శ్రీమద్రామాయణామృత తరంగిణిలో మనోభావాలహరీ విలాసాలు

పుల్లెల శ్రీరామచంద్రుడు 





రామాయణరామణీయరహస్యోద్ఘాటనం 


శ్రీమద్రామాయణంలోని యుద్ధకాండలో ఆదికవి వాల్మీకి రామ రావణయుద్ధాన్ని వర్ణిస్తూ - 

"ఆకాశానికి ఆకాశమే సాటి, సాగరానికి సాగరమే సాటి, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి" అని‌ అన్నాడు. 

"గగనం గగనాకారం సాగరః సాగరోపమః,
రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ." 

అదే విధంగా ఈ ఆదికావ్యాని గురించి - 

" శ్రీమద్రామాయణం కావ్యం శ్రీమద్రామాయణం యథా." శ్రీమద్రామాయణానికి శ్రీమద్రామాయణమే సాటి అని నిస్సంశయంగా చెప్పవచ్చు. దీనితో పోల్చదగిన కావ్యం ప్రపంచ వాఙ్మయం లో ఎక్కడా ఈనాటి వరకూ ఆవిర్భవించలేదు, ఇటుపైన ఆవిర్భవించబోదు. 

అత్యత్భుతమైన ఈ కావ్యాన్ని అనేకులు తమ‌ తమ అభిరుచులను బట్టి అనేక దృక్కోణాలలో పరిశీలించి అధ్యయనం చేస్తూ దానిలోని వివిధ విషయాలను ఆస్వాదిస్తూ ఆనందిస్తూంటారు. 

శ్రీ మహావిష్ణువు  అవతారమైన శ్రీరాముని దివ్య చరిత్రమును వర్ణించే పవిత్ర గ్రంథమని దీనిని ఎందరో పుణ్యార్జనతత్పరులు భక్తి పారవశ్యంతో పఠిస్తుంటారు.

ఆయా ఘట్టాలలో పోషించిన వివిధ రసాలను ఆస్వాదిస్తూ కొందరు సరసహృదయులు చమత్కారభరితాంతరంగులౌతూంటారు. అపూర్వమైన ఉపమాద్యలంకారాల సౌందర్యం చూచి కొందరు విస్మయావిష్టచేతస్కులౌతూంటారు.
పుర- అంతఃపుర - అరణ్య - సముద్ర - ఋతు - శైల - నదీ - నద - సరస్ - చంద్రోదయ- సూర్యోదయ - యుద్ధాది వర్ణలలోని వైచిత్రిని పరిశీలిస్తూ కొందరు ప్రమోదభరిత మానసులౌతుంటారు. 

మహాకావ్య నిర్మాణానికి దిశానిర్దేశం చేసినది ఈ ఆదికావ్యమే‌కదా అని అని గుర్తించగలిగిన అలంకారికాదులు దీనిని వేయి విధాల శ్లాఘిస్తూంటారు. 

మాధుర్య-ప్రసాద గుణాలకు నిలయమైన మనోహర రీతిలో నడచిన ఈ కావ్యమునే ఆదర్శంగా తీసికొని కావ్యాదులు రచించిన కాళిదాసాదులు మహాకవులగా అత్యున్నత స్థానాన్ని ఆక్రమించారు.

 దీనినుండే వివిధభాషలలో కావ్యరచనాస్ఫూర్తిని పొందుతున్న సత్కవులెందరో అన్ని కాలాలలోను ఆవిర్భవిస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఈ ఆది కావ్యంలో కావ్యత్వసంపాదకములూ, కావ్యశోభా సంవర్ధకములూ అయిన విషయములు ఎన్నో నిక్షిప్తములై వున్నాయి.

అయితే - ఈ మహాకావ్యం లోకప్రియం అవడానికీ ఇది ఆవిర్భవించిన మొదలు నేటి వరకూ అవిచ్ఛిన్నంగా జనాదరణ పొందడానికీ ప్రధానకారణమైన , చాలా మంది గుర్తించని , మరొక విషయం ఉంది - అది ఈ కావ్యంలో మొదటినుండి చివరివరకు కవి చూపిన సంభాషణనిర్వహణచాతుర్యం. 

ప్రతీఘట్టంలోను ఆయా వ్యక్తులచేత వారి మానసిక స్థితికీ , అప్పటి పరిస్థితికి అనుగుణంగా సవిస్తరంగా మాటలాడించడం ఈ కావ్యంలో మాత్రమే కనబడే వైశిష్ట్యం. 

ఇది పఠితలకు ఆయా సంఘటనలను ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. వాల్మీకి‌మహాముని బాలకాండ మొదలు యుద్ధకాండ చివరి వరకు ఈ మహాకావ్యాన్ని ఆ పద్ధతిలోనే నడపగలిగాడంటే దీనిని బట్టి ఆ ఆదికవి వర్ణ్యవిషయాలను మనోనేత్రాలతో ప్రత్యక్షంగా చూడగలిగిన  ఎంతటి భావనాశక్తిసంపన్నుడో ఊహించుకొనవచ్చును. 

నిజానికి బ్రహ్మదేవుడు - వాల్మీకిమహామునికిచ్చి‌న - 

"రహస్య చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః, 
రామస్య సహ‌సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః, 
వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వా రహః, 
తచ్చాప్యవిదితం సర్వం విదితం యే భవిష్యతి" 

(రామునకు, లక్ష్మణునకు, సీతకు, రాక్షసులకు, తదితరులందరికీ సంబంధించిన ప్రతీ విషయమూ, అది ప్రకాశమైనా - రహస్యమైనా కూడ, నీకు తెలుస్తుంది) అను వరం అక్షరాలా సత్యమైనట్టు కనబడుతూన్నది. ఈ సంభాషణాదులను బట్టి మనం అలా అనుకోవడమే కాదు - అది సత్యమే అయినట్లు ఆ ఘట్టంలో ఉన్న - 

"తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమస్థితః,
పురా యత్తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా"

( ఆ విషయాలన్నీ, వాల్మీకి ముని, అరచేతిలో ఉసిరికాయ చూచినట్లు చూడగలిగాడు) అను శ్లోకం స్పష్టంగా చెపుతూన్నది. 

ఈ విధంగా ఆ యా ఘట్టాల్లో, ఆ యా పాత్రల మనస్సులలో ఉండే భావలను అతిస్వాభావికమైన రీతిలో ఆవిష్కరించగలిగిన సంభాషణలను, సంవాదాలను కూర్చడం ద్వారా ఆదికవి శ్రీమద్రామాయణానికి అజరామరత్వం సంపాదించగలిగాడు. 

రామాయణంలో కథా వస్తువు చాల చిన్నది. మొత్తం కథ అంతా పది పదిహేను పుటలలో వ్రాయవచ్చును. అత్యల్పమైన కథావస్తువుతో ఆదికవి ఇంత విస్తృతమైన మహాకావ్యాన్ని నిర్మించాడంటే ఈ సంభాషణానిర్వహణచాతుర్యమే ఇందుకు కారణం. దీనికి విస్తృత వర్ణనా నైపుణ్యం తోడైనది. కేవలం విషయప్రతిపాదనము, లేదా ఆఖ్యాన కథనమూ ప్రధానంగా వుండే భారత - పురాణాదుల్లో మనోహరసంవాదాల అనుప్రవేశానికి అవకాశం ఉండదు. రామాయణంలోనే, ఉపాఖ్యానాలు ఎక్కువగా ఉన్న బాలకాండలోను, ఉత్తరకాండలోను (ఉత్తరకాండ వాల్మీకి రచన కాదు అని అస్మదాదృశుల అభిప్రాయం) ఇలాంటి మానవమనోభావముకురాలైన  సంభాషణాదులు ఎక్కువగా కనబడవు. 

శ్రీ మద్రామాయణాన్ని తెలుగులో ప్రతిపదార్థ - తాత్పర్యాదులు వ్రాయడం కోసం దాదాపు తొమ్మిది సంవత్సరాలు ( 1986 - 1995) ఈ ఆదికావ్యం, నిరంతరమూ చదువుతున్న కాలంలో ఇలాంటి ఘట్టాలలోని రామణియకాన్ని గుర్తించే అవకాశం నాకు కలిగింది. వీటినన్నింటినీ ఒక చోట చేర్చి సహృదయులకు అందజేసి ఈ ఆనందాన్ని వారితో పంచుకుంటే బాగుంటుందన్న భావం మనస్సులో చాలకాలంనుండి ఉండేది. కాని నేటివరకు అది కావ్యరూపం దాల్చలేదు. ఏమైనా ఈ పని పూర్తిచేసి ఆదికావ్యంలో ఉన్న , ఇంతవరకు ఎవరూ ఒక నిశ్చితరూపంలో స్పష్టీకరించని, ఈ వైశిష్ట్యాన్ని వెలికి తీయాలను సంకల్పంతో ఈ మధ్య ఒకటిన్నర- రెండు మాసాల దీక్షతో ఈ కావ్యం పూర్తి చేయగలిగాను. యుద్ధకాండాంతరామాయణంలోని 357 ఘట్టాలను ఉద్ధరించి, సందర్భాలను సూచిస్తూ వాటిని సహృదయులకు అందజేయుచున్నాను. వీటిని మళ్ళీ మళ్ళీ చదువుతూ‌న్నపుడు నాకే రామాయణం అంతా మరలా చదువుతూన్న ఆనందం కలుగుచున్నది. 

భవభూతి చెప్పినట్లు - 

"ఉత్పత్స్యతే స్తి మమ కో పి సమానధర్మా
కాలో హ్యయం నిరవధిర్విపులా చ పృథ్వీ" 
( నా వలెనే వీటిని మననం చేసి ఆనందించే వారు ఈ అనంతకాలంలో మున్ముందు జన్మించవచ్చు లేదా ఈ విశాలభూమండలంలో ఇప్పుడే ఎక్కడైనా ఉండవచ్చును) అని ఆశిస్తున్నాను. 

27-10-2010                                         పుల్లెల శ్రీరామచంద్రుడు

***************************************************************************************************
ఆదికవి వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణ మహాకావ్యం ఒక రసామృత తరంగిణి. సొగసుగా, మెల్ల మెల్లగా ప్రవహిస్తున్న ఈ రసతరంగిణిలో విచిత్రమానవ మనోభావలహరుల విలాసాలు ఎన్నో సహృదయుల హృదయాలను ఆనందతుందిలాలను చేస్తుంటాయి. అలాంటి కొన్ని లహరుల మనోహరలాస్యాలను ముకుళితలోచనులమై మనోనేత్రాలతో తిలకించి ఆస్వాదిద్దాం. 

  బాలకాండము - 1

శ్రీమద్రామాయణం ఇద్దరు మహామునుల పరిశుద్ధ మనోభావాలను చిత్రించే వస్తు నిర్దేశంతో ప్రారంభం అయింది. 

తపఃస్వాధ్యాయనిరతుడు దేవర్షీ అయిన నారదుడొకనాడు మహాతపఃశాలియైన వాల్మీకిమునీంద్రుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆనందభరితాంతరంగుడైన వాల్మీకి ఆయనను తగువిధంగా సత్కరించిన తరువాత వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది.  సామాన్య మానవుల మధ్య జరిగే సంభాషణవలె లౌకికవిషయాలకు సంబంధించి ఉండేది కాదు. ఇద్దరూ మహామునులే ఇద్దరూ సర్వలోకహితైషులే అందుచేత వారి సంభాషణ ఆ మార్గంలోనే జరిగింది. 

"ఈనాడు ఈ లోకంలో ఉన్న సద్గుణ సంపన్నుడైన మహాపురుషుడెవరు?" అని వాల్మీకి నారదుణ్ణి ప్రశ్నిస్తూ ఆ సద్గుణాలెలాంటివై ఉండాలో కూడ పేర్కొన్నాడు - 

"తపస్స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదామ్ వరమ్ 
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుఙ్గవమ్"

"కోన్వస్మిన్ సాంప్రతమ్ లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్,
ధర్మజ్ఞశ్చ కృతజ్ఙశ్చ సత్యవాక్యో దృఢవ్రతః "

"చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతహితేరతః" 
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనః " 

ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే" 

ఈప్రశ్నకు సమాధానంగా నారదుడు శ్రీరాముని గుణగణాలు వర్ణిస్తూ రామాయణ కథంతా సంక్షిప్తంగా వాల్మీకికి చెప్పాడు. ఈ విధంగా ఇద్దరు మహామునుల సహజ మనఃప్రవృత్తి చిత్రణంతో ప్రారంభం అయినది శ్రీమద్రామాయణం.

***************************************************************************************************

బాలకాండము - 2

వాల్మీకి నారదునినుండి విన్న శ్రీరామకథను మననం చేసికొంటూ, ఆనందభరితమైన హృదయంతో భరద్వాజుడాను శిష్యునితో మాధ్యాహ్నికస్నానం చేయడానికి తమసానదికి వెళ్ళాడు. 

అప్పుడాయన మనోవృత్తికి ఆ నదీప్రదేశమంతా ప్రకృతిసౌందర్యంతో ఆనందమయంగా గోచరించింది. కర్దమం (బురద) ఏమాత్రం లేకుండా స్వచ్ఛంగా ఉన్న ఆ తమసానదీ ప్రవాహం చూడగానే ఆయనకు ఏ కల్మషాలు ఎరుగని మహాత్ముల నిర్మలమైన మనస్సు గుర్తుకు వచ్చింది. అది శ్రీరాముని మనస్సో , నారదుని మనస్సో, తనదో ఏదైనా కావచ్చు. 

"అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ
రమణియం ప్రసన్నాంబు సన్మనుష్యమనో యథా"

ప్రకృతి సౌందర్యం చూస్తూ ఇటూ అటూ పచారు చేస్తున్న వాల్మీకికి ఒక వైపు మధురంగా కూస్తూ హాయిగా ఎగురుతున్న క్రౌంచ పక్షుల విడదీయరాని జంట కనబడింది. వాటినికూడా చూస్తూ ఆనందిస్తున్నాడు. అవికూడా ప్రకృతిసౌందర్యంలో ఒక భాగమే కదా!! అంతలో హటాత్తుగా ఏ మూలనుండో బాణం వచ్చి తగలగానే మగపక్షి రక్తంతో తడిసిన శరీరంతో నేలమీద పడిపోయింది. తన సహచరుణ్ణి చూచి ఆడపక్షి కరుణ స్వరంతో అరుస్తూన్నది. ఈ దుర్భరమైన దృశ్యం చూడగానే అంతవరకు ఒక విధమైన ఆనందపారవశ్యంతో వున్న ముని మనస్సు చెదిరిపోయింది. ఆ బాణం వచ్చిన వైపు చూడగానే దానిని ప్రయోగించిన ఒక నిషాదుడు కనబడ్డాడు. కలవరం చెందిన మనస్సుతో ఏమి జరిగిందో తెలియని పరిస్థితిలో ఉన్న ఆ వాల్మీకి మహాముని నోటినుండి ఛందోబద్ధమైన ఒక వాక్కు అప్రయత్నంగా బయలుదేరింది. 

"మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాః
యత్ క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితమ్" 

"నిర్భాగ్యుడవైన ఓ బోయవాడా నీవీ క్రౌంచ పక్షుల జంటనుండి కామపరవశమై ఉన్న మగపక్షికి చంపావు. నీవు చాల కాలం జీవించవు" 

నిజానికిది శాపం‌ కాదు. వాల్మీకి మహాముని సహజంగా జాలి గుండె గలవ్యక్తి. అట్టి స్థితిలో ఉన్న క్రౌంచాన్ని నిషాదుడు చంపినా కూడ శపించలేదు. శపిస్తే అతడు వెంటనే చనిపోయేవాడు. ఇది ఒక కరుణావేశంతో అప్రయత్నంగా వెడలిన "ఎంత పనిచేసావురా అర్ధాయుష్కుడా!" అన్న తిట్టు వంటిది. నిషాదునికి పక్ష్యాదుల మారణం సహజమైన వృత్తి. దానివల్ల అతనికి పాపం వస్తుందనడానికి కూడ వీలు లేదు. అయినా అటువంటి కామమోహితమైన స్థితిలో ఉన్న పక్షిని చంపినందుకు అతడు పెద్ద తప్పు చేశాడన్న అభిప్రాయంతో వానిని ఆ విధంగా దూషించడం జరిగింది.  "శాశ్వతీఃసమాః ప్రతిష్ఠాం మా గమః" - ఇలాంటి స్థితిలో ఉన్న పక్షిని చంపావు గాన నీకు కూడ సంతానం కలిగి ఆ సంతానంతో నీ వంశం చిరకాలం ఉండడం అనేది ఉండదు" అని‌కూడా దీని భావం. ఈ విధంగా "నీవు వెంటనే రక్తం కక్కుకొని చస్తావు" అన్నట్లు శపించకుండా వాని దూషణ మాత్రం చేయడం వాల్మీకి‌మహాముని సహజస్వభావానికి అనుగుణంగా వున్నది. 

తననోటినుండి అలాంటి వాక్కు ఛందోబద్ధంగా అప్రయత్నంగా వెడలినందుకు ఆయనకు చాల ఆశ్చర్యంగా ఉన్నది. "అప్రయత్నంగా వచ్చిన శ్లోకమే, శ్లోకం అనే ఛందస్సే" అని శ్లోకాన్ని మననం చేస్తూ, పైకి చదువుతూ, శిష్యునితో అన్నాడు. అతడు ఆశ్చర్యంతో ఆ శ్లోకాన్ని గురుముఖంనుండి గ్రహించి వెంటనె కంఠస్థం చేసికొని చదివాడు. అతడు అది కొత్తగా ఉండడం చేతా, గురువు విషయంలో గౌరవం చేతా అలా చేయడం సహజమే. అతడలా చదువుతూంటే గురువుకు కూడా అనందం కలిగిందట. తన రచనను ఎవరైన అభినందిస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది రచయితకు? 

"శిష్యస్తు తస్య బ్రువతో మునేర్వాక్యమనుత్తమం
ప్రతిజగ్రాహ సంతుష్టస్తస్య తుష్టో అభవద్గురుః?".  (బా.కాం. 2.10)


***************************************************************************************************

బాలకాండము - 3

వాల్మీకి తన ఆశ్రమానికి వచ్చి, మాధ్యాహ్నిక కార్యకలాపాలన్నీ పూర్తి చేసుకొని విశ్రమిస్తూన్న సమయంలో బ్రహ్మ దేవుడు వచ్చాడు. వాల్మీకి ఆయనకు తగిన సత్కారాలన్నీ యాంత్రికంగా చేసినట్లే చేసి ఆయన యెదుటనే కూర్చున్నాడన్నమాటే గానీ ఆయన మనసులో కొన్ని ఘడియలకు‌ ముందు జరిగిన క్రౌంచ వృత్తాంతమూ, తన నోటినుండి వచ్చిన ఆ శ్లోకమూ నిరంతరమూ తిరుగుతూనే ఉన్నాయి. 

"బ్రహ్మణా సమనుజ్ఞాతః  సో అప్యుపావిశదాసనే 
ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాల్లోకపితామహే 
తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థితః "

"బ్రహ్మ దేవుని అనుజ్ఞ పొంది ఆసనం‌మీద కూర్చున్నాడు. సాక్షాత్తు బ్రహ్మ దేవుడే ఎదురుగా కూర్చున్న సమయంలో కూడ ఆయన మనస్సులో ఆ విషయాలే ఆలోచిస్తున్నాడు. "

"పాపాత్మనా కృతం కర్మ వైరగ్రహణ బుద్ధినా
యస్తాదృశం చారురవం క్రౌఞ్చం హన్యాదకారణాత్ "

"అలా మధురంగా కూస్తున్న క్రౌంచ పక్షిని నిష్కారణంగా ఆ బోయవాడు చంపివేసినాడు కదా! ఆ పాపాత్ముడు వైరంతో దానిని పట్టుకోవాలనే బుద్ధితో ఎంతటి పనిచేసినాడు! " అని ఆలోచిస్తున్నాడు. 

"శోచన్నేచం ముహుః క్రౌఞ్చీముపశ్లోకమిమం పునః
జగావన్తర్గతమనా భూత్వా శోకపరాయణః"

"వాల్మీకి ఈ విధంగా ఎదుట కూర్చున్నవారెవరా అను విషయం కూడా మరచిపోయాడా అన్నట్లు ఒక మారు మరణించిన క్రౌంచ పక్షిని గురించి శోకార్తయైన క్రౌంచిని గూర్చీ ఆలోచిస్తున్నాడు, తన నోటి నుండి వచ్చిన శ్లోకాన్ని మనస్సులోనే నెమరువేసుకుంటున్నాడు. " ఎంతటి సహజమైన భావ చిత్రణమో చూడండి! 

ఇదంతా గమనిస్తూనే ఉన్న బ్రహ్మ దేవుడు - "నీవు ఏ రామచరితాన్ని ఈ నాటి ప్రాతఃకాలం నారదుని నుంచి విన్నావో దానిని నీచేత ఛందస్సులో రాయించాలనే నా ఛదం (అభిలాష) చేతనే నీ చేత ఆ ఛందస్సులో పలికించాను.అదే ఛందస్సుతో రామచరితాన్ని అంతా వ్రాయుము. " అని ఆజ్ఞాపించి "రామ చరితం అంతా నీకు కరతలామలకం వలె స్పష్టంగా గోచరిస్తుంది " అని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. 

బ్రహ్మ దేవుడు వెళ్ళిపోయిన తరువాత వాల్మీకి ఇతర శిష్యులందరూ కూడ పూర్వం ఎన్నడూ విని ఉండని ఆ శ్లోకాన్ని మహదా‌నందంతో చదవడం ప్రారంభించారు.

***************************************************************************************************

బాలకాండము - 4

బ్రహ్మదేవుని ఆదేశం ప్రకారం వాల్మీకి రామచరితాన్నంతనీ 'రామాయణమ్', 'సీతాయశ్చరితం మహత్, 'పౌలస్త్య వధ ' అను‌మూడు పేర్లతో ఒక కావ్యంగా రచించి దానిని అందరిలోనికి వెళ్ళి , చక్కగా గానం చేయగలవారెవరా అని ఆలోచిస్తుండగా ఆ ఆశ్రమం లోనే నివసిస్తున్న కుశలవులనే కవలలు వచ్చి ఆయనకు పాదాభివందనం చేశారు. 

వీళ్ళు ఈ కార్యానికి తగినవాళ్ళు అని‌ నిర్ణయించుకొని వాలీకి వారికి రామాయణాన్ని వాళ్ళకు బోధించాడు. వాళ్ళు మధురమైన సర్వ జన ఆకర్షకమైన స్వరంతో పాడుతూ వివిధాశ్రమాలలో సంచరిస్తూ మహా తపఃశాలులైన మునులు ఒకచోట కలిసి  ఉన్నప్పుడు అక్కడ గానం చేశారు. ఆ మునులెవ్వరూ కూడా ఇంతకు ముందు ఇలాంటి మధుదమైన కావ్యగానం విని ఉండకపోవడం చేత ఆనందబాష్పాలు కారుస్తూ "సాధు సాధు" చాల బాగున్నది, చాలా బాగున్నది అని ఆశ్చర్యభరితాంతరంగాలతో ఆ చిన్ని బాలులను ప్రశంసించారు. అంత ఆనందకరమైన ‌గానాన్ని వినిపించినందుకు వాళ్ళు తమ వద్ద ఏ వస్తువులుంటే అవి వాళ్ళకు బహూకరించారు. అత్యానంత భరితులైనవారు అలాంటి ఆనంద హేతువైన వారికి తమ దగ్గర ఉన్న విలువైన వస్తువులను బహూకరించి తమ ఆనందాన్ని ప్రకటించడం సహజమే కదా.  

ఆ కుశలవులకు ఒక ముని తన దగ్గరనున్న మిక్కిలి విలువైన వస్తువు, ఒక పాత్ర, ఇచ్చాడు. ఒకరు నార చీర, ఒకరు కృష్ణాజినము, ఒకరు యజ్ఞోపవీతము ఒకరు కమండలము, ఒకరు ముంజెగడ్డి తాడు, ఒకరు జట ముడిపెట్టుకోవడానికి చిన్నతాడు, ఒకరు చిన్ని చాప, ఒకరు కౌపీనము ఒకరు చిన్న గొడ్డలి, ఒకరు కషాయవస్త్రము, ఒకరు చిన్న వస్త్రము, ఒకరు కఱ్ఱలు కట్టుకునే త్రాడు, ఒకరు యజ్ఞ సమయంలో ఉపయోగించే పాత్రలు, ఒకరు కఱ్ఱల మోపు, ఒకరు ఉదుంబ వృక్షం నారతో చేసిన చాప,  ఇవ్వగా ఇటువంటి వస్తువులు కూడా లేని వాళ్ళు 'స్వస్తి ' అన్నారు. మరికొందరు దీర్ఘాయుష్మంతులగుదురుగాక అని ఆశీర్వదించారు. ఈ విధంగా వాళ్ళందరూ తమ వద్దనున్న వాటిలో శ్రేష్ఠమైన వన్నీ వాళ్ళ కిచ్చి వేశారు. ఇది అత్యత్భుతమైన మానవమనోభావవ్యంజన విధానం. 

సంతోషపారవశ్యంలో వాళ్ళు తామిచ్చే వస్తువులలో బాలులకు ఏవి ఎంత వరకు ఉపయోగిస్తాయి అని కూడా ఆలోచించలేదు. ఉపాయనం అనేది ఇచ్చేవాళ్ళ ఆనందాన్ని బట్టి ఉంటుంది కాని తీసుకునేవాళ్ళ కుపయోగించేది మాత్రమే అనే ఆలోచనతో ఇవ్వబడదు కదా?

***************************************************************************************************

బాలకాండము - 5

[సూర్య వంశీయుడైన దశరథ మహారాజు అయోధ్యను రాజధానిగా చేసికొని చతుఃసాగర పర్యంతమైన భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. కులగురువైన వసిష్ఠుడు చెప్పగా అతడు పుత్రులకొరకు యాగం సంకల్పించాడు. అప్పుడు అతని మంత్రీ, సారథియైన సుమంత్రుడు, పూర్వం పెద్దలు చెప్పుకొనుచుండగా తాను విన్న ఒక విషయం దశరథునికి చెప్పాడు - మహారాజా! విభాండకమహామునికి ఋష్యశృంగుడను ఒక కుమారుడున్నాడు. అతడు తన బాల్యం నుండి తండ్రిని తప్ప వేరొక మనిషిని ఎవరినీ చూడకుండా ఆశ్రమంలో పెరిగాడు. అతడు మహా ప్రభావ సంపన్నుడు. నీ‌ మిత్రుడైన రోమపాదుని రాజ్యంలో చాల కాలం అనావృష్టి ఏర్పడినది. అప్పుడాతని పురోహితులు - "ఋష్యశృంగుణ్ణి మన రాజ్యానికి తీసుకొని వస్తే సుపుష్టి కలుగుతుంది" అని రోమపాదునికి చెప్పగా అతడు మంత్రుల అభిప్రాయం ప్రకారం ఋష్యశృంగుణ్ణి తీసికొనిరావడం కొరకై కొందరు వేశ్యలను, పరివారంతో పంపాడు. వాళ్ళు విభాండక మహామునికి తెకియకుండా ఋష్యశృంగుణ్ణి అంగ దేశానికి తీసుకుని వెళ్ళారు. అతడు పాదం‌మోపగానే ఆ దేశంలో మంచి వర్షాలు కురిశాయి. రోమపాదుడు ఋష్యశృంగుణ్ణి ఆదరించి అతని కుమార్తె శాంతనిచ్చి వివాహం చేశాడు. ఆ ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండి పుత్ర కామేష్టి చేయించగా నీకు సంతానం కలుగుతుందని పెద్దలు చెప్పగా విన్నాను. అట్లు చేసిన మంచిది. " సుమంత్రుని‌మాట ప్రకారం దశరథుడు ఋష్యశృంగుణ్ణి ఆహ్వానించి, ముందుగా వసిష్ఠ మహాముని ఆధ్వర్యంలో అశ్వమేధ యాగం చేసి, పిమ్మట పుత్రకామేష్టి చేశాడు. దశరథ భార్యలైన కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు‌, సుమిత్రకు లక్ష్మణ శతృఘ్నులు అను‌ పుత్రులు  జన్మించారు.. శ్రీ మహావిష్ణువే రామునిగా అవతరించాడు. ]


ఋష్యశృంగుణ్ణి అంగదేశానికి తీసుకెళ్ళడానికై వేశ్యలు అతని ఆశ్రమం‌ ప్రవేశించారు. వాళ్ళు అక్కడ విడిది చేసి ఉండగా యాదృచ్చికంగా ఋష్యశృంగుడు ఒకనాడు వాళ్ళున్న ప్రాంతానికి  వెళ్ళాడు. అలాంటి వాళ్ళను పూర్వం ఎన్నడూ చూడకపోవడంతో ఆశ్చర్యచకితుడయ్యాడు. వేశ్యలు అతనితో పరిచయం చేసికొని అతని ఆశ్రమానికి వెళ్ళారు. అతడిచ్చిన ఆతిథ్యం స్వీకరించి, ఫలాలు తిని, మా ఫలాలు నువ్వు కూడా తినమని అంటూ మధురమైన పదార్థాలు అతనికిచ్చారు. అతడు తిని చాల ఆనందించాడు. అలాంటివేవీ అతడు పూర్వం తిని ఉండలేదు. వేశ్యలు అతని కౌగలించుకొని తద్ద్వారా అతనికి కొత్త రుచులు చవి చూపారు. సాయంకాలమయ్యే సరికి అతని తండ్రి విభాండకుడు ఎక్కడ వస్తాడొ అని భయపడుతూ "మా అనుష్ఠానాలకు వేళ ఐపోతుంది. మేం వెడతాం" అని అంటూ తమ గుడారాలకు వెళ్ళిపోయారు. 

"తతస్తాస్తం సమాలిఙ్గ్య సర్వా హర్ష సమన్వితాః,
మోదకాన్ ప్రదదుస్తస్మై భక్ష్యాంశ్చ వివిధాన బహూన్. (బా.కాం - 10. 20) 
అపృచ్ఛ్య చ తదా విప్రం వ్రతచర్యాం నివేద్యచ
గచ్ఛన్తి స్మాపదేశాత్తాః భోతాస్తస్య పితుః స్త్రియః"  (బా.కాం - 10. 22) 

అనుష్ఠానం వేళ దాటిపోతుందని అలాంటివాళ్ళను మోసగించడం సులభం‌ కదా ? వాళ్ళు చేసిన ఆశ్లేషాదులు ఫలించాయి. మళ్ళీ వాళ్ళను ఎప్పుడు కలుద్దామా అను తహతహతో మర్నాడే అతడు వాళ్ళ శిబిరాలను వెదుక్కుంటూ వెళ్ళాడు. 

"గతాసు తాసు సర్వాసు కాశ్యపస్యాత్మజో ద్విజః 
అస్వస్థ హృదయశ్చాసీద్దుఃఖాత్ స్మ పరివర్తతే"
తతో అపరేద్యుస్తం దేశమాజగామ స వీర్యవాన్
మనోజ్ఞా యత్ర తా దృష్టా రూపవత్యః స్వలంకృతాః" (బా.కాం. 10.23, 24)

***************************************************************************************************

బాలకాండము - 6

స్వామి (యజమాని) ఎంత‌ భక్తిశ్రద్ధలతో కొన్ని పుణ్యకార్యాలు చేయాలని ప్రారంభించినా క్రింద పని చేసేవాళ్ళలో అంతటి భక్తిశ్రద్ధలుండవు. ముఖ్యంగా దాన ధర్మాదులు, ఆహార వితరణాదులు చేసేటప్పుడు వాళ్ళు ఆహారాదులు తీసుకొనడానికి వచ్చిన వారి విషయంలో నిర్లక్ష్యభావం చూపించడం సహజం.

 "దశరథ మహారాజు తలపెట్టిన అశ్వమేధయాగానికి దేశంలోని వివిధవృత్తులు గలవారినీ , నాలుగు వర్ణాలవారినీ ఆహ్వానించాలి. భోజనాదుల సమయంలో వాళ్ళు ఏమైనా కామక్రోధాదులు చూపించినా మీరు మాత్రం వాళ్ళ విషయంలో కొంచెం కూడా అనాదరం చూపించకూడదు" అని వసిష్ఠ మహాముని అశ్వమేధయాగాని ఏర్పాట్లు చేయడానికి నియుక్తులైనవారి నందరినీ ఆజ్ఞాపించాడు. 

     "సర్వే వర్ణా యథా పూజాః ప్రాప్నువన్తి సుసత్కృతాః, 
      న చావజ్ఞా విధాతవ్యా కామక్రోధవశాదపి" (బా.కాం. 13.12) 

      "అవజ్ఞయా న దాతవ్యం కస్యచిల్లీలయాపి వా, 
       అవజ్ఞయా కృతం హన్యాదాతారం నాత్ర సంశయః"

"ఎవ్వరికీ కూడ అనాదరంతో గాని అశ్రద్ధతో గాని భోజనాదులు ఇవ్వకూడదు. అనాదర పూర్వకంగా చేసిన దానం దాతకు అపాయకరం. సందేహం లేదు."

***************************************************************************************************

బాలకాండము - 7

దశరథుడు అశ్వమేధయాగాన్ని సంకల్పం చేశాడు. ఆహూతులు వేలకొలదీ నిరతరమూ షడ్రసోపేతమైన భోజనాలు చేస్తున్నారు. పరిపూర్ణమైన సంతృప్తితో మనస్ఫూర్తిగా దశరథుణ్ణి అభినందిస్తూ తమ ఆనందాతిశయాన్ని ప్రకటిస్తున్నారు. అదే కదా అన్నదానంలోని విశేషం.

 ఇతరదానాలేవి చేసినా తీసుకొనే మానవునికి సంతృప్తి కలగక పోవచ్చు. కడుపునిండా భోజనం పెట్టిన నప్పుడు అతడు సంతృప్తితో "అన్నదాతః సుఖీ భవ" అని అనకుండా ఉండజాలడు. యజ్ఞ యాగాదులలోను, వివాహాది శుభకార్యాలలోను అన్నదానానికున్న ప్రాశస్త్యం ఇదే. 

భోజనం చేస్తున్న వాళ్ళు మాటలు దూరం నుండి వింటూ వాళ్ళ ముఖాలలో ప్రతిఫలిస్తూన్న ఆనందాన్ని చూస్తూ దశరథుడు పరమానందం చెందుతున్నాడు. నిజమైన దాత స్వభావం ఇదే కదా? 

  " నానాదేశానుప్రాప్తాః పురుషాః స్త్రీగణాస్తథా,
   అన్నపానైః సువిహితాస్తస్మిన్యజ్ఞే మహాత్మనః"
   "అన్నం చ విధివత్స్యాదు ప్రశంసన్తి ద్విజర్షభాః ,
‌    అహో తృప్తాః స్మ భద్రం తే ఇతి శుశ్రావ రాఘవః" (బా.కాం. 14.14,15) 

"నానా దేశాలనుండి వచ్చిన పురుషులు స్త్రీలు బాగుగా ఏర్పరచిన అన్నపానాదులతో తృప్తిని పొందారు. యథావిధిగా వండిన మధురమైన భోజ్యపదార్థాలను భుజించి బ్రాహ్మణ శ్రేష్టులు - " ఆహా! తృప్తి చెందాము, నీకు మంగళమగు గాక" అని అంటూండగా దశరథుడు విని ఆనందించాడు. "

***************************************************************************************************

బాలకాండము - 8

ఒక్కొకప్పుడు కొందరు సత్పురుషులు ఏవైన ఉత్తమ కార్యాలను గూర్చి ఆలోచిస్తూన్నపుడు అవి సఫలం అయే పరిస్థితులు అనుకోకుండా సమకూడుతూంటాయి. ఇది చాల మందికి అనుభవం లో ఉన్న విషయం. 

తన నలుగురు కుమారులు విద్యలన్నీ పూర్తిచేసికొని యవ్వనంలో అడుగుపెట్టారు. వారి వివాహాన్ని గూర్చి దశరథుడు మంత్రి పురోహితాదులతో కలిసి మంతనాలు జరుపుతున్నాడు. ఇంతట్లో యజ్ఞ సంరక్షణార్థమై రాముణ్ణి తనతో పంప వలసినదిగా దశరథుణ్ణి కోరడానికై విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. ఆయన రావడంలో అసలు కారణం ఏమో తరువాత జరిగిన సంఘటనలు బట్టి అందరికీ తెలిసినదే. 

     "అథ రాజా దశరథః తేషాం దారక్రియాం ప్రతి 
     చిన్తయామాస ధర్మాత్మా సోపాధ్యాయః సబాంధవః
     తస్య చింతయామాస మంత్రిమధ్యే మహాత్మనః 
     అభ్యగచ్ఛన్మహాతేజా విశ్వామిత్రో మహామునిః"

***************************************************************************************************

బాలకాండము - 9

తనను చూడడానికై వచ్చిన విశ్వామిత్రమహామునిని దశరథుడు తగు విధంగా సత్కరించి అతడు తన నగరానికి వచ్చినందుకు సంతోషాతిశయాన్ని ప్రకటించాడు. 
ఈ ఘట్టంలో దశరథ-విశ్వామిత్ర-వసిష్ఠుల సంభాషణాదికం వారి మానసిక ప్రవృత్తులకు అనుగుణంగా స్వాభావికంగా జరిగింది. 


సహజంగా ఉదార స్వభావుడైన దశరథ మహారాజు విశ్వామిత్రుడు తన ఇంటికి వచ్చాడన్న సంతోషాతిశయంతో "నీవు ఏమి ఆజ్ఞాపిస్తావో అది ఏ మాత్రమూ సంకోచం లేకుండా ఆజ్ఞాపించుము" అని విశ్వామిత్రునితో అన్నాడు. 

"నా యజ్ఞానికి రాక్షసులు కొందరు విఘ్నాలు కలిగిస్తున్నారు. వాళ్ళను సంహరించడానికై నీ కుమారుడు రాముణ్ణి నాతో పంపాలి" అని విశ్వామితుడనగానే దశరథుడు దిగులుచెంది రాముణ్ణి పంపడానికి నిరాకరిస్తూ అవసరమైతే తాను యజ్ఞ సంరక్షణం చేస్తానన్నాడు.

 దశరథుడు ఆ విధంగా మొదట ప్రతిజ్ఞ చేయడమూ పుత్రప్రేమ చేత ఆ మాటనే తప్పడానికి సిద్ధమవడమూ ఇవి ఆ సమయంలో ఆయన చూపవలసిన సహజ ప్రవృత్తులే. 

విశ్వామిత్రుడు రామునకు, తర్వాత లోకానికీ అనేక విధాలుగా సహాయం చేయాలను కోరికతో  వచ్చాడు. దశరథుడు తన ప్రతిజ్ఞ నుండి వెనుదిరగగానే సహజంగా తీవ్ర స్వభావం గల విశ్వామిత్రునకు తీవ్రమైన కోపం రావడం సహజమే. "ఇలా మాట తప్పటం రఘువంశీయులు చేయవలసిన పనికాదు. ఇలా చేయమే యుక్తమని నీవనుకొంటే - సరే! నేను వెడుతున్నాను; బంధువులతో సుఖంగా వుండు" అంటూ విశ్వామిత్రుడు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. "ఇలా చేసి బంధువులతో సుఖంగా వుంటాని అనుకుంటున్నావేమో. దానికి విరుద్ధమైన ఫలం అనుభవిస్తావు" అని విశ్వామిత్రుని మాటలలోని సూచన. 

పరిస్థితి వైషమ్యాన్ని గుర్తించిన వసిష్ఠుడు వెంటనే కలగజేసికొని, విశ్వామిత్రుని అసాధారణమైన ప్రజ్ఞాదులను దశరథునికి విశదీకరించి రాముణ్ణి విశ్వామిత్రునితో పంపవలసినదిగా ఉపదేశించాడు. ఇది ఈయన స్వభావానికి అనుగుణమైన ప్రవృత్తి. దశరథుడు ఏ వివాహాన్ని గూర్చి ఆలచిస్తున్నాడో అది విశ్వామిత్రుని ద్వారా జరిగింది.

***************************************************************************************************

బాలకాండము - 10

"తాటక చాల దుష్టురాలు. ఈమెను నువ్వు తప్ప ముల్లోకాల్లో ఎవ్వరు కూడ చంపజాలరు. నువ్వు ఆమెను సంహరించాలి" అని విశ్వామిత్రుడంటున్నా కూడ రాముని మనస్సులో ఆమెను చంపడానికి కొంచెం సంకోచం ఉన్నట్లు విశ్వామిత్రుడు గ్రహించాడు. ఉత్తమవంశ సంజాతుడైన రాముడు సహజంగా ధర్మాత్ముడు కదా? అతడు సందేహిస్తున్నట్లు గ్రహించి విశ్వామిత్రుడు లోకోపకారంకొరకు పూర్వం స్త్రీలను కూడ చంపిన కొందరు మహాపురుషులను దృష్టాంతాలుగా చూపాడు. "విశ్వామిత్ర మహర్షి ఎలా చెపితే అలా చేయాలి" అని సభా మధ్యంలో మా నాన్న గారు ఆజ్ఞాపించారు.పితృవాక్య పరిపాలనకొరకూ, మీ మీద నున్న భక్తి భావంచేత నేను తప్పక తాటకను వధిస్తాను" అని అన్నాడు రాముడు. 

   "పితుర్వచన నిర్దేశాత్పితుర్వచన గౌరవాత్,
     వచనం కౌశికస్యేతి కర్యవ్యమవిశఙ్కయా"

అయితే తాటక మీదికి వస్తున్నా కూడ రాముని మనస్సులో సహజమైన ఆ సంకోచం పూర్తిగా తొలగిపోలేదు. "ఏమైనా స్త్రీ కదా? ఈమెను చంపకుండగా ముక్కు -చెవులు ఛేదించి నడవలేనిదానిగా చేస్తాను" అంటాడు లక్ష్మణితో - 
    "న హ్యేనాముత్సహే హంతుం  స్త్రీస్వభావేన రక్షితామ్,
 ‌     వీర్యం చాస్య గతిం చాపి హనిష్యామీతి మే మతిః"

ఇంతలో తాటక విజృంభించింది. ఈ పరిస్థితిని ‌గ్రహించిన విశ్వామిత్రుడు "ఈమెను విడిచిపెట్టకూడదు;చంపివేయలి" అని రాముణ్ణి మళ్ళీ హెచ్చరించాడు. అప్పుడు రాముడు ఆమెను సంహరించాడు. ఇక్కడ రామునిలో సహజంగా ఉన్న ధర్మదృష్టి సూక్ష్మంగా చిత్రింపబడినది.

***************************************************************************************************

బాలకాండము - 11

ఎంతటి పవిత్ర వ్యక్తులైనా ఒక్క క్షణంలో ప్రలోభాలకు ఎలా లొంగిపోతారో చెప్పడానికి ఉద్దిష్టమైనది అహల్యా వృత్తాంతం. అంతటి మహాపతివ్రత త్రిలోకాధిపతియైన మహైశ్వర్య సంపన్నుడైన ఇంద్రుణ్ణి చూడగానే వానికి వశం అయిపోయింది. అతడు గౌతముడే అను అభిప్రాయంతో వానిని కలవలేదు. లోపల ప్రవేశించడానికి ఆ వేషంతో వచ్చిన వాడు తాను ఎవరో ఆమెకు తెలిపియే ఉంటాడు. ఇలాంటి విషయాలన్నీ రామాయణంలో స్పష్టంగా చెప్పకుండా సూచింపబడుతున్నాయి. 

   "మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన,
    మతిం చకార దుర్మేధా దేవరాజ కుతూహలాత్"
   "అథబ్రవీన్నరశ్రేష్ఠ! కృతార్థేనాన్తరాత్మనా,
    కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్ఛ శీఘ్రమితః ప్రభో,
   ఆత్మానం మాం చ దేవేశ! సర్వథా రక్ష గౌతమాత్"

"పిమ్మట అహల్య కృతార్థ మైన అంతః కరణంతో - " దేవతలలో శ్రేష్ఠుడా! కృతార్థురాల నయ్యాను. ఓ ప్రభూ! ఇక్కడినుండి శీఘ్రంగా వెళ్ళుము. ఓ! దేవరాజా! నిన్ను నన్నూ కూడా గౌతమునినుండి అన్ని విధాలా రక్షింపుము" అని అంటుంది ఇంద్రునితో. 

ఇదే ఎంతటివారిలో నైనా నిగూఢంగా ఉండే మానస దౌర్బల్యం. 

గౌతముని శాపం ఒక విధంగా వరంగా మారి - అహల్య చిరకాలం భస్మశాయినియై అదృశ్యురాలై పడి ఉండి తపస్సు చేసి తన పవిత్రత్వాన్ని మళ్ళీ సంపాదించు కొన్నది.

***************************************************************************************************

బాలకాండము - 12

ఇంత మహాపాప కృత్యం చేసిన ఇంద్రుడు దేవతలను పిలిచి - "గౌతమునికి క్రోధం కలిగించి అతని తపస్సును భగ్నం చేయడం ద్వారా సురలనందరిని రక్షించడం కోసం నేనీ పని చేశాను" అని అన్నాడు. పాపకృత్యాలు చేసే వాళ్ళు చేసికొనే ఆత్మ సమర్థనం ఇలాగే ఉంటుంది కదా!! 

    "కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః,
     క్రోధముత్పాద్య హి మయా సురకార్యమిదం కృతమ్" (బా.కాం. 49.2) 

ఎక్కడ గౌతముని కంట పడతామో అని భయపడుతూ పారిపోతున్న ఇతడు చివరికి ఏ విధంగా శాపగ్రస్తుడైనాడో వాల్మీకి ఆ ఘట్టంలో వర్ణించియే ఉన్నాడు. ఇలాంటి కృత్యాలలో రావణాఅదులకు ఇంద్రాదులకూ అంతగా భేదం ఉన్నట్లు కనబడదు.


***************************************************************************************************

 బాలకాండము - 13

త్రిశంకూపాఖ్యానంలో విభిన్న మనస్తత్త్వచిత్రణం కనబడుతుంది.

 ఇక్ష్వాకు వంశీయుడైన త్రిశంకువు ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అను విచిత్రమైన కోరిక కలిగింది. అందుకు తగిన యాగం చేయవలిసిందిగా కులగురువైన వసిష్ఠుని కోరాడు. ఆయన అలాంటి యాగం కుదరదని నిరాకరించాడు. అప్పుడతడు ఆయనను కాదని ఆయన కుమారులను అభ్యర్థించాడు. ఆ అభ్యర్థనలో గురునింద కొంచెం కనబడుతుంది. "మా తండ్రి గారిని కాదని మా దగ్గరికి వచ్చావా? నువ్వు అలా రావడం యుక్తం కాదు; మేము అలాంటి యాగం చేయించడమూ యుక్తం కాదు. " అని వాళ్ళు నిరాకరించారు. తమ తండ్రి మాటను ధిక్కరించడంవల్ల వాళ్ళకు వానిమీద కోపం కలగడం సహజమే. 

అయితే త్రిశంకువు మొండి పట్టుదల గల మనిషి. "పోనీలెండి! గురువూ నిరాకరించాడు, గురుపుత్రులూ నిరాకరించారు; మరొకరి నెచరినైనా ఆశ్రయిస్తాను." అని అన్నాడు. దానితో వాళ్ళు తీవ్రమైన కోపంతో శపించారు. అయినా అతడు జంకక వసిష్టునితో వైరం పెట్టుకుని ఘోర తపస్సు చేస్తున్న విశ్వామిత్రుని ఆశ్రయిస్తే పని జరుగుతుంది అని‌ నిశ్చయించుకొని ఆయన దగ్గరకు వెళ్ళాడు. 

తన శత్రుపక్షాన్ని కాదంక్ తన దగ్గరకు రావడం చేత అతనికి అభయహస్తం ఇచ్చి ఆ యాగం చేయించడానికి ప్రయత్నించాడు కాని అది సఫలం కాలేదు. 

ఆ విధంగా శక్యం కాని, చేయకూడని పని విషయంలో త్రిశంకున కున్న మొండి పట్టుదల, తమ తండ్రిని ధిక్కరించినందుకు వసిష్ఠపుత్రుల కోపం, తన శత్రువు చేయజాలని దానిని తాను చేసి చూపించాలాన్న విశ్వామిత్రుని పట్టుదల. ఇవన్నీ అతిసహజంగా ఈ ఘట్టంలో చిత్రింపబడ్డాయి.

***************************************************************************************************

బాలకాండము - 14

త్రిశంకువు చేత యాగం చేయించాలని నిశ్చయించిన విశ్వామిత్రుడు శిష్యులనందరినీ పిలిచి వాళ్ళతో - "మీరు బ్రాహ్మణులందరి దగ్గరికీ వెళ్ళి యజ్ఞం చేయించడానికి రమ్మని నేను ఆజ్ఞాపించానని చెప్పండి. అయితే నా మాట విని వాళ్ళలో ఎవరేమన్నారో చెప్పండి" అని చెప్పి వాళ్ళను నలు దిక్కులకూ పంపాడు. లోకవిరుద్ధమైన పనిచేస్తున్నా కూడ తనను ఎవరూ ఆక్షేపించకూడదు - ఇదొక మనస్తత్వం. వాళ్ళు తిరిగి వచ్చి 'బ్రాహ్మణులందరూ వస్తున్నారు, వసిష్ఠ పుత్రులు మాత్రం నిందాపూర్వకంగా మాట్లాడారు ' అని చెప్పగానే విశ్వామిత్రుడు వసిష్ఠపుత్రులందరినీ శపించాడు.

***************************************************************************************************

బాలకాండము - 15

అంబరీషుడు డను అయోధ్యాపతి యైన రాజు యాగం చేస్తూండగా ఇంద్రుడు పశువును అపహరించాడు. ఈ పశువుకు బదులు నఫుణ్ణి బలి ఇవ్వాలని ఋత్విక్కులు చెప్పగా ఎంత మూల్యమైనా చెల్లించి నరుణ్ణి కొనుక్కొని రావాలని ఆ రాజు అనేక ప్రదేశాలలో తిరిగాడు. చివరికి ఒక చోట ఋచీకుడనే ఒక మునికి ముగ్గురు కుమారులుండగా వీళ్ళలో ఒకరనిని నాకు విక్రయించమని రాజు కోరాడు. "నేను ఎట్టి పరిస్థితులలోనూ జ్యేష్ఠపుత్రుణ్ణి విక్రయించను" అని తండ్రి అన్నాడు. "నాకు చిన్నవాడంటే చాల ఇష్టం; నేను వానిని‌ అమ్మను" అని తల్లి అన్నది. వాళ్ళ మాటలు విన్న మధ్యముడైన శునఃశేపుడు, "ఇంక మిగిలింది నేనే కదా? వీళ్ళకు ధనం చెల్లించి నన్ను తీసుకొని వెళ్ళు అన్నాడు. 

    " పితా జ్యేష్ఠమవిక్రేయం  మాత చ కనీయసమ్
    విక్రీతం మధ్యమం మన్యే రాజన్ పుత్రం నయస్వయ మామ్" (బా.కాం. 61. 21)

ఇలాంటి విచిత్రమైన మనస్తత్వం గల తలిదండ్రులు కూడా ఉండేవారు. బలికోసం అమ్మకపోయినా సంతాన విషయంలో ప్రేమలో భేదం చూపే తలిదండ్రులు ఈనాడు కూడా అక్కడక్కడ కనబడుతూనే ఉంటారు. 

శునఃశేపుడు మార్గ మధ్యంలో విశ్వామిత్రుని చూచి ఆయనతో తన విషయం చెప్పుకొనగా ఆయన ఏవో మంత్రాలుపదేశించి తత్పఠనం ద్వారా దేవతలను సంతోష పెట్టి ఈ పశుబంధంనుండి విముక్తుడవడానికి ఉపాయం బోధించాడు.

***************************************************************************************************

బాలకాండము - 16

"నీ దగ్గరున్న ధనుస్సు చూడడానికి ఈ రాజకుమారులు వచ్చారు" అని విశ్వామిత్రుడు జనక మహరాజుకు చెప్పగా ఆయన ఆ ధనుస్సు గొప్ప తనాన్ని గూర్చి అతి విస్త్రతంగా వర్ణించి "దీనిని దేవ దానవాదులు కూడ ఎక్కుపెట్టజాలరు; మానవుల మాట చెప్పాలా" అని అన్నాడు. 

చక్రాల ఇనుప పెట్టలో ఉన్న ఆ ధనుస్సును 5000 మంది భృత్యులు అతికష్టం మీద లాగికొని వచ్చారు. ఆ ధనుస్సు ఈ పెట్టెలో ఉన్నది అని జనకుడన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు "వత్సా! రామా! ఈ ధనుస్సు సంగతి చూడు" అన్నాడు. అంతా విని - "వత్స! రామ! ధనుః పశ్య" అనడంలో "మా రామునికి ఇదొక లెక్కా?" అన్న భావం స్ఫురిస్తున్నది.

***************************************************************************************************

 బాలకాండము - 17

పరశురాముడు శివధనుర్భంగాన్ని గూర్చి విని రాముని విషయంలో ఎంతో అహంకారంతో తేలికగా మాట్లాడాడు. అంత తీవ్రంగా ఉన్న మాటలకు సమాధానం చెప్పడానికి వీలున్నా కూడ రాముడు "ప్రక్కనే తండ్రిగారుండగా తీవ్రంగా మాటలాడడం మంచిది కాదు. అవినయం చూపినట్లవుతుంది" అను అభిప్రాయంతో అధికంగా మాటలాడలేదట

 "శ్రుత్వా తజ్జామదగ్నస్య వాక్యం దాశరథిస్తదా, 
  గౌరవాద్యన్త్రితకథః పితూ రామమథాబ్రవతీత్"

ఇది శ్రీ రాముని ఉదాత్తమూ మహోన్నతమూ అయిన మనస్తత్వం. ముక్కూమొగం తెలియని ఒక వ్యక్తి వచ్చి తీవ్రంగా అధిక్షేపిపిస్తున్నా కూడా కొంచెం కూడా తొణకలేదు. బెణకలేదు. ఇందుకు కారణం ప్రక్కనే పూజ్యుడైన తండ్రి ఉండడం.

***************************************************************************************************
***************************************************************************************************


అయోధ్యాకాండము - 18


శ్రీ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహా లయ్యాయి. అందరూ సర్వ విద్యా పారంగతులయ్యారు. శ్రీ రాముడు తన సద్గుణాలచేత సకల లోక ప్రియుడై అందరి మన్ననలనూ పొందుతున్నాడు. అతని యౌవరాజ్యపట్టాభిసషిక్తుని చేయాలను తీవ్రమైన అభిలాషతో దశరథుడు మంత్రి సామంతాదుల నందరినీ ఒకనాడు సమావేశపరచి వాళ్ళకు తన అభిప్రాయం తెలిపి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అప్పుడు వాళ్ళందరూ వేరు వేరుగా సమావేశమై శ్రీ రాముడు యౌవరాజ్యాంహిషేకానికి తగినవాడని తమ ఏకాభిప్రాయాన్ని తెలిపారు.
అందుకొరకే ఈ అమాత్య - పౌరముఖ్యాదుల సమావేశాన్ని ఏర్పరచి వాళ్ళ ఎదుట తన అభిప్రాయం వ్యక్తీకరించిన దశరథుడు ఏమీ తెలియనివాడు వలె వాళ్ళనిలా ప్రశ్నించాడు.

  "ఇతి తద్వచనం శ్రుత్వా రాజా తేషాం మనఃప్రియం,
    అజాన్నివ జిజ్ఞాసురిదం వచనమబ్రవీత్.
    
    శ్రుత్వైవ వచనం యన్మే రాఘవం పతిమిచ్ఛథ
     రాజానః సంశయో అయం మే తదిదం బ్రూత తత్వతః

     కథం ను మయి ధర్మేణ పృథివీమనుశాసతి
     భవన్తో ద్రష్టుమిచ్ఛన్తి యువరాజం మమాత్మజం"  (అ.కాం.2.23-25)

"వాళ్ళ మాటలు విన్న దశరథుడు వాళ్ళ మనస్సులలో అభీష్టమేదో పూర్వం తెలియక ఇప్పుడు తెలియగోరుచున్నాడు వలె ఇలా అన్నాడు"

"రాజులారా! నా మాట వినగానే మీరు రాముడు ప్రభువు కావాలని అంటున్నారు! నాకు ఎదురు చెప్పడం ఇష్టం లేక ఇలా అంటున్నారా అని నాకు సందేహం కలుగుతూన్నది. ఈ విషయంలో మీ యథార్థమైన అభిప్రాయం ఏమో చెప్పండి"

"నేను ధర్మానుసారం భూమిని ఇంత కాలం పాలిస్తుండగా మీరందరూ నా కుమారుడు యువరాజు కావాలని ఎందుకు కోరుచున్నారు? ఇదే నా సంశయం"

ఇలా ప్రశ్నించడంలో - తన పాలనలో ఏవైనా లోపాలున్నట్లు వాళ్ళు చెపుతారా అని దశరథుని అభిప్రాయం. అంతకంటే ప్రధానమైనది శ్రీ రాముని గుణగణాలను గూర్చి వాళ్ళనుండి ప్రత్యక్షంగా విని సంతోషించాలనేది.

***************************************************************************************************

 అయోధ్యాకాండము - 19

రాముడు యువరాజు కావాలని తామెందుకు వాంఛిస్తున్నారో  విశదీకరిస్తూ మంత్రి - పౌర - సామంతాదులు రామునిలో మాత్రమే ఉన్న, ఇతరులలో లేని, రాజుగా ఉండడానికి తగిన ఎన్నో సద్గుణాలు వర్ణించి చెప్పారు. (అ.కాం.2.26-54)

ఏవైనా గ్రామాలు గానీ నగరాలు గాని వశం చేసుకోవలైన అవసరం ఏర్పడినప్పుడు రాముడు లక్ష్మణునితో‌కలసి వెళ్ళి యుద్ధం చేసి వాటిని స్వాధీనం చేసికొని రథారూఢుడై గాని, కుంజరాధిరూఢుడై గాని తిరిగి వస్తున్నప్పుడు పౌరులనందరినీ

"మీ పుత్రులు, భార్యలు, భృత్యులు, శిష్యులూ క్షేమంగా ఉన్నారా?" అని తండ్రి ఔరస పుత్రులను పలకరించి అడిగినట్లు అడుగుతుంటాడు.

"అగ్నిహోత్రాది కర్మ కలాపాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయా" అని యోగ క్షేమాలు అడుగుతుంటాడు.

 "యదా వ్రజతి సంగ్రామం గ్రామార్థే నగరస్య వా,
‌   గత్వా సౌమిత్రి సహితో నావిజ్యతే నివర్తతే.
   సంగ్రామాత్పునరాగత్య కుఞ్జరేణ రఘేన వా,
   పౌరాన్ స్వజనవన్నిత్వం కుశలం పరిపృచ్ఛతి
   పుత్రేష్వగ్నిషు దారేషు పితా పుత్రానివౌరసాన్" (అ.కాం.2.36-38)

"మీ భృత్యులందరూ వాళ్ళు చేయవలసిన పనులన్నీ శ్రద్ధగా చేస్తూ మీకు సేవ చేస్తున్నారా" అని మేం కనబడినప్పుడు అడుగుతూంటాడు. "

   "శుశ్రూషన్తే చ వః శిష్యాః కచ్చిత్కర్మసు దంశితాః, 
     ఇతి సః పురుషవ్యాఘ్రః సదా రామో అభిభాషతే "

"పౌరులలో ఎవరికి కష్టాలు కలిగినా తాను చాల దుఃఖిస్తాడు. ఎవరికైనా అభ్యుదయం కలిగితే తండ్రి సంతోషించి నట్లు సంతోషిస్తాడు. "

  "వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః,
    ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి" (అ.కాం. 2.40)

ఇవి రామునిలో సహజంగా ఉన్న అనేకమైన ఉత్తమ పాలకునికుండవలసిన లక్షణాలలో కొన్ని.


***************************************************************************************************

అయోధ్యాకాండము - 20

ఉత్తమ లక్షణాలు, ఉదారస్వభావము, ప్రభువు కుండ వలసిన సమస్త సద్గుణాలు ఉన్న వ్యక్తుల విషయంలో అందరూ కూడ స్నేహ భావంతో , ఆదరంతో ఎల్లప్పుడూ ఆతని అభివృద్ధిని కోరుతూండడం సహజం. అయితే ఇలాంటి మానసికప్రవృత్తి స్త్రీలలో అత్యధికంగా ఉంటుంది. అందుచేతనే "వయస్సు మళ్ళిన మహిళలు, యువతులూ, కూడ రాముని అభివృద్ధి కోరుతూ ప్రాతఃకాలమూ సాయం సమయాలలోను కూడ ఏకాగ్రచిత్తంతో దేవతలను ప్రార్థిస్తూంటారట.

రాజు మంచి వాడైతే కదా దేశం సుఖశాంతులతో వర్ధిల్లేది?

  " స్త్రియో వృద్ధాస్తరుణ్యశ్చ సాయం ప్రాతః సమాహితాః,
     సర్వాన్ దేవాన్ సమస్యన్తి రామస్యార్థే యశస్వినః"  (అ.కాం.2.52)

***************************************************************************************************

అయోధ్యాకాండము - 21

రాముణ్ణి యౌవరాజ్యాభిషిక్తుణ్ణి చేయాలనే అభిలాషను మంత్రి - సామంత - పురోహితపౌరాదులతో కూడిన మహాసభకు తెలిపి, వాళ్ళ అనుమతి తీసుకొని, రాముణ్ణి కూడ మహాసభకు పిలిపించి దశరథ మహారాజు ఆ మహాసభలో ఆ నిర్ణయాన్ని ప్రకటించాడు.

మహాసభలో దశరథుడు చేసిన ప్రకటనను విన్న కొందరు రాముని మిత్రులు వెంటనే కౌసల్యకు ఆ వార్తను చేరవేశారు. కుమారుని అభ్యుదయం విని ఎక్కువగా ఆనందించేది తల్లియే కదా! ఆమె ఆ ప్రియవార్త తీసుకొని వచ్చిన వారికి అనేకమైన అమూల్యమైన పారితోషికాలిచ్చి సత్కరించింది.

  "సా హిరణ్యం చ గాశ్చైవ రత్నాని వివిధాని చ,
    వ్యాదిదేశ ప్రియాఖ్యేభ్యః కౌసల్యా ప్రమదోత్తమా"  (అ.కాం.3.47)


రాముడు తిరిగి తన ప్రాసాదానికి వెళ్ళిపోయాడు. సభాసదులందరూ తమ తమ నివాసాలకు వెళ్ళి రాముని పట్టాభిషేకం నిర్విఘ్నంగా జరగాలని కోరుతూ దేవతలకు పూజలు చేశారు. (అ.కాం.3.49)

***************************************************************************************************
అయోధ్యాకాండము - 22


పౌరులందరూ వెళ్ళిపోయిన తరువాత దశరథుడు మంత్రులతో రేపు పుష్యమీ నక్షత్రం, రేపే పట్టాభిషేకం అని నిర్ణయించి, గృహంలోపల ప్రవేశించి, రాముణ్ణి తీసికొని రావలసిందిగా ఆజ్ఞాపించి సుమంత్రుణ్ణి పంపాడు. ఇంత తొందరగా మళ్ళీ సుమంత్రుడు ఎందుకు వచ్చాడా అని రామునికి శంక కలిగింది.‌

 "శ్రుత్వైవ చాపి రామస్తం ప్రాప్తం శఙ్కాన్వితో అభవత్ " (అ.కాం.4.5)

మహాసభలో తన నిర్ణయాన్ని ప్రకటించి దశరథుడు రామునికి మాత్రమే చెప్పదగిన తన మనస్సులో ఉన్న రెండు విషయాలను చెప్పడానికై రాముని పిలిపించాడు.
1) "నేను చాల కాలం రాజ్యపాలన చేసి వృద్షుడనైనాను. అంతే కాకుండా ఈ మధ్య నాఖ్ కొన్ని దుస్స్వప్నాదులు, గ్రహదోషాలు, ఉత్పాతాలు కనబడుతున్నాయి. ఇవి నేనింక ఎంతో కాలం ఈ లోకంలో ఉండను అని సూచిస్తున్నాయి. అందుచేత నీవు రేపే రాజ్యాభిషిక్తుడవు కావాలి. " (4.12-22)

2) " మరొక విషయం ఏమనగా - భరతుడు తిరిగి అయోధ్యకు రాక ముందే ఈ అభిషేకం జరగాలి. భరతుడు సదాచార సంపన్నుడే ; నువ్వంటే భక్తి ఉన్నవాడే. అయినా కూడ ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు కదా? " అని రామునితో అంటాడు.

  "విప్రోషితశ్చ బరతో యావదేవ పురాదితః, 
    తావదేవాభిషేకస్తే ప్రాప్త కాలో మతో మమ.
 
    కామం ఖలు సతాం వృత్తే భ్రాతా తే భరతః స్థితః
    జ్యేష్ఠానువర్తీ ధర్మాత్మా సానుక్రోశో జితేంద్రియః

    కిన్తు చిత్తం మనుష్యాణామనిత్యమితి మే మతిః 
    సైతం హి ధర్మనిత్యానాం కృతశోభి చ రాఘవ" (అ.కాం.4.25-28)

భరతుని విషయంలోనే కాదు కైకేయి విషయంలోనూ దశరథునికి శంక    ఉండి ఉంటుంది. ఆ విషయం వాల్మీకి మరొక చోట చెప్పాడు (అ.కాం.103)

***************************************************************************************************
అయోధ్యాకాండము - 23

రాముడు తండ్రి వద్ద సెలవు గైకొని తన గృహానికి వెళ్ళి వెంటనే తల్లి కౌసల్య అంతఃపురానికి వెళ్ళాడు. అప్పటికే వార్తను విన్న సుమిత్ర, లక్ష్మణుడు ఆమెను అభినందించడానికై అక్కడికి వచ్చి ఉన్నారు. సీతను కూడా పిలిపించారు. కౌసల్య మాత్రం ధ్యానముద్ర లో తన ఆరాధ్య దైవమైన జనార్దనుడు తన కుమారునికి ఇంతటి అభ్యుదయం చేకూర్చినందుకు ఆ పరమాత్మను కృతజ్ఞతాభావంతో ధ్యానిస్తున్నది.

రాముడు అక్కడికి వెళ్ళగానే ఆమె రాముణ్ణి మనసారా దీవించి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. పుత్రుని అభ్యుదయానికి ఎక్కువగా సంతసించేది తల్లి దండ్రులే కదా? దశరథుడు లౌకికమైన ప్రయత్నాలలో నిమగ్నుడై ఉండగా కౌసల్య తన కుమారునకు అన్ని విధాల దైవం అనుకూలంగా ఉండాలని దేవతలను ప్రార్థన చేస్తున్నది.

దశరథునికి కైకేయి విషయంలో ఉన్న శంక ఆమె మనసులో కూడ లేకపోలేదు. "నన్ను తండ్రి గారు యౌవరాజ్యాభిషిక్తుని చేస్తా మని అన్నారు. తగిన మంగళ కృత్యాలన్నీ పూర్తి చెయ్యి" - అని రాముడు అనగానే ఆమె - " నాయనా ఎంతో శుభవార్త వింటున్నాను. నీతో పోటీపడే శత్రువులందరూ జయింపబడ్డారు. ఇటుపై నీవు రాజువై నా జ్ఞాతులకూ , సుమిత్ర జ్ఞాతులకూ అన్ని విధాలా ఆనందం కలిగించాలి " అని అంది.

     "వత్స రామ చిరంజీవ హతాస్తే పరిపన్ధినః ,
      జ్ఞాతీన్మే త్వం శ్రియా యుక్తః సుమిత్రాయాశ్చ నన్దయ" (4.39)

ఇక్కడ ఈమె తనవాళ్లకు సుమిత్ర బంధువులకు ఆనందం కలుగుతుంది అని చెప్పడం చేత ఆమె మనస్సులో ఉన్న పరిపంథులెవరో (శత్రువులెవరో) స్పష్టంగా తెలుస్తూన్నది.

***************************************************************************************************

 అయోధ్యాకాండము - 24

రాముడు ప్రక్కనే ఉన్న లక్ష్మణునితో - "లక్ష్మణా ! నాతో కలిసి నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. నువ్వు నా రెండవ ఆత్మవు. అందుచేత రాజ్యలక్ష్మి నన్ను వరించినదనగా నిన్ను కూడా వరించినట్లే. నువ్వు  రాజభోగాలన్నీ అనుభవించాలి. " నేను ఈ రాజ్యాన్ని నీకోసమే అంగీకరిస్తున్నాను.

ఇంతకు మించి భ్రాతృస్నేహ సూచకములైన వాక్యాలుండవు.

  "లక్ష్మణేమాం మయా సార్థం ప్రశాధి త్వం వసుంధరామ్,
    ద్వితీయం మే న్తరాత్మానం త్వామియం శ్రీరుపస్థితా. 
   
    సౌమిత్రే భుఙ్ క్ష్వ భోగాన్ స్త్వమిష్టాన్ రాజ్యఫలాని చ
    జీవితం చ హి రాజ్యం చ త్వదర్థమభికామయే " (అ.కాం. 4.43-44)

తరువాత రాముడు సీతా సమేతుడై తన నివాస ప్రాసాదానికి వెళ్ళిపోయాడు.

***************************************************************************************************

అయోధ్యాకాండము - 25

యౌవరాజ్యపట్టాభిషిక్తుడు కానున్న సీతాసమేతుడైన రామునిచేత తగిన ఉపవాసాది దీక్షలు చేయించవలసినదిగా దశరథుడు వసిష్ఠ మహామునిని కోరాడు. వసిష్ఠ మహాముని తానే స్వయంగా బ్రాహ్మణయోగ్యమైన రథం ఎక్కి రామప్రాసాదానికి వెళ్ళాడు. -

   "స్వయం వసిష్ఠో భగవాన్ యయౌ రామ నివేశనం" (అ.కాం.5.3)
   "బ్రాహ్మం రథవరం యుక్తమాస్థాయ సుధృఢవ్రతః"  (అ.కాం.5.4)

ఇది వసిష్ఠముని ఉచితజ్ఞతను సూచిస్తున్నది.

***************************************************************************************************

అయోధ్యాకాండము - 26

వసిష్ఠమహాముని వచ్చినట్లు తెలియగానే రాముడు తొందర తొందరగా రథం దగ్గరికి వెళ్ళి స్వయంగా చెయ్యి అందించి ఆయనను రథంనుండి దింపాడు. -

   "అభ్యేత్వ త్వరమాణశ్చ రథాభ్యాం మనీషిణః,
    తతో  వతారయామాస పరిగృహ్య రథామ్ స్వయమ్" (అ.కాం. 5.7) 

ఇదీ ఆనాటి రాజకుమారుల వినయ సంపద.

***************************************************************************************************

అయోధ్యాకాండము - 27

రామాభిషేక వార్తను విని ఎంతోమంది అతని మిత్రులు అభినందించడానికై వచ్చి ఉన్నారు. మిత్రులందరూ కలిసి అభినందించడానికి అంతకంటే మంచి సమయం ఏముంటుంది?

రాముడు వాళ్ళతో కొంచెం సమయం మాత్రమే గడిపి వాళ్ళ అనుమతి తీసుకొని అంతఃపురం లోనికి వెళ్ళిపోయాడు.

  "సుహృద్భిః  సహ రామో సి సహాసీనః ప్రియంవదైః,
   సభాజితో వివేశాథ తాననుజ్ఞాప్య సర్వశః " (అ.కాం. 5.13) 

పాఠకులు ఊహించుకొని ఆనందించవలసిన సన్నివేశం.
***************************************************************************************************

అయోధ్యాకాండము - 28

వసిష్ఠ మహాముని దశరథుడు చెప్పిన విధంగా రామునిచేత దీక్షలు గ్రహింప చేసి తిరిగి దశరథుని వద్దకు రాముని దీక్షా ప్రారంభాన్ని గూర్చి చెప్పడానికి వెళ్ళాడు. కొంత మంది అమాత్యులతో కొలువు దీర్చి ఉన్న దశరథుడు ఆయనను చూడగానే ఆసనం నుండి లేచాడు. ఆయనతో పాటు అక్కడున్నవాళ్ళందరూ లేచారు.

   "తమాగతమభిప్రేక్ష్య హిత్వా రాజాసనం నృపః,
     పప్రచ్ఛ స చ తస్మై తత్ కృతమిత్యభ్యవేదయత్"
    
     తేన చైవ తదా తుల్యం సహాసీనాః సభాసదః 
     ఆసనేభ్యః సముత్తస్థుః పూజయన్తః పురోహితం" (అ.కాం.5.23,24)

ఇది వసిష్ఠమహామునికున్న సర్వజనాదరణీయత్వాన్నే కాక దశరథుని ఉదారత్వాన్ని ఉత్తమ సంస్కారాన్ని సూచిస్తున్నది.

***************************************************************************************************

అయోధ్యాకాండము - 29

మంథరా వృత్తాంతంలో వాల్మీకి రెండు విభిన్న మనస్తత్వాల సంఘర్షణను చాల చక్కగా చిత్రీకరించాడు.

మరునాడు జరుగబోయే రామ పట్టాభిషేకానికి నగరం అంతా ఆనందోత్సాహలతో కోలాహలంగా వుంది. వీథులన్నీ చక్కగా అలంకరించారు. ఎందరో పౌరులు జనపదాలనుండి, నగరాలనుండి తండోపతండాలుగా అయోధ్యానగరానికి వస్తున్నారు. కైకకు అత్యంత సన్నిహితురాలైన సఖి వంటి పరిచారిక మంథర యాదృచ్ఛికంగా ప్రాసాదాగ్రం మీదికి ఎక్కి నలువైపులా చూచేసరికి నగరం అంతా ఉత్సవ వాతావరణలో కనబడింది. అందుకు కారణమేమో ఆమెకు తెలియదు.

ఇంతలో కౌసల్య అంతఃపురంలో ఉండే ఒక దాది తెల్లటి పట్టుబట్టలు ధరించి బాగా అలంకరించుకుని అనందాతిశయంతో ఆ ప్రాంతంలో కనబడింది. ఈ ఉత్సవానికి కారణమేమని మంథర ఆమెను అడిగింది.

మంథర కైకేయికి పుట్టినింటి నుండి అరణంగా వచ్చిన దాసి. ఈమెకు కైకయే సర్వస్వము. కైక అభివృద్ధిని గూర్చిన చింత తప్ప ఆమెకు మరొక ఆలోచన ఏదీ లేదు. కైకకు కౌసల్యకు సవతుల మధ్య ఉండే పోటీలు కలహాలూ ఉన్నవను విషయం కూడా ఆమెకు తెలుసును. అందుచేత కౌసల్య విషయంలో కైకకు ఎంత ద్వేషభావం ఉన్నదో తెలియదు గాని ఈమెకు మాత్రం కౌసల్య అంటే అమితమైన ద్వేషం. కైకేయి దశరథునికి అత్యంత ప్రేమపాత్రురాలైన  విషయం కూడా ఆమెకు తెలుసును. దశరథుని అనంతరం కూడా భరతుని ద్వారా కైకేయియే ఎల్లపుడూ ఉన్నతమైన గౌరవ స్థానంలో ఉంటూ కౌసల్యను అణచి వేయాలని ఆమె దృఢవాంఛ. అందుచేత ఆమె ఎల్లపుడూ కౌసల్యమీద ఒక కన్ను వేసి ఉండేది.

నగరంలో పౌరులందరూ మహోత్సాహంతో ఉత్సవం జరుపుకోవడమే కాదు; కౌసల్య ఇంటి ముందు ఎందరో జనులు బారులు తీర్చి ఉన్నారు.
ఆమె చేయి విడిచి ఎన్నో బహుమతులు వచ్చిన వాళ్ళకందరికీ పంచిపెడుతున్నది. ఇదంతా చూచే సరికి ఆమె మనస్సులో కలవరం బయలుదేరింది.

ఈ హడావుడి ఆంతా ఏమని అడుగుతూ ఆమె కౌసల్య పరిచారికను "సహజంగా ధనం ప్రోగుచేసికోవాలని మాత్రమే కోరుకునే, లుబ్ధురాలైన రాముని తల్లి విరివిగా దానాలు చేస్తున్నదేమిటి" అని అంటుంది.

  "ప్రహర్షోత్ఫుల్లనయనాం పాణ్డురక్షౌమవాసినీం,
    అవిదూరే స్థితాం దృష్ట్వా ధాత్రీం పప్రచ్ఛ మన్థరా. 

    ఉత్తమేనాభిసంయుక్తా హర్షేణార్థపరా సతీ,
    రామమాతా ధనం కిం ను జనేభ్యః సంప్రయచ్ఛతి" (అ.కాం. 7.7,8)

కౌసల్యపేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టం లేక కాబోలు మంథర 'రామ మాతా' (రాముని తల్లి) అంటుంది.

***************************************************************************************************

అయోధ్యాకాండము - 30

రాముని యౌవరాజ్య పట్టాభిషేకం మాట వినగానే మంథరకు కోపంతో ఒడలు దహించుకుపోయింది. వెంటనే ఆమె ప్రాసాదం పైభాగం నుండి క్రిందికి దిగి, పర్యంకం మీద హాయిగా శయనించి ఉన్న కైకేయి వద్దకు వెళ్ళి

"గొప్ప ఆపద వచ్చిపడింది, ఏమీ తెలియకుండా హాయిగా కూర్చొని ఉన్నావు" అని హెచ్చరించింది.

"ఉత్తిష్ఠ మూఢే కిం శేషే భయం త్వామభివర్తతే ,
  ఉపప్లుతమఘౌఘేన కిమాత్మానం న బుధ్యసే"

నీతో నీ భర్త పైకి మంచి మాటలాడుతూ ఇప్పుడు గొప్ప ద్రోహం తలబెట్టాడు అని తీవ్రంగా ఆక్షేపిస్తుంది. ఆ మాటలన్నీ విని కూడ కైక రాముడు రాజ్యాభిషిక్తుడు కానున్నాడని తెలియడంతో పరమానంద భరితురాలై అలాంటి శుభవార్త చెప్పినందుకు ఆమెకు ఒక అమూల్యమైన ఆభరణం బహూకరించింది. మంథర ఆ ఆభరణం దూరంగా పడవేసి కైకకు వచ్చిన ఆపదను గూర్చి, కౌసల్య వల్ల ఆమెకు రాబోయే అవమానాదులను గూర్చి సుదీర్ఘంగా విశదీకరిస్తుంది. అయినా కైకేయి మనస్సులో ఏ మాత్రమూ రాముని విషయంలో ద్వేషభావం కలగలేదు. ఆమె మళ్ళీ తన ఆనందాన్ని ప్రకటించింది. ఇందుకు కారణం ఉన్నత రాజవంశంలో పుట్టిన కైకేయి సహజంగా ఉదారస్వభావం గలది. దానికి తోడు రాముని లోకోత్తరములైన సద్గుణాలు, తన విషయంలో బాల్యం నుండీ అతడు కనబరుస్తున్న ఆదర భక్తి భావలూ అందరి మనసులను వలెనే ఆమె మనస్సును కూడా పూర్తిగా వశం చేసికొని ఉన్నాయి.

ఇంత చెప్పినా కైకేయి తనకు వచ్చిన ముప్పును గ్రహించకపోవడంతో మంథర హతాశురాలైంది. ఇపుడు కైకేయికి కలగనున్న అవమానాదులను గూర్చి కాకుండా ఆమె పుత్రుడైన భరతునుకి పట్టన్నున్న దుర్గతిని గూర్చి అధికంగా చెప్పడం ప్రారంభించింది. "రాముడు ఏ నాటికైనా భరతుడే తనకు పోటీపడే వాడనే అభిప్రాయంతో అతనిని దేశాంతరానికి గాని లోకాంతరానికి గాని పంపివేస్తాడు. ఇప్పటికే నీ కుమారుణ్ణి బాల్యంలోనే చాల కాలంక్రితం నీ తండ్రి గారి దేశం పంపి చాల పెద్ద పొరబాటు చేఐ ఉన్నావు. మనుష్యులు దగ్గర లేకపోతే వాళ్ళ విషయంలో ప్రేమ, స్నేహ భావమూ కూడా సన్నగిల్లుతాయి. అందుచేత దగ్గర ఉన్న లక్ష్మణుని విషయంలో రాముడు ప్రేమతో ఉంటాడు.

 " ధ్రువం తు భరతం రామః ప్రాప్య రాజ్యమకణ్టకమ్,
    దేశాంతరం వాసయితా లోకాంతరమథాపి వా."
    "బాల ఏవ హి మాతుల్యం భరతో నాయితస్త్వయా
      సంనికర్షాచ్చ సౌహార్దం జాయతే స్థావరేష్వపి" (అ.కాం. 8.27,28) 

"అందుచేత మళ్ళీ అయోధ్యకు తిరిగి రాకుండా భరతుడు రాజగృహం నుంచే , మేనమామ ఇంటి నుంచే , వనానికి వెళ్ళిపోవడం మంచిది"

ఈ విధంగా రాముని రాజ్యాభిషేకం జరిగితే నీవూ నీ పుత్రుడూ అనేక కష్టాల పాలవుతారు; నువ్వు కౌసల్యకు ఊడిగాలు చేయవలసి వస్తుంది; చివరికి నీ కోడళ్ళు కూడా నీ మాట వినరు. " అని అంటూ మంథర రెండు పర్యాయాలు ఎంతో దీర్ఘోపన్యాసం ఇచ్చినా కూడ రాముణ్ణే వెనుకవేసికొని వచ్చిన కైకేయి,

 "నీ పుత్రుని ప్రాణాలకే ముప్పు వస్తుంది"

అను బ్రహ్మాస్త్రం మంథర ప్రయోగించడంతో పూర్తిగా మారిపోయింది. " ఈ నాడే రాముణ్ణి అరణ్యానికి పంపివేస్తాను; భరతునికి యౌవరజ్యాభిషేకం జరిగేటట్లు చూస్తాను" అని ప్రతిజ్ఞ చేసి అందుకు ఉపాయం కూడా నువ్వే చెప్పుమని మంథరను అడిగింది. మంథర తెలివి మీద ఆమెకు అంత నమ్మకం కుదిరింది.

  "అద్య రామమితః క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహమ్,
    యౌవరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే" 
    
    ఇదం త్విదానీం సంపశ్య కేనోపాయేన మంథరే,
    భరతః ప్రాప్నుయాద్రాజ్యం న తు రామః కథంచన" (అ.కాం. 9.2,3)

***************************************************************************************************

అయోధ్యాకాండము - 31

మంథర కైకేయికి దశరథుడు పూర్వం ఏనాడో ఇచ్చిన రెండు వరాల మాట గుర్తు చేసి వాటిని ఆ సమయంలో ఎలా వినియోగించుకోవాలో ఉపదేశించింది. మంథర మాటలు వినగానే కైకేయి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. ఆమె సంతోషాతిశయంతో మంథరను పాదాదిశిరః పర్యంతం వర్ణించి, నీవంటి కుబ్జ ఈ లోకంలో మరొకతె ఎవరూ ఉండదని శ్లాఘించింది.

"నువ్వు తెల్లని పట్టుచీర కట్టుకొని నా ఎదుట వయ్యారంగా నడుస్తూ ఉంటే రాజహంస నడక చూస్తున్న ఆనందం కలుగుతుంది. అది గూను కాదు; అన్ని మాయలు, క్షత్రియ విద్యలూ కూడ అక్కడ మూట కట్టి నిక్షిప్తములై ఉన్నాయి. రాముడు అరణ్యానికి వెళ్ళి భరతుడు రాజ్యం పొందగానే నీ గూనుకు బంగారు మాల చేయించి అలంకరిస్తాను. దీనిమీద మేలిమి బంగారు పూత పూయిస్తాను.

" త్వమాయాతాభ్యాం సక్థిభ్యాం మంథరే క్షౌమవాసినీ
   అగత్రో మమ గచ్ఛన్తీ రాజహంసీవ భాససే" (అ.కాం.9.44)

   "జాత్యేన చ సువర్ణేన సువిష్టప్తేన మంథరే
     లబ్దార్థా చ ప్రతీతా చ లేపయిష్యామి తే స్థగు" (అ.కాం. 9.48)


కైక ఆనంద పారవశ్యంలో మంథరను ఇలా ఇంకా అనేక విధాల స్తుతించింది.

***************************************************************************************************

అయోధ్యాకాండము - 32

దశరథ మహారాజు మరునాడు జరగవలసిన శ్రీరామయౌవరాజ్యపట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయించాడు. ఆ రాత్రి గడవ వలసి ఉంది. నిజానికి దశరథుడు రామ మాత అయిన కౌసల్య అంతఃపురంలో గడపడమే న్యాయం. అయినా కూడా కైకేయి అంతఃపురానికే వచ్చాడు. అందుకు రెండు కారణాలు ఉండి ఉండవచ్చు. మొదటిది - తాను తలబెట్టిన కార్యానికి కైకేయి ఎక్కడ విఘ్నం కలిగిస్తుందో అన్న భయం అతని మనస్సులో మెదులుతూ ఉండాలి. అందుచేత ముందుగానే ఆమె అంగీకారాన్ని పొందడం అవసరం. రెండవది - బహుశా ఆరోజుల్లో బహుభార్యలున్న వారు అనుసరించిన పద్ధతి ప్రకారం దశరథుడు ఆ మాసమో , వారమో కైకేయి అంతఃపురంలో నివసిస్తూ ఉండాలి.

అందుచేతనే అతడు రాత్రి తప్పక తన అంతఃపురానికి వస్తాడనే నమ్మకంతో కైకేయి శోకగృహంలో ప్రవేశించింది. అలవాటు ప్రకారం ప్రతీ రోజూ ఆమె ఇంట్లో రాత్రులు గడిపేవాడు ఆ రాత్రి కౌసల్య అంతఃపురానికి వెళ్ళి అక్కడ రాత్రి గడిపితే కైకేయి అసూయాగ్రస్తురాలై ఇంతవరకు తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని పైకి ప్రకటించి మరునాటి కార్యక్రమాన్ని పీటలమీదనే ఎక్కడ భగ్నం చేస్తుందో అన్న భయం కూడా దశరథునికి ఉండి ఉండాలి. అందుచేత కూడ దశరథుడు కౌసల్య ఇంటికి వెళ్ళకుండా ప్రతీరోజూ వెళ్ళినట్లే కైకేయి నివాసానికి వెళ్ళి ఉంటాడు.

***************************************************************************************************

అయోధ్యాకాండము - 33

కైకేయి తన రెండు వరాలు గుర్తు చేసి, రాముణ్ణి అరణ్యానికి‌పంపి భరతుణ్ణి పట్టాభిషిక్తుని చేయాలని దశరథుణ్ణి నిర్బంధించింది. అతడు ఏమీ చేయజాలని పరిస్థితిలో పడ్డాడు. అలాంటి సమయంలో మానవుని హృదయంలో అనేకమైన భావాలు కలగడం సహజం. కైకేయి మొండి పట్టు చూచిన అతని‌ మనసులో కలిగిన మొదటి భావం - "వనానికి వెళ్ళమని చెప్పగానే పూర్తిగా మారిపోయే రాముని ముఖం ఎలా చూడగలను?" అనేది.

  "కథం ద్రక్ష్యామి రామస్య వనం గచ్ఛేతి భాషితే ,
    ముఖవర్ణం వివర్ణం తం యథైవేన్దుముపప్లుతమ్." (అ.కాం.12.62)

"అందరు పెద్దల సమక్షంలో నిర్ణయించిన అభిషేకోత్సవానికి ఆహ్వానించగా వచ్చిన వాళ్ళ ముఖాలు ఎలా చూడగలను;వాళ్ళకు ఏమి సమాధానం చెప్పగలను?" అనేది రెండవ ఆలోచన. ఈ రెండు ఆలోచనలతో బాటు - కైకేయిని సంతోషపెట్టడంకోసం పట్టపురాణియైన కౌసల్య విషయంలో చాలకాలం నుంచీ తాను చూపుతూవస్తూన్న అనాదరభావం అతని మనసును తీవ్రంగా కలచివేసింది.

"కౌసల్య ఎప్పుడూ నా ప్రియాన్నే కోరుతుంది. పుత్రుని(ల) విషయంలో అపారమైన ప్రేమ గలది. ఎల్లప్పుడూ ప్రియంగానే మాట్లాడే స్వభావం గలది. అలాంటి కౌసల్య ఆ యా సమయాలలో దాసి వలె, సఖురాలు వలె, భార్య వలె, సోదరి వలె, తల్లి వలె నన్ను చేరి నాకు ఆనందం కలిగిస్తున్నా కూడ నీ‌మూలాన ఆమె విషయంలో చూపవలసిన ఆదరం చూపలేదు" అని అతడు కైకేయిని‌ నిందిస్తాడు.

 "యదా యదా హి కౌసల్యా దాసీవచ్చ సఖీవ చ, 
   భార్యావద్భగినీవచ్చ మాతృవచ్చోపతిష్ఠతి. 
   
   సతతం ప్రియకామే మే ప్రియపుత్రా ప్రియంవదా, 
   స మయా సత్కృతా దేవీ సత్కారార్హా కృతే తవ." (అ.కాం.12.68,69)

***************************************************************************************************

అయోధ్యాకాండము - 34

దశరథుడు ఎంత బ్రతిమిలాడినా కైక తన పట్టు విడవలేదు. అతడు నిద్ర లేకుండా అర్థచేతనాస్థితిలో పక్కమీద పడుకొని ఉన్నాడు. తెల్లవారుచున్నది. రామాభిషేక ముహూర్తం దగ్గర బడుతూండడంచేత వసిష్ఠుడు అంతఃపుర ద్వారం వద్ద నిలచి దశరథునికొరకై సుమంత్రుని లోనికి పంపాడు. సుమంత్రుడు లోనికి వెళ్ళి రాజుకు దగ్గరగా నిలబడి అతనిని స్తుతి వాక్యము లతో నిద్రనుండి మేల్కొల్పడానికి ప్రయత్నించాడు. సుమంత్రాదులు అలాంటి (మేల్కొల్పే) సమయాలలో పలికే ఆనందకరమైన స్తుతివాక్యాలే దశరథునికి ఆ పరిస్థితిలో చాల‌ మానసికమైన బాధను కలిగించాయి. సుమంత్రునికి జరిగిన విషయం ఏమీ తెలియదు. రాజు ఇంకా అర్ధనిద్రలోనే ఉన్నాడని అతడనుకొన్నాడు.

"రామాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది; మహారాజా! నీవు శీఘ్రంగా వచ్చి తరువాతి కార్యక్రమం నడిపించాలి" అన్న సుమంత్రుని మాటలు దశరథుని చెవులకు ముళ్ళు గ్రుచ్చినట్లు బాధ కలిగించాయి. రాత్రొ తెల్లవార్లూ శోకంతో ఎఱ్ఱబడిపోయిన నేత్రాలతో సుమంత్రుని వైపు పైకి చూచి - "ఈ మాటలతో నీవు నా మర్మాలు ఇంకా ఛేదించి వేస్తున్నావు" అన్నాడు. సుమంత్రునికేమీ అర్థం‌కాలేదు. అక్కడి నుండి నాలుగైదు అడుగులు వెనకకు వేసి చేతులు జోడించి నిలబడ్డాడు. మామూలు పరిస్థితులలో ఆనందకరమైన సుమంత్రుని మేల్కొల్పులు ఆనాడు దశరథునికి మర్మచ్ఛేదకములు అనిపించాయి.

   "తతః స రాజా తం సూతం సన్నహర్షః సుతం ప్రతి,
     శోకరక్తేక్షణః శ్రీమానుద్వీక్ష్యోవాచ ధార్మికః. 
     వాక్యైస్తు ఖలు మర్మాణి మమ భూయో నికృన్తసి"

     "సుమన్త్రః కరుణం శ్రుత్వా దృష్ట్వా దీనం చ పార్థివం,

       ప్రగృహీతాఞ్జలిః కిఞ్చిత్తస్మాద్దేశాదపాక్రమత్ " (అ.కాం.14.59,60)

***************************************************************************************************

అయోధ్యాకాండము - 35

కైకేయి పరిస్థితి గమనించింది. అప్పుడు ఆ రాజు అలా ఎందుకున్నాడో సుమంత్రునికి జరిగినదంతా చెప్పడం ప్రారంభిస్తే కాలయాపనం అయిపోతుంది. తన ప్రయత్నానికే ఏవైనా అడ్డంకులు రావచ్చు. ఆ సమయానికి ఏదో చిన్న అసత్యం పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలి. అందుచేత సుమంత్రునితో "మరేమీ లేదు;రామునికి జరగబోయే రాజ్యాభిషేకాన్ని గూర్చి ఆలోచిస్తూ రాజు రాత్రంతా నిద్ర లేకుండా ఉన్నాడు. ఇప్పుడే చిన్న కునుకు పట్టింది. అందుచేత వెంటనే వెళ్ళి ఆలస్యం చేయకుండా రాముణ్ణి ఇక్కడికి తీసుకొనిరా " అని‌ అన్నది -
 "సుమంత్ర రాజా రజనీం రామహర్షసముత్సుకః
ప్రజాగరపరిశ్రాంతో నిద్రావశముపేయివాన్.

తద్గచ్ఛ త్వరితం సూత రాజపుత్రం యశస్వినం,
రామమానయ భద్రం తే నాత్ర కార్యా విచారణా" (అ.కాం. 14.62,63)

కాళిదాసు 'అభిజ్ఞానశాకుంతలంలో ' "స్త్రీలు ప్రత్యుత్పన్నమతులు" (సమయానికి తగిన విధంగా ఏదో ఒక అబద్ధం వెంటనే అల్లేస్తారు ) అన్న మాటకు ఇదే అర్థం.

సుమంత్రుడు కైక మాటలు విని కాబోలుననుకున్నాడు. అలాగే తాను విన్న దశరథుని మాటలు సగం నిద్రావస్థలో బైటకు వచ్చిన కలవరింతమాటలనుకొని ఉంటాడు. కైకేయి చెప్పినట్లు రాముణ్ణి తీసుకొనిరావడానికి రామభవనానికి బయలుదేరాడు.

సుమంత్రుడు బైట ద్వారం దగ్గరికి వచ్చేసరికి రామాభిషేకానికి అవసరమైన సంభారాలన్నీ సిద్ధం చేసిన బ్రాహ్మణులు , సేనాపతులు, అమాత్యులు, నిగమప్రధానులు ఇతరులు కూడా ద్వారం దగ్గర చేరి అప్పటికి కూడా రాజు కనబడకపోవడంతో - "మేం అందరం వచ్చినట్లు రాజుకు ఎవరు చెప్తారు ?" అంటున్నారు. సుమంత్రుడు వాళ్ళను సమీపించి - " నేను రాజాజ్ఞ ప్రకారం రాముని దగ్గరకు వెడుతున్నాను. మీరందరూ దశరథునకు, విశేషించి రామనకు పూజనీయులు ; మేల్కొన్న రాజు సుఖంగానే ఉన్నాడా అను విషయం , ఇక్కడికి రాకపోవడానికి కారణమూ , మీ‌ మాటగా నేను అడిగి వస్తాను. అని చెప్పాడు.

   "రామం రాజ్ఞో నియోగేన త్వరయా ప్రస్థితో స్మ్యహం,
    పూజ్యా రాజ్ఞో భవన్తశ్చ రామస్య చ విశేషతః". 
   "అయం పృచ్ఛామి వచనాత్ సుఖమాయుష్మతామహమ్,
     రాజ్ఞః సంప్రతిబుద్ధస్య చానాగమన కారణం" (అ.కాం. 15.17,18)

సుమంత్రుడు కైకేయి మాట ప్రకారం రామభవనానికి బయలుదేరాడన్నమాటే కానీ అతని మనసులో ఏదో సందేహం‌ ఉండే ఉంటుంది. అందుచేత ద్వారం దగ్గర హుమిగూడినవారిని చూచి వారికి‌ పై మాటలు చెప్పి మళ్ళీ రాజు దగ్గరకు వెళ్ళాడు.

రాజు దగ్గరకి వెళ్ళి  "దశరథ మహారాజా ! బ్రాహ్మణాదులందరూ అభిషేక సంభారాలతో నీ దర్శనం కొరకై వేచి ఉన్నారు" అని‌ అన్నాడు. అప్పుడు దశరథుడు - కొంచెం విసుగుతో "రాముణ్ణి తీసుకొని రమ్మని ఈమె చెప్పినది కదా? అయినా కూడా నా ఆజ్ఞను‌ పాటించకుండా ఉండడానికి కారణం ఏమిటి? నేను నిద్ర పోవడం లేదు. వెంటనే రాముణ్ణి తీసుకొని రా " అని‌ అన్నాడు.

 "రామమానయ సూతేతి యదస్యభిహితో నయా, 
  కిమిదం కారణం యేన మమాజ్ఞా ప్రతిహన్యతే "

   "నచైవ సంప్రసుప్తో అహమానయేశు రాఘవమ్,
    ఇతి రాజా దశరథః సూతం తత్రాన్వశాత్ పునః" (అ.కాం. 15.26,27) 


సుమంత్రునికి అప్పుడుకూడా రాజు పరిస్థితి ఏమీ అర్థం అయి ఉండదు. కానీ ప్రశ్నించజాలడు కదా. ఇది దాజ సేవలోని వైచిత్ర్యం.


***************************************************************************************************

అయోధ్యాకాండము - 36


సుమంత్రుడు రామభవన ప్రాంగణంలో ప్రవేశించి, ఎన్నో కక్ష్యలు దాటి లోపల ప్రవేశించే సమయానికి రాముడు ఒక విహారశయ్యాసనం మీద (సోఫా మీద) కూర్చొని ఉన్నాడు. సీత వింజామర పట్టుకొని ప్రక్కనే నిలబడి‌ఉంది. సుమంత్రుడు సమీపించి, "నీ తండ్రి , రాణియైన కైకేయి, వెంటనే నిన్ను చూడాలని కోరుతున్నారు" అని రామునితో చెప్పాడు. ఆ మాట విని రాముడు సంతోషించి ప్రక్కనే ఉన్న సీతతో - "దేవీ ! రాజు గారు, రాణీ కూడా నన్ను గూర్చీ, నా రాజ్యాంహిషేకాన్ని గూర్చి ఆలోచిస్తూండి ఉంటారు. మా తల్లి యైన కైకేయి రాజు అభిప్రాయం తెలిసి చాల సంతోషించి ఏమేమి చేయాలో ఆయనను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆమె మహారాజు హితాన్నీ నా అభివృద్ధిని కోరుతూంటుంది. మన అదృష్టం కొలదీ రాజు, రాణీ కూడా అఫ్థ కామాలను సమకూర్చే సుమంత్రుణ్ణి దూతగా పంపారు. అక్కడ ఎలాంటి పరిషత్తు కలసినదో అలాంటి దూతనే పంపారు. రాజు తప్పక నన్నీ దివసాన రాజ్యాభిషిక్తుని చేస్తాడు. నేను తొందరగా తిరిగి వస్తాను. నువ్వు ఈ లోగా సఖురాండ్రతో విహరిస్తూ ఉండు" అని అన్నాడు.


      "దేవ! దేవశ్చ దేవీ చ సమాగమ్య మదన్తరే 
       మన్త్రయేతే ధ్రువం కించిదభిషేచనసంహితమ్. 
       
       లక్షయిత్వా హ్యభిప్రాయం ప్రియకామా సుదక్షిణా
       సంచోదయతి రాజానం మదర్థమసితేక్షణా 
       
       సా ప్రహృష్టా మహారాజం హితకామానువర్తినీ
       జననీ చార్థకామా మే కేకయాధిపతేఃసుతా.

       దిష్ట్యా ఖలు మహారాజో మహిష్యా ప్రియయా సహ,
       సముంత్రం ప్రాహిణోద్దూతమర్థకామకరం మమ. 

       యాదృశీ పదిషత్తత్ర తాదృశో దూత ఆగతః
       ధ్రుమమద్యైవ మాం రాజ యౌవరాజ్యే భిపేక్ష్యతి 
        
       హన్త శీఘ్రమితో గత్వా ద్రక్ష్యామి చ మహీపతిమ్
       సహ త్వం పరివారేణ సుఖమాస్స్వ రమస్వ చ. (అ.కాం. 16.15, 20) 

ఆ సమయంలో రాముడు ఆ విధంగా అనుకోవడం ఎంతో సహజంగా ఉంది. జరగబోయే సంఘటనలను బట్టి ఈ మాటలలో ఎంత దయనీయదైవవక్రత (irony of fate - dramatic irony) దాగి ఉన్నదో సహృదయులు గుర్తించగలరు.

***************************************************************************************************

అయోధ్యాకాండము - 37

రాముడు కైకేయి గృహంలో ప్రవేశించి చూచేసరికి దశరథుడు దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. ఆ దుఃఖానికి‌ కారణం‌ ఏమిటో రామునికి ఏమీ అర్థం కాలేదు. తండ్రికి పాదాభివందనం చేశాడు. రాముణ్ణి చూడగానే దశరథుడు ఒక్క సారి "రామా!" అన్నాడు. కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. రాముని ముఖంలోకి చూడలేకపోయాడు. మళ్ళీ నోటినుండి ఒక్కమాట కూడా రాలేదు.

     "రామేత్యుక్త్వా తు వచనం బాష్పపర్యాకులేక్షణః,
       శశాక నృపతిర్దీనో నేక్షితుం నాభిభాషితుమ్. (అ.కాం. 18.3)

***************************************************************************************************

అయోధ్యాకాండము - 38

తండ్రి పరిస్థితి చూచి రాముడు నిర్ఘాంతపోయాడు. "ఇందుకు కారణం ఏమిటి? నా‌ మీద కోపం వచ్చిందా? శారీరకంగా గానీ మానసికంగా గానీ ఏమైనా రుగ్మత కలిగిందా?" అని కైకేయిని ప్రశ్నించాడు. "అదేమీ లేదు; ఈయన మనసులో ఒక విషయం ఉంది. అది నీకు భయపడి చెప్పడం లేదు" అని సమాధానం‌‌ చెప్పింది.

 "న రాజా కుపితో రామ వ్యసనం నాస్యకించన,
   కించిన్మనోగతం త్వస్య త్వత్భయాన్నాభిభాషతే" (అ.కాం.18.20)


"అది నువ్వు అంగీకరిస్తావో అంగీకరించవో, తిరాకరిస్తావేమో అన్న భయం మాట్లాడడం లేదు గాని తనకు ఇష్టం లేక బాధపడడం లేదు" అని తెలపడం ఆమె అభిప్రాయం.

***************************************************************************************************

అయోధ్యాకాండము - 39

"నా తండ్రి అగ్నిలో దుమకమని చెప్పినా దుముకుతాను. ఆయన చెప్పినది చేయకపోవడమనే ప్రశ్నే లేదు" అని రామునిచేత ప్రతిజ్ఞ చేయించుకుని కైకేయి అసలు విషయం బయట పెట్టింది.

 "తప్పకుండా అలాగే జరుగుతుంది. ఈ రోజునే రాజాజ్ఞ ప్రకారం దూతలను పంపి భరతుణ్ణి అయోధ్యకు రప్పించాలి. నేను అరణ్యానికి వెడతాను. " అన్నాడు రాముడు.

   "గచ్ఛన్తు చైవానయితుం దూతాః శీఘ్రజవైర్హయైః 
     భరతం మాతులకులాదద్యైవ నృపశాసనాత్.
     దణ్డకారణ్యమేషో హమితో గచ్ఛామి సత్వరః" (అ.కాం.19.10,11)

రాముని ఈ మాటలు వినగానే కైకేయి చాల సంతోషించింది. "నువ్వు చెప్పింది బాగానే ఉంది. భరతుని కోసం దూతలు వెడతారులే; దానిని గూర్చి ఆలోచన నీకు అనవసరం. నువ్వు మాత్రం నిలబడిన మనిషివి నిలబడినట్లుగా అరణ్యానికి వెళ్ళాలి. ఈ మాట చెప్పడానికి సిగ్గుపడి ఈయన నీతో మాట్లాడడం లేదు. అందుకు ఏమీ అనుకోకు. " అని రాముణ్ణి ఆమె వనగమనానికి తొందరపెట్టింది.

  "ఏవం భవతు; యాస్యంతి దూతాః శీఘ్రజవైర్హయైః,
    భరతం మాతులకులాదుపావర్తయితుం నరాః" (అ.కాం.19.13)

    వ్రీడాన్వితః స్వయం యచ్చ నృపాస్త్వం నాభిభాషతే 
    నైతత్కించిన్నరశ్రేష్ఠ! మన్యురేషోపనీయతామ్

    యావత్వం న వనం యాతః పురాదస్మాదభిత్వరన్ 
    పితా తావన్న తే రామః స్నాస్యతే భోక్ష్యతే పివా" (అ.కాం.19.15,16)

ఈ విధంగా కైకేయి - "నువ్వు అడవికి వెళ్ళడం రాజుకు అన్ని విధాలా ఇష్టమే; నోటితో చెప్పడానికి సందేహంతో బాధపడుతున్నాడు" అన్నట్లు రామునికర్థమయే విధంగా మాట్లాడింది.


***************************************************************************************************

అయోధ్యాకాండము - 40

ఈ మాటలు వింటున్న దశరథుడు పర్యంకంమీదనే తల తిరిగి పడిపోయాడు. వంటనే ఆయనను రాముడు లేవదీశాడు. ఇంతలో మళ్ళీ కైక, గుఱ్ఱాన్ని కొరడాతో కొట్టినట్లు, రాముణ్ణి తొందరపెడుతూ ఏమేమో అన్నది. ఈ విధంగా తండ్రికి ఉపచారాలు చేస్తూ కాలయాపన చేస్తాడేమో అని ఆమె భయం. వాస్తవంలో దశరథునికి రాముని వనవాసం ఇష్టం లేదంహ్ విషయం అతనికెక్కడ తెలిసిపోతుందో అని కూడా ఆమె భయం.

     రామో ప్యుత్థాప్య రాజానం కైకేయ్యాభిప్రచోదితః
     కశయేవాహతో వాజీ వనం గన్తుం కృతత్వరః (అ.కాం.19.18)

కైక ఆ విధంగా తొందరపెడుతూంటే రామునికి కూడా కొంచెం మనసులో చికాకు కలిగి ఉంటుంది. తన జీవన లక్ష్యం ఏమో ఆమెకు స్పష్టంగా వివరించి చెప్పాడు. "దేవీ! నాకు ధనంమీద ఏ మాత్రమూ ఆసక్తి, ఆశ లేదు. లోకమర్యాదను కాపాడడమే నా లక్ష్యం. ధర్మ మార్గాన్ని మాత్రమే అనుసరించే నేను ఋషులవంటి వాడనని తెలుసుకో"

   "నాహపర్థపరో దేవీ! లోకమావస్తుముత్సహే ,
    విద్ధి మామృషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం" (అ.కాం. 19.20)

***************************************************************************************************

అయోధ్యాకాండము - 41

రాముడు కైకేయి చెప్పిన మాటలను బట్టి తండ్రి గారి మనస్సులోని అభిప్రాయం తెలిసికొని అక్కడినుండి వెళ్ళబోతూ -

"దేవీ నాన్నగారు చెప్పకపోయినా, నువ్వు చెప్పినా చాలును. నేను తప్పకుండా పదునాలుగు సంవత్సరాలు అరణ్యంలో నివసిస్తాను. ఇంతకీ; నీకు నామీద నమ్మకం ఉన్నట్లు లేదు. కాకపోతే నామీద సర్వాధికారాలూ ఉన్న నువ్వు చెపితే చేయనంటానా! ఈ మాత్రం దానికి తండ్రిగారిని బాధపెట్టావెందుకు? "

"అనుక్తో  ప్యత్రభవతా భవత్యా వచనాదహమ్,
  వనే వత్స్యామి విజనే వర్షాణీహ చతుర్దశ"

  "న నూనం మయి కైకేయి కించిదాశంససే గుణమ్ 

   యద్రాజానమవోచస్త్వం మమేశ్వరతరా సతీ" (అ.కాం. 19, 23,24)

***************************************************************************************************

అయోధ్యాకాండము - 42

"సరే! ఇంక నా తల్లి దగ్గర సెలవు తీసుకొని సీతను ఓదార్చి, వెంటనే దండకారణ్యానికి వెళ్ళిపోతాను. నువ్వు భరతునికి రాజ్యం సంపాదించి ఇచ్చావు కాబట్టి ఒక్క పని చెయ్యాలి. - భరతుడు రాజ్యం చక్కగా పాలించడంతో బాటు తండ్రి గారికి శుశ్రూష చేసేటట్లుగా కూడా నువ్వు చూడాలి. ఇది సనాతన ధర్మం" అన్నాడు రాముడు.

"యావన్మాతరమాపృచ్ఛే సీతాం చానునయామ్యహమ్,
  తతో ద్యైవ గమిష్యామి దణ్డకానాం మహద్వనమ్."

"భరతః పాలయేద్రాజ్యం శుశ్రూషేచ్చ పితుర్యథా,
  తథా భవత్యా కర్తవ్యం స హి ధర్మః సనాతనః." (అ.కాం.19.25,26)


ఈ రెండు మాటలు పలికి రాముడు అక్కడనుండి బయలుదేరాడు. కోపంతో లోలోపల మండిపోతున్న లక్ష్మణుడు బాష్పపూర్ణనయనాలతో అతని వెనుకనే వెళ్ళాడు.

***************************************************************************************************

అయోధ్యాకాండము - 43

"రాజ్యం నశించినా కూడా , చేయిజారిపోయినా కూడా రాముని సహజమైన శోభ ఏమాత్రం తగ్గలేదట. రాత్రి చంద్రుని శోభను పెంచుతుందే కానీ దానిని తగ్గించజాలదు కదా?" "రాజ్యం త్యజించి అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా కూడా రాముని చిత్తంలో , లోకాతీతుడైన మహాయోగి చిత్తం వలెనే , ఏ మాత్రం వికారం కలగలేదు"

 "న చాస్య మహతీం లక్ష్మీం రాజ్యనాశో పకర్షతి,
  లోకకాన్తస్య కాన్తత్వాచ్ఛీతరశ్మేరివ క్షపా" 

  "న వనం గన్తుకామస్య త్యజతశ్చ వసుంధరామ్,
    సర్వలోకాతిగస్యేవ లక్ష్యతే చిత్తవిక్రియా" (అ.కాం. 19.32,33)

***************************************************************************************************

అయోధ్యాకాండము - 44

రాముడు తల్లి అనుమతి తీసికొనడంకొరకు కైకేయి గృహంనుండి తల్లి గృహానికి వెళ్ళేసరికి ఆమె కుమారుని అంహ్యుదయంకొరకు దేవతాపూజలు చేయడంలో వ్యగ్రురాలై ఉంది. పుత్రుడు రావడం చూడగానే ఆమె లేచి - "నాయనా! ఈ దివసాన నీ తండ్రి నిన్ను యౌవరాజ్యాభిషిక్తుని చేయబోతున్నాడు. ఆయన ఆడిన మాట తప్పడు. ఈ నాటికి నా నోములు‌ ఫలించాయి." అని‌ అంటూ అతనికొక ఆసనము చూపి, ప్రేమ భరితమైన మాతృహృదయంతో కొన్ని భక్ష్యాలు అందజేయబోయింది.

  సత్యప్రతిజ్ఞం పితరం రాజానం పశ్య రాఘవ, 
  అద్యైవ హి త్వాం ధర్మాత్మా యౌవరాజ్యే భిపేక్ష్యతి. (అ.కాం.20,24) 

దశరథుడు సత్యప్రతిజ్ఞుడే! కాని అతని సత్యప్రతిజ్ఞత్వం తన కుమారునికీ తనకూ, ముప్పు తేనున్నదని పాపం! అప్పుడు కౌసల్యకు తెలియదు. ఇదొక శోచనీయస్థితి (irony)


రాముడు ఆ ఆసనం కేవలం చేతితో స్పృశించి విషయం అంతా తల్లికి తెలియచేశాడు. అది వినగానే కౌసల్య నిట్టనిలువునా నేలమీద కూలిపోయింది. రాముడు ఆమెను లేవదీసి, ధూళి దులిపి శరీరం అంతా నిమిరాడు.

***************************************************************************************************


అయోధ్యాకాండము - 45

ఆమెకు తిరిగి స్పృహ రాగానే కైకేయి మూలాన అంతవరకు ఆమె పడ్డ కష్టాలూ, భరించిన అవమానాలూ ఒక్కమాటు ఆమె మనసులో మెదిలాయి. "ఇంతవరకు ఎన్నడూ కూడ భర్త ద్వారా సుఖం ఏమీ అనుభవించలేదు- ఇటుపైన నైనా నీవు పెద్దచాడవైన తరువాత కొబ్త సుఖపడవచ్చును కదా అని ఆశ పడ్డాను. ఆ ఆశలన్నీ వమ్మయ్యాయి.

 " న దృష్ట పూర్వం కల్యాణం సుఖం వా పతిపౌరుషే ,
    అపి పుత్రే పి పశ్యేయమితి రామాస్థితం మయా" (అ.కాం. 20.38) 

"రామా! నువ్వు దగ్గర ఉన్నప్పుడే నేను ఎన్నో అవమానాలకు గురి అవుతున్నాను. ఇంక నువ్వు వెళ్ళిన తరువాత చెప్పాలా! నాకింక మరణమే శరణ్యం " "నా భర్త నన్ను కైకేయి పరివారంతో సమానంగాను, వాళ్ళకంటే నీచంగానూ కూడ చూస్తూ అణగద్రోక్కి ఉంచేవాడు"

"త్వయి సంనిహితే  ప్యేవమహమాసం నిరాకృతా,
  కిం పునః ప్రోషితే తాత ధ్రువం మరణమేవ మే"

 "అత్యన్తనిగృహీతాస్మి భర్తుర్నిత్యమతన్త్రితా,
   పరివారేణ కైకేయ్యా సమా వాప్యథవా వరా" (అ.కాం.20. 41,42) 

"ఇటుపైన - నాకంటే చిన్నవాళ్ళైన సవతులందరు గుండెలు కోసే చెడ్డమాటలన్నీ అంటూంటే వినవలసివస్తుంది."

"సా బహున్యమనోజ్ఞాని వాక్ యా ని హృదయచ్ఛిదామ్,
  అహం శ్రోష్యే సపత్నీనామవారాణాం వరా సతీ" (అ.కాం.20.39) 

"నన్ను సేవిస్తున్నవాళ్ళు, నన్ను అనుసరించేవాళ్ళు కూడ ఇకపైన కైకేయి పుత్రుణ్ణి చూచి, అతనికి భయపడి నన్ను పలకరింక్షరు కూడ"

 "యో హి మాం సేచతే కశ్చిదథవాప్యనువర్తతే,
   కైకేయ్యాః పుత్రమన్వీక్ష్య స జనో నాభిభాషతే " (అ.కాం.20,43) 

సవతులకు లొంగిపోయిన భర్త వల్ల కలిగే అవమానాలకు గురియైన ఒక ఉత్తమవంశానికి చెందిన స్త్రీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఘట్టంలో స్పష్టంగా వర్ణింపబడింది. దశరథుని పట్టమహిషి, శ్రీరాముని జనని యైన కౌసల్యయే ఆ కాలంలో రాజభవనంలో ఇన్ని కష్టాలు మౌనంగా సహించవలసినప్పుడు ఇతరకాలాలలో ఇతర స్త్రీల మాట చెప్పాలా? కొందరు ఇలాంటి కష్టాల పాలవడానికి తోటి స్త్రీలే ప్రధానకారణమేమో అనిపించకమానదు.

అయోధ్యాకాండము - 46

ఎందరో ధర్మాత్ములు తమ అపరాధం ఏదీ లేకుండా అనేకమైన ఇక్కట్లకు పాలవుతూన్నప్పుడు తాము ధర్మ మార్గాన్ని అనుసరించడమే తప్పేమో అని వాళ్ళకు అనిపింపక మానదు.

 "నేను సంతానం కోసం చేసిన వ్రతాలు, దానాలూ, నియమాలూ, తపస్సు ఇవన్నీ చవిటినేలలో వేసిన విత్ఫనంవలె, వ్యర్థం అయిపోయినాయంటే ఇదే నాకు చాల దుఃఖాన్ని కలిగిస్తున్నది."

 "ఇదం తు దుఃఖం యదనర్థకాని మే 
  వ్రతాని దానాని చ సంయమాశ్చ హి. 

  తపశ్చ తప్తం యదపత్యకారణాత్,
 సునిష్పలం బీజమివోప్తమూషరే" (అ.కాం.20.52)


అయోధ్యాకాండము - 47

రాముని‌ ప్రక్కనే ఉండి కైకేయి భవనంలోను, కౌసల్యభవనంలోను జరిగిన విషయాలన్నీ చూస్తున్న లక్ష్మణుడు ఎంతో ప్రయత్నించి అణచి పెట్టుకున్న కోపాగ్ని ఒక్కసారి భగ్గుమన్నది.

 "ఇంతటి ధర్మాత్ముడైన కుమారుణ్ణి ఏ కారణమూ లేకుండా కేవలం ఆడదాని మాటలు విని అడవికి పంపడం నాకు ఏమాత్రము నచ్చడం లేదు. ఈ విషయం అందరికీ తెలియకముందే మనం మన పరాక్రమం చూపి రాజ్యం స్వాధీనం చేసుకోవాలి.
ఎవరు అడ్డు వచ్చినా అందరినీ సంహరించి వేస్తాను. తండ్రి యైనా కైక మటలు విని దుష్టుడుగా ప్రవర్తిస్తున్నప్పుడు అతనిని కూడా బంధించాలి, వధించాలి. మంచి చెడ్డలు తెలియక దుష్టుడై చెడ్డ మార్గం పట్టిన పెద్దవానిని కూడ దండించవలసినదే.
ఇతడు ఏ కారణం పురస్కరించుకొని, ఏ బలం చూచుకొని నీకు చెందిన ఈ రాజ్యం కైకేయికి కట్టబెడదా మనుకుంటున్నాడో  తెలియదు. "  అని‌  ఇంకా ఏమేమో అంటూ లక్ష్మణుడు అతి తీవ్రంగా మాట్లాడాడు.

 "ప్రోత్సాహితో అయం కైకేయ్యా స దుష్టో యది నః పితా
  అమిత్రభూతో నిఃసంగం వధ్యతాం బధ్యతామపి"

  "గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః,
  ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం"

  "బలమేష కిమాశ్రిత్య హేతుం వా పురుషర్షభ
    దాతుమిచ్ఛతి కైకేయ్యా రాజ్యం స్థితమిదం తవ"  (అ.కాం. 21.12, 14)


అయోధ్యాకాండము - 48

కౌసల్య లక్ష్మణుని మాటలన్నీ విన్నది. ఆ సమయంలో ఆమె మనసులోని తీవ్రమైన వాంఛ రాముడు ఎట్టి‌పరిస్థితుల్లోనూ తనకు దూరంగా వెళ్ళిపోకూడదు అనేది. అలాంటి పరిస్థితుల్లో ఆమెకు లక్ష్మణుడు చెప్పినది కూడ కొంతవరకు బాగున్నదేమో అనిపించింది. ఆమె రామునితో - "నాయనా! లక్ష్మణుడేదో అంటున్నాడు: అలాగే చేస్తే బాగుంటుందేమో ఆలోచించు" అన్నది.

 "భ్రాతుస్తే వదతః పుత్ర లక్ష్మణస్య శ్రుతం త్వయా,
   యదత్రానన్తరమ్ కార్యం కురుష్వ యది రోచతే (అ.కాం. 21.20) 


ఇంత కాలంగా తాను సవతి మూలాన అనుభవిస్తున్న బాధలచేతా, ఇప్పుడు తన పుత్రుని బాధకు కూడ ఆ సవతియే మూలకారణం అవడం చేతా  ఆమె మనస్సు ఎంతగా క్షోభ చెందుచున్నదో దీనిని బట్టి తెలుస్తున్నది.

 అయోధ్యాకాండము - 49

రాముణ్ణి వనానికి వెళ్ళవద్దని నివారిస్తూ కౌసల్య "నీకు తండ్రి ఎంత పూజ్యుడో తల్లియైన నేను కూడా అంత పూజ్యురాలనే కదా? నేను అరణ్యానికి వెళ్ళవద్దంటున్నాను. అందుచేత నా మాటను అనుసరించాలి. తండ్రి మాటను బట్టి అరణ్యానికి వెళ్ళవలసిన పనిలేదు" అని అన్నది.

"యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథా హ్యయమ్,
  త్వాం నాహమనుజానామి న గన్తవ్యమితో వనమ్." (అ.కాం.21.24) 

న్యాయసమ్మతమైన వాదమే కదా!

అయోధ్యాకాండము - 50

తనను అరణ్యానికి వెళ్ళవద్దని అంటూన్న తల్లికి ముందు రాముడు "పితృవాక్య పరిపాలనం పూర్వం ఎందరో మహాపురుషులు చేశారు. అట్లే నేను కూడ చెయ్యాలి. నాకు అడ్డు చెప్ప వద్దు" అని బోధించాడు.

 తరువాత లక్ష్మణునితో - "లక్ష్మణా! నా తల్లికి సత్యంలోనూ, శమంలోనూ ఉన్న రహస్యం తెలియక ఆమె అంతగా దుఃఖిస్తున్నది. ధర్మం అంటే ఏమో తెలిసిన నీవు కూడా అలా అనడం యుక్తం కాదు" ధర్మం అన్నింటి కంటే ప్రధానమైనది. తండ్రిగారి ఆజ్ఞ కూడా ధర్మ సంమతమే; దానిని‌ నేను తప్పక  పాటించాలి. "

  "మమ మాతుర్మహద్దుఃఖమతులం శుభలక్షణ, 
   అభిప్రాయమవిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ."
  "ధర్మో హి‌ పరమో లోకే సత్యం ప్రతిష్ఠితం,
‌‌‌‌‌   ధర్మసంశ్రితమేతచ్చ పితుర్వచనముత్తమం" (అ.కాం. 21.39,40) 

"నువ్వు ఏ క్షాత్రధర్మాన్ని గూర్చి మాట్లాడుతున్నావో అది ప్రకృతంలో ధర్మ విరుద్ధమైనది. అనార్యమైనది. అందుచేత ధర్మమును ఆశ్రయించుము"

"తీక్ష్ణత్వాన్ని విడిచిపెట్టి నేను ఏ విధంగా ఆలోచిస్తున్నానో ఆ విధంగా ఆలోచించుము. " అని కూడా రాముడు లక్ష్మణునికి ధర్మసూక్ష్మం తెలిపాడు.

  "తదేనాం విసృజానార్యాం క్షత్రధర్మాశ్రితాం మతిమ్,
    ధర్మమాశ్రయ మా తైక్ష్ణ్యం మద్బుద్ధిరనుగమ్యతామ్" (అ.కాం. 21.43)

అయోధ్యాకాండము - 51

రాముడు లక్ష్మణుణ్ణి తాత్కాలికంగా ఈ మాటలతో ఉపశమింపచేసి, ఏ విధంగానూ తల్లి అంగీకరించదని అనుకొని ఇలా అంటాడు. :

"అమ్మా! నేను వెంటనే అరణ్యానికి వెళ్ళవలసిందే. అనుజ్ఞ ఇమ్ము. నా ప్రాణాల మీద ఒట్టు పెడుతున్నాను. నాకు ఇపుడు చేయవలసిన స్వస్త్యయనకార్యాలన్నీ చెయ్యి"

  "అనుమన్యస్వ మాం దేవి! గమిష్యన్తమితో వనమ్,
    శాపితాసి మమ ప్రాణైః కురు స్వస్త్యయనాని మే" ( అ.కాం. 21.45) 


తనమీద ఎంతో ప్రేమ గల ఒక వ్యక్తిని‌ ఒప్పించాలంటే చివరికి ప్రయోగించే బ్రహ్మాస్త్రం తన ప్రాణాలమీద ఒట్టు‌పెట్టడం. దానితో అవతలి వ్యక్తి అవాక్కైపోతారు. అదే ఇక్కడ రాముడు తల్లిని ఒప్పించడానికి చేసిన పని.


అయోధ్యాకాండము - 52

"తండ్రి నిన్ను అరణ్యానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తే తల్లిగా నేను వెళ్ళవద్దని ఆజ్ఞాపిస్తున్నాను" అని కౌసల్య అంటే "రాజు చేసినది అధర్మం అందుచేత అతనిని నిగ్రహించినా తప్పులేదు" అని లక్ష్మణుడు అన్నాడు.

వాళ్ళిద్దరికి సమాధానం చెప్పినట్లుగా రాముడు - "తల్లీ! నువ్వూ నేనూ,సీతా, లక్ష్మణుడు, సుమిత్రా అందరూ కూడ మా తండ్రి గారి ఆజ్ఞ పాటించవలసిన వాళ్ళమే. ఇదే అతిప్రాచీనమైన ధర్మం." అని అన్నాడు.

 "త్వయా మయా వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా,
   పితుర్నియోగే స్థాతవ్యమేష ధర్మః సనాతనః" 

ఈ విధంగా రాముడు - నీవు కూడ రాజాజ్ఞ పాటించవలసినదాన వవడం చేత ఆయన ఆజ్ఞను కాదని నీవు ఆజ్ఞాపించడం యుక్తం కాదని తల్లికీ, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించడం యుక్తం కాదని తమ్మునికీ బోధించినట్లయింది.

అయోధ్యాకాండము - 53

ఇంత బోధించినా లక్ష్మణుడింకా పగబట్టిన పాము వలె బుసకొడుతూనే ఉన్నాడు. రాముడు అతని‌ దగ్గరికి వెళ్ళి, మానవుల సహజ మానసిక ప్రకృతిని సూచిస్తూ ఇలా అన్నాడు -

  "జరిగిన విషయా లెవరికీ తెలియక పోవడంచేత అభిషేకోత్సవానికి ఆమబంధించిన పనులన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని నిలిపివేసేటట్లు చేయి. అలా చేయకపోతే   " ఇంకా ఇతడు వెళ్ళలేదే! ఎందుచేతనో" అని‌ కైకేయి మనసులో శంకిస్తూంటుంది. "నా కుమారుడు నా ఆజ్ఞ ను పాలించడంలేదా ? " అని తండ్రి గారి మనసులో సందేహం ఉంటుంది. ఎందువల్ల ననగా - ఆయన తాను కైకేయికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొనకబోతే ఏమి పాపం వస్తుందో అని భయ పడుతూంటాడు".

  "సౌమిత్రే యో  భిషేకార్థే మమ సంభారసంభ్రమః,
    అభిషేకనివృత్యర్థే సో  స్తు సంభారసభ్రమః " 

 "యస్యా మదభిషేకార్థే మానసమ్ పరితప్యతే,
   మాతా మే సా యథా స స్యాత్ సవిశఙ్కా తథా కురు" (అ.కాం.22.5,6)

 "సత్యః సత్యాభిసంధశ్చ నిత్యం సత్య పరాక్రమః
  పరలోకభయాద్భీతహ్ నిర్భయోః అస్తు పితా మమ" 

  "తస్యాపి హి భవేదస్మిన్ కర్మణ్యప్రతిసంహృతే ,
   సత్యం నేతి మనస్తాపస్తస్య తాపస్తపేచ్చ మామ్" (అ.కాం. 22.9.10)



 అయోధ్యాకాండము - 54

లక్ష్మణుని మానసిక స్థితిని, భావాలను మార్చడానికి రాముడింకా‌ ఇలా అన్నాడు.

 "లక్ష్మణా! ఇస్తా నన్న రాజ్యం వెనుకకు తీసికొని అరణ్యానికి పంపుతున్నారంటే ఇందుకు దైవం తప్ప మరే కారణం ఉంటుంది?"

"దైవ ప్రేరణ లేకపోతే నన్ను బాధించాలని కైకకు బుద్ధి ఎందుకు పుడుతుంది?"

  "కృతన్తస్త్వేవ సౌమిత్రే ద్రష్టవ్యో మత్ప్రవాసనే,
   రాజ్యస్య చ వితీర్ణస్య పునరేవ నివర్తనే"

  "కైకేయ్యాః ప్రతిపత్తిర్హి కథం స్యాన్మమ పీడనే,
   యది తస్యా న భావో  అయం కృతాన్తవిహితో భవత్." (అ.కాం.22.15,16)

"ఇది దైవ ప్రేరణ కాకపోతే అలాంటి ఉత్తమమైన సంస్కారమూ సద్గుణాలూ గల రాజవంశ సంజాతురాలైన ఆమె ఎవరో సామాన్య స్త్రీ వలె నాకు బాధాకరంగా అలా మాటలాడుతుందా? అందులోనూ భర్త సమక్షంలో అలా చేస్తుందా ?"

  "కథం ప్రకృతిసంపన్నా రాజపుత్రీ తథాగుణా,
   యస్య న గ్రహణం కించిత్ కర్మణో అన్యత్ర దృశ్యతే." (అ.కాం.22.21)

"ప్రారంభించిన పనికి హటాత్తుగా ఏవో అడ్డంకులు ఏర్పడతాయంటే అది దైవం పనే."

   "అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే 
    నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మ తత్" (అ.కాం.22.24) 

    "ఏతయా తత్త్వయా బుద్ధ్యా సంస్తభ్యాత్మానమాత్మనా, 
     వ్యాహతే అప్యభిషేకే మే పరితాపో న విద్యతే" (అ.కాం.22.25) 

"ఈ యథార్థబుద్ధితో నన్ను నేను కుదుట పరుచుకొనుచున్నాను. అందుచేత అభిషేకానికి విఘ్నం వచ్చినా కూడా నాకేమీ పరితాపం లేదు"


అలాంటి సమయంలో కూడా రాముని చిత్త స్థైర్యం ఇది. !!

అయోధ్యాకాండము - 55

దీనికంతకీ దైవమే కారణమని శ్రీరాముడు ఎంత బోధించినా లక్ష్మణునికి ఆ విషయం ఏదీ మనసునకు పట్టలేదు. అలాంటి సమయాలలో పైనుండి చూచే వాళ్ళకు ఎలాంటి శంక కలుగుతుందో అలాంటి శంకయే లక్ష్మణునకు కైకేయీ దశరథుల విషయంలో కలిగింది.

"దైవం ఏం చేస్తుంది? అదేమీ చేయజాలదు. అనవసరంగా నువ్బు దీనినంతా దైవం మీద మోపుతున్నావు. కైకేయీ - దశరథులు నీ‌మెత్తదనాన్ని అదనుగా తీసికొని ఏనాటికైనా నీకీ నష్టం కలిగించడానికి ఎప్పటినుండో ఆలోచనలు చేస్తూంటారు. అలా కాకపోతే ఎప్పుడో ఇచ్చిన వరాలు ఆమె ఇప్పుడు కోరడం ఏమిటి? తగిన సమయంలో ఈ వరాలను ఉపయోగించుకుందాం అని వాళ్ళిద్దరూ ముందుగానే అనుకొనే ఈ నాడిలా చేశారు. అందుచేత దైవం దైవం అంటూ ఊరకుండడం కాదు; పరాక్రమించాలి. " అంటాడు లక్ష్మణుడు.

  "కిం నామ కృపణం దైవమశక్తమభిశంససి, 
    పాపయోస్తే కథం నామ తయోః శఙ్కా న విద్యతే" 

   "సన్తి ధర్మోపదాః శ్లక్ష్ణాః ధర్మాత్మన్ కిం న బుధ్యసే,
    తయోః సుచరితం స్వార్థం శాఠ్యాత్ పరిజిహీర్షతోః" 

   "యది నైవం వ్యవసితం స్యాద్ధి ప్రాగ్రేవ రాఘవ,
   తయోః ప్రాగ్రేవ దత్తశ్చ స్యాద్వరః ప్రకృతశ్చ సః" (అ.కాం.23.7,9) 

రాముడు లక్ష్మణుణ్ణి సముదాయించి అంతటి ఉద్రిక్త స్థితినుంచి సాధారణ స్థితికి తీసికొని వచ్చాడు.

అయోధ్యాకాండము - 56

అంతవరకు నీవు అరణ్యానికి వెళ్ళవద్దు అంటూన్న కౌసల్య రాముడు తన ప్రాణాలమీద ఒట్టు పెట్టడంతో ఆ మాట విడిచివేసి

 "నేను కూడ నీతో అరణ్యానికి వస్తాను; నన్ను కూడ తీసికొనివెళ్ళు; లేగ దూడ వెళ్ళిపోతుంటే తల్లి దాని వెనుకనే వెళ్ళకుండా ఉండగలదా" అంటుంది.

    "కథం హి ధేనుః స్వం వత్సం గచ్ఛన్తం నానుగచ్ఛతి,
     అహం త్వామనుగమిష్యామి యత్ర పుత్ర! గమిష్యసి (అ.కాం.24.9)



అయోధ్యాకాండము - 57

నేను కూడా నీవెంటనే వస్తాను అని కౌసల్య అన్నప్పుడు రాముడిలా అన్నాడు.

"రాజును కైకేయి మోసం చేసింది. నేను అరణ్యానికి వెళ్ళి నువ్వు కూడ ఆయనను విడిచి వేస్తే ఆయన తప్పక ప్రాణాలు వదలివేస్తాడు. స్త్రీ భర్తను త్యజించడం అనేది చాల క్రూరమైన పని. నింద్యమైన అలాంటి పని నువ్వు మనసా కూడ చేయకూడదు. రాజైన నా తండ్రి జీవించి ఉన్నంతవరకు నువ్వు ఆయనకు శుశ్రూష చేయాలి. ఇదే అతిప్రాచీనమైన , శాశ్వతమైన ధర్మం."

రాముని‌ మాటలు విన్న కౌసల్య మారుమాటాడకుండా, సంతోషపూర్వకంగా - "అలాగే చేస్తాను" అని అన్నది. తాత్కాలికంగా ఆవేశానికి లోనైనా ఆమె వెంటనే తన ధర్మాన్ని గుర్తించడం ఆమె మహోన్నత వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నది.


    "కైకేయ్యా వఞ్చితో రాజా మయి చారణ్యమాశ్రితే
     భవత్యాపి పరిత్యక్తో న నూనం వర్తయిష్యతి " 

    "భర్తుః కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః,
    స భవత్యా న కర్తవ్యో మనసాపి విగర్హితః"
  
    "యావజ్జీవతి కాకుత్స్థః పితా మే జగతీపతిః
     శుశ్రూషా క్రియతాం తావత్స హి ధర్మః సనాతనః"

     ఏవముక్తా తు రామేణ కౌసల్యా శుభదర్శినా

     తథేత్యువాచ సుప్రీతా రామమక్లిష్టకారిణమ్" (అ.కాం.24.11.14)


 అయోధ్యాకాండము - 58

"సరే, నువ్వు చెప్పినట్లే చేస్తాను" అని తల్లి అనగానే రామునికి‌ కొంచెం ఊరట కలిగింది.

 "రాజు మనందరకూ పూజ్యుడు, ప్రభువు, శ్రేష్ఠుడు. అందుచేత నువ్వు నేను అందరమూ కూడ ఆయన చెప్పినట్లే చేయాలి. పద్నాముగు సంవత్సరాలపాటు అరణ్యంలో హాయిగా విహరించి వచ్చేస్తాను. " అని రాముడు మళ్ళీ రెండు మాటలు పలకగానే కౌసల్య మనస్సు మారిపోయింది. "ఏమైనా ఈ సవతుల మధ్య అవమానాలు భరిస్తూ ఉండలేను. నేను కూడ నీతో వచ్చేస్తాను." అంది.

అలాంటి సమయంలో చిత్తం ఈ విధంగా అవ్యవస్థితంగా ఉండడం సహజమే కదా!

  "ఆసాం రామ సపత్నీనాం వస్తుం మధ్యే న మే క్షమమ్,
    నయ మామపి కాకుత్స్థ వనం వన్యాం మృగీం యథా" (అ.కాం.24.19) 


మళ్ళీ రాముడు భర్త విషయం లో భార్య ధర్మాన్ని గుర్తుచేసి, భరతుని మంచితనాన్ని వర్ణించి చెప్పి ఏదో విధంగా తల్లిని ఒప్పించాడు. ఆమె అతనిని ఆశీర్వదించి, ప్రయాణ సమయంలో తల్లి కుమారునికి చేసే మాంగల్యప్రక్రియలన్నీ  చేసింది.


అయోధ్యాకాండము - 59

రాముని‌క్షేమం కొరకై దేవతాపూజాహోమాదులు చేసి కౌసల్య పైకి సంతోషంగా ఉన్నట్లు నవ్వుతున్నా, లోలోన దుఃఖాక్రాంతయై మాటలతో మాత్రమే రాముణ్ణి దీవించింది. ఆమె మనసు మాత్రం నిలకడగా లేదు. మాటలు కూడా తడపడుతున్నాయి.

  "ఉవాచాతి ప్రహృష్టేవ సా దుఃఖ వశవర్తినీ 
   వాఙ్మాత్రేణ న భావేన వాచా సంసజ్జమానయా" (అ.కాం.25.39)



అయోధ్యాకాండము - 60

రాముడు తల్లి చేసిన స్వస్త్యయన దేవతాపూజాహోమాదులు పూర్తియైన పిమ్మట ఎట్లో కష్టం మీద ఆమె అనుమతి గ్రహించి సీత దగ్గరకు స్వప్రాసాదానికి వెళ్ళాడు.

ఎంతో ఆనందోత్సాహాలతో కైకేయీదశరథులున్న భవనానికి వెళ్ళిన రాముడు దారిలో కనబడిన పౌరులను , మిత్రులను కలిసి, వాళ్ళతో మామూలుగా సంభాషణ చేస్తూ అదే పద్ధతిలో తల్లి కౌసల్య గృహంలో కూడ ప్రవర్తించి ఆమె అనుమతి తీసికొని వచ్చాడు.

 అయితే సీతను చూచేసరికి అతని మనస్సులోని దుఃఖం పెల్లుబికి పైకి వచ్చేసింది. ముఖం‌ వివర్ణమయినది. అంత జరిగిన విషయం ఏమీ తెలియని సీత అతని స్థితిని చూడగానే దిగ్భ్రాంతి చెందింది. ఏమైనది అని భర్తను ఆతురతతో అడిగింది.

రాముడు జరిగినదంతా సీతకు తెలిపి "నేను ఇప్పుడే మహారణ్యానికి వెళ్ళిపోతున్నాను. నిన్ను చూచి నీకు తెలిపి వెళ్ళాలని ఇలా వచ్చాను" అని‌ అంటూ తాను దగ్గర లేని కాలంలో ఆమె అంతఃపురంలో ఎలా మసలుకోవాలో ఉపదేశి‌ంచడం ప్రారంభించాడు.

"నువ్వు భరతుని ఎదుట నన్ను గురించి స్తుతిస్తూ ఎన్నడూ మాటాడకూడదు. ఎందుచేతనంటే ఐశ్వర్యం అధికంగా ఉన్న పురుషులెవ్వరూ, ఎవరైనా ఇతరులను స్తుతుస్తుంటే సహింపజాలరు. అందుచేత నా గుణాలను గూర్చి ఎన్నడూ అతని ఎదుట మాట్లాడకూడదు"

    "భరతస్య సమీపే తు నాహం కథ్యః కదాచన, 
      బుద్ధియుక్తా హి పురుషా న సహన్తే పరస్తవమ్
      తస్మాన్న తే గుణాః కథ్యా భరస్యాగ్రతో మమ" (అ.కాం.26.24,25) 

     "నాపి త్వం తేన భర్తవ్యా విశేషేణ కదాచన,
       అనుకూలతయా శక్యం సమీపే త్వస్య వర్తితుమ్" 

      "తస్మై దత్తం నృపతినా యౌవరాజ్యం సనాతనమ్,
        స ప్రసాదస్త్వయా సీతే! నృపతిశ్చ విశేషతః" (అ.కాం. 26.26,27) 

"నిన్ను విశిష్టమైన గౌరవ భావంతో పోషించవలసిన బాధ్యత అతనికేమీ లేదు. అందుచేత నువ్వు అతని చెప్పుచేతలలో ఉంటేనే అతని దగ్గర ఉండగలుగుతావు."

"రాజు యౌవరాజ్యం అతనికి ఇచ్చివేశాడు.  అందుచేత నువ్వు అతనిని మంచి చసుకోవాలి, విశేషించి రాజుగారిని మంచి చేసుకోవాలి"

    "భ్రాతృ పుత్ర సమౌ చాపి ద్రష్టవ్యౌ చ విశేషతః, 
     త్వయా భరతశతృఘ్నౌ ప్రాణైః ప్రియతరౌ మమ" (అ.కాం.26.33)

"భరత శత్రుఘ్నులిద్దరూ కూడ నాకు ప్రాణాలవంటి వారు. వాళ్ళను సోదరులవలె పుత్రులవలె చూచుకోవాలి. "

ఇక్కడ రాముడు లక్ష్మణుని మాట చెప్పలేదు. అందుకు రెండు కారణాలుండి ఉంటాయి.
ఒకటి - అతడు తనవాడే గాన తన విషయంలో ప్రత్యేకమైన ఆదరం చూపాలని అతడు అనుకొనడు.
రెండు- బహుశా లక్ష్మణుడు కూడ తనతో అరణ్యానికి రావచ్చు.

  "విప్రియం న చ కర్తవ్యం భరతస్య కదాచన,
    స హి రాజా ప్రభుశ్చైవ దేశస్య చ కులస్య చ" 
    
    ఆరాధితాహి శీలేన ప్రయత్నైశ్చోపసేవితాః
    రాజానః సంప్రసీదన్తి ప్రకుప్యన్తి విపర్యయే " (అ.కాం.26.34,35) 

"భరతునికి అనిష్టమైన పని ఏదీ ఎన్నడూ చేయకూడదు. అతడు రాజ్యాని రాజు; సర్వాధికారీ కూడా."   " రాజులను‌మంచి శీలంతో, నడవడికతో సంతోషింప చేస్తూ ప్రయత్నపూర్వకంగా సేవిస్తే వారు ప్రసన్నులౌతారు. అలా కాకపోతే వాళ్ళకు కోపం కలుగుతుంది.

   "ఔరసానపి పుత్రాన్హి త్యజన్త్యహితకారిణః 
    సమర్థాన్ సంప్రగృహ్ణన్తి జనానపి నరాధిపః" (అ.కాం. 26.36) 

"రాజులు తమకు అహితం చేసే ఔరసపుత్రులను కూడా వదలి వేస్తారు. ఏ సంబంధమూ లేని సామాన్య జనులలో సమర్థులెవరైనా ఉంటే వాళ్ళని చేరదీస్తారు"

    "సా త్వం వసేహ కల్యాణి రాజ్ఞః సమనువర్తినీ, 
     భరతస్య రతా ధర్మే సత్యవ్రతపరాయణా" (అ.కాం.26.37)

"మంగళ స్వరూపురాలైన ఓ!  సీతా! నువ్వు రాజైన భరతుణని విషయంలో అనుకూలంగా ప్రవర్తిస్తూ ధర్మనిరతురాలవై, సత్యవ్రతం అవలంబించి ఇక్కడనే నివసించుము. "

ఇంతే కాకుండా రాముడు సీతకు ప్రతిదినాన దేవతాపూజాదులు ఎలా చేస్తుండాలి, అత్తలను ఏ విధంగా పూజించాలి మొదలైన విషయాలను కూడ బోధించాడు.

ఈ ఘట్టంలో రాముని మాటలలో రెండు విషయాలు ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. అధికారం చేతికి రానంతవరకు ఎంతో‌మంచివాడుగా ఉన్నవాడు కూడ, అధికారం లభించడంతో , అందులోను నిరంకుశాధికారం లభించడంతో, పూర్తిగా మారిపోతాడు అనే అన్ని కాలాలకు సంబంధించిన సత్యం ఒకటి. భరతుని విషయంలో రామునకు ఎంత భ్రాతృ ప్రేమ ఉన్నా, అతడు చాల ఉత్తమ స్వభావం కలవాడని ఎన్ని పర్యాయాలు చెప్పినా అతని విషయంలో కూడ కొంత శంక రాముని హృదయంలో ఎక్కడనో ఒక‌మూల దాగి ఉండి పనిచేస్తున్నట్లు కనబడుతుంది. ఇది రెండవ అంశం.

అలాంటి భరతుని విషయంలో కూడ రామునికిలాంటి శంక ఉండడంలోని ఔచిత్యానౌచిత్యాలను గూర్చి మాటలాడడానికి ముందు ఒక్క విషయం గుర్తుంచుకొనవలసి ఉన్నది. నిన్ను యౌవరాజ్యాభిషిక్తుణ్ణి చేస్తాను అని చెప్పిన దశరథుడే తన అభిప్రాయం మార్చుకొని అరణ్యానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అందుకు ప్రధాన కారణం కైకేయియే అను విషయం‌ రామునికి తెలిసినా కూడ ఆమె కుమారుడైన భరతునికి‌ కూడ ఈ విషయం తెలిసే ఉంటుందనీ, అతనికి కూడ రాజ్యాభిలాష ఉండే ఉంటుందని శంక కలగక మానదు. ఇంతకాలమూ తనను భరతునికంటే కూడ ప్రేమతో చూచిన కైకేయి ఒక్క క్షణంలో అలా మారిపోయిందంటే ఇంత వరకు ఆమె చూపిన ప్రేమ కేవలం నటనేననీ, భరతుడు చూపుతూన్న భ్రాతృప్రేమభక్తులు కూడా అటువంటింవేమో అన్న సందేహం కలగడం కూడ సహజమే. లక్ష్మణుడైతే ఒక అడుగు ముందుకు వెళ్ళి కైకేయీ - దశరథులిద్దరూ కలిసి కుట్రపన్నారని స్పష్టంగా అననే అన్నాడు. భరతుడు తాను శంకించినట్లు రాజ్యాభిలాష కలవాడే అయితే రాజ్యాధికారం లభించిన తరువాత అతడు ఇతరులైన సామాన్య ప్రభువుల వలె అహంకారం పెరిగి తనవాళ్ళ విషయంలో అనాదరంగా ప్రవర్తించవచ్చును అను శంక కూడ రామునికి కలిగి ఉండవచ్చును. అందుచేతనే సీతకు ఈ విధంగా బోధించాడు.


మరొక విషయం‌ ఏమనగా - తరువాత ఏమి జరిగినా కూడ, ఆ క్షణం వరకు రాముడు తానొక్కడే , అందరినీ విడిచిపెట్టి, అరణ్యంలో ఒంటరిగా కాలక్షేపం చేయవలసి ఉంటుందను అభిప్రాయం తో ఉన్నాడు. ఒంటరిగా వనానికి వెళ్ళినవాడు తిరిగి రాకలగవచ్చు రాలేకపోవచ్చు. అలాంటి పరిస్థితిలో తనను విడిచి ఉండవలసిన సీత భరతుని అంతఃపురంలో ఎలా మసలుకోవాలో బోధించడం యుక్తమే కదా? అందుచేతనే ఆమె ఎవరితో ఎలా ప్రవర్తించాలి అను విషయాన్ని , తాను వెంటనే అయోధ్య విడిచి వెళ్ళవలసిన అత్యల్ప సమయంలో ఎంతవరకూ చెప్పాలో అంతవరకు స్పష్టంగా ఉపదేశించాడు. సీత, లక్ష్మణుడు కూడ తనతో వస్తారను భావం రాముని‌ మనస్సులో ఆ సమయంలో కలగడానికి ఏ మాత్రమూ అవకాశం లేదు. అందుచేత ఆ సమయంలో రాముడు సీతతో అన్న ప్రతీ ఒక్క మాటా కూడ అతని మానసికస్థితికి అనుగుణంగా ఉంది; యుక్తంగా ఉంది.



 అయోధ్యాకాండము - 61


రాముని నోటినుండి అప్రియమైన వార్త వినగానే సీత సామాన్య స్త్రీ వలె దుఃఖావేశంతో కండ్లు తిరిగి పడిపోలేదు. అతని రాజ్యాభిషేకానికి విఘ్నం కలిగినందుకు ఆమెకేమీ అంతగా విచారం కలిగినట్లు లేదు. కాని అతడు తనను అయోధ్యలో వదలి వెళ్ళిపోవడానికి సిద్ధం అయినందుకూ, తాను ఇక్కడ ఎలా మసలుకోవాలో బోధించినందుకూ ఆమెకు కోపం కూడ వచ్చింది. ఇదొక ప్రణయ కోపం మాత్రమే. ప్రేమతో చూపిన అలక.

ఆమె ఇలా అన్నది - "రామా! ఏమిటి నువ్వు మాటలాడుచున్నది! నీవు మాట్లాడే మాటలు నీకే అపహాస్యాస్పదంగా ఉండాలి; నాకు ఎంతో అపహాస్యాస్పంగా ఉన్నాయి" ఇలా అంటూ "భార్య ఎల్లప్పుడూ భర్తతో ఉండ దగినదే కాని ఆమెకు మరొక మార్గం ఏదీ ఉండడానికి అవకాశం లేదు. నేను కూడా నీతో అరణ్యానికి వస్తున్నాను" అని అన్నది.

  "ఏవముక్తా తు వైదేహీ ప్రియార్హా ప్రియవాదినీ, 
    ప్రణయాదేవ సంక్రుద్ధా భర్తారమిదమబ్రవీత్." 

    "కిమిదం భాషసే రామ వాక్యం లఘుతనయా ధ్రువమ్, 
      త్వయా యదపహాస్యం మే శ్రుత్వా నరవరాత్మజ" (అ.కాం.27.1,2) 

"భర్త భాగ్యాన్ని పంచుకొనేది భార్య మాత్రమే. అందుచేత నీ తండ్రి నిన్ను వనవాసం చేయమని ఆజ్ఞాపించాడంటే నన్ను కూడా ఆజ్ఞాపించినట్లే. "

     "భర్తృభాగ్యం హి భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ, 
       అతశ్చైవాహమాదిష్టా వనే వస్తవ్యమిత్యపి" (అ.కాం.27.4) 

"నేను నా జీవితంలో ఎలా నడచుకోవాలో నాకు నా తల్లీ, తండ్రీ చిన్నతనంలోనే ఉపదేశించి ఉన్నారు. ఇప్పుడు నాకెవ్వరూ కొత్తగా ఉపదేశాలు చేయవలసిన పనిలేదు."

      "అనుశిష్టా చ మాత్రా చ పిత్రా చ వివిధాశ్రయమ్ 
        నాస్మి సంప్రతి వక్తవ్యా వర్తితవ్యం యథా మయా" (అ.కాం.27.9)

"నేను నియమవంతురాలనై, బ్రహ్మచర్యం పాటిస్తూ నీకు శుశ్రూష చేస్తూ మంచి సుగంధాలుండే వనాలలో నీతో హాయిగా విహరిస్తాను. "

      "శుశ్రూషమాణా తే నిత్యం నియతా బ్రహ్మచారిణీ,
        సహ రంస్యే త్వయా వీర వనేషు మధుగన్ధిషు." (అ.కాం.27.12)

"వనేషు మధుగన్ధిషు" అని‌ అనడంలో సీత భావం నగరాలలో దుర్గంధాలు తప్పవనేమో !



అయోధ్యాకాండము - 62

తనతో అరణ్యానికి వస్తానని సీత అన్నా కూడా రాముడు అరణ్యవాసంలో ఎదురయ్యే  కష్టాలన్నీ ఆమెకు సుదీర్ఘంగా వివరించి చెప్పి నిన్ను నాతో అరణ్యానికి తీసుకొని వెళ్ళనని అన్నాడు. అప్పుడామె మనస్సులో దుఃఖం అంకురించింది. కండ్లు చెమ్మగిల్లాయి. ఆమె మంద్ర స్వరంతో మాట్లాడుతూ అరణ్యంలో ఎదురయే కష్టాలన్నీ తాను రామ‌సన్నిధిలో ఎలా అనుకూలంగా మలచుకోగలదో అతనికి చెప్పింది.

  "ఏతత్తు వచనం శ్రుత్వా సీతా రామస్య దుఃఖితా, 
‌‌‌‌‌‌   ప్రసక్తాశ్రుముఖీ మన్దమిదం వచనమబ్రవీత్"
   
   "యే త్వయా కీర్తితా దోషా వనే వస్తవ్యతాం ప్రతి
     గుణానిత్యేవ తాన్విద్ధి తవ స్నేహ పురస్క్రతాన్" (అ.కాం‌. 29.1,2)


అయోధ్యాకాండము - 63

సీత ఈ విధంగా చెప్పినా కూడ రాముడు ఆమెను అరణ్యానికి తీసికొని వెళ్ళడానికి అంగీకరించలేదు. ఆమె మళ్ళీ అతనిని అంగీకరింప చేయడం కోసం - "నేను ఒకనాడు నా పుట్టింట ఉన్నపుడు సాముద్రికశాస్త్ర పండితులైన బ్రాహ్మణులు వచ్చి, నన్ను చూచి - ఈమె కొంతకాలం వనవాసం చేస్తుంది అని చెప్పారు.

అలాగే మరొకప్పుడు సోదె చెప్పే ఒక‌ భిక్షుకి మా తల్లితో - ఈమెకు భర్తతో వనవాసం చేసే యోగం ఉన్నది" అని చెప్పింది. అది విన్న నాటినుండీ నేను నీతో కలిసి ఆ వనవాసం చేయడం ఎప్పుడా, ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను. అందుచేత నేను వనవాసానికి ఏనాటినుండో సిద్ధంగా ఉన్నాను. నన్ను కూడ నీతో తీసికొని వెళ్లాలి" అని‌ అన్నది.

  "అథ చాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణానాం మయా శ్రుతమ్,
    పురా పితృగృహే సత్యం వస్తవ్యం కిల మే వనే"         (అ.కాం.29.9)

     "కన్యయా చ పితుర్గేహే వనవాసః శ్రుతో మయా,
      భిక్షిణ్యా సాధువృత్తాయాః మమ మాతురిహాగ్రతః" (అ.కాం.29.13) 


ఏనాడో బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనలు పెద్దవాళ్ళైన తరువాత కూడ ఏ విధంగా మానవుల ఆలోచనలలో తమ ప్రభావం చూపుతాయో చూపడానికి సీత చెప్పిన ఈ బాల్యవృత్తాంతం ఉదాహరణం.


అయోధ్యాకాండము - 64

ఇలా చెపుతున్నా కూడా రాముడు ఆమెను తనతో తీసికొని వెళ్ళడానికి అంగీకరించలేదు. నన్ను తీసికొనివెళ్ళక పోతే ఆత్మహత్య చేసుకుంటానన్నది. అయినా రాముడు ఒప్పుకోలేదు. చివరికి సీత రాముని‌ మనసు గ్రుచ్చుకునే తీవ్రమైన మాటలేవైనా అంటేనే కాని అతడు అంగీకరించడు, ఇప్పుడే‌ మాత్రం  అజాగర్తతో ఉన్నా వ్యవహారం చేయిజారిపోతుంది అని నిశ్చయించుకుంది. రాముని‌మీద తనకున్న ప్రేమను, తన అహంకారాన్ని వ్యక్తీకరిస్తూ -

"రామా! నువ్వు పురుషాకారంలో ఉన్న స్త్రీవి; ఈ విషయం గుర్తించక మిథిలాపతియైన నా తండ్రి నిన్ను అల్లుణ్ణిగా చేసికొన్నాడు." అంది.

  "సా తముత్తమసంవిగ్నా సీతా విపులవక్షసమ్, 
    ప్రణయాచ్చాభిమానాచ్చ పరిచిక్షేప రాఘవమ్" 

   "కిం త్వామన్యత వైదేహః పితా మే మిథిలాధిపః,
    రామ! జామాతరం ప్రాప్య స్త్రియం పురుషవిగ్రహమ్" (అ.కాం.30.2,3)

ఆమె ఇంతటితో ఆగలేదు. రాముడన్న మాటలలో‌ కొన్నింటిని కప్పిపెట్టి, కొన్నింటికి వక్రార్థం కల్పిస్తూ అధిక్షేపించింది. " భరతుని విషయంలో నువ్వు జాగర్తగా ప్రవర్తించాలి. నా భర్తకు చెందవలిన రాజ్యాన్ని ఇతడు అనుభవిస్తున్నాడనే భావంతో కాని, నేను అన్నగారి భార్యను కదా, నాకు విశిష్టమైన పూజ్యస్థానం ఇవ్వాలని‌కాని అనుకొనకూడదు; అతనికి అనుకూలంగా ప్రవర్తించాలి" అని‌ అంటూనే రాముడు - "నీవు సదాచారవంతురాలవై, సత్యాన్నీ, వ్రతాన్నీ పాలిస్తూ, భరతునికి రాజుగారికీ అనుకూలంగా, వారి చెప్పుచేతలలో ఉండాలి" అని ఉపదేశించి ఉన్నాడు.

 దానిలో మొదటి భాగానికి విపరీతార్థాన్ని కల్పించి సీత - "నీవు నాటకాలలో వేషాలు వేసే నటుడు తన భార్యను కూడ ఇతరులకు అప్పగించినట్లు నన్ను ఇతరుల చేతిలో పెట్టదలుచుకున్నావు." అని‌ అన్నది. ఇది మొదటి అధిక్షేపం కంటే తీవ్రమైన అధిక్షేపం.

  "స్వయం తు భార్యాం కౌమారీం చిరమధ్యుషితాం సతీమ్, 
   శైలూష ఇవ మాం రామ పరేభ్యో దాతుమిచ్ఛసి" (అ.కాం. 30.8) 

నీవు తీసికొనివెళ్ళక పోతే నా ప్రాణాలు త్యజిస్తాను అని మళ్ళీ అన్నది. దీనితో రాముడామెను తనతో అరణ్యానికి తీసికొనివెళ్ళడానికి అంగీకరించాడు. "నిన్ను రక్షించుకొనలేననే భయంతో కాదు. నీ‌మనస్సు పూర్తిగా తెలిసికొనకుండా అంతటి క్లేశావహమైన వనవాసానికి నిన్ను తీసికొనివెళ్ళడానికి ఇష్టం లేక ఇంతవరకూ నిరాకరించాను. సరే; బయల్దేరుము" అన్నాడు.

  "తవ ఆర్వమభిప్రాయమవిజ్ఞాయ శుభాననే, 
    వాసం ఆరోచయే అరణ్యే శక్తిమానపి రక్షణే " (అ.కాం..30.28) 

రాముడు ఈ విధంగా ఆలోచించడం కూడా న్యాయసమ్మతమే కదా? సీత "నన్ను అరణ్యాలలో తిప్పడం కోసమా మా తండ్రి నన్ను నీకిచ్చి పెండ్లి చేసినది" అనే భావంతో ఉంటే రాముని మనస్సులోని ఊగిసలాట యుక్తమే కదా? "స్త్రియం పురుషవిగ్రహమ్" , "శైలూష ఇవ" అనగలిగినప్పుడు ఇలా అనదనే మాట ఏమున్నది!

తనతో అరణ్యానికి వెళ్ళడానికి రాముడు సీతకు అనుజ్ఞ ఇచ్చి " ఇక నువ్వు ప్రయాణానికి సిద్ధం కావాలి. నీకు సంబంధించిన ధనము, వస్తు -వాహనాదులూ అన్నీ కూడ భృత్యులకు , బ్రాహ్మణాదులకూ దానం చేసి వేయుము" అని ఆమెతో అన్నాడు. ఆమె సంతోషభరితాంతరంగంతో అత్యుత్సాహంతో రాముడు చెప్పిన విధంగా చేసి ప్రయాణానికి సిద్ధం అయినది.


అయోధ్యాకాండము - 65

ప్రక్కనే నిలబడి ఇదంతా చూస్తున్న లక్ష్మణుడు సీతారాముల పాదాలకు నమస్కరించి తాను కూడ వారితో అరణ్యానికి వస్తానని అన్నాడు. రాముడు అతనిని వారించాడు. ఆ సందర్భంలో రాముడు కైకేయీభరతుల విషయంలో తన మనసులో ఉన్న శంకను మళ్ళీ బహిర్గతం చేశాడు.

"మేమిద్దరమూ అయోధ్య విడచి దూరంగా వెళ్ళిపోయి, నీవు కూడ ఇక్కడ ఉండకపోతే కౌసల్యనూ, సుమిత్రనూ ఎవరు చూచుకొంటారు? అందుచేత ఇక్కడనే ఉండి వాళ్ళ యోగక్షేమాలు చూచుకొంటూ ఉండాలి. ఎందువల్ల ననగా - మహాతేజః శాలియైన ఏ మహరాజు, మేఘుడు భూమిమీద వర్షించినట్లు ఆశ్రితులందరిమీదా వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఇచ్చి ధనసౌఖ్యాదులను వర్షించేవాడో ఆ రాజు ఈ నాడు కామపాశంతో బద్ధుడై నిస్సహాయస్థితిలో ఉన్నాడు. ఆ అశ్వపతిమహరాజు కుమార్తె రాజ్యం చేతిలో చిక్కించుకొన్నది. ఆమె సవతులను సరిగా చూడదు. అసలే వాళ్ళందరూ దుఃఖితులై ఉంటారు.

 రాజ్యాధికారం చేపట్టిన భరతుడు కూడ కైకేయి చెప్పినట్లే నడుచుకొంటాడు గాని దుఃఖితురాలైన కౌసల్య విషయం గాని, సుమిత్ర విషయం గాని పట్టించుకొనడు. అందుచేత నువ్వు స్వప్రయత్నంచేత గాని, రాజును అనుగ్రహింపచేసి కొనడం ద్వారా గాని కౌసల్యను పోషించాలి. నేను చెప్పినట్లు చెయ్యి" అని‌ లక్ష్మణునితో అన్నాడు.

  "మయాద్య సహ సౌమిత్రే త్వయి గచ్ఛతి తద్వనమ్,
 ‌   కో భరిష్యతి కౌసల్యాం సుమిత్రాం వా యశస్వినీమ్?"
   
    "అభివర్షతి కామైర్యః పర్జన్యః పృథివీమివ,
      స కామపాశపర్యాప్తో మహాతేజా మహీపతిః"

    "సా హి రాజ్యమిదం ప్రాప్య నృపశ్యాశ్వపతేసుతా,
     దుఃఖితానాం సపత్నీనాం న కరిష్యతి శోభనం"

    "న స్మరిష్యతి కౌసల్యాం సుమిత్రాం చ సదుఃఖితామ్,
     భరతో రాజ్యమాసాద్య కైకేయ్యాం పర్యవస్థితః " 

    "తామార్యాం స్వయమేవేహ రాజానుగ్రహణేన వా, 
     సౌమిత్రే! భర కౌసల్యాముక్తమర్థమిమం చర. "  (అ.కాం.31.11,15)


అయోధ్యాకాండము - 66

ఈ విధంగా రాముడు అరణ్యానికి రావద్దన్నప్పుడు లక్ష్మణుడు - "వాళ్ల యోగక్షేమాలు భరతుడే చూచుకొంటాడు. ఏ మమాత్రం దానిలో లోపం వచ్చినా నీవేమి చేస్తావో అన్న భయం మనస్సులో మెదులుతూనే ఉంటుంది" అన్నాడు.

"భరతుడు సహజంగా ఉత్తమస్వభావం కలవాడు గాన అతడే చూచుకొంటాడు" అని‌ అనకుండా , "నీ భయానికి వాళ్ళను జాగర్తగా చూచుకొంటాడు" అనడం భరతుని గూర్చి లక్ష్మణుని మనస్సులో నాటుకొని పోయిన భావాన్ని సూచిస్తుంది"

"ఇంతకీ కౌసల్య యోగక్షేమాలు ఇతరులెవ్వరూ చూడవలసిన పనిలేదు. ఆమెకు వెయ్యి గ్రామాలు ఉన్నాయి. ఆమె‌ నా తల్లినే కాదు, నావంటివాళ్ళను కూడ ఎందరినో వేలకొలది ఆశ్రితులను పోషించగలదు" అని కూడ అన్నాడు లక్ష్మణుడు.

"తవైవ తేజసా వీర భరతః పూజయిష్యతి,
 కౌసల్యాం చ సుమిత్రాం చ ప్రయతో నాత్ర సంశయః"
     
"కౌసల్యా బిభృయాదార్య! సహస్రమపి మద్విధాన్,
 యస్యాః సహస్రం గ్రామాణాం సంప్రాప్తముపజీవినాం"
      
 "తదాత్మ భరణే చైవామ మాతుస్తథైవ చ, 

 పర్యాప్తా మద్విధానాం చ భరణాయ యశస్వినీ" (అ.కాం.31య19-21)


అయోధ్యాకాండము - 67

రాముడు లక్ష్మణునికి కూడ తనతో అరణ్యానికి రావడానికి అనుమతినిచ్చి తన ధనమూ, అలంకారాలూ, ఇతర వస్తువాహనాదులను అందరికీ పంచిపెట్టవలసిందిగా ఆదేశించాడు.

 "వేల‌కొలదీ బ్రహ్మచారులు మా తల్లిని ఆశ్రయించుకొని ఉంటారు కదా? వాళ్ళందరికీ పుష్కలంగా ధనము నిమ్ము. అలా చేస్తే మా తల్లి కూడ చాల సంతోషిస్తుంది" అని‌ అన్నాడు.

"మేఖలీనాం మహాసంఘః కౌసల్యాం సముపస్థితః, 
 తేషాం సహస్రం సౌమిత్రే ప్రత్యేకం సంప్రదాయ" 

 "అంబా యథా చ సా నన్దేద్కౌసల్యా మమ దక్షిణామ్,
తథా ద్విజాతీంస్తాన్ సర్వాన్ లక్ష్మణార్చయ సర్వశః" (అ.కాం.32.21.22)


రాముని ఆజ్ఞ ప్రకారం లక్ష్మణుడు ఆ విధంగా చేశాడు.

అయోధ్యాకాండము - 68

తరువాత రాముడు తన దగ్గరికి వచ్చి బాష్పలోచనులై నిలబడియున్న భృత్యుల నందరినీ చూచి వాళ్ళకందరికీ చాల సంవత్సరాలు సరిపోవునంతగా ధనం పంచిపెట్టి - "మేం తిరిగి వచ్చే వరకూ నా భవనమూ , లక్ష్మణుని భవనమూ జాగర్తగా చూచుకొంటూ ఉండండి" అని ఆదేశించాడు.

"అథాబ్రవీద్బాష్పగళాంస్తిష్ఠతశ్చోపజీవినః,
  సంప్రదాయ బహు ద్రవ్యమేకైకస్యోపజీవనమ్"

 "లక్ష్మణస్య చ యద్వేశ్మ గృహం చ యదిదం మమ, 
   అశూన్యం కార్యమేకైకం యావదాగమనం మమ" (అ.కాం.32.24,25)

అలాంటి సమయాలలో అలాంటివాళ్ళతో చెప్పవలైన మాటలు అవే కదా?

ధనాగారం నుండి ధనరాసులు తెప్పించి బ్రాహ్మణులకు, బాలురకు, వృద్ధులకు, దీనులకూ ఇప్పించాడు. రాజ్యమే త్యజించి దూరదేశం వెళ్ళిపోయే వానికి ఆ ధనరాసులమీద ఏమాత్రం మమకారం లేకపోవడమే కాకుండా వాటి సద్వినియోగం కావాలను కోరిక కూడ సహజమే కదా?

 "తతః స పురుషవ్యాఘ్రస్తద్ధనం సహ లక్ష్మణ, 
   ద్విజేభ్యో బాలవృద్ధేభ్యః కృపణేభ్యో హ్యదాపయత్ (అ.కాం.32.28)



అయోధ్యాకాండము - 69

రాజ ప్రాసాదంలో ఇంత కోలాహలం జరుగుతున్నా, నగరం అంతా రామవనవార్తను విని శోకమగ్నమై ఉన్నా, ఇవేమీ తెలియకుండా, తెలిసినా పట్టించుకొనకుండా తమ‌పనులు చేసికొంటూ ఎంతోమంది అక్కడనే ఉన్నారు. ఇది అన్ని‌ కాలాలలోనూ కనబడే సత్యము. అలాంటి వారిలో ఒకడు త్రిజటుడనే మహా తపఃశాలియైన బ్రాహ్మణుడు. ఇతడు పిల్లలకు కడుపునిండా తిండి కూడ పెట్ట జాలని‌‌ దరిద్రుడు. అరణ్యానికి ఒక‌ గొడ్డలి, గునపం, పార వంటి సాధనాలతో వెళ్ళి అక్కడ భూమి తవ్వుతూ, కంద మూలాలు పండించి గాని, ఉన్నవి పైకి తీసిగాని జీవికను నడుపుకునే వాడు.

రాముడు ధనం దానం చేస్తున్నాడని తెలిసి త్రిజటుని యువతి ఐన భార్య అన్నం లేని‌ పిల్లలను కూడా తీసికొని, అరణ్యం లో నేల తవ్వుతున్న భర్త దగ్గరికి వెళ్ళి "రాముడేవో దానాలు చేస్తున్నాడట. నీవు వెళ్ళి రాముని దర్శనం చేస్తే మంచిది" అని చెప్పింది.

అతను వెంటనే చేతిలో‌ఉన్న గునపం అక్కడనే పడవేసి, చాలీ చాలని ఉత్తరీయంతో శరీరాన్ని కప్పుకొనడానికి‌ప్రయత్నిస్తూ, సరాసరి రాముని భవనం లోనికి వెళ్ళాడు. అతని తేజస్సు చూచి ఐదు ద్వారాలలోను కూడ ద్వారపాలురెవరు కూడ అతనిని అడ్డుకొనలేదు. అతడు తిన్నగా రాముణ్ణి చేరి - "అయ్యో! నువ్వు అరణ్యానికి వెళ్ళవలసి వచ్చినదా? మీ వాళ్ళు నీకెంత అన్యాయం చేశారు!" - ఇలాంటి మాటలేవీ అనకుండా - "రాజపుత్రా! నేను చాల‌మంది పుత్రులుగల దరిద్రుడను, నిత్యము అరణ్యంలో నేల త్రవ్వుకుంటూ బ్రతుకుతున్నాను. నన్ను కూడ చూడుము" అన్నాడు.

ఆ సమయం లో కూడ రామునికి ఆ బ్రాహ్మణునితో నాలుగు మాటలు మాటలాడాలనిపించింది. "నేను ఇంతవరకు వేయి ఆవులను కూడ దానం చేయలేదు. నీ చేతిలోని కఱ్ఱను ఎంత దూరం విసరగలిగితే అంత దూరం నిలచి ఉన్న ఆవులను నీకిస్తాను." అన్నాడు. ఆ బ్రాహ్మణుడు వెంటనే ఉత్తరీయం నడుమునకు బిగించి, చేతిలోని కఱ్ఱ ఒక్కమాటు నేలమీద కొట్టి బలంకొద్దీ ఆ కఱ్ఱ విసిరాడు. అది అక్కడ నిలబెట్టిన వేలకొలది ఆవులను దాటి నది అవతలి ఒడ్డున పడింది.  రాముడు సంతోషించి అన్ని గోవులను ఇచ్చి. "నేను పరిహాసం కోసం ఇలా అన్నాను. ఏమీ అనుకోవద్దు ఇంకా ఏమైనా ధనం కావలసి ఉంటే అడుగు, ఇస్తాను." అన్నాడు. త్రిజటుడు ఇంకేమీ మాటలాడకుండా ఆ గోవులను తోలుకొని వెళ్ళిపోయాడు.

  "తం వృద్ధం తరుణీ భార్యా బాలానాదాయ దారకాన్,
   అబ్రవదీద్బ్రాహ్మణం వాక్యం దారిద్ర్యేణాభిపీడితా" 

  "అపాస్య ఫాలం కుద్దాల కురుష్వ వచనం మమ,
    రామం దర్శయ ధర్మజ్ఞం యది కించిదవాప్స్యసి" (అ.కాం.32.31,32) 

   "స తీర్త్వా సరయూపారం దణ్డస్తస్య కరాచ్చ్యుతః ,
    గోవ్రజే బహుసాహస్రే పపాతో క్షణ సంనిధౌ." 

    "ఉవాచ చ తతో రామస్తం గార్గ్యమభిసాన్త్వయన్,
     మన్యుర్న ఖలు కర్తవ్యః పరిహాసో హ్యయం మమ"  (అ.కాం.32.39) 

ఇక్కడ వర్ణించిన విధానాన్ని బట్టి దానం ఇవ్వడానికై వేలకొలదీ ఆవులను వరుసగా సరయూ నదితీరం వరకు నిలబెట్టి ఉంటారనీ త్రిజటుడు విసిరిన కఱ్ఱ చివరి ఆవును కూడా దాటి పడి ఉంటుందని ఊహించాలి.


పరిపాలకులలోను, పరిపాలనలోను ఎన్ని సంక్షోభాలు జరుగుచున్నా  వీటిని వేటినీ పట్టించుకొనని కొందరు తమ పనులు తాము చేఐకొంటూంటారను విషయాన్నీ, అన్ని వేళలా రామునిలో సహజంగా ఉన్న ధర్మ - ధార్మికరక్షకానిరతత్వాన్ని సూచించడానికై వాల్మీకి‌‌ ఇక్మడ ఈ  చిన్ని వృత్తాంతం చెప్పి ఉంటాడు.


అయోధ్యాకాండము - 70

రాముడు తన ధనం అంతా పంచిపెట్టివేసి తండ్రి దగ్గర అనుమతి తీసికొనడానికై సీతాలక్ష్మణులతో పాదచారియై దశరథుడున్న భవనానికి వెళ్ళాడు. దారిలో వేలాది ప్రజలు గుమిగూడి అనేక విధాలుగా తమ శోకాన్ని ప్రకటిస్తున్నారు. వీళ్ళందరూ దశరథుని మీద కూడ గొప్ప రాజభక్తీ, ఆదరమూ ఉన్నవాళ్ళే. "అలాంటి దశరథుడు కూడ సద్గుణవంతుడైన కుమారుణ్ణి అరణ్యానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడంటే అతనిని ఏదో భూతం ఆవహించి వుండాలి" అని కొందరంటున్నారు.

  "అద్య నూనం దశరథః సత్వమావిశ్య భాషతే
   న హి రాజా ప్రియం పుత్రం వివాసయితుమర్హతి" (అ.కాం. 33.10) 


ఇలాంటి పని జరగడానికి తగిన కారణం ఏదీ కనబడనప్పుడు కొందరు ఈ విధంగా అనుకొనడం సహజమే కదా?

అయోధ్యాకాండము - 70

పౌరులందరికీ రాముని మీద ఉన్న అపారమైన ప్రేమ ఎంతటిదనగా - "లక్ష్మణుని వలె మనం కూడ ఈ నగరం విడిచి వనానికి వెళ్ళి పోదాం. ఈ నగరం అంతా పాడుపడిపోతుంది‌. అలాంటి నగరాన్ని కైక పాలించుకొనుగాక. మనం అందరమూ అక్కడికి వెళ్ళడంతో అరణ్యంలో ఉన్న క్రూర మృగాదులన్నీ అయోధ్యచేరుతాయి. ఇది అరణ్యం ఔతుంది. నగరం అయోధ్య ఔతుంది." ఇంత సుదీర్ఘంగా వెళ్ళింది వాళ్ళ ఆలోచన.


"గచ్ఛన్తమనుగచ్ఛామ యేన గచ్ఛతి రాఘవ". (అ.కాం.33.16)

 " వనం నగరమేవాస్తు యేన గచ్ఛతి రాఘవః, 
    అస్మాభిశ్చ పరిత్యక్తం పురం సంపద్యతాం వనమ్."

   "బిలాని దంష్ట్రిణః సర్వే సానూని మృగపక్షిణః, 
     త్యజన్త్వస్వద్భయాద్భీతాః గజసింహాః వనాని చ, 
     అస్మత్యక్త్వం ప్రపద్యన్తాం, సేవ్యమానం త్యజన్తు చ." (అ.కాం.34.26)

అయోధ్యాకాండము - 72

రాముడు సీతాలక్ష్మణసమేతుడై దశరథుని దగ్గరికివెళ్ళి - "నేను అరణ్యానికి వెడుతున్నాను. సీత, లక్ష్మణుడు కూడ నాతో అరణ్యానికి వచ్చుచున్నారు. వాళ్ళకు కూడ అనుమతుని ఇమ్ము. " అని అన్నాడు.
దశరథుడు దుఃఖం పట్టలేక పోయాడు. ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. అతడు - "రామా! వరాలను నెపం చేసికొని కైక నన్ను వంచించింది. నువ్వు నన్ను నిగ్రహించి అయోధ్యకు రాజువు కమ్ము" అని అన్నాడు.

"అహం రాఘవ కైకేయ్యా వరదానేన మోహితః,
 అయోధ్యాయాస్త్వమేవాద్య భవ రాజా నిగృహ్య మామ్" (అ.కాం. 34.26) 

ఈ మాటలు దశరథుని అసహాయస్థితిని స్పష్టంగా తెలుపుతున్నాయి.

రాముడు దశరథుణ్ణి ఓదారుస్తూ - అరణ్యానికి వెళ్ళాలన్న తన దృఢసంకల్పాన్ని ముళ్ళీ వ్యక్తీకరించాడు. దసరథ స్త్రీలందరూ శోకావేశంతో హాహాకారాలు చేశారు. అదంతా చూస్తున్న సుమంత్రుడు కూడా మూర్ఛ చెందాడు. కైకేయి మాత్రం ఏమీ అదురూ బెదురూ లేకుండా అలాగే చూస్తూన్నది.

అయోధ్యాకాండము - 73

మూర్ఛ చెందిన సుమంత్రుడు తేరుకొని ఎదుట ఉన్న కైకేయిని, చాల తీవ్రంగా దూషిస్తూ "నీ తల్లికున్న మొండిపట్టుదల నీకు వచ్చినది" అని‌ అంటూ "ఇప్పటికైనా మించిపోయినదేమీ లేదు. నీ‌మాటను వెనక్కు తీసికొని దశరథుడు చెప్పినట్లు చెయ్యి" అని బోధించాడు. ఇంతగా చెప్పినా కూడ కైకేయి మాత్రం ఏమాత్రం చలించలేదు.

"నైవ సా క్షుభ్యతే దేవీ న చ స్మ పరిదూయతే,
 న చాస్యా ముఖవర్ణస్య విక్రియా లక్ష్యతే తదా" (అ.కాం. 35.37)

"ఈ క్షణం వరకూ అడుగులకు మడుగులిడుతూ ఎంతో ఆదరంతో గౌరవించిన సుమంత్రుడు కూడ అంత తీవ్రంగా దూషించినా ఆమె మనసులో ఏమీ క్షోభ కలుగలేదు. ఏ మాత్రం విచారం కలగలేదు. ఆమె ముఖవర్ణంలో ఏ మార్పూ రాలేదు. "

ఏది ఏమైనా తన స్వార్థాన్ని సాధించాలనే దృఢనిశ్చయంతో ఉన్న వ్యక్తులు ఎంత లజ్జావిహీనులై ప్రవర్తిస్తారో, లోకులకు ఏమాత్రం వేరవరో ఇది ఉదాహరణం.


అయోధ్యాకాండము - 74

దశరథుడు ఇంక చేయకలిగినదేదీ లేకపోవడంతో సుమంత్రునితో "రాముని వెంట చతురంగసేనను , ధాన్యాగారాలను, ధనాగారాలను, కావలిసిన పరిచారకాదులను ఇంకా ఇతర సామాగ్రినంతనూ పంపే ఏర్పాటు చెయ్యి" అన్నాడు. ఈ మాట వినగానే అంతవరకు విజయగర్వంతో ఎవరేమన్నా లెక్కచేయకుండా నిర్భయంగా నిలచిఉన్న కైకేయి గుండె గుభేలు మన్నది. ముఖం ఎండిపోయింది. కంఠస్వరం మారిపోయింది. ఆమె రాజులో ఇలా అంది - "సారం అంతా తీసివేసిన మద్యం వలె, జనులందరూ తరలి వెళ్ళిపోయిన రాజ్యం భరతునికి అవసరం లేదు"

 "కైకేయ్యాం ముక్తలజ్జాయాం వదన్త్యామతిదారుణమ్,
  రాజా దశరథో వాక్యమువాచాయతలోచనామ్" (అ.కాం.36.13) 

కైకేయి మాట విని దశరథుడు - "అనార్యురాలా! అహితురాలా! నన్ను బండి కాడికి కట్టి లాగిస్తున్నావు. ఇంకా ఎందుకు ఆ ముల్లు కఱ్ఱతో పొడుస్తావు? ముందుగానే ఇలా చేయకూడదని ఎందుకు చెప్పలేదు? " అన్నాడు.

"వహన్తం కిం తుదసి మాం నియుజ్య ధురి మా అహితే,
 అనార్యే కృత్యమారబ్ధమ్ కిం న పూర్వముపారుధః" (అ.కాం.36.14)

ఆ మాట వినగానే కైకేయి రెట్టింపు కోపంతో -"మీ వంశంలో ఇది క్రొత్త విషయం ఏమీ కాదు. సగరుడు తన జ్యేష్ఠపుత్రుడైన అసమంజుణ్ణి కట్టుబట్టలతో దేశం నుండి వెడల గొట్టాడు. అలాగే ఇతడి కూడ వెళ్ళవలసిందే " అంది.

"తవైవ వంశే సగరే జ్యేష్ఠపుత్రముపారుధత్,
 అసమఞ్జ ఇతి ఖ్యాతం తథాయం గన్తుమర్హతి" (అ.కాం.36.16)

ఆ సమయంలో ఆమె ఏమి‌అనాలో ఏమి అనకూడదో కూడ తెలియని స్థితిలో ఉంది.

ఆ మాట వి‌నగానే దశరథుడు అవాక్కైపోయాడు. " ఛీ ఎంత మాట అన్నావు! అని మాత్రమే అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సిగ్గుతో తలలు వంచుకొన్నారు. "

"ఏవ ముక్తో ధిగిత్యేవ రాజా దశరథో అబ్రవీత్,
 వ్రీడితశ్చ జనః సర్వః సా చ తం నావ బుధ్యతి" (అ.కాం.36.17)


"ఇంత  అయినాకూడా ఆమె తానన్న మాట ఎంర చెడ్డదో గ్రహించలేదు"


అయోధ్యాకాండము - 75

అక్కడనే ఉన్న సిద్ధార్థుడనే వృద్ధుడైన మంత్రి - "అసమంజుడు చేయరాని మహాపరాధం ఒకటి చేయడం చేత అతనిని నగరం నుండి పంపివేశారు. రామునిలో ఒక్క దోషం కూడా మాకు కనబడడం లేదు. అలాంటిదేదైనా ఉంటే చూపించు; నిరూపించు; అప్పుడు అతనిని పంపివేయవచ్చును" అని అన్నాడు.

 "అథవా దేవి! దోషం త్వం కంచిద్పశ్యతి రాఘవే, 
  తమద్య బ్రూహి తత్వేన తదా రామో వివాస్యతామ్" (అ.కాం.36.28)

ఈ విధంగా సిద్ధార్థుడు, సుమంత్రుని వలె అతితీవ్రమైన మాటలలో కాక మంచి మాటలతోనే ఆమె మనస్సును మార్చడానికి ప్రయత్నించాడు. ఏమీ ప్రయోజనం లేక పోయింది.

చివరికి దశరథుడు ఏమీ చేయజాలక అలసిపోయి శాంతస్వరంతో -"సరే! నువ్వూ నీ కుమారుడు కలిసి రాజ్యం ఏలికొనండి. నేను కూడా రామునితో అరణ్యానికి వెళ్ళిపోతాను. " అని అన్నాడు.

  "శ్రుత్వా తు సిద్ధార్థో రాజా శాన్తతరస్వనః,
    శోకోపహతయా వాచా కైకేయీమిదమబ్రవీత్" 

   "అనువ్రజిష్యామ్యహమద్య రామం,
   రాజ్యం పరిత్యజ్య సుఖం ధనం చ,
   సహైవ రాజ్ఞా భరతేన చ త్వం

   యథా సుఖం భుఙ్ష్వ చిరాయ రాజ్యం" (అ.కాం. 36.38)


అయోధ్యాకాండము - 76

దశరథుడు అరణ్యానికి కాదు; మరెక్కడికి వెళ్ళినా ఏమీ చింత లేదన్న పరిస్థితిలో ఉన్నది ఆ సమయంలో కైకేయి మనసు. ఆమె ఈషణ్మాత్రం కూడ చలించలేదు.

అప్పుడు రాముడు - "అన్ని సుఖాలూ విడిచి అడవికి పోయే వానికి ఈ పరివారం అంతా ఎందుకు? మదపుటేనుగును దానం చేసిన తరువాత దాని నడుముకు కట్టే జీను కోసం పెనుగులాడినట్లుంది ఇదంతా. ఇంక నేను వెళ్ళివస్తాను. నాకు ఏ పరివారమూ వద్దు. నార బట్టలు తెప్పించండి. " అని‌ అన్నాడు.

  "యో హి దత్వా ద్విపశ్రేష్ఠం కక్ష్యాయాం కురుతే మనః,
   రజ్జు స్నేహేన కిం తస్య త్యజతః కుఞ్జరోత్తమమ్" 

  తథా మమ సతాం శ్రేష్ఠ కిం ధ్వజిన్యా జగత్పతే,

  సర్వాణ్యేవానుజానామి చీరాణ్యేవానయస్తు మే. (అ.కాం.37.3,4)


అయోధ్యాకాండము - 77

రాముని నోటి నుండి మాట రావడమే తడవుగా కైకేయి నిస్సంకోచంగా అందరూ చూస్తుండగా లోనికి వెళ్ళి నారబట్టలు తీసికొని వచ్చి "ఇవిగో కట్టుకో" అని‌ అంటూ అతని చేతిలో పెట్టింది. రాముడు తరువాత లక్ష్మణుడు కూడ అంతవరకు ఉన్న వస్త్రాలు విడిచి ఆ నారబట్టలు ధరించారు.

సీత కైకేయి చేతిలో నుండి నార బట్టలు తీసికొని అవి ఎలా ధరించాలో తెలియక ఒకటి భుజం మీద వేసుకొని, మరొకటి చేతిలో పట్టుకొని "వనంలో నివసించేవాళ్ళు వీటిని ఎలా ధరిస్తారు" అని భర్తను అడుగుతూ కంటతడి పెట్టుకున్నది. వెంటనే రాముడు ఆకె దగ్గరికి వెళ్ళి ఆమె ధరించి ఉన్న పట్టుచీరమీదనే ఆ నారబట్ట చుట్టబెట్టాడు.

అది చూచి అక్కడ ఉన్న స్త్రీ లందరూ కన్నీళ్ళు కార్చుతూ - "ఈమె వనవాసానికి వెళ్ళవలసిన పని లేదు కదా? నీవు తిరిగి వచ్చే వరకు మేమందరమూ ఈమెను చూచుకొని సంతోషిస్తూంటాము. నువ్వు లక్ష్మణుణ్ణి సహాయం తీసికొని అరణ్యానికి వెళ్ళిరా" అని రాముణ్ణి ప్రార్థించారు.

"అన్తఃపురగతా నార్యో ముముచుద్వారి నేత్రజమ్,
 ఊచుశ్చ పరమాయస్తాః రామం జ్వలితతేజసమ్" (అ.కాం.37.15)

 లక్ష్మణేన సహాయేన వనం గచ్ఛస్వ పుత్రక

 నేయమర్హతి కల్యాణీ వస్తుం తాపసవద్వనే" (అ.కాం.37.18)



అయోధ్యాకాండము - 78

ఇంతవరకూ ఉదాసీనుడుగా ఉన్న వసిష్ఠుడు కూడ కైకేయి సీతకు నారబట్ట ఇవ్వడము తరువాత జరిగిన విషయాలు చూడగానే కోపం పట్టలేకపోయాడు. కైకేయిని అతికఠోరమైన మాటలలో దూషిస్తూ -

"హద్దు మీరి ప్రవర్తిస్తున్న దుర్బుద్ధివైన ఓ కైకేయీ ! నీవు నీ కులాన్నే అపవిత్రం చేశావు. రాజును మోసగించి ఇప్పుడు నీతినీ, మర్యాదనూ అతిక్రమించి ప్రవర్తిస్తున్నావు."

భర్త అనాదరానికే కాకుండా ప్రజలందరి కోపానికి పాత్రమజ్న స్త్రీని ప్రతిఒక్కరూ ఆ విధంగా దూషించడం సహజమే కదా?

 "అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయి కులపాంసని,
   వఞ్చయిత్వా చ రాజానం న ప్రమాణే అవతిష్ఠసే" (అ.కాం.37.22)

వసిష్ఠిడు మూడు అంశాలు గట్టిగా నొక్కి చెప్పాడు.

1) "సీత రామునితో పాటు అరణ్యానికి వెళ్ళవలసిన పనిలేదు. ఆమె రాముని అర్ధాంగిని. రాముని రాజ్యంమీద ఆమెకు పూర్తి అధికారం ఉంది. అందుచేత రాముడు అరణ్యానికి వెడితే ఆమె సింహాసనం ఎక్కి రాజ్యం చేస్తుంది.

" ఆత్మా హి దారాః సర్వేషాం దార సంగ్రహ వర్తినామ్,
   ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదినీమ్" (అ.కాం.37.24)

2) సీత కూడ రాముడు అరణ్యానికి వెడితే మేమూ, ఈ నగరవాసులందరూ కూడ అరణ్యానికి వెళ్ళిపోతాం. రాజ్యం అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. అంతే కాదు - భరత శత్రుఘ్నులు కూడ అరణ్యం చేరుతారు.

 "అథ యాస్యతి వైదేహీ వనం రామేణ సంగతా,
   వయమప్యనుయాస్యామః పురం చేదం గమిష్యతి. 

   " అన్తపాలాశ్చ యాస్యన్తి సదారో యత్ర రాఘవః,
     సహోపజీవ్యం రాష్ట్రం చ పురం చ సపరిచ్ఛదమ్" 

    భరతశ్చ సశత్రుఘ్నః చీరావాసా వనేచరః,
    వనే వసన్తం కాకుత్స్థమనువత్స్యతి పూర్వజమ్" (అ.కాం.37.25.27) 

3) "నువ్వు ఒక్క రాముని వనవాసమే కోరావు గాని, సీత కూడ వెళ్ళాలని కోరలేదు. అందుచేత ఆమె బాగుగా అలంకరించుకొని పరివారంతో వెళ్ళాలి"

  "యానైశ్చ ముఖ్యైః పరిచారకైశ్చ
    సుసంవృతా గచ్ఛతు రాజపుత్రీ,
    వస్త్రైశ్చ సర్వైః సహితైర్విధానైః 
    నేయం వృతా తే వనసంప్రవాసే" (అ.కాం.37.36)


కైకేయి దుష్టబుద్ధిని చూడగా మహామునియైన వసిష్టుడంతటి వాడు అంత తీవ్రంగా ఆమెను నింది‌ంచవలసివచ్చినది.


అయోధ్యాకాండము - 79 

వసిష్టుని మాటలు వినగానే సీత మనసులో క్షణకాలం కొంచెం దిగులు కలిగింది. తనను రామునికి బదులు ఎక్కడ సింహాసనం మీద కూర్చు‌డబెడతారో అని; దానితో తాను అనుకున్నదంతా మొదటికి వస్తుంది. అరణ్యానికి తనను వెళ్ళనిచ్చినా - తాను మాత్రమే రామునికి సేవ చేయాలని అనుకుంటూంటే పెద్ద పరివారం కూడ పంపుతారేమో అని రెండవ దిగులు. ఏది ఏమైనా తాను ఒక్కతియే రామునితో అరణ్యానికి వెళ్ళాలి అని దృఢనిశ్చయం చేసికొన్నది.

"తస్మిన్ తథా జల్పతి విప్రముఖ్యే 
  గురౌ నృపస్యాప్రతిమప్రభావే 
   నైవ స్మ సీతా వినివృత్తభావా
   ప్రియస్య భర్తుః ప్రతికారకామా" (అ.కాం.37.37)


చివరికి అదేమీ జరుగలేదు. ఆకె వల్కలాలు ధరించకుండా రామునితో అరణ్యానికి వెళ్ళేటట్లు ఇదంతా ముగిసింది.

 అయోధ్యాకాండము - 80

ఇంక వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమౌతున్నాడు రాముడు. - "వరప్రదుడవైన ఓ! తండ్రీ!  నేను లేకపోవడం చేత నా తల్లి శోకసాగరంలో మునిగి ఉంటుంది. ఇలాంటి కష్టం ఆమె ఇదివరకెన్నడూ అనుభవించి ఎరుగదు.  ఆమెను మీరు ఆదరంతో చూచుకోవాలి" అని తండ్రిని కోరాడు.

"మయా విహీనాం వరద ప్రపన్నాం శోకసాగరం,
  అదృష్టపూర్వవ్యసనాం భూయః సంమన్తుమర్హసి" (అ.కాం. 38.16)

అయోధ్యాకాండము - 81

రాముడు వల్కలాలు ధరించి అనుజ్ఞ ఇమ్మని కోరగా దశరథుడు - "నేను పూర్వజన్మలలో ఎంతోమందిని వాళ్ళ పిల్లలకు దూరం చేసి ఉంటాను. అందుచేతనే నాకీనాడు ఈ కష్టం ప్రాప్తించింది." ఇలాంటి సమయాలలో ఇవి అందరి మనస్సులలో కలిగే భావాలు. 

"మన్యే ఖలు మయా పూర్వం వివత్సా బహవః కృతాః

 ప్రాణినో హింసితా వాపి తస్మాదిదముపాగతమ్" (అ.కాం.39.4)



అయోధ్యాకాండము - 82

రాజాజ్ఞచేత సుమంత్రుడు  సిద్ధం చేసిన రథం ఎక్కి రామాదులు  అరణ్యానికి ప్రయాణం అవడానికి సిద్ధం అయ్యారు. తనకు అభివాదం చేసిన సీతకు కౌసల్య ఆమె రాముణ్ణి ఏ విధంగా చూచుకోవాలో బోధిస్తుంది.

 " సాధారణంగా స్త్రీలు సంపదలలో ఉన్న భర్తను గౌరవిస్తారు; అతడు కష్టాల్లో ఉన్నప్పుడు ఈసడించుకుంటారు. రాముడిప్పుడు కష్టాల్లో చిక్కుకొని ఉన్నాడు. అతని విషయంలో నీవు ఏమాత్రము అనాదరంగా ప్రవర్తించకూడదు. " అని ఉపదేశించింది.

ఒక తల్లి తన కుమారుని‌మీద ఉన్న ప్రేమాతిశయం చేత బోధించే విధానం ఇలాగే ఉంటుంది కదా?

" అసత్యః ఆర్వలోకే అస్మిన్ సతతం సత్కృతాః ప్రియైః ,
  భర్తారం నానుమన్యన్తే వినిపాతగతం స్త్రియం"
  
  ఏష స్వభావో నారీణామనుభూయ పురా సుఖమ్,
  అల్పామప్యాపదం ప్రాప్య దుష్యన్తి ప్రజహత్యపి" (అ.కాం.39.20,21)

 "స త్వయా నావమన్తవ్యః పుత్రః ప్రవ్రాజితో మమ,

  తవ దైవతమస్త్వేష నిర్ధనః సధనో పి వా" (అ.కాం.39.25)


 అయోధ్యాకాండము - 83

కౌసల్య చేసిన ఉపదేశం విన్న సీత - " ఆర్యురాలా! నేను నీవు చెప్పినట్లు నడచుకొంటాను. భర్త విషయంలో ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు. చిన్నతనంలో విని ఉన్నాను కూడ" అనొ సవినయంగా పలుకుతుంది. ఈ మాట వినగానే‌ కౌసల్య నేత్రాలనుండి ఆనందాశ్రువులు, దుఃఖాశ్రువులూ కూడ రాలాయి.

"కరిష్యే సర్వమేవాహమార్యా యదనుశాస్తి మామ్,
 అభిజ్ఞాస్మి యథా భర్తుర్వర్తితవ్యం శ్రుతం చ మే"

 "సీతాయాః వచనం శ్రుత్వా కౌసల్యా హృదయంగమమ్,

  శుద్ధసత్త్వా ముమోచాశ్రు సహసా దుఃఖహర్షజమ్" (అ.కాం.39.32)


అయోధ్యాకాండము - 84

అంతకు కొన్ని క్షణాల పూర్వం "మా తల్లిని ఆదరంతో చూచుకొమ్ము" అని దశరథుణ్ణి వేడిన రాముడు కౌసల్యకు నమస్కరించి -"తల్లీ నువ్వు బెంగ పెట్టుకొనకుము. నా వనవాస కాలం శీఘ్రంగా గడిచిపోతుంది. నాన్నగారిని జాగర్తగా చూచుకో" అని అన్నాడు.

"అమ్బ మా దుఃఖితా భూస్త్వం పశ్య త్వం పితరం మమ,

  క్షయో హి వనవాసస్య క్షిప్రమేవ భవిష్యతి" (అ.కాం.39.34)


అయోధ్యాకాండము - 85

రాముడు తనకు తల్లులే అయిన దశరథుని‌ ఇతర భార్యలందరికీ అభివాదనం చేసి వాళ్ళ వీడ్కోలు కోరుతూ - "దగ్గరగా కలిసి నివసించడం వల్ల గాని, అజ్ఞానం వల్ల గాని, నేను ఏమైనా పొరబాట్లు చేసి ఉంటే అవన్నీ మన్నించండి. నేను వెడుతున్నాను. మీ అందరి అనుజ్ఞ కోరుచున్నాను." అని అన్నాడు. ఆ మాట వినగానే వాళ్ళందరూ అశ్రువులు కార్చుచూ బిగ్గరగా ఏడ్చారు:

"సంవాసాత్పరుషం కించిదజ్ఞానాద్వాపి యత్కృతమ్,
 తన్మే సమనుజానీత సర్వాశ్చామన్త్రయామి వః"

 జజ్ఞే అథ తాసాం సంనాదః క్రౌఞ్చీనామివ నిస్వనః,

 మానవేన్ద్రస్య భార్యాణామేవ వదతొ రాఘవే" (అ.కాం.39.38,40)


అయోధ్యాకాండము - 86

సీతారామలక్ష్మణులు అందరికీ నమస్కరించి అనుజ్ఞ తీసికొంటున్నారు. లక్ష్మణుడు తల్లి సుమిత్రకు అభివాదం చేశాడు - ఆమె అతనిని ఆశీర్వదిస్తూ " నాయనా! నువ్వు రామునితో వెళ్ళి అతని విషయంలో ఎల్లపూడూ అప్రమత్తుడవుగా ఉంటూ రక్షించాలి. అన్నగారి చెప్పుచేతలలో ఉండడం సత్పురుషుల ధర్మం. "దానం చేయడము, యజ్ఞాలకు దీక్ష వహించడము, యుద్ధాలలో‌ప్రాణాలు పరిత్యజించడమూ - ఇది ఈ వంశంలో అనాదిగా వస్తున్న ఉత్తమమైన ఆచారం."
 "మేమెవరమూ దగ్గరలేమని‌ అనుకోవద్దు. సీత నే ననుకో. అటవియే అయోధ్య అనుకో సుఖంగా వెళ్ళు" అని ఆమె అత్యుదాత్తమైన హృదయంతో లక్ష్మణునికి అనుమతి‌ ఇచ్చింది.

"ఇదం హి వృత్తముచితం కులస్యాస్య సనాతనమ్, 
  దానం దీక్షా చ యజ్ఞేషు తనుత్యాగో మృధేషు చ" 

 "రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం,

  అయోధ్యామటవీం విద్ధి గచ్ఛ యథా సుఖమ్" (అ.కాం.40.7,9)

అయోధ్యాకాండము - 87

సీతారామ‌లక్ష్మణులు ముగ్గురూ రథం ఎక్కి బయకుదేరారు. ప్రజలందరూ శోకాక్రాంతులై హాహాకారాలు చేస్తూ అనేకవిధాల మాట్లాడుతున్నారు.
దశరథుడు, అతని భార్యలు, ఇతర స్త్రీలు కూడ రాముణ్ణి చూడడానికై రాజమార్గం లోనికి వచ్చారు. వాళ్ళందరి ఆర్తనాదాలు రామునికి వినబడుతున్నాయి. రథం తొందరగా నడపమని సారథిని తొందరపెడుతున్నాడు రాముడు. నడపమని రాముడంటుంటే ఆపమని పౌరులంటున్నారు. సుమంత్రుడు ఏమీ చేయలేకుండా ఉన్నాడు. కౌసల్యా - దశరథులిద్దరూ రథం వెనుకనే పరుగెత్తికొని వస్తుంటే రాముడు వాళ్ళని చూడలేకపోతున్నాడు, మానలేకపోతున్నాడు.

"రథం ఆపుము ఆపుము" అని దశరథుడు బిగ్గరగా అరుస్తుంటే "ఆపవద్దు శీఘ్రంగా నడుపు నడుపు" అని రాముడంటున్నాడు. అప్పుడు సుమంత్రుని మనస్సు రెండు చక్రాల మధ్య ఇరుక్కొనిపోయినట్లయింది." "రథం ఎందుకు ఆపలేదు అని రాజు అడిగితే చక్రాల చప్పుడులో వినబడలేదు అని చెప్పవచ్చునులే. ఆలస్యం అయిన కొలదీ ఈ దుఃఖం భరింపరానిది" అని రాముడన్నాడు. సుమంత్రుఫు పౌరులను బ్రతిమాలికొని రథమ్ ముందుకు నడిపించాడు.

 "తిష్ఠేతి రాజా చుక్రోశ యాహి యాహీతి రాఘవః, 
   సుమన్త్రస్య బభూవాత్మా చజ్రయోరివ చాన్తరా‌."

  "నాశ్రౌషమితి రాజానముపలాబ్ధో అపి వక్ష్యసి,
   చిర‌ం దుఃఖస్య పాపిష్ఠి.మితి రామస్తమబ్రవీత" 

  "రామస్య చ వచః కుర్వన్ననుజ్ఞాప్య చ తం జనమ్

   ప్రజతో అపి హయాన్ శీఘ్రమ్ చోదయామాస సారథిః" (అ.కాం.40.46,47,48)


అయోధ్యాకాండము - 87

సీతారామ‌లక్ష్మణులు ముగ్గురూ రథం ఎక్కి బయలుదేరారు. ప్రజలందరూ శోకాక్రాంతులై హాహాకారాలు చేస్తూ అనేకవిధాల మాట్లాడుతున్నారు.

దశరథుడు, అతని భార్యలు, ఇతర స్త్రీలు కూడ రాముణ్ణి చూడడానికై రాజమార్గం లోనికి వచ్చారు. వాళ్ళందరి ఆర్తనాదాలు రామునికి వినబడుతున్నాయి. రథం తొందరగా నడపమని సారథిని తొందరపెడుతున్నాడు రాముడు.

నడపమని రాముడంటుంటే ఆపమని పౌరులంటున్నారు. సుమంత్రుడు ఏమీ చేయలేకుండా ఉన్నాడు. కౌసల్యా - దశరథులిద్దరూ రథం వెనుకనే పరుగెత్తికొని వస్తుంటే రాముడు వాళ్ళని చూడలేకపోతున్నాడు, మానలేకపోతున్నాడు.

"రథం ఆపుము ఆపుము" అని దశరథుడు బిగ్గరగా అరుస్తుంటే "ఆపవద్దు శీఘ్రంగా నడుపు నడుపు" అని రాముడంటున్నాడు. అప్పుడు సుమంత్రుని మనస్సు రెండు చక్రాల మధ్య ఇరుక్కొనిపోయినట్లయింది."

 "రథం ఎందుకు ఆపలేదు అని రాజు అడిగితే చక్రాల చప్పుడులో వినబడలేదు అని చెప్పవచ్చునులే. ఆలస్యం అయిన కొలదీ ఈ దుఃఖం భరింపరానిది" అని రాముడన్నాడు. సుమంత్రుడు పౌరులను బ్రతిమాలికొని రథం ముందుకు నడిపించాడు.

 "తిష్ఠేతి రాజా చుక్రోశ యాహి యాహీతి రాఘవః, 
   సుమన్త్రస్య బభూవాత్మా చజ్రయోరివ చాన్తరా‌."

  "నాశ్రౌషమితి రాజానముపలాబ్ధో అపి వక్ష్యసి,
   చిర‌ం దుఃఖస్య పాపిష్ఠి.మితి రామస్తమబ్రవీత" 

  "రామస్య చ వచః కుర్వన్ననుజ్ఞాప్య చ తం జనమ్

   ప్రజతో అపి హయాన్ శీఘ్రమ్ చోదయామాస సారథిః" (అ.కాం.40.46,47,48)


అయోధ్యాకాండము - 88

దశరథుడు, ఎంత చెప్పి‌నా నిలబడక రథం వెనుక పరుగెత్తడానికి ప్రయత్నిస్రున్నాడు. అప్పుడు మంత్రులు - "ఎవరు దూరదేశం వెళ్ళి శీఘ్రంగా తిరిగి రావాలని కోరుతామో వారిని చాల దూరం సాగనంపకూడదు. " అని బోధించారు. ఆ మాట వినగానే దశరథుడు ఆ రథంకేసి చూస్తూ నిలబడి పోయాడు.

"యమిచ్ఛేత్పునరాయాన్తం నైనం దూరమనువ్రజేత్,
  ఇత్యమాత్యా మహారాజమూచుర్దశరథం వచః" 

 " తేషాం వచః సర్వగుణోపపన్నం 
    ప్రస్విన్నగాత్రః ప్రవిషణ్ణరూపః,
    నిశమ్య రాజా కృపణః సభార్యో

    వ్యవస్థితస్తం సుతమీక్షమాణః" (అ.కాం. 40.50,51)


అయోధ్యాకాండము - 89


రాముని రథం కనబడుతూన్నంతవరకూ వీథిలో నిలబడి దానినే చూస్తూన్న దశరథుడు ఆ రథం కనుమరుగు అవగానే దుఃఖావేశంచేత నేలమీద పడి పోయాడు.

కౌసల్య ఒక ప్రక్క కైకేయి ఒకప్రక్కా చేతులు పట్టుకొని లేవదీశారు. అప్పుడు ఆతడు కైకేయితో -"ఓ దుష్టచారిణీ నువ్వు నన్ను స్ప్రశించవద్దు. నిన్ను చూడడం నా కిష్టం లేదు. నువ్వు నాభార్యవు కాదు. నీకు సంబంధించిన వాళ్ళతో నాకేమీ సంబంధం లేదు. ధర్మాన్ని విడచి కేవలం అర్థపరురాలవైన నిన్ను విడిచి వేస్తున్నాను. నీవు సంపాదించి పెట్టిన రాజ్యం భరతునికి అంగీకార్యమే అయితే అతడు నాకు ప్రేతకర్మలు చేయవలసిన పనిలేదు. ; అవి నాకు ముట్టవు. " అని తీవ్రంగా ఆమెను దూషించాడు.

"కైకేయి మా మమాఙ్గాని స్ప్రాక్షీస్త్వం దుష్టచారిణి,
 నహి త్వాం ద్రష్టుమిచ్ఛామి న భార్యా న చ బాంధవీ" 

"యేచ త్వామనుజీవన్తి నాహం తేషాం నతే మమ
  కేవలార్థ పరాం హి త్వాం త్యక్త ధర్మాం త్యజామ్యహం"

 "భరతశ్చేత్ప్రతీతః స్యాద్రాజ్యం ప్రాప్యేదమవ్యయమ్,
   యన్మే ప్రదద్యాత్ప్రిత్రర్థం మాం తద్దత్తమాగమత్" (అ.కాం. 42.67,69)



కౌసల్య దశరథుని శరీరానికి అంటిన పరాగం దులిపి తన గృహానికి వెళ్ళి పోయింది. దశరథుడు రామాదులనే తలచుకొంటూ గృహంలో ప్రవేశించాడు.


అయోధ్యాకాండము - 90

"ఇక్కడి నుండి నన్ను కౌసల్య నివాసానికి తీసికొని వెళ్ళండి" అని ఆజ్ఞాపించగా ప్రతీహారులు దశరథుణ్ణి కౌసల్యాగృహానికి తీసికొని వెళ్ళారు. శయ్య మీద అలాగే పడి ఉన్న దశరథుడు రాముణ్ణి తలచుకొని తలచుకొని విలపిస్తుంటాడు.

అర్థరాత్రి ప్రక్కనే ఉన్న కౌసల్యతో -"కౌసల్యా! నా దృష్టి రామునితో బాటు వెళ్ళిపోయింది; అది తిరిగి రావడం లేదు. నువ్వు కూడ నాకు కనబడడం లేదు. నన్ను చేతితో స్పృశించుము. "  అన్నాడు. ఆమె రామునికోసమే దుఃఖిస్తూన్న అతని ప్రక్కనే కూర్చుండి విలపించింది.






No comments: