వారి యుద్ధాన్ని చూచారు.


164. కం. సాగరమన సాగరమే
ఆ గగనము గగన సమమె! అరయగ నటులే,
రాఘవ రావణ రణమది
రాఘవ రావణ రణముగ రాజిల్లు భువిన్!

సుర, గంధర్వ,  అప్సర సంఘాలు అనుపమానమైన రామరావణయుద్ధాన్ని చూస్తూ అనుకున్నారు,
ఆకాశానికి సాటి యేది? ఆకాశమే! సాగరానికి సాటియేది? సాగరమే కదా!  రామ రావణ యుద్ధానికి సాటి యేది? రామ రావణ యుద్ధమే! పోల్చడానికి వేరే వస్తువు, విషయమూ ప్రపంచంలో ఎక్కడా కనపడదు.

మూ. గంధర్వాప్సరసాం సంఘా దృష్ట్వా యుద్ధమనూపమమ్|
గగనం గగనాకారం సాగరః సాగరోపమః ||
రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ |
ఏవం బ్రువంతో దదృశుస్తద్యుద్ధం రామరావణం||


165. కం. జగముల శాసించిన తల,
మగువల‌ పీడించిన తల, మదమత్తుతలన్!
అగణిత సుగుణా ధాముడు
తెగనరికెను రావణు తల దిక్కులదరగన్!!!

లోకాలను శాసించిన రావణుని తల, మదంతో స్త్రీలను మునులను పీడించిన తల, సకల సుగుణాభిరాముడు శక్తివంతమైన శరములను వేసి దిక్కులన్నీ అదిరి లోకం కపించగా తెగనరికాడు.


166. కం. కొట్టిన తల తానొక్కటి
పుట్టెను మరియొక శిరస్సు భుజముల మీదన్
పట్టును విడువని రాముడు
వట్టై మిగిలిన శరముల పడెనచ్చరమున్

భయంకరమైన యుద్ధం సాగింది రామ రావణుల మధ్యన. అప్పుడు రాముడు రావణుని తలకు గురిపెట్టి విడిచిన బాణము రావణుని తలను ఛేదించింది కానీ వెంటనే మరొక శిరస్సు భుజములపై మొలిచింది. రాముడు పట్టు విడువకుండా శిరస్సులను ఖండించాడు. ఖరదూషణులను, వాలిని, అనేక రాక్షసులను సంహరించిన తన అస్త్రాలన్నీ నిష్ఫలం కావడం చూచి రాముడు ఆశ్చర్యపోయాడు.

167. కం. మొలుచును పదులుగ శిరములు
కలిగిన వరముల బలమున, కాంచవదేలా!
పిలిచిన పలికెడు నలువను
తలచిన అసురుడు సమయును త్వరపడు రామా!

సారథియైన మాతలి రామునితో అన్నాడు, రామా ఇతనికి వరబలమున్నదన్న విషయం తెకుసుకదా నువ్వు ఎన్ని అస్త్రాలను వేసినా లాభం లేదు.  నీ చేతిలోనే ఉన్న బ్రహ్మాస్త్రాన్ని మరచి ఏమీ తెలియని వానిలా యుద్ధం చేస్తున్నావేమి? బ్రహ్మ్మస్త్రంతోనే రావణుడు హతము కాగలడు.

168. కం. సంధించెను రాముడసిత
కంధరుడై బ్రహ్మశరము కైకసి సుతుపై
ఇందీవర శ్యాముడపుడు
అందరి కనులకు అగుపడె హరిగ వెలుగుచున్

రామచంద్రుడు,  ప్రళయకర్తయైన రుద్రునిలా (అసితకంధరుడు- నల్లని కంఠము కలవాడు)  నిలబడి రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. యుద్ధాన్ని చూస్తున్న దేవ గంధర్వ నర వానరులకు సాక్షాత్ శ్రీమన్నారాయణునిలాగ  కనిపించాడు స్వామి.

త్రిమూర్తుల కలబోతగా రాముడు వేసిన ఆ రామబాణము కైకసి పుత్రుడైన రావణుని గుండెను ఢీకొనడానికి వేగంతో ముందుకు సాగింది.

169. కం. లోకమ్ములు స్తంభించెను
భీకరతన్ రాముని విలు విడివడు శరమున్
యేకాకృతిగన్ నిలిచిరి
నాకమ్మున సురగణములు నలువ సహితులై

రామబాణము ధనుస్సునుండి విడివడగానే  ఒక్క సారి లోకాలన్నీ స్తంభించాయి. బ్రహ్మతో సహా దేవతలందరూ స్థాణువుగా నిలబడి పోయారు.

170. కం. నరుడై వచ్చిన రాముడు
ఉరమందున నాటు శరము యుర్విని జేరెన్
నరులెంతని నిరసించిన
దురితాత్ముని ప్రాణములను దూరము చేసెన్

నరునిగా వచ్చిన నారాయణుడు రావణుని వక్షస్థలం పైన గురి చూచి వేసిన బ్రహాస్త్రము అతని ఎదను చీల్చి భూమిలో గుచ్చుకుంది. నరులే కదా అని చులకన భావంతో చూచిన దురితాత్ముడైన రావణుని ప్రాణాలను హరించి మరలా చడీ చప్పుడు చేయకుండా రఘురాముణ్ణి చేరుకుంది. త్రిలోక కంటకుడైన రావణుడు హతమైనాడు.

171. కం. కురిపించిరి విరివానలు
సుర లోకము నుండి సురలు శుభగాత్రునిపై
మరణించెను రావణుడని
ధర యంతట మ్రోగు ధ్వనులు తాకెను నభమున్

రావణుడు హతం కాగానే దేవతలు శుభాంగుడైన శ్రీరామచంద్రునిపై పూల వానలను కురిపించారు. రావణుడు మరణించాడని, సీతమ్మ చెర విడిపోయిందని లోకంలో ప్రజలంతా చేసిన జయజయ ధ్వానాలు మారుమ్రోగి ఆకాశాన్ని చేరాయి.

172. కం. జయము జయము రఘువీరా!
జయము నిఖిల సుజనపాల జగదాధారా!!
జయరావణ సంహారా!
జయరామా సుగుణధామ శాత్రవ భీమా!!!

ఎక్జడ చూచినా జయరామా జయరామా అనేవాళ్ళే. స్వామీ నీవే జగత్తునకు ఈ రోజు ఆధారమై నిలిచావు.త్రిలోక కంటకుడైన రావణుని సహరించి శత్రుభయంకరునిగా నిలిచావు అని పరి పరి విధాలుగా సీతారాముని పొగిడారు.

173. కం. మెత్తని పాన్పుల మీదన్
నెత్తావుల సేద తీరు నీవీ రీతిన్
నెత్తుటిలో తేలితివే
చిత్తమునకు శాంతి యెటుల చేకురు నన్నా!!

రావణాసురుని కళేబరం చెంత నిలబడి ధర్మాత్ముడు, తోడబుట్టిన వాడైన విభీషణుడు   దుఃఖిస్తూ , అన్నా మెత్తని పరుపుల మీద హాయిగా అంతఃపుర స్త్రీలు సుగంధాలను చిమ్ముతుంటే సేద తీసుకునే నీవు ఈ నెత్తుటిలో పడి పోయావే!  నీవు లేకుంటే రాక్షసులకు సుఖ శాంతులు లేవు కదా, నామాట వింటే నీకీ గతి వచ్చేది కాదు కదా అని విలపించాడు.

174. కం. వీరునిగా మరణమ్మును
చేరెను నీ సోదరుండు సింగంబువలెన్
ధారుణిలో వైరమ్ములు
దూరమగును మరణవేళ ధూర్తుడె యైనన్ !!

విభీషణునితో రాముడు, విభీషణా రావణుడు వీర‌మరణాన్నే పొందాడు. పిరికివానివలె చావలేదు. సింహంలా యుద్ధంచేశాడు. ఎంతటి ధూర్తునికైనా మరణంతో వైరమన్నది ముగిసిపోతుంది. కాబట్టి నీవు కాగల కార్యము పై దృష్టి పెట్టు అని అన్నాడు.

175. కం. మృత రావణు దేహముపై
మతిపోయిన వారివలెనె మానిని గణముల్
క్షితిపై నన్ పొరలిపొరలి
గతియేమని వగచిరపుడు కన్నీరేరై

తమ పతి మృతుడైనాడని రావణుని భార్యలంతా పరుగును కోటలోనుంచి వచ్చి అతని పై బడి విలపించారు. భూమ్మీద పొరలి అయ్యో ఇక మా గతి ఏమి అని ఏడ్చారు.

176. కం. రాలితివే భువి నొంటిగ
యీలాగున యమ సదనము యేగుట మేలా
రాలేనని తలచితివో
నాలోకము నీవనునది నమ్ముము స్వామీ!

రావణుని పట్టపు రాణియైన సాధ్వీమణి మండోదరి అతని మృతదేహము చెంత కన్నీరు మున్నీరై ఏడుస్తూ అనుకున్నది.

స్వామీ !    నా గురించి ఆలోచించక  నీవు ఇట్లా ఒక్కడివే మట్టిలో రాలిపోయావే ఇది న్యాయమేనా. నీవు యమ సదనానికి వెళితే నీతో బాటు నేను రాలేననుకున్నావో?  నాకున్న సర్వస్వమూ నీవే, నాలోకమే నీవు కదా! ఎట్లా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు?


177. కం. నరుడా? రాముడు చంపెను?
అరివీర భయంకరుడగు  అస్మత్ నాథున్?
హరియే యీతడు, అరయగ,
తరమా నాపతిని గెల్వ ధరలో వేరల్!!

 సుర గంధర్వ కిన్నెరులను దిక్పాలకులను శాసించిన  అరివీర భయంకరుడైన నా పతిని ఒక నరుడు సంహరించినాడా! ఇదెలా సాధ్యం?  అతడు సాక్షాత్తు నారాయణుడే వేరెవ్వరికీ నా భర్తను గెలిచే శక్తి లేదు.

178. కం. కులసతి కన్నుల నీరే
కుల సహితము యిచ్చె నీకు ఘోర మరణమున్
నెలతగ భ్రమసితివామెను
నలువకు మాతని యెరుగక నశియించితివే

నాథా నిన్ను రాముడు సహరించాడని అందరూ అనుకుంటున్నారు కాని వాస్తవంలో సీతా దేవిని జనస్థానం నుంచి అపహరించినప్పుడే ఆ పతివ్రత కన్నుల నీరు పెట్టినప్పుడే నీకు మరణించావు రామబాణం ఒక నిమిత్తం మాత్రమే. నిజానికి ఆ తల్లిని మామూలు ఆడదానిగా అనుకున్నావు ఆమె సాక్షాత్తూ బ్రహ్మదేవుని తల్లియైన శ్రీ మహా లక్ష్మియని తెలియక నీ చావును కొని తెచ్చుకొన్నావు.

179. కం. అహితాగ్నిగ బ్రతికెనితడు
దహన క్రియల గరుప వలెను తప్పక నీవున్
గహనమ్ములు వేద విధులు
వహియించుటె మనకు మేలు వలదన కన్నా!!

విభీషణా,  నీ అన్న అయిన రావణాసురుడు వేద శాస్త్రాలను క్షుణ్ణంగా తెలిసిన వాడు నిత్య నైమిత్తిక కర్మలను తప్పక ఆచరించిన వాడు. అతనికి దహన క్రియలు చేయడం తమ్మునిగా నీ ధర్మము. వేదం చెప్పినట్టు చేయడమే మన కర్తవ్యం దాన్ని నిరాకరించే అధికారం మనకు లేదు. పైగా అట్లా చేయకుంటే పాపం సంక్రమించటం మాత్రం ఖాయం. కాబట్టి కాదగిన కార్యం పైన దృష్టినుంచు.

180. కం. ధీమంతు విభీషణుడను
సీమకు ప్రభువుగ నిలుపగ సింధుజలములన్
రామాజ్ఞానిరతుండై
సౌమిత్రియుతెచ్చెనపుడు స్వర్ణకలశమున్

రావణుని అంత్యక్రియలు పూర్తి చేసిన తరువాత రామచంద్రుడు లక్ష్మణునితో సముద్ర జలాలను తెప్పించి వేదోక్తంగా విభీషణుని లంకా రాజ్యానికి రాజుగా అభిషిక్తుని చేశాడు.


181. కం. వినయాంజలితో నిలబడు
హనుమంతుని రాఘవుండు ఆనందముతో
గొని లంకాధిపు నాజ్ఞను
తన సేమము తెలుప యనిపె ధరణిజ కడకున్

పర్వత శరీరుడై, మహా బలవంతుడైనా వినయముతో నిలబడి ఉన్న హనుమంతుని పిలిచి రామచంద్రుడు, హనుమా నీవు సీత దగ్గరికి వెళ్ళి మా క్షేమము,  విజయ వార్తను చెప్పి రమ్మని పంపించాడు.

182. కం. శ్రీరాముడు జయమొందెను
క్రూరాత్ముని హతము చేసి ఘోర రణమునన్
యీ రాక్షస చెర వీడెను
నీరాముని చేరెదవిక నిజముగ తల్లీ!!

అశోక వనము చేరిన స్వామి‌హనుమ సీతమ్మ తో, శ్రీరాముడు రావణుని సంహరించి విజయాన్ని పొందాడు. తల్లీ నీకు ఈ రాక్షస చెర విడినది. తొందరలో నీ రాముని చేరగలవు అన్నాడు.

183. కం. ఆనందము యెద నిండగ
భూనందన పలుకు రాక పొందిన ముదమన్
మౌనమ్ముగ చూచె కపిని
ఆనతికై వేచె హనుమ అంజలి నిడుచున్

హనుమంతుని మాటలు విన్న సీతమ్మ నోట మాట రాక ఆనందముతో నిశ్చేష్టురాలై నిలబడి పోయింది. హనుమ అంజలితో సీతమ్మ ఆజ్ఞ కై వేచి నిలబడినాడు.

184. కం. కన్నులు కాయగ వేచితి
యిన్నిది నమ్ములకు వింటి యింతటి శుభమున్
నిన్నే రీతిని పొగడుదు
యెన్నగ కనబడదు ఏది, యిలలో నీయన్

తేరుకున్న సీతమ్మ హనుమతో, ఎంతటి చల్లని వార్తను చెప్పావు హనుమా! కళ్ళు కాయలు కాచాయి పదినెల్లుగా ఒక్క శుభవార్త వినడానికి. నీకు బదులుగా ఇవ్వడానికి ఏదీ కనబడటం లేదు అని అన్నది తల్లి.

185. కం. పరుషమ్మలు నీ యెదుటనె
దురుసుగ పల్కిన వనితల దునుమాడగను
త్తరువును కోరెద తల్లీ
పరిమార్చగ యానతి నిడు ప్రార్థింతు నినున్!!

హనుమంతుడు సీతమ్మతో అమ్మా ఈ రాక్షస వనితలు పరుషమైన మాటలతో నిన్ను ఎన్నో రకాలుగా బాధించారు. వీరందరినీ సంహరించడానికి ఆజ్ఞను కోరుతున్నాను అని అన్నాడు.

186. కం. "ధరనేలిన ప్రభు వాక్కును
నెరవేర్చిన వీరి యెడల నిర్దయ తగునా?"
పరతంత్రులు వీరెల్లరు
పరిమార్చుట పాడికాదు పవన కుమారా!!

కరుణామయి సీతమ్మ హనుమంతుని మాటలు విని మారు పలుకుతూ, హనుమా ఈ రాక్షస వనితలు పరతంత్రులు వారి ప్రభువైన రావణుడు యే విధంగా నడుచుకోమన్నాడో అలాగే ప్రవర్తించారు నాతో.  రావణుడు తాను చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించాడు. వీరు చేసిన దోషమేమీ లేదు. పైగా అపకారం చేసిన వారిపై ప్రతీకారం తీసుకొనడం కారుణ్యము కాదు. కాబట్టి నీ ఆలోచన మానుకో అని చెప్పింది.

187. కం. ఉపకారము చేయతగును
అపకారియెయైన యతిథి ఆశ్రయమడుగన్
నెపమెన్నక చేయు నెరవు
ఉపయుక్తము రాము సతికి ఉర్విని హనుమా!

హనుమా ఆశ్రయమడిగి అతిథిగా వచ్చిన వాడు అపకారియే ఐనాగానీ వానికి ఉపకారమే చేయాలి. రావణుడెంత దురాత్ముడే ఐనా ఒకవేళ ఆశ్రయమడిగితే రాముడు కాదంటాడా? ఆ రామునికి సతినైన నాకు కూడా అదే సరియైనది కదా! కాబట్టి ఈ రాక్షస వనితలను నీవు బాధించడానికి నేను ఒప్పుకోను అని కరుణామయి సీత హనుమతో అన్నది.

188. కం. హరివీరుడు వినిపించెను
కరుణామయి సీత గతిని గద్గద స్వరమున్
పొరలెడు కన్నీరాపుచు
భరతాగ్రజుడచట నిల్చె పర్వతమువలెన్

సీతమ్మ కు రాముని క్షేమ సమాచారాన్ని తెలిపి ఏఅముని వద్దకు వచ్చిన హనుమంతుడు ఆమె స్థితిని స్వామికి తెలిపాడు. శ్రీరాముని కళ్ళలో ఒక్క సారిగా కన్నీళ్ళు పొంగాయి. వచ్చే కన్నీటిని ఆపుకొని,  స్థిరంగా నిలబడి విభీషణుని పిలిచి సీతను సర్వాంగభూషితగా ప్రవేశపెట్టమని ఆదేశాన్నిచ్చాడు రామచంద్రుడు.

మూ. ఏవముక్తో హనుమతా రామో ధర్మభృతాం వరః
అగచ్ఛత్సహసా ధ్యానమాసీద్బాష్ప పరిప్లుతః

189. కం. పావని సీతను తోడ్కొని
పూవుల పల్లకి వెనుకనె భూపతి యేగెన్
కోవెలలో దేవి వలెనె
ఆ వానరుల కగుపించె అవనిజ చూడన్

సీతమ్మను పల్లకి తీసుకొని విభీషణుడు వెనుకనే ఉండి రాముని వద్దకు వచ్చాడు. అక్కడున్న వానరులకు ఆమె సాక్షాత్తు ఆదిలక్ష్మిగా అగుపించింది.

190. కం. భూనందన యరుదెంచగ
వానర గుంపులు పరుగిడి వచ్చిరి చూడన్
రానీయక యడ్డుపడిన
వానరపతినిన్ రఘుపతి వారించెనటన్

సీతమ్మను చూడాలని ఆతృతగా పరుగిడి గుంపులుగా వస్తున్న వానరులను అడ్డగించగా రాముడు మిక్కిలి క్రోధంతో వీరంతా నావాళ్ళు, వారిని తోయకండి. సీతను చూచే అధికారం వారికి వున్నది పైగా నా సమక్షంలో ఉన్న సీతను చూడ్డంలో తప్పులేదు. ఆడదానికి మంచి వస్త్రాలు, భవంతులు ఆభరణాలు కవచం కాదు‌ మంచి నడవడియే ఆమెకు రక్ష ఎల్లప్పుడూ అని అన్నాడు.

191. కం. సీతను చూచిన రాముడు
రాతివలెనె నిల్చియపుడు రమణితొ పలికెన్
స్వాతంత్ర్యము నిచ్చితినిక
యే తావులకైన పొమ్ము యీభువి లోనన్

192. కం. యినకుల గౌరవ మెంచియు
నిను గాచితి గాని వేరు నెపమున్ యెరుగన్
తన మానిని పరునింటను
మనగ మరల యేలుకొనుట మగనికి తగునా?

పక్కన వచ్చి నిలచిన సీతమ్మను సంబోధించి రాముడు ఇలా అన్నాడు. నేను అనుకున్నది, మానవునికి సాధ్యమైన పనిని చేశాను. ఈ వానర వీరుల కష్టము , హనుమంతుని సముద్రలంఘనము, సుగ్రీవుని సాయము ఈ రోజు సఫలమైనాయి. రావణాసురుడు సంహరింపబడ్డాడు.
 సీతా నేనిదంతా సూర్యవంశ గౌరవాన్ని  నిలబెట్టడానికి మాత్రమే చేశాను నీకొరకు కాదు, నీకు నేను స్వాతంత్ర్యము ఇస్తున్నాను ఇక నీవు నీ ఇష్టమైన చోటికి వెళ్ళవచ్చు. శత్రువు పంచన గడిపిన ఆడదాన్ని అత్యాశతో మళ్ళీ ఏలుకోవడం ఒక మగనికి తగినది కాదు కదా,  అని నిర్వికారంగా పలికాడు.

193. కం. రామా, యేమీ నిర్దయ!!
నామాన్యత నాదు యునికి నశియించెగదా!!
నా మనసున నీ రూపము
నేమఱకన్ నిలుపు కొంటినిందులకేనా!!

రామా, ఎందుకు ఇంత నిర్దయగా, సామాన్య స్త్రీ తో మాట్లాడినట్టు నాతో ఇంతటి ఘోరమైన మాటలు మాటాడుతున్నావు? నా గూర్చి నీవు యెరుగవా ? నా వ్యక్తిత్వమూ శీలమూ నీ ఈ ఒక్క మాటతో నశించి పోయిందికదా? ఇన్ని రోజులూ నీవు తప్ప వేరే ధ్యాస లేదే నాకు. దానికి ఫలితం ఇదా?

194. కం. మనసుంచితి నా వశమున
నినుతలచితి రేయి పవలు నేరను వేరున్!!
తనువు నొడిసి పట్టు ఖలుని
వినువీథిని యేమి జేతు వెలదిన్ అబలన్!!

రావణుడు నన్ను స్పృశించాడని అంటున్నావు, అప్పుడు నా మనసు నా వశములో వుంది అందులో ని‌న్ను మాత్రమే నింపుకున్నాను కానీ అబలనైన నేను బలవంతుడైన రాక్షసుడు నన్ను ఒడిసి పట్టుకొని ఆకాశంలో వుండగా ఏమి చేయగలను.

195. కం. దనుజుల చంపుట యేలా?
నిను నమ్మిన నేస్తుల కృషి నిష్ఫలమేలా?
హనుమంతుడు కనుగొనగనె
నను వీడక యీ రణమను నాశనమేలా?

రామా నన్ను విడిచి పెట్టాలనే ఉద్దేశ్యమే ఉంటే అసలు ఇంతమంది రాక్షసులను సంహరించడం ఎందుకు? నీ స్నేహితుల కష్టము నిష్ఫలం చేయడం ఎందుకు? హనుమంతుడు నన్ను వెదకిన తరువాత నన్ను పరిత్యజించినట్టైతే అప్పుడే ప్రాణాలు విడిచి ఉండేదాన్ని కదా, యుద్ధం చేసి ఇంత నాశనం కలిగించడం ఎందుకు?


196. కం. పతిచేతిని అపవాదము
గతియైనది సీత కిపుడు కాల వశమునన్!
చితిపేర్చుము ఓ లక్ష్మణ!
బ్రతికి ఫలము లేదు నాకు పతిలేక యిలన్

ఇంక నేను బ్రతి లాభంలేదు, రాముని పత్నిగా అగ్నికి నా దేహాన్ని సమర్పిస్తాను. లక్ష్మణా నీవు నాకు ఒక చితిని ఏర్పరుచు అని అన్నది సీతమ్మ.

197. కం. రాముని రూపము కాంచుచు
యేమనకన్ లక్ష్మణుండు యేర్పర్చె చితిన్
భూమిజ దుమికెను అగ్నిని
హామాతా యనిరి జనులు హాహా రవమున్

అన్న మాటలు విన్న లక్ష్మణుడు క్రోధావేశం తో ఊగిపోయాడు. కాని ప్రళయకాల రూపం తో వున్న రాముని చూచి ఏమీ అనలేక చితిని యేర్పర్చాడు లక్ష్మణుడు. సీతమ్మ ఆ అగ్నిలో దూకింది. అక్కడున్న వారంతా హా మాతా , హా మాతా అని హాహా కారాలు చేశారు.

198. కం. దిగివచ్చిరి దివి వేల్పులు
భగభగ మని నెగయు శిఖల పావని బడగన్!
అగణిత సుగుణారాముడు
గగనమ్ముల దొరల యెదుట కరములు మోడ్చెన్

సీతమ్మ ఎగసే అగ్నిశిఖల్లోకి దూకగానే దేవలోకాలనుంచి చతుర్ముఖబ్రహ్మ తో సహా సదాశివుడు ఇంద్రుడు మొదలైన దేవతలు దిగి వచ్చి రాముని వద్దకు వచ్చారు. వారిని చూచిన రామచంద్రుడు చేతులు మోడ్చి నమస్కరించాడు.

199. కం. ఆదియు నంతము లేకన్
వేదమ్ముల సారమగుచు వెల్గుదువె ప్రభూ
సాధారణ మానవు వలె
బాధింపగ భూతనయను పాడియ రామా!!

దేవతలు రామునితో , ప్రభూ ఆది అంతము లేక నిర్వికార నిరంజనుడవు నీవు. సకల వేదాలకు సారము నీవు వేదమే ఊపిరిగా వున్నవాడివి. ఒక సాధారణ మానవునిలాగా పరమపావని యైన సీత అగ్నిలో దూకుతూ ఉంటే ఎట్లా చూస్తున్నావు.

200. కం. సాధారణ మానవుడనె
నే దశరథ తనయుడన్న నిజము నెరుగుదున్
కాదేనిచొ వచియింపుము
సాదరముగ కోరుచుంటి సారస‌నిలయా!!

చతుర్ముఖ బ్రహ్మతో రాముడు, నేను సాధారణ మానవడను దశరథ కుమారుడను అనే నమ్ముతున్నాను. నేను యెవరికి సంబంధించిన వాడినో మీ నోట వినదలుచుకుంటున్నాను అని అన్నాడు.

201. కం. లోకమ్ముల పాలించు
శ్రీకాంతుడవయ్య నీవు సీతా నాథా!!
శోకమ్ముల తీర్చ భువిని
 యాకారము దాల్చినావు    యవనిజ కామా!!

ఈ సమస్త లోకాలకు ఆధారభూతుడవై అన్నిటిని సంరక్షించే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడవు నీవు. రావణుని సంహరించి లోకుల శోకాన్ని పోగొట్టడానికి ఈ భూమిపైన ఆకారాన్ని ధరించావు.

202. కం. సిరియే సీతని యెరుగుము
హరివే నీవని తెలియుము అచ్యుత నిలయా!
నరుగా పుట్టిన నీవీ
ధరలో ధర్మము నిలుపగ తరలితివయ్యా!

రామా! భూమిలోనుంచి ఉద్భవించి జనకుని ఇంట్లో పెరిగిన జానకియే ఆదిలక్ష్మి గా యెరుగుము. శ్రీహరివే నీవు. ధర్మాన్ని రక్షించడానికి ఈ భూమిపైన మానవునిగా దిగివచ్చిన సాక్షాత్ శ్రీహరియే నీవని తెలుసుకొనుము.‌

203. కం. చితిలోబడు భూకాంతను
హుతవాహుడు యంక మందు ఒద్దిక తోడన్
పతి చెంతన్ నిల్పి పలికె
హితవాక్కులు జనులు చూడ యినకులమణితో

బ్రహ్మ దేవుడు రామునితో ఆయన నిజ స్వరూపాన్ని యెరిగించిన వెంటనే. అగ్ని దేవుడు ఆకారాన్ని ధరించి సీతమ్మను తన వొడిలో నుండి రాముని చెంత నిలిపి ఆయనతో హితవు పలికాడు.

204. కం. పాపాత్ముని నీడ బడిన
దీపమ్ముగ వెల్గె సీత దివ్య ప్రభలన్
పాపమ్మెరుగని యీమెను
కోపమ్మును వీడి నీవు కూడుము రామా!

రామా, సీతమ్మ పరమ పావని. పాపాత్ముడైన రావణుని నీడపడినా కోవెలలో దీపంలాగా వెలిగింది సీత. ఈమె‌ ఏ పాపమూ ఎరుగదు. నీవు కోపాన్ని వదలి ఈ పావనిని గ్రహించు ఇది నా ఆజ్ఞ అని అన్నాడు అగ్నిదేవుడు.‌

205. కం. "రాముడు కామాసక్తుడు
యీ ముదితను చేగొనెగద యినకుల విభుడై!!"
భూమి జనులు పలుకరిటుల
భూమిజ శోధన ఫలముగ  పుడమిని యికపై

మూ. బాలిశో బత కామాత్మ రామో దశరథాత్మజః |
ఇతి వక్ష్యతి మామ్ లోకో జానకీమవిశోధ్య హి||

ఓ అగ్ని దేవా, సీతకు ఈ శోధన లేకుండా ఆమెను పరిగ్రహిస్తే లోకులు నన్ను కామాసక్తునిగా పరిగణించిన యెడల అది మా వంశానికి ఆమెకి కూడా మాయని మచ్చై మిగిలిపోతుంది. నీచే ప్రక్షాళన జరిగిన ఈమెను ఇకపై లోకం పునీతగానే చూస్తుంది.

206. కం. దినకరునికి దీప్తి వలెనె
ననువీడదు సీతయెపుడు నాలోనుండున్
యినకుల సతిగా జానకి
ఘనశీలగ నిలిచియుండు కాలాంతమునన్

సీత మహా సాధ్వియని నేను యెరుగుదును. ఆమె అగ్నిశిఖలా రావణుని వనములో ఉందనీ తెలియును, సూర్యుణ్ణి కాంతి విడిపోనట్టుగా సీత నాతో నాలో వుంటుంది ఎప్పుడూ.  ఆమె పాతివ్రత్యం కాలాంతము వరకు లోకం లో నిలిచి ఉంటుంది.


207. కం. భరతుడు నీకై వేచెను
పరివేదన తోడ జనని పలవించునదే
త్వరపడి యేగుమయోధ్యకు
ధరనేలుము ధర్మనిరతి దశరథ తనయా

పరమశివుడు ప్రేమతో, రామా నీకై భరతుడు కనులు కాయలు కాచి వేచి చూస్తున్నాడు. నీ తల్లి నిన్నే తలచి దుఃఖిస్తున్నది. త్వరగా అయోధ్యకు వెళ్ళు వారి దుఃఖాన్ని తీర్చి భూమిని ధర్మ నిరతితో పాలించి తిరిగి వైకుంఠము చేరుకొనుము అని అన్నాడు.

దశరథుడు రామ లక్ష్మణులను సీతమ్మను చూచి వాత్సల్యంతో దగ్గరకు తీసుకొని ఇలా అన్నాడు.

208. కం.  కలిగిన విఘ్నము లన్నియు
కలుషాత్ముని వధ కొరకని గ్రహియించితినే
తొలగెను కష్టములిక భువి
కలకాలము పాలనమ్ము గరపుము తనయా!!

రామా, యువరాజ పట్టాభిషేకము ఆగడమూ, కైకేయి వరాలు కోరడమూ, వనవాసము కలగడమూ అన్ని విఘ్నాలు కూడా రావణ సంహారానికి అని దేవతల వలన తెలుసుకున్నాను. ఇంక నీవు సువిశాల భరతభూమిని తమ్ములతో కలిసి ధర్మ బద్ధంగా పాలించు అని అన్నాడు.

209. కం. తల్లీ జానకి, రాముడు
యిల్లీలన్ శోధనమ్ము యిడె నీకొరకే
కల్లన్ యెరుగని నీపతి
ముల్లోకమ్ములను గాచు మురహరుడమ్మా!!

అమ్మా సీతా నీకు కలిగిన ఈ శోధన నీ హితవు కొరకే , సత్య సంధుడైన రాముడు సాక్షాత్తు శ్రీ మహా విష్ణువుగా దేవతల వల్ల తెలుసుకున్నాను.

210. కం. కన్నపితరు మరపించుచు
యిన్నేడులు గాచితయ్య యినకుల తిలకున్
కన్నార్పక కాచుకొనుము
అన్నను లక్ష్మణ‌ విడువక అంచిత బుద్ధిన్

లక్ష్మణా ! కన్న తండ్రి లాగా రాముణ్ణి కాపాడుకున్నావు వనవాస కాలమంతా  ఇకపై కూడా అన్నను పూజ్య భావముతో అనుగమించి సద్గతులను పొందు అని అన్నాడు.

211. కం. వరమివ్వక పోజాలరు
సురలెన్నడు రామచంద్ర, చూడగ జగతిన్
ఉరవగునది కోరుకొనుము
పరితుష్టుల మైతిమయ్య పరమేశనుతా!

దశరథ మహరాజు రామలక్ష్మణులను సీతను ఆశీర్వదించి ఊర్ధ్వ లోకాలకు వెళ్ళగానే, అక్కడే ఉన్న దేవేంద్రుడు రామచంద్రునితో , రామా, లోకములో మంచికార్యములు జరిగినప్పుడు సంతుష్టులైన దేవతలు ఎదురుపడితే వరములనివ్వకుండా వెళ్ళడం సరికాదు. పరమేశ్వరునిచే పొగడబడిన ఓ రామా,  నీకు ఉచితమైన (ఉరవు) కోరికను తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అన్నాడు.

212. కం. నాకై తమ ప్రాణములను
భీకర సంగ్రామమందు వీడు కపులకున్
ఆకారమునిమ్ము యిపుడె
నేకోరెడు వరము వినుము నిజముగ దేవా!

213. కం. తృణ ప్రాయముగెంచి బ్రతుకు
పణముగ నాకొరకు బెట్టు, వారందరకున్
ఋణమును తీర్చు తెరవిదె
ప్రణతులివియె నాకధీశ వరమీయంగన్  !

భార్య బిడ్డలను వదలి తమ ప్రాణాలను తృణప్రాయంగా తలచి భీకరమైన యుద్ధంలో ఎందరో వానరులు ప్రాణాలు కోల్పొయారు. దేవా నీవు నాకు వరమివ్వదలుచుకుంటే వారందరు తిరిగి ఆకారాన్ని పొంది భార్యా బిడ్డలతో సుఖసంతోషాలతో వుండాలనే వరమివ్వు. వారందరి ఋణమును తీర్చ అని ధర్మాత్ముడైన రామచంద్రుడు మహేంద్రునితో అన్నాడు.

214. కం. మహితాత్ముడు భరతుడచట
యిహభోగమ్ముల వీడి యేడ్చును నాకై
అహరహములు వేచునతడు
సహియింపగ జాలడింక జాగును సేయన్

కొన్ని‌నాళ్ళు లంకాపురిలో ఉండి తన ఆతిథ్యమును పొందమని కోరిన విభీషణునితో రామ చంద్రుడు, విభీషణా నా తమ్ముడు భరతుడు నేను వనవాసం పూర్తి చేసుకొని వస్తాను అని నన్నే తలుచుకుంటూ ఇహభోగాలాన్నీ విడిచి ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంకా ఆలస్యం చేస్తే అతడు యే అఘాయిత్యానికైనా పాల్పడవచ్చు కాబట్టి నేను ఇప్పుడే అయోధ్యకు బయలుదేరాలి. దానికి కావలసిన యేర్పాట్లు చూడమని చెప్పాడు.

215. కం. తమ్ములతో కూడి కరుణ
మమ్మేలగ నీవు భువిని మహరాజువలెన్
సమ్మతినిడు చూడగ గొని
మమ్ముల నీతోడ పురికి మైథిలి నాథా

శ్రీ రామా, సీతమ్మ చెంతనుండగా,  భరథ లక్ష్మణ శతృఘ్నులతో నీవు మహరాజుగా పట్టాభిషిక్తుడవయ్యే ఆ మహత్తర సన్నివేశాన్ని చూడాలని మేమంతా అనుకుంటున్నాము. మీతో బాటు మేము అయోధ్యకు రావడానికి సమ్మతిని ప్రార్థన చేస్తున్నాము. కాదనకు రామా!

216. కం. ఘనమగు పుష్పక మందున
యినకులమణి కోటిప్రభల యింద్రుని రీతిన్
యినసుతు సేనల తోడుగ
తనకాంతను చెంతనుంచి తరలె గగనమున్

పుష్పక విమానంలో వానర సేనలతో కూడిన రాఘవుడు ఇంద్రునిలాగా వెలిగి పోయాడు. సీతమ్మను చెంతనే ఉంచి ఆమెకు ఆకాశ మార్గం నుంచి వివిధ ప్రదేశాలను, అక్కడ జరిగిన సన్నివేశాలను చెప్తూ ముందుకు సాగాడు.

217. కం. అదెచూడుము వైదేహీ
పదితలలను త్రెంచితి నిట పౌలస్త్యునికిన్
వధియించితి కనుమిటనే
పదునాలుగు వేలఖరుల వాడిశరములన్

సీతా, అదిగో చూడు ఈ యుద్ధభూమిని. ఇక్కడే రావణుని పదితలలను నరికి అతని సంహరించాను. ఇదిగో జనస్థానము ఇక్కడే పద్నాలుగు వేల ఖరులను సంహరించినది.

218. కం. నినునుకోల్పడి వగచితినిట
ఘనమగు కిష్కింధ నగరి కనుమదె సీతా
యినసుతు సేనల కూడితి
తనయన్నను కూల్చితినిట ధరణీ తనయా!

అదిగో చూడుము, నిన్ను కోల్పోయి రేయింబవళ్ళు ఎంతగానో ఏడిచాను ఇక్కడే. అదిగో కిష్కింధ నగరి, సుగ్రీవుని తో మైత్రిని చేసిన స్థలం. వాలిని సంహరించింది కూడా ఇక్కడే.

219. కం. మనతోడుగ రుమతారల
గొనిపోవగ మన నగరికి కోర్కెను వినుమా
మనసారగ కాన్కలనిడి
వనచారుల సత్కరించు భాగ్యమునిమ్మా

రామా! మనకు తోడుగా సుగ్రీవుని‌భార్యలను మిగిలిన కపివీరుల పడతులను మన నగరానికి గొనిపోయి వారికి అతిథి సత్కారాలను చేయాలని వున్నది. నా ఈ కోర్కెను
తీర్చండి అని సీతమ్మ రామునితో అన్నది.  ఉచితమైన సతి కోర్కెకు వెంటనే సరేనన్నాడు రామయ్య.

220. కం. మునివరుడు భరద్వాజుని
వనవాటిక నరుగుదెంచి వనితామణితో
మనసున ఆత్రము నిండగ
తనతమ్ముని సేమమరసె దాశరథి మునిన్

221. పుష్పక విమానం భరద్వాజ మహాముని ఆశ్రమం దగ్గర నిలిపి సీతమ్మతో కలిసి రామయ్య ఆ ముని ఆశీస్సులను పొందాడు. తరువాత త్రికాలవేది యైన భరద్వాజునితో రాముడు మనసులోని ఆత్రము వుంచుకోలేక తన తమ్ముడు భరతుని క్షేమ సమాచారాలను అడిగాడు.

కం. నిరతము నిన్నే తలచును
భరతుడు, నీపాదుకలిడి పాలించు భువిన్!
పరితాపము వీడి యిచట
విరమించుము నేటి రాత్రి ప్రీతిన్ రామా!!

రామా, భరతుడు మట్టి వస్త్రాలను ధరించి (శరీరం పైన ధ్యాస లేకుండా) నిరతము నిన్నే తలుచుకుంటూ నీ పాదుకలతో రాజ్యాన్ని సుభిక్షంగా ఏలుతున్నాడు. కాబట్టి నీవు అతనికై విచారించకు. నేటి రాత్రి ఇక్కడే విశ్రమించు పరివారముతో సహా అని బదులిచ్చాడు భరద్వాజ మహాముని.

222. కం. వింటిని వనవాస వ్యథల
వింటిని చేకొని సలిపిన వింతల నెన్నో!!
తుంటరి రావణు హతమును,
మంటను గెలిచిన యవనిజ మహిమల నన్నిన్

రామా, నేను నీ వనవాస వ్యథను, విల్లమ్ములతో నీవు వేల రాక్షసులను సంహరించిన కథలను, రావణ సంహారము, సీత అగ్ని పునీతగా మరలిన విశేషాలన్నీ తెలుసుకున్నాను అని భరద్వాజ మహాముని రామునితో అన్నాడు.


223. కం. చనుమిపుడే భరతు కడకు
వినిపించుము మన కథలను వేగమె హనుమా
కనిపెట్టుము ముఖ కవళిక
తన మనసున ఉన్నదేమొ తప్పక తెలియున్

శ్రీ రాముడు, కార్య సాధకుడు, వాగ్విశారదుడు తనకు అతి ప్రియుడైన హనుమంతుని పిలిచి, హనుమా నీవు ఇప్పుడే  భరతుని దగ్గరికి వెళ్ళు మన రాకని, సీతాపహరణాన్ని,  రావణ హతమును అతనితో చెప్పు. అట్లా నీవు చెప్తున్నప్పుడు అతని ముఖ కవళికలను పరీక్షించు, అప్పుడు అతని మనసులో రాజ్యము కావాలన్న కోరిక ఉంటే మనకు తెలిసి పోతుంది.

224. కం. హరివీరుడు వాక్చతురుడు
అరుదెంచెను కైకసుతుని ఆవాసముకున్
ధరపై నడచిన ధర్మమె
భరతునిగా గాంచి యచట పలుకుట మరచెన్

హనుమంతుడు మాటలందు నేర్పరి యెదుటి వారి మనసును తెలుసుకోగల బుద్ధిమంతుడు. భరతుడున్న నందిగ్రామానికి వచ్చి అక్కడ జడ ధారియై శుశ్కించిన శరీరం కలిగినా సూర్యునిలాగా వెలిగిపోతూ,  ధర్మమే తనువు దాల్చిందా అన్నట్టు మరో రామచంద్రునిగా కనబడుతున్న భరతుని ఆశ్చర్యంగా చూచాడు.

225. కం. శ్రీరాముని రాకను విని
ధారగ కన్నీరుబుకగ తనువు తడబడన్
ధారుణి పైపడె భరతుడు,
మారాడక యచటనిల్చె మారుతి యపుడున్

శ్రీరాముడు ఆగమన వార్తను భరతునికి తెలిపాడు స్వామి హనుమ, రాముని మాట వినగానే పరవశత్వము పొందిన భరతుడు కన్నుల నీరు ఒక్కసారిగా ఉబికింది, ఆనందంతో శరీరం పట్టు తప్పి నేల పై బడి మూర్ఛను పొందాడు మహాత్ముడైన భరతుడు. ఆయన భక్తి ప్రపత్తులు చూచి హనుమ నిశ్చేష్టుడై నిలబడి పోయాడు.

226. కం. యేమిత్తును నీకు హనుమ!!
రాముని యాగమన మెరిగి రంజిలు మనమున్?
భూములొ? భామలొ? గోవులొ?
ఏమైనన్ కోరుకొనుము యిచ్చెదనిపుడే!!!

తేరుకున్న భరతుడు హనుమతో, ఇంత మంచి వార్తను తెలిపిన నీకు ఏమీయగలను నేను? భూములా అందమైన స్త్రీలా వేల గోవులా? ఏదైనా సరే నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు.

227. కం. వినుడు వినుడు ప్రజలారా
మనరాముడు మరలి వచ్చె మనలన్ బ్రోవన్
ఘనస్వాగత మిడ స్వామికి
జనులంతా కదలి రండు జాగు తగదికన్

 పద్నాల్గేళ్ళు ప్రతిక్షణం అన్నకై వేచి చూచిన భరతుడు రాముడు వచ్చేస్తున్నాడన్న స్వామి హనుమ వార్తను విని ప్రజలతో,
మన రాముడు వచ్చేస్తున్నాడు! మనమంతా కలసి స్వామికి ఘనమైన స్వాగతమునివ్వాలి త్వరగా పదండి అంతా!! భరతుని ఆనందానికి హద్దులు లేవానాడు.

228. కం. ఆకసమంటగ పందిరి
భూకాంతుని కొరకు తీర్చి పూవుల దారుల్
సాకేతపురిని మరియొక
నాకమ్ముగ చేయుడిపుడు నారామునికై

నా రామునికై ఎండ తగులకుండా ఆకాశాన్నంటే పందిరి వేయండి.   దారంతా పూలతో నింపివేయండి. సాకేతపురమా స్వర్గంగా తీర్చి దిద్దండి.

229. కం. అదిగో అల్లదిగో గను
మదె, ధనదుని పుష్పకమ్ము ఆకసమందున్ !!
మదనజనకు వలె రాముడు
సుదతిని గొని వచ్చుచుండె చూడుము భరతా

 రాముడు కనబడక హనుమతో భరతుడు, సహజమైన కపి బుద్ధిచేత నాకు రాముడు వచ్చాడని చెప్పావా హనుమా? ఎందుకంటే నాకు అన్న ఇంకా కనబడటం లేదు అని అన్నాడు. ప్రేమమయుడు భరతుని తపన చూచి హనుమ ఆయనతో, భరతా అదిగో చూడు, చంద్రునిలాగా వెలుగుతున్నదే అదే ధనదుని (కుబేరుని) దివ్య పుష్పక విమానము అందులోనే శ్రీహరి (మదన జనకుడు) లాగా వెలుగుతూ సీతమ్మతో వస్తున్నాడు శ్రీరాముడు.

230. కం. భరతుని చూచిన రాముడు
పరుగున నెదచేర్చె నతని పరవశుడయ్యెన్
పరమాద్భుత మా దృశ్యము
వరముగ చూచిరి సుజనులు వారినిరువురిన్

అంతలో శ్రీరాముడు పుష్పకము నుండి క్రిందికి దిగాడు. పదునాలుగు యేళ్ళ తరువాత తమ్ముని చూడగానే రాముడు, ఆనందభరితుడై భరతుని తొడమీద కూర్చుండబెట్టి హృదయానికి హత్తుకున్నాడు.  ఆ దృశ్యమును చూచిన వారంతా ఇది మాకు వరముగా దొరికినది అనుకొని సంతోషించారు.

231. కం. నీపాదుకలే రక్షగ
యేపాపపు నీడ బడక యీదేశముకున్
కాపుగ నుంటిని‌ అన్నా!
యీపుడమిని గొనుము నాకు యిచ్చిన పగిదిన్!!

భరతుడు సీతమ్మకు ప్రవర చెప్పి నమస్కరించి,  లక్ష్మణుని పలకరించి శ్రీరామునితో,
అన్నా నీ పాదుకలే నాకు ఈ పదునాల్గేండ్లుగా తోడూ నీడా. నీపాదుకలే రక్షగా ఈ దేశాన్ని శతృవులబారినిండి కాపాడుతూ, సుభిక్షంగా ఉంచగలిగాను. ఇదిగో నాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాను. మా అందరికీ ఎల్లప్పుడూ నీవే కదా ప్రభుడవు అని అన్నాడు.

232. కం. నీవే మా మహరాజువు
కావేవీ నీకు సమము కరుణా నిలయా!!
నీవానిగ యుండతగుదు
నావన్నవి లేనెలేవు నమ్ముము రామా!!

రామచంద్రునితో భరతుడు అంటున్నాడు, అన్నా నీవే మహరాజ స్థానానికి తగిన వాడవు నాకు నీవానిగా మాత్రమే ఉండటం సంతోషం, శ్రేయస్కరం.

233. కం. గ్రహతారలు నిలుచు వరకు
మహిలో ధర్మము నిలుపగ, మము గాచుటకున్
వహియింపుము భూభారము
ఇహపరముల నిచ్చి మాకు యినకులతిలకా!

ఈ భూమండలం లో రథ చక్రం ఎక్కడవరకూ తిరుగుతుందో అంతవరకూ, ఆకాశంలో గ్రహతారలు ఉన్నంత వరకూ నీవే ఈ సమస్త లోకానికి ప్రభుడవు. ఇహపరములనిచ్చే ధర్మాన్ని నిలిపి మమ్ములను పాలించు

234. కం. ఊరెరిగింపుగ రాముడు
బారులు తీరగ సుజనులు, వానర పతితో
వీరులు శతృఘ్న భరతులు
చేరగ తన వేంట వెడలె సీతా సతితో

శ్రీ రాముడు పట్టాభిషేకానికి సమ్మతించిన పిదప వానర స్త్రీల కోరికమేరకు సీతమ్మతో కలిసి అయోధ్యా నగర వీథులలో భరతుడు రథ సారథిగా, శతృఘ్నుడు ఛత్రం పట్టుకొనగా, విభీషణుడు చామరతో వీస్తూండగా, బారులు తీరిన నగర ప్రజల మధ్యన దేవేంద్రునిలా వెలిగిపోతూ దర్శనమిచ్చాడు.

235. కం. విచ్చిన పూవుల‌ మాలలు
పచ్చని తోరణములేసి పట్టణ మంతన్
ఎచ్చట చూచిన రాముడె
సచ్చరితుని విజయ కథలె జనవాక్యములన్

అయోధ్యా పట్టణమంతా కూడా ఎక్కడచూచినా పూలతో పచ్చని తోరణాలతో అలంకరించబడింది ప్రతి గృహమూ. అందరిళ్లలోనూ పండగే, అందరి మనసుల్లోనూ రాముడే, ఎవ్వని నోటవిన్నా స్వామి విజయ గాథలే, జగమంతా రామమయంగా నిలిచిపోయింది.

236. కం. మ్రోగెను  మంగళ రవములు
సాగెను వేడుకలయోధ్య జనపథములలో
వేగమున తెచ్చిరి కపులు
సాగర జలము లభిషేక సంబారముకై

మంగళ వాద్యాల ధ్వని మిన్నంటగా అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవము నిర్వహింపబడింది. అభిషేకానికి కావలసిన సప్త సముద్ర జలాలనూ, నదీ జలాలనూ బలవంతులైన హనుమాది వానర వీరులు తెచ్చారు. రామ పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది.

237. కం. రాజయ్యెను రఘురాముడు
భూ జనములు కొలువ నతడు పురుషోత్తముడై
భూజాతయె వెంట నిలువ
రాజిల్లెను ధర్మమూర్తి లక్ష్మీపతియై

దివ్యమైన కిరీటమూ, రఘుకుల సామ్రాట్టులు ధరించిన కిరీటం కులగురువైన వశిష్టుడు శిరస్సుపై నుంచగా అందరి సమక్షంలో పురుషోత్తముడైన  రఘురాముడు రాజారాముడయ్యాడు. సీతమ్మ పక్కనుండగా శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణునిగా దర్శనమిచ్చాడు భూలోక ప్రజలకు.

238. కం. పలుకాన్కల నర్పించెను
నలినాక్షుడు వానరులకు నగర ప్రజలకున్
విలువగు ముత్యాలసరము
అలివేణికి యిచ్చె విభుడు ఆనందముగన్

రాజారాముడు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడై వానరులకు నగర పౌరులకు విలువైన కానుకలను అర్పించాడు. అతి మహిమాన్వితమైన ముత్యాల హారాన్ని సీతమ్మకు బహూకరించాడు రామయ్య. ఆ ముత్యాల హారాన్ని మెడలోనుంచి తీసి హనుమ వైపు రాముని వైపు చూచింది అమ్మ. రాముడు సీతమ్మతో ఈ హారాన్ని బుద్ధి, యశస్సు, తేజము, ధైర్యము, దాక్ష్యము, సామర్థ్యము పౌరుషము గల వానికి నీ ఇచ్ఛానుసారంగా ప్రదానం చేయవచ్చు అన్నాడు.

239. కం. వినయము ధైర్యము బుద్ధియు
ఘనయశమును గల హనుమను కాంచిన తడవున్,
తనహారము నిడె జానకి
మనసున దీవించి తల్లి మరుతాత్మజుకున్

అన్ని సద్గుణముల రాశియైన స్వామి హనుమకు సీతమ్మ ఆ ముత్యాల హారాన్ని కానుకగా ఇచ్చింది. మనసులోనే స్వామిని నవనిధులకు, అష్టసిద్ధులకు అధికారిగా దీవించింది తల్లి.


240. కం. శ్రీ రాముని రాజ్యమ్మున
లేమన్నది లేదుయచట లేశమ్మైనన్
కామితములు తీర్చి విభుడు
భూమి ప్రజల మన్ననలను పూజల బడసెన్


సకల భూమండలాన్ని పదకొండువేల సంవత్సరాలు పాలించాడు శ్రీ రామ చంద్రుడు. రామ రాజ్యం లో ప్రజలకు ఏమాత్రము లేమి అన్నది లేకుండా ఉండేది. ప్రజలు ధర్మ బద్ధంగా జీవిస్తూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవించారు. అకాల మరణం లేదు, సకాలంలో వర్షాలు భూమి సస్యశ్యామలంగా విరాజిల్లింది. ప్రజల పూజలను అందుకొని రామ రాజ్యమంటే రామ రాజ్యమే అన్నట్టుగా పాలింక్షాడు భూమిని స్వామి.


కం. రామాయణ కథను వినిన 
రామాయని మాటయన్న రావుదురితముల్ 
సేమమ్మును కూర్చు పరం
ధామమ్మును చేర్చు విభుని తారక మంత్రం 

శ్రీమద్రామాయణాన్ని‌ విన్నా, శ్రీ రామా యని ఏకార్యం తలపెట్టినా సఫలమౌతుంది. రామ నామము సకల శ్రేయోదాయకము. రామ నామము ఐహిక ఆనందాన్ని ఇచ్చి పరంధామాన్ని చేర్చగలిగే తారక మంత్రం.

జయ జయ రామ జానకి రామా
రఘుకుల సోమా కరుణా ధామా
రామ రామ జయ రాజా రామా
రామ రామ జయ సీతా రామా

        జై శ్రీ రామ్ !!






No comments: